Saturday, September 7, 2024

మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్

చైనా, రష్యాలకు చేరువై భారత్ పని పట్టాలని పన్నాగం

పాకిస్తాన్ కు పొద్దస్తమానం కళ్ళు భారతదేశంపైనే ఉంటాయి.ఎన్నిసార్లు పరువుపోయినా బుధ్ధి రాదాయె. తాజాగా మరోసారి అంతర్జాతీయ సమాజంలో పరువు పోగొట్టుకుంది. భారత రక్షణ శాఖకు చెందిన క్షిపణి ఒకటి ఇటీవల పొరపాటున పాకిస్థాన్ భూభాగంలో పడింది. దానితో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కయ్యానికి కాలుదువ్వింది. ఏకంగా ఒక క్షిపణి ప్రయోగానికి సిద్ధమైంది. కానీ,అది ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు ఆ దేశం పరువు గాల్లో కలిసిపోయింది. ఈ అంశంపై వివిధ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో ప్రాంతంలో గురువారం నాడు గుర్తుతెలియని వస్తువు ఒకటి గాల్లోకి ఎగిరి కిందకు పడిపోయింది. ఈ దృశ్యాన్ని స్థానికులు గమనించారు. అది క్షిపణి ప్రయోగమని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది.

మీడియాలో వస్తున్న కథనాలు ఇలా ఉన్నాయి.
క్షిపణి ప్రయోగం విఫలం

గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సింధ్ లోని టెస్ట్ రేంజ్ నుంచి ఓ క్షిపణి ప్రయోగం చేపట్టింది. ట్రాన్స్ పోర్టర్ ఎరెక్టర్ లాంఛర్ లో సమస్య వచ్చింది.
ఈ కారణంతో ప్రయోగాన్ని గంటసేపు వాయిదా వేశారు. మళ్ళీ 12 గంటలకు ప్రయోగించారు. గాల్లోకి లేచినా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ క్షిపణి లక్ష్యం పెట్టిన మార్గం నుంచి తప్పింది. అంతటితో ఆగక, ఉన్నపళంగా కుప్పకూలిపోయింది.
పాకిస్థాన్ కు చెందిన కొన్ని ఛానల్స్ ఈ వార్తను ప్రసారం కూడా చేశాయి. అది సాధారణ మోర్టార్ ట్రేసర్ రౌండ్ అని కొంతమంది అధికారులు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అది క్షిపణి లేదా రాకెట్ అని రక్షణ రంగాలలో అనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభమైందని వినికిడి.
పాక్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించిన క్షిపణి అంశంలో, భారత రక్షణ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించింది. కానీ, పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది. పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. అది జరిగే పని కాదని మనవాళ్లు కొట్టి పారేస్తున్నారు. భారత్ విషయంలో పాకిస్థాన్ మొదటి నుంచి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ప్రపంచానికి తెలియంది కాదు. కశ్మీర్ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క చైనాను, మరో పక్క తాలిబాన్ మూకను మనపైకి పంపించి మన దేశాన్ని విధ్వంసం చేయాలని చూస్తోంది. అటు అమెరికా -ఇటు చైనాతో ద్వంద్వనీతితో అక్రమ సంబంధాలను పెట్టుకుంటోంది. రష్యాకు బాగా దగ్గరవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికా నుంచి అనేక ఆర్ధిక ప్రయోజనాలు పొందింది, పొందుతోంది.

పాకిస్తాన్ కుతంత్రం

ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ నుంచి రష్యా సైనికులను వెళ్ళగొట్టించడానికి అమెరికాతో చేయి కలిపి ఆర్ధిక ప్రయోజనాలు పొందింది. అసలు! తాలిబన్ మూక తయారయ్యింది పాకిస్థాన్ లోనే అన్న విషయం చరిత్ర విదితం. బిన్ లాడెన్ ను అప్పగించడంలో అమెరికాకు చేసిన దొంగసాయం అందరికీ తెలిసిందే.ఇప్పుడు రష్యాకు దగ్గరవుతూనే అమెరికాతోనూ నాటకాలు ఆడుతోంది. భారతదేశంతో నేరుగా పోరాడే సామర్ధ్యం లేక చైనా,రష్యా చుట్టూ తిరుగుతోంది. రష్యాను భారత్ కు దూరం చేయాలనే కుట్రలో పాకిస్థాన్ -చైనా తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయి.
భారత సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూనే, జమ్మూ,కశ్మీర్ ప్రాంతాలలో అరాచకాలు చేస్తూనే,
శాంతి ఒప్పందాలంటూ నంగనాచి మాటలు మాట్లాడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాలను పాటించిన దాఖలాలే లేవు. భారత్ లో మిగిలివున్న కశ్మీర్ భూభాగాన్ని కూడా ఎలా దురాక్రమించాలి, మతమార్పిళ్లు ఎట్లా చెయ్యాలి, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎలా వ్యాపింప చెయ్యాలనే దురాలోచనలు తప్ప పాకిస్థాన్ కు ఇంకో పనే లేదు. ఎన్ని వేషాలు వేసినా.. భారత్ ముందు పాకిస్థాన్ ఎప్పటికీ నిలబడలేదు. ధర్మం,శాంతి, పరమత సహనం, పరోపకారం, నీతినియతి భూషణాలుగా వర్ధిల్లే భారతదేశానికి – రౌద్రం, రణం,రుధిరం తప్ప ఇంకొకటి తెలియని పాకిస్థాన్ కు పోలికే లేదని ప్రపంచ రాజనీతిజ్ఞ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనాతన సంగతి ఏంటో తాను చూసుకుంటే ఇంకా మంచిది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles