Sunday, June 20, 2021

పాకిస్తాన్ కొత్త పాచిక?

కొన్నాళ్ల నుంచి పాకిస్తాన్ స్వరం మారుతోంది. అది వ్యూహమా? మార్పులో భాగమా? అన్నది కాలంలోనే తెలుస్తుంది. తాజాగా  ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ భారత ప్రభుత్వం రద్దు చేసిన 370 ఆర్టికల్  అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది భారత అంతర్గత అంశమని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది పాకిస్తాన్ ఆలోచనా వైఖరికి, రాజకీయ సిద్ధాంతానికి పూర్తి భిన్నమైన దృక్పథం. కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన సమయంలో పాకిస్తాన్ చేసిన హడావిడి అంతాఇంత కాదు.

Also read: స్టాలిన్ కు శుభాకాంక్షలు

గతంలో ఇదే అంశంపై హడావిడి

భారత రాయబారిని కూడా ఇస్లామాబాద్ నుంచి భారత్ కు వెనక్కు పంపించేసింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేంత వరకూ భారత్ తో ఎటువంటి చర్చలు నిర్వహించడం కుదరదని అప్పుడు కరాఖండిగా తేల్చి చెప్పేసింది.ఇదే అంశంలో, ప్రపంచ దేశాల ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చూసింది. ఇప్పుడేమో మెత్తని మాటలు మాట్లాడుతోంది.  ఇరు దేశాల సరిహద్దుల్లో ఎటువంటి ఘర్షణలు ఉండకూడదని, శాంతి వర్ధిల్లాలని భాష్యం చెబుతూ  మిలటరీని వెనక్కు పిలిపించేసుకుంది. సైనిక దళాల ఉప సంహరణతో పాటు, కాల్పులకు చరమగీతం పాడే దిశగా రెండు దేశాలు  పునఃసమీక్ష చేసుకున్నాయి.

Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

శాంతి ఒప్పందాలపై నిబద్ధత

శాంతి ఒప్పందాలకు బద్ధులై ఉందామని నిర్ణయం తీసుకున్నాయి. ఇవన్నీ ఇటీవల జరిగిన పరిణామాలు. ఇవి ఉభయ తారకమైన ఆలోచనా విధానాలే. భారత్ సహజసిద్ధంగానే శాంతికాముక దేశం. కశ్మీర్ తో సహ భారతదేశంలోని పలుప్రాంతాల్లో పలు సందర్భాల్లో జరిగిన అల్లర్లు, మారణహోమం వెనకాల పాకిస్తాన్ ఉందన్న విషయం ప్రపంచ దేశాలకు తెలిసిందే. భారత భూభాగాన్ని దురాక్రమించడానికి, వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి చైనా వంటి దేశాల అండతో పాకిస్తాన్ చెయ్యని దుశ్చర్య అంటూ ఏమీ లేదు. నిన్నటి వరకూ సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్వింది. పూర్తిగా చైనాకు అండగా నిలిచింది. రష్యాతోనూ అక్రమ సంబంధాలను పెంచుకుంది. అమెరికాతో ద్వంద్వ నీతితో ప్రవర్తించింది. సరిహద్దుల్లో అల్లర్లు తప్ప, మిగిలినవన్నీ ఇప్పటికీ సాగుతూనే వున్నాయి.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ

ఆఫ్ఘనిస్థాన్ నుంచి సైనిక దళాలను పూర్తిగా ఉప సంహరించడానికి అమెరికా శ్రీకారం చుట్టింది. ఇది భారత్ వంటి దేశాలకు పెనుప్రమాదంగా మారుతుందని ఎందరో భాష్యం చెబుతున్నారు. ఆ దేశం పూర్తిగా తాలిబాన్ చేతులోకి వెళ్ళిపోతుందని అందరూ అనుమానపడుతున్నారు. తాలిబాన్ అండతో పాకిస్తాన్ రెట్టించిన ఉత్సాహంతో భారత్ పై కక్ష కట్టి అల్లర్లకు దిగుతుందనే భయాలు అలుముకుంటున్న వేళ, ఆ దేశపు మంత్రిగారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. లోపలి వ్యూహం బయటపడకుండా, కొత్త పల్లవి ఎత్తుకున్నారా అనిపిస్తోంది. 370ఆర్టికల్ రద్దును భారత ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారని, పరోక్షంగా అసలు మాటలు బయట పెట్టారు.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

మాట మార్చడంలో మతలబు?

పాకిస్తాన్ ఎంతో కీలకంగా భావించే కశ్మీర్ అంశంలో ఇప్పటికిప్పుడు మాటల మార్పు వెనకాల ఆ దేశానికి బలమైన అవసరాలేవో దాగివున్నాయని అర్ధం చేసుకోవాలి. పాకిస్తాన్ పై ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఏ టి ఎఫ్ ) కఠినమైన ఆంక్షలు విధిస్తుందనే భయాలు అవహించుకున్నాయి. ఉగ్రవాదులకు అందే ఆర్ధిక సహాయాలు, లావాదేవీలను ఈ టాస్క్ ఫోర్స్ గమనిస్తూ ఉంటుంది. భారత్ లోని కశ్మీర్ సహా, పలు ప్రాంతాల్లో జరిగే అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉన్నదనే అంశం విషయంలో, బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోతామన్నది ఆ దేశానికి ఉన్న అసలు భయం. అందుకే, కశ్మీర్ అంశంలో స్వరం మారుస్తోందని రాజనీతిశాస్త్ర పండితులు అంటున్నారు.

Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే దేశంగా ముద్ర

ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశంగా పేరున్న పాకిస్తాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు కూడా పుట్టడం లేదు. దీనితో దిద్దుబాటు చర్యలకు దిగివచ్చిందని అంచనా వెయ్యాలి. పాకిస్తాన్ కు చైనా ఆర్ధికంతో పాటు బహురూపాల్లో సహాయసహకారాలు అందిస్తోదన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు వాటిని గౌరవనీయమైన కోణంలో చూడడం లేదు. ప్రస్తుతం,  పాకిస్తాన్ ఆర్ధికంగా కుదేలైపోతోంది. అంతర్జాతీయ సంస్థలతో ఉన్న ఆర్ధిక స్వార్థంతోనే భారత్ విషయంలో పాకిస్తాన్ శాంతి మంత్రాలు వల్లిస్తోంది. ఎఫ్ ఏ టీ ఎఫ్ సహ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ శాంతికపోతాన్ని ఎగుర వేస్తోంది. భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం వల్ల ఆ దేశానికి ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి కొంత ఆర్ధిక సాయం అందింది. ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడడం కోసమే ఈ ఎత్తులు వేస్తోంది. భారత్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు ఏ పన్నాగం పన్నుతుందో ఆ దేశ ఏలికలకే ఎరుక. ఏది ఏమైనా, పాకిస్తాన్ ను నమ్మకూడదన్న విషయం మనవారికీ తెలుసు.

Also read: ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles