Monday, November 4, 2024

రైతు ఉద్యమంలో దేశద్రోహులు

గత రెండు నెలలు పైగా జరుగుతున్న రైతు ఉద్యమం మొన్న రిపబ్లిక్ డే నాటి నుంచి గతి తప్పింది. ప్రతిష్ఠ దిగజారింది. అసలు నిజాలు ఎట్లా ఉన్నా, అనుమానాలు పెరిగే వాతావరణం ఏర్పడింది.ప్రభుత్వాలు బలవంతంగా ఉద్యమాన్ని కట్టడి చేసే పరిస్థితులు వచ్చేశాయి. దిల్లీ -యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ దగ్గర ఆందోళన విరమించి రోడ్లను ఖాళీ చేయాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ రైతు సంఘాలను ఆదేశించారు. ఇందుకోసం ఒక్క రాత్రి మాత్రమే గడువు ఇచ్చారు. ఒకవేళ రైతులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. ట్రాక్టర్ల పరేడ్ హింసాత్మాకంగా మారడమే దీనికి ప్రధాన కారణం. జాతీయ రహదారుల పనులు పెండింగ్ ఉండడం వల్ల నేషనల్ హైవే అధారిటీ నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నాయని పైకి చెప్పినా, అర్జెంట్ గా ఖాళీ చేయించడమే అసలు ఎజెండా అని అర్ధమైపోతోంది. రిపబ్లిక్ డే నాడు జరిగిన అల్లర్లపై దర్యాప్తు వేగవంతమయ్యింది.

రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేష్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్ చాదుతో సహా పలువురు నేతలపై ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. తాజాగా లుక్ అవుట్ నోటీసులు  జారీ చేశారు. విదేశాలకు పారిపోడానికి అవకాశం లేకుండా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగరవేయడం, పోలీసులను దాడి చేసి గాయపరచడం మొదలైన దుర్ఘటలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది.సరిహద్దుల్లో భద్రతను బాగా పెంచారు. ఈ నెల 31వ తేదీ వరకూ ఎర్రకోటను మూసేశారు.రైతులు -ప్రభుత్వాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది.తాను చేయాలనుకున్న కార్యం గంధర్వులే చేశారన్న చందంగా, రైతు సంఘాలు పెద్ద ఎత్తున చెడ్డపేరు మూటకట్టుకోవడంతో    బిజెపి నేతల గొంతు పెరిగింది. ప్రభుత్వాధినేతలు – రైతు సంఘాల మధ్య మొదటి నుంచీ ఒకే తీరు నడుస్తోంది. అది నేడు పతాకస్థాయికి చేరుకుంది.

వాస్తవాలు ఎట్లా ఉన్నా, రైతు సంఘాల నేతలను దోషులుగా, ప్రతినాయకులుగా చిత్రీకరించడానికి గొప్ప అవకాశం కేంద్రానికి దొరికింది. ఉద్యమాన్ని నీరుగార్చడానికి, చెడ్డపేరు తేవడానికి బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఇప్పుడు ఆ కుట్ర శాతం మరింత పెరిగిందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుకూలురు, ఆర్ ఎస్ ఎస్ వారినే రంగంలో దించారన్నది రైతు సంఘాల  వాదన. దీప్ సిద్ధూ, లఖా సిధానా ఎర్రకోట అంశంలో ప్రధాన పాత్రధారులని వీరి ప్రధాన ఆరోపణ. సిద్ధూ ప్రస్తుతం కనిపించకుండా పోయాడు.ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసుల్లో ఇతని పేరు కూడా ఉంది.కమీషన్ ఏజెంట్లు, ఖలీస్థాన్ ఉద్యమకారులు, మద్దతుదారులే రైతు ఉద్యమం నడిపిస్తున్నారనేది  ప్రధానమైన ఆరోపణ. ఎర్రకోటపై మతాన్ని సూచించే జెండాను ఎగురవేయడం, పోలీసులపై ట్రాక్టర్లు దూసుకు వెళ్లడం, ఆందోళనలు హింసాత్మాకంగా మారడంతో కేంద్రం వాదనలకు బలం చేరింది. వ్యవసాయ చట్టాల అంశం అటుంచగా, మొన్న జరిగిన అరాచక సంఘటనలు క్షమించదగినవి కానేకావు. ఈ దుర్ఘటనలతో యావత్తు భారత ప్రజల ముందు వీరు దోషులుగా మిగిలారు.

ఇదీ చదవండి:హింసాత్మకంగా కిసాన్ పరేడ్

ఇప్పటికే రెండు సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాయి. ఫిబ్రవరి 1వ తేదీనాడు రైతు సంఘాలు తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను విరమించుకున్నాయి.చట్టాలను రద్దు చేసేంత వరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రైతు సంఘాలు చెబుతున్నా, ప్రస్తుతం తీరు చూస్తుంటే ఈ ఉద్యమం ఎక్కువకాలం కొనసాగక పోవచ్చు.ఉద్యమం తాత్కాలికంగా సమసిపోయినా, రాజకీయాలకు అతీతంగా సామాన్య రైతులోకం పట్ల ప్రభుత్వ పెద్దలు పెద్దమనసు చేసుకోవాలి. కొత్త చట్టాలపై పునఃసమీక్ష చేసుకొని, సర్వరైతు ఆమోదంగా పునర్నిర్మాణం చేయడం అవశ్యం. ప్రస్తుతం ఉద్యమం నడుపుతున్న రైతు సంఘాల రహస్య ఎజెండా ఏదై ఉన్నప్పటికీ, దానికి అతీతంగా, రైతుల పట్ల నిల్చోవాల్సిన బాధ్యత పాలకులదే. ఉద్యమం వెనకాల ఖలిస్తాన్ ఉందా పాకిస్తాన్ ఉందా అన్నది కూడా తేల్చాల్సిన అంశమే.

రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ ఉద్యమం వల్ల సామాన్య ప్రజలు, ఉద్యమంలో పాల్గొనని రైతులు కూడా కొత్త చట్టాల మంచిచెడులపై అలోచించడం ప్రారంభించారన్నది వాస్తవం. గత ముప్పైఏళ్ళ కాలంలో సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి తలసరి నెలసరి ఆదాయం ఇప్పటికీ 10వేల రూపాయలకు లోపే ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం వున్న ఆర్ధిక పరిస్థితుల్లో ఈ ఆదాయం ఏ మూలకు సరిపోదు.ఇప్పటికే చాలా వరకూ రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలి, వేరే వృత్తులను ఎంచుకున్నారు. దీనితో ఆహార ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.గ్రామీణ వృత్తులు కూడా తగ్గిపోయాయి. ఈ పరిణామాలు దేశానికి ఏ మాత్రం మంచిది కావు. రైతులు, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది.వీరిని విస్మరిస్తే, భావిపౌరులకు నేటి పాలకులు ద్రోహం చేసినట్లే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎందరు ప్రధానమంత్రులు మారినా, రైతుల జీవితాల్లో చీకట్లు పెరిగాయి తప్ప, వెలుగులు లేవు.ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు దొరికితే,60శాతం మంది వ్యవసాయం వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. రాజకీయాలు ఎట్లా ఉన్నా, రైతులను రక్షించుకోవాలి. వ్యవసాయం లాభసాటి కావాలి.ఉత్పత్తి జోరందుకోవాలి.పంజాబ్, హర్యానా మొదలైన రాష్ట్రాల్లో ప్రారంభమైన ప్రస్తుత రైతు ఉద్యమం మిగిలిన రాష్ట్రాలకు, మిగిలిన రంగాలకు విస్తరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మిగిలిన విషయాలు ఏ విధంగా ఉన్నా, ఈ ఉద్యమ నేపథ్యంలో సిక్కులు బిజెపికి వ్యతిరేకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ రాజ్యం వచ్చేసిందనే ప్రచారం బాగా జరుగుతోంది. మిగిలిన సామాజిక వర్గాలన్నీ ఏకమైతే, భవిష్యత్తులో బిజెపికి నష్టం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో బిజెపి విజయాలు సాధించినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండడం మంచిదని పరిశీలకులు హితవు చెబుతున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న రైతు ఉద్యమం ఎటుసాగుతుందో, అనే భయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కథ సుఖాంతమవ్వాలని కోరుకుందాం.

ఇదీ చదవండి: ఢిల్లీలో కిసాన్ పరేడ్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles