Tuesday, April 23, 2024

నా ఎదుట మూడు మార్గాలు: పవన్ కల్యాణ్

  • చిరు అభిమానుల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్
  • మెగా స్టార్ జనసేనకు మద్దతు పలుకుతారని చిరు తమ్ముడు నాగబాబు ప్రకటన
  • రాజకీయాల పట్ల ఆసక్తిలేని చిరంజీవి సినిమాలకే అంకితం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విషయం మాత్రం స్పష్టం. జనసేన ఇదివరకటి కంటే ఎక్కువ శక్తిమంతంగా ముందుకు సాగుతోంది. పార్టీ అంతర్గత సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. భావి కార్యాచరణకు కావలసిన సలహాలూ, సూచనలూ లభిస్తున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే జనసేన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చిరంజీవి అభిమానుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి అభిమానుల జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని విజయవాడలోని ఒక హోటల్ లో మే 22న నిర్వహించారు. అభిమాన సంఘం నాయకులు జనసేనకు మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యున్నత పీఠంపైన పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టటమే తమ ఆశయమని కూడా వెల్లడించారు.

చిరంజీవి అభిమానులతో మాట్లాడిస్తున్న జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్

మెగా అభిమానులు కానీ పవన్ అభిమానులు కాని కొంతసేపు సంతోషంగా ఉండటం మంచిదే. చిరంజీవి అభిమానులు జనసేనకు 2014లోనూ, 2019లోనూ మద్దతు ఇవ్వలేదా? రెండు ఎన్నికలలోనూ వారు క్షేత్రస్థాయిలో జనసేన అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధర్మతేజ్ బహిరంగంగానే పవన్ కల్యాణ్ కు బాసటగా నిలిచారు. చిరు అభిమానులు ఈ విషయం మరచిపోయారా? ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ప్రకటనలు ఎందుకు? తమ బాస్ మెగాస్టార్ నుంచి వారికి ఏమైనా సంకేతాలు అందాయా? 2024 ఎన్నికలకు ముందు మెగాస్టార్ మరోసారి రాజకీయరంగంలో అడుగు పెడతారా?

చిరు అభిమానులకు మనోహర్ ధన్యవాదాలు

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనకు మద్దతు పలికినందుకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలకు వెళ్ళి అధికార వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాలనీ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలనీ మనోహర్ చెప్పారు. ‘‘మూడు మాసాల సమయం పెట్టుకోండి. సమైక్యంగా కృషి చేయండి. ఓటర్లకు పవన్ కల్యాణ్ దృక్పథం ఏమిటో వివరించండి,’’ అని మనోహర్ ఉద్బోధించారు. ఈ దశలో చిరంజీవి అభిమానులతో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు ప్రజల మద్దతు చిరంజీవి అభిమానుల వల్లనే వచ్చిందన్నమాట సత్యం. నాగబాబు మరోసారి చిరంజీవి అభిమానులతో సమావేశం అవుతారనీ, చివరికి చిరంజీవి హాజరై జనసేన విజయానికి కృషి చేయవలసిందిగా అభిమానులకు చెపుతారనీ సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. చిరంజీవి అభిమానులు ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం అయిదు సినిమాలతో నిర్విరామంగా ఉన్న చిరంజీవి రాజకీయాలలోకి మళ్ళీ వస్తారన్న సూచన కానీ సంకేతం కానీ లేదు.

టీడీపీతో పొత్తుపై ఆలోచన

వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. రెండు పార్టీల మధ్య సీట్ల విభజన గురించి సమాలోచనలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ సన్నిహితులు అంటున్నారు. ఈ సంవత్సరాంతంలో రెండు పార్టీలూ కలిసి సంయుక్త ప్రకటన వెలువరించవచ్చు.  పొత్తల గురించి బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆదివారంనాడు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెబుతూ పవన్ కల్యాణ్ పట్ల పార్టీకి పూర్తి విశ్వాసం ఉన్నదని పునరుద్ఘాటించారు. గతంలో తిరుపతి ఉపఎన్నికలలోనూ, ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికలలోనూ బీజేపీ వైఖరి పవన్ కల్యాణ్ కు బొత్తిగా సమ్మతం కాకుండా ఉంది. పవన్ కల్యాణ్ తో ఒక్క మాటైనా చెప్పకుండానే ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నట్టు సమాచారం కూడా పవన్ కల్యాణ్ కి అందించలేదు. రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్నదనడానికి ఇది నిదర్శనం. పొత్తుల కోసం 2014లోనూ, 2019లోనూ జనసేన త్యాగాలు చేసిందనీ, ఇప్పుడు పొత్తు పెట్టుకునే పార్టీలు త్యాగాలు చేసి రుణం తీర్చుకోవాలనీ పవన్ కల్యాణ్ ఆదివారం నాటి సమావేశంలో అన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని దృష్టిలో పెట్టుకొనే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారు.

ఇంతకీ పవన్ కల్యాణ్ ఎదుట ఉన్న మూడు మార్గాలు ఏమిటి? ఒకటి, ప్రస్తుతం ఉన్న బీజేపీ-జనసేన పొత్తు లో కొనసాగడం. రెండు, ఈ పొత్తులోకి టీడీపీని కూడా ఆహ్వానించి మూడు పార్టీలూ కలసి 2014లో చేసినట్టే పోటీ చేయడం లేదా జనసేన ఒంటరిగా పోటీ చేయడం. దేనికైనా తాను సిద్ధమేననీ, ఈ సారి లక్ష్యం మాత్రం అధికారం సాధించడమేననీ పవన్ కల్యాణ్ చిరంజీవి అభిమానులకు చెప్పారు. మూడు పార్టీలూ మళ్ళీ పొత్తు పెట్టుకుంటాయా? చిరంజీవి జనసేనకు మద్దతు ప్రకటిస్తారా? కొన్ని మాసాలు వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles