Monday, September 16, 2024

పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది

నా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ముదునూరు. అక్కడికి 28 ఏళ్ళుగా ప్రతి ఏడాదీ ఒక్కసారైనా వెళ్ళి వస్తున్నాను. అక్కడ ఉన్న మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి రావడం ఆనవాయితీ. అప్పుడే చుట్టుపక్కల ఉన్న రెండు, మూడు గ్రామాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు, స్కాలర్ షిప్పులు ఇస్తాను. దళితవాడలో ఒక ప్రైమరీస్కూలు భవనాన్ని నేనే మూడు దశాబ్దాల కిందట కట్టించాను. అంతకంటే చాలా ముందు మా అమ్మగారి జ్ఞాపకార్థం మహిళామండలి భవనం నిర్మించాను. మా నాన్నగారి స్మృత్యర్థం ప్రాథమిక పాఠశాలలో, హైస్కూలులోనూ  పిల్లలకోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేశాను. అందరూ గ్రామాలను వదిలి పట్టణాలకు వలస పోతుంటే నేను మాత్రం ఆ ధోరణికి  పూర్తి భిన్నంగా వ్యవహరించాను. నా సొంత ఊరంటే నాకు ఇష్టం. నా వేర్లు నాకు ప్రాణం. వందేళ్ళ క్రితం కట్టిన ఇంటిని కూల్చి ఇప్పుడు మా ఊరిలో ఒక మోస్తరు ఇంటిని నిర్మిస్తున్నాను. క్షేత్ర సంబంధాలు బాగా ఉన్న వ్యక్తిగా నేను ప్రజల అభిప్రాయాలనూ, వారి ధోరణినీ తెలుసుకుంటూ ఉంటాను. అవేవీ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించలేదు. మనసు వ్యాకులత చెందడం వల్ల కలిగే ఆదుర్దా, ఆత్మవిశ్వసరాహిత్యం, తోటివారిపట్ల నమ్మకం తగ్గిపోవడం, నిస్సహాయత, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు వారిని వేధిస్తూ ఉంటాయి. అందుకే జన్మస్థలం నుంచి అవకాశాలను అన్వేషిస్తూ దూరతీరాలకు పయనం అవుతారు.

Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి

క్షేత్రస్థాయి పరిణామాలు

కోవిద్ రోజులలో ఈ స్థూల పరిశీలన నుంచి మరింత లోతుగా అధ్యయనం చేస్తూ ఈ క్షేత్రస్థాయి పరిణామాలకూ, దేశ భవితకూ మధ్య సంబంధం ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేశాను. కొట్టవచ్చినట్టు కనిపించే పరిణామం ఏమంటే ప్రభుత్వం విపరీతంగా విస్తరించింది. ప్రబలమైంది. పౌరుల పాత్ర పరిమితమైపోయింది. రాజకీయ పార్టీల ఆధిపత్యం పెరిగింది. అన్నిటికంటే భయంకరమైన పరిణామం ఏమంటే పౌరులు ప్రభుత్వంపైన ఆధారపడటం చాలా రెట్లు పెరిగింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలన్నిటికీ అంతర్లీనంగా ఇదే ముఖ్యమైన కారణం. ఇది కొత్త పరిణామం కాదు. ఏదో ఒక రాష్ట్రానికే పరిమితమైనదీ కాదు. కానీ ఈ పౌరుల పరాధీన స్థితి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. దీన్ని గుర్తించకపోయి ఉండాలి లేదా బుద్ధిపూర్వకంగా చాపకిందికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి.

Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

ఎన్ని ఎన్నికలు జరిగితే అంత మంచిది!

ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పౌరపరాధీనస్థితి బలపడుతూ వచ్చింది. ఎన్ని ఎన్నికలు జరిగితే అంత మంచిదనట్టు పరిస్థితులు ఉన్నాయి. బయటి నుంచి వస్తున్న ఒత్తిళ్ళకూ, ఆకర్షణలకూ తలొగ్గి ప్రజలు ఓట్లు వేస్తుంటే ప్రజల అభీష్టం పూర్తయ్యేది ఎట్లా? వారి ఆశలు నెరవేరేదెట్లా? ఈ ధోరణి పెరుగుతూ ఉంది. 2022 లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఆరు మాసాల ముందు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక మునుపే రాజకీయ పార్టీలు కొత్త తాయిలాలు ఇస్తామంటూ ప్రచారం ప్రారంభించాయి. దిల్లీలో కొన్ని మంచి పనులు చేసి ఆదర్శంగా నిలిచింది అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గోవా, గుజరాత్ రాష్ట్రాల ప్రజలకు ఎన్నికల వాగ్దానంగా ఉచిత విద్యుత్తు సరఫరా హామీ ఇచ్చింది. ఉద్యోగాలు పోయినవారికీ, నిరుద్యోగులకు భృతి ఇస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇస్తోంది. వెంటనే మరో పార్టీ అందుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా మంచినీరు సరఫరా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసింది. ఈ ధోరణిని ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రజాదరణకోసం ఉచితాలతో పోటీ (కాంపెటీటీవ్ పాపులిజం)గా అభివర్ణించారు. ఈ దిశగా ఎవ్వరూ నిగ్రహం పాటించడం లేదు. హేతుబద్ధత మాటే లేదు.

Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

అన్ని తరగతుల ఓటర్లనూ ఆకర్షించాలి

ఎన్నికల ప్రచారం నిరంతరాయంగా సాగుతూ ఓటర్లలోని అన్ని తరగతులవారినీ ఆకట్టుకునే విధంగా వాగ్దాన వర్షాలు కురిపిస్తూ  పౌరులను పరాధీనులుగా, ప్రభుత్వంపైన ఆధారపడి జీవించే పక్షులుగా, పరాన్నభుక్కులుగా తయారు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తున్న తాయిలాలనే ‘సంక్షేమ కార్యక్రమాలు’ లేదా ‘సంక్షేమ అస్త్రాలు’ అంటున్నారు. పౌరులను చైతన్యవంతులను చేయడానికి బదులు ఈ ఉచితాలు వారిని సోమరులుగా, పరాన్నభుక్కులుగా మార్చివేస్తున్నాయి. పౌరులను వర్గాలుగా విభజించి, వారి అవసరాలు తీర్చడం ద్వారా వారిని కట్టిపడేయవచ్చుననీ, నియంత్రించవచ్చుననీ వ్యూహం. బ్రిటిష్ పాలకులు అమలు చేసిన ‘విభజించి పాలించు’ అన్న సూత్రాన్ని కొద్దిగా మెరుగులు దిద్ది మన రాజకీయ ధురంధరులు అమలు చేస్తున్నారు. మన నాయకులు వీటిని ప్రగతి ప్రేరకాలుగా అభివర్ణిస్తున్నారు. ఇటువటి తాయిలాలను వివిధ రూపాలలో ఇన్నేళ్ళు ఇచ్చిన తర్వాత దేశంలో అసమానతలు ఏమైనా తగ్గిపోయిన దాఖలా కనిపిస్తోందా?  కనిపించకపోగా, ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వంపైన మరింతగా ఆధారడేట్టు చేసేందుకు ప్రజలను విభజించేందుకు జనాభా లెక్కలను కులాల ప్రాతిపదికగా నిర్వహించాలని కోరతాం.  రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టుపడతాం, ప్రజలను  రాజకీయ నాయకుల గుప్పిటలో ఉంచుకునేందుకు వీలుగా రకరకాల కార్డులు (రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు, రుణమాఫీ కార్డులూ వంటివి) ఇస్తున్నారు. వాటి రంగులు ప్రజల వర్గీకరణను బట్టి మార్చుతూ ఉంటారు.

Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

స్విట్జర్లండ్ ప్రజల ఆదర్శం

రాజకీయ పార్టీలు తక్షణం కొన్ని తాయిలాలు ఇస్తూ ఎన్నికలు కాగానే మరిన్ని తాయితాలు ఇస్తామని ప్రకటించడాన్ని రెండు మాసాల కిందట మద్రాసు హైకోర్టు అభిశంసించింది. ఈ దోరణి ప్రజలను సోమరులను చేస్తూ వారిని నిరర్థకులుగా, ఉత్పత్తి చేయనివారుగా తయారు చేస్తోందనీ, ఇది అవినీతికి పాల్పడటమేననీ, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ, రాజకీయ, నైతిక విలువలకూ, చట్టాలకూ, భవిష్యత్తుకు అవసరమైన నిర్మాణాత్మకమైన అంశాలకూ తిలోదకాలు ఇచ్చి ఒక పార్టీ తర్వాత మరో పార్టీ, ఒక రాజకీయ నాయకుడి తర్వాత మరో రాజకీయ నాయకుడు ఉచితాల వాగ్దానాలను ముమ్మరం చేయడం చూస్తున్నాం. మంచి పరిపాలన అంటే నేను తరచుగా ఇచ్చే ఉదాహరణ రెండేళ్ళ కిందట స్విట్జంర్లండ్ ప్రజలు స్పందించిన తీరే. ప్రతి కుటుంబానికీ ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం తీర్చాలనే ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. వారి రాజ్యాంగం ప్రకారం లక్షమంది ఓటర్లు కావాలంటే రెఫరండం (జనవాక్య సేకరణ) జరిపించాలి. ఉచితాల ప్రతిపాదనపైన ఓటింగ్ నిర్వహించారు. స్విస్ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఉచితాల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేశారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి జీవించడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. సోమరులుగా తయారై వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పనే పూజ (వర్క్ ఈజ్ వర్షిప్) అనే సూత్రాన్ని గుర్తుచేశారు. అటువంటి వివేకాన్నిఇక్కడ ఊహించగలమా? ఆశించగలమా?

పౌరులు ప్రభుత్వంపైన ఎంత ఆధారపడితే అంతమంచిదనే ధోరణి పెరుగుతోంది. ప్రజలు ప్రభుత్వ సహకారం లేకుండా పనులు చేయలేని దుస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మా గ్రామం జనాభా మూడు దశాబ్దాలుగా 5,500 ల దగ్గరే ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ ఆదాయం రెట్టింపై సాలీనా పదిలక్షల రూపాయలకు చేరుకున్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాల సంఖ్య  ఒక పంచాయతీ కార్యాలయం నుంచి నాలుగుకి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య రెండు నుంచి 30కి పైగా పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి, స్కూలు, లైబ్రరీ, సహకారసంఘం ఇందులో కలపలేదు. అంతగా ప్రభుత్వ విస్తరణ జరిగింది. మనవాళ్ళు మాట్లాడుతున్న వికేంద్రీకరణ నిర్వాకం ఇదే. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎంతగా విస్తరిస్తే అంతగా  పౌరులు అవినీతికూపంలోకి నెట్టబడతారని ఇదివరకు నేను చేసిన అధ్యయనంలో తేలింది. పౌరుల ప్రభుత్వాధీన స్థితిని ముమ్మరం  చేయడం వల్లా, వారి కార్యాచరణపైన పరిమితులు విధించడం వల్లా ‘‘వుయ్ ద పీపుల్’’ (ప్రజలనే మేము) అనే మౌలిక వ్యవస్థకు గండి కొడుతున్నారు.

బయటపడేదెలా?

పౌరప్రభుత్వాధీనత స్థితి నుంచి బయట పడటం ఎట్లా? ఇదంతా ఏమిటో, దీని అర్థం ఏమిటో, ఇది ఎటుదారితీస్తుందో తెలుసుకోకుండా సమస్య పరిష్కరించుకోగలమా? మన నాగరికతను ఉన్నతశిఖరాలకు దీటుగా పెంపొందించి సుసంపన్నం చేయడానికి బదులు పౌరులను నిస్సహాయ స్థితిలోకి నెట్టడం ద్వారా వ్యక్తుల, సంస్థల మూలాలపైన ఖడ్గప్రహారం వేస్తున్నాం. అటువంటి ఆత్మహననం నుంచి దేశాన్ని కాపాడటానికి అదుపు, సమతౌల్యత (చెక్స్ అండ్ బ్యాలెన్స్) దోహదం చేస్తాయని ఆశ.  ఈ ధోరణిని అరికట్టడానికి ఉపయోగించే పది పద్ధతులను నేను సూచించగలను. మొదటిది పౌరుల కార్యక్రమాలను పునరుద్ధరించడం. రెండవది సమాచార హక్కును పూర్వస్థితికి తీసుకొని వెళ్ళి ధాటిగా అమలు చేయడం.   సిటిజన్ చార్టర్ ను తిరిగి ప్రారంభించడం, ప్రజాసేవల పబ్లిక్ ఆడిట్ చేయడం, సేవాపరమైన హామీలను బాగా పట్టించుకోవడం, ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక విభాగం పని చేయవలసిన అవసరం ఉన్నది. ఎన్నిలక నిఘా (ఎలక్షన్ వాచ్) వంటి వ్యవస్థలను విరివిగా రంగంలోకి దింపాలి. ఫిర్యాదుల పుస్తకం ప్రభుత్వ సేవలు అందించే ప్రతిచోటా అందుబాటులో ఉండేట్టు చూడటం కూడా అవసరం. రెసిడెంట్స్ అసోసియేషన్స్ (నివాసితుల సంఘం), సీనియర్ సిటిజన్స్ గ్రూప్ (వయోజనుల బృందం), కన్జూమర్ గ్రూప్స్ (వినియోగదారుల బృందాలు) వంటి సంస్థలను ప్రోత్సహించాలి. క్షేత్ర వాస్తవికతలను అధ్యయనం చేయడానికి మేధావులూ, అధ్యాపకులూ చొరవ ప్రదర్శించాలి.

శనివారంనాడు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ట్వీట్ సందేశం పెట్టింది. పేద ప్రజలను ప్రభుత్వంపైన మరింతగా ఆధారపడేట్టు చేయడం ద్వారా పేదరికంపైన పోరాటం చేయలేం (Poverty cannot be fought by making the poor more dependent on governments). నిజంగానే ఇది సకాలంలో వ్యక్తం చేసిన మంచి అంశం. కానీ దీన్ని గురించి మనం ఏమి చేయబోతున్నాం?

(డాక్టర్ భాస్కరరావు న్యూదిల్లీలో చాలా కాలంగా నివసిస్తూ  ప్రభుత్వ విధానాల అధ్యయనం, విశ్లేషణ చేస్తున్నారు. ఇవే అంశాలపైన  డజన్ పుస్తకాలు రాశారు.)

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles