- మౌమా, సుధకు పద్మ శ్రీ
క్రీడారంగంలో అసాధారణంగా రాణించిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న, అర్జున పురస్కారాలు ఇచ్చి సత్కరించడం మనకు తెలిసిందే. అయితే..అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ దేశానికి ఖ్యాతి తెచ్చిన క్రీడాకారులకు పద్మశ్రీ లాంటి పౌరపురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం కూడా మనదేశంలో ఓ అలవాటుగా వస్తోంది.భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా…వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు క్రీడారంగానికి చెందిన ఏడుగురికి సైతం పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.
సుధాసింగ్ కు పద్మ పురస్కారం:
అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టీపుల్ చేజ్ విభాగంలో మనదేశానికి ఖ్యాతి తెచ్చిన సుధాసింగ్ కు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 34 ఏళ్ల సుధా సింగ్ కు 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన అసాధార రికార్డు ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన సుధా సింగ్ 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లోనూ బరిలోకి దిగింది.
మౌమాదాస్ కూ పురస్కారం:
భారత టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో సంవత్సరాల తరబడి రాణిస్తూ వస్తున్న బెంగాల్ ప్లేయర్, 36 సంవత్సరాల మౌమాదాస్ ను సైతం పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మౌమాదాస్ స్వర్ణ, రజతపతకాలు సాధించింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో రజతం సాధించింది. భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మౌమా బరిలోకి దిగింది.
చెన్నైకి చెందిన 35 ఏళ్ల అనిత పాల్‌దురై భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించింది. హరియాణాకు చెందిన 34 ఏళ్ల వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బధిర ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. మౌమాతో పాటు పద్మపురస్కారాలు అందుకోనున్న ఇతర అథ్లెట్లలో అనిత, అన్షు జంప్సేనా, మాధవన్ నంబియార్, వీరేందర్‌సింగ్, కేవై వెంకటేశ్ ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.