Monday, February 26, 2024

మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?

సృష్టి మొదలైన నాటి నుండి వేద సంస్కృతి ఈ పవిత్ర భారతదేశంలో పరిఢవిల్లుతూ ఉందని, ఈ దేశం ప్రపంచానికి జ్ఞానాన్ని, ప్రసాదించిందని చెప్పుకునే మాటలు కాసేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం! ఈ దేశం ప్రపంచానికి ఇచ్చిందా లేక ప్రపంచం నుండి ఈ దేశమే కొన్ని సంగతులు గ్రహిస్తూ వచ్చిందా విశ్లేషించుకుందాం. ప్రపంచమంతా ఒకటే అయినప్పుడు, కొన్ని విషయాలు అటు నుండి ఇటు, మరికొన్ని ఇటు నుండి అటూ వెళ్లి ఉంటాయి. ఎవరైనా సరే, ముందు ఆ విషయం ఒప్పుకుని తీరాలి. మనం సింధు నాగరికతకు ముందు, సమాంతరంగా ప్రపంచంలో అనేక నాగరితలు వర్థిల్లాయి. కాల విభజన ప్రకారం ఏది ఎప్పుడు పరిఢవిల్లిందో సులభంగానే గ్రహించుకోవచ్చు. ఇబ్బంది లేదు. నైలునది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈజిప్టు దేశంలో 3100 BCE  నుండే నాగరికత ప్రారంభమైంది. మరో రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత గానీ, ఈ దేశంలో సింధు నాగరికత (3300-1300 BCE) ప్రారంభం కాలేదు. ప్రపంచానికి జ్ఞానాన్ని  అందించామని చెప్పుకునే వేద సంస్కృతి 1500-500 BCE మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. సరే, ఇక ఇప్పుడు ఒకసారి ప్రాచీన ఈజిప్టు సంస్కతిలోకి వెళ్లి, ఆనాటివారి విశ్వాసాలు, భావనలు ఎలా ఉండేవో చూద్దాం!  వారు రూపకల్పన చేసుకున్న దేవుళ్లు, మనదేశంలోని వైదిక ప్రభోదకులకు ఏమైనా ఉపయోగ పడ్డాయో లేదో గమనిద్దాం!

Also Read: ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పాయం భార్గవ

అతి పురాతన ఈజిప్టు దేవుళ్లలో ముఖ్యమైన వాడు ‘రా’. ఒక్కోసారి ‘రే’ అని కూడా పిలుస్తారు. క్రీ.పూ 25-24 శతాబ్దాలలో రూపకల్పన చేయబడ్డ వాడు, ఆకాశాన్ని, భూమిని సకల చరాచర జగత్తును పాలించేవాడిగా గుర్తించారు. రా – అంటే సూర్యుడు. ఆకాశ దేవుడి పేరు హోరస్. బహుశా ‘హారిజన్స్’ అనే పదం హోరస్ నుండే వచ్చి ఉంటుంది. అలాగే సృష్టి కర్త అయిన ‘రా’ –వైదిక ధర్మంలో ‘బ్ర-హ్మ’ గా మరి ఉంటుంది. ఒక్కోసారి రా-హోరస్ లు కలిపి రా-హోరక్టిగా వ్యవహరించారు. అన్ని జీవరాసులు రా-వల్లనే  ఉద్భవించాయనీ, మనుషులు రా-స్వేదంతోనూ, కన్నీళ్లతోనూ పుట్టారని ఆనాటి ఈజిప్టు ప్రజలు భావించారు. అందుకే తమను తాము సూర్యుడి పశువులు (Cattle of Ra) గా భావించుకుంటూ ఉండేవారు. ఇలా అనేక కల్పనలు, భావనలు వారికి ఉండేవి. తమనూ, ఇతర ప్రాణులనూ సూర్యుడే (రా) పుట్టించాడన్న ఈజిప్షియనుల భావాన్ని మన పూర్వీకులు కూడా అనుసరించారు. మన సంప్రదాయ కవులు రాసిన “ఎవ్వనిచే జనించు జగమెవ్వని” పద్యం ఒక ఉదాహరణ!

రా-దేవతల రారాజుగా భావించుకున్న ఈజిప్షియన్లు అతనిని ఒక మనిషి ఆకారంలోనే ఊహించుకున్నారు. మనిషికి గద్ద జాతికి చెందిన ఒక పక్షి తల ఉన్నట్లుగా భావించుకున్నారు. మనిషిలాగా ఉన్న భాగాన్ని అటుమ్ (ATUM) అని, పక్షి ఆకారపు తలను ఖెప్రి (KHEPRI) అని అనే వారు. బహుశా వైదిక ధర్మంలోని ‘ఆత్మ’  ఈ అటుమ్ అనే శబ్ధం నుండే రూపొందించుకుని ఉండొచ్చు. పక్షితల మీద గుండ్రటి సోలార్ డిస్క్ ఉండి మళ్లీ దానిపైన తాచుపాము ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుడిని, చంద్రుడిని పాము మింగేస్తుందన్న ఆలోచన, వైదిక ధర్మ బోధకులకు ‘రా’ చిత్రపటం చూసిన తర్వాత కలిగిఉంటుంది. రా – షు (గాలిదేవుణ్ణి) టెప్నట్ (తేమ దేవతని) ఇంకా ఇతర దేవతల్ని సృష్టించాడు. రా-కు ముగ్గురు కుమార్తెలు- 1. బాస్టెట్, 2. హథోర్, 3. షెక్ మెట్. వీరిలో షెక్ మెట్ ను మండే సూర్యనేత్రం గా భావించేవారు. రా – ఆధిపత్యాన్ని అంగీకరించని వారిని, లేదా తప్పులు చేసిన వారిని రా- తన షెక్ మెట్ తో కాల్చేయిస్తాడు. రక్షించాలన్నా, శిక్షించాలన్నా షెక్ మెట్ చేయాల్సిందే. రా-మెత్తబడి ఎవరినైనా దయాదాక్షిణ్యాలతో కరుణించాలంటే తన కూతురు హథోర్ ద్వారా చేసేవాడు. ఆమె ప్రేమికుల ప్రతినిధి. ఇక బాస్టెట్ – ఒక కారుణ్య మూర్తి.

Also Read: ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!

రా (సూర్యుడు) మిలియన్ సంవత్సరాల పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇందులో మళ్లీ రెండు పడవలుంటాయి. ఉదయపు పడవ, రాత్రి పడవ. రాత్రి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు దాన్న ‘అండర్ వరల్డ్ ఆఫ్ ఈజిప్టు’ గా ఈజిప్షియన్లు భావిస్తారు. ఈ పడవలో రా- ప్రయాణిస్తున్నపుడు అతనితో పాటు ఇతర దేవతలు కూడా వెంట ఉంటారు. సియా (PERCEPTION), హు (COMMAND), హెకా (MAGICAL POWER) మొదలైనవారు. ఎపోఫిస్ (ప్రళయం సృష్టించే దేవడు) పెద్ద సర్పాకారంలో ఉంటాడు. ప్రతిరోజు రాత్రి సూర్యుడి పడవకు అడ్డుపడతాడు. సూర్యుడు కనబడకుండా పోయినప్పుడు ఆయన కింది లోకంలో ఉండి, దుష్టశక్తులతో పోరాడుతుంటాడని ఈజిప్షియనులు భావిస్తారు. అప్పుడు ఆయనను ఎఫ్ (AF) అని గానీ, ఎఫూ (AFU) అని గానీ పిలుచుకుంటారు. కింది లోకంలో ఉన్నపుడు రా-ఒసిరిస్ (OSIRIS) తో ఐక్యమయ్యాడని తలుస్తారు. ఒసిరిస్ – అంటే మృత్యు దేవత. ఏది ఏమైనా, పన్నెండు గంటల తర్వాత సూర్యుడు మళ్లీ జన్మిస్తాడు. సూర్యోదయాన్ని వాళ్లు అలా ‘సూర్యుడు మళ్లీ జన్మించాడన్నట్టుగా భావిస్తారు.

ఈజిప్షియనుల భావనలు, విశ్వాసాలు అంత మామూలుగా ఏమీ లేవు. చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అయినా కొంత సారాంశాన్ని గ్రహించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎత్తి చెప్పాను. అప్పటికి ఇంకా శతాబ్ధాలు, దశాబ్ధాలు, సంవత్సరాలు వంటి పదాలు రూపొందలేదు. కానీ, వారు కాల విభజనని సూర్యుడి మొదటి డైనాస్టీ, రెండో డైనాస్టీ అంటూ విభజించుకుంటూ పోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పిరమిడ్లు, సమాధులు రూపొందించబడుతూ వచ్చాయి. సమాధుల మీద రాతలు రాయడం ఎక్కువైంది. సర్వశక్తి సంపన్నుడైన సూర్యుడు (రా) తమ విన్నపాల్ని ఎప్పుడో చనిపోయిన తమ పూర్వీకులకు చేరవేస్తాడని వారి భావన. సూర్యుడు రాత్రి పడవనెక్కి ప్రతి రోజూ కింది లోకాలు తిరిగి, మళ్లీ తూర్పున జన్మిస్తున్నాడు కదా! అందుకని ఎవరు ఏ లోకంలో ఉన్నా అందరినీ రా- కలుపుకుంటాడని వారి నమ్మకం. తమ సందేశాల్ని తమ పూర్వీకులకు అందిస్తాడని ఆశ. పిరమిడ్ల మీద, సమాధుల మీద రాసే రాతలు అందుకే. లండన్ లో పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అతిపురాతన ఈజిప్టు శిలలు భద్రపరచబడి ఉన్నాయి. వాటి మీద ఆనాటి చిత్రాలు, రాతలు అలాగే ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించిన పరిశోధకులు అనేక విషయాలు తెలియజేశారు. వాటిలో ఏవో కొన్ని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆసక్తి ఉన్నవారు అంతర్జాలంలో వెతికి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

Also Read: దేవీ ఉపాసనే ప్రకృతి ఉపాసన

వేదకాలం నాటికి విగ్రహారాధనలో సూర్యుడికి ఆధారం ఈజిప్టు సంస్కృతిలో లభించింది. సూర్యుణ్ణి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తిగా గుర్తించారు. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ వీరు సంధ్యావందనం ప్రారంభించారు. రా-మ్ అంటే సూర్యుని వలన పుట్టినవాడు అని అర్థం. సీత్రే అంటే సూర్యుని పుత్రిక అని అర్థం. బౌద్ధుల జాతక కథల ప్రకారం దశరధుడు కాశీకి రాజు. అయోధ్యకు కాదు. రామ, లక్ష్మణ, సీత ముగ్గురూ దశరధుడి మొదటి భార్యకు పుట్టిన తోబుట్టువులు. రెండవ భార్య గయ్యాళి. ఆమె నుండి తన మొదటి భార్య పిల్లలను రక్షించుకోవడానికి దశరధుడు వారిని హిమాలయాలకు పంపిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత వారు రాజ్యానికి తిరిగివస్తారు. సీతాపహరణం ఈ కథలో లేదు. జాతక కథలలో వలె ఉన్నది ఉన్నట్లుగా కాక, పాత్రలు వాటి విధానాలు, నడవడి కొద్దిగా మార్చుకుంటూ మనువాద హిందూ పురాణాలు రాయబడ్డాయని ఆధారాలు దొరుకుతున్నాయి.

ఈజిప్టు కథల్లోని పాత్రలకు, భారతీయ హిందూ పురాణ పాత్రలకూ పోలికలు ఉన్నాయి. వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాధలలో ఉంది. ‘సేథ్’  ఒక భారీ వరాహరూపాన్ని తీసుకుని ‘రే’ ముందుకు వస్తాడు. యుద్ధంలో రే (సూర్యుడు) హారస్ కళ్లలోకి చూస్తున్నపుడు, సేథ్, హారస్ కంటిని గాయపరుస్తాడు. హారస్ (ఆకాశదేవుడు) కన్ను బంగారు రంగులోకి మారుతుంది. అప్పుడు ‘హిరణ్యాక్షుడు’ అని అంటారు. అంటే బంగారు కన్ను గలవాడు అని అర్థం.

పురాణాల్లోని విష్ణుమూర్తికి, ఈజిప్టు దేవుడు ‘నన్’ కు పోలికలున్నాయి. రిచర్డ్ విల్కిన్సన్ ప్రకారం ప్రళయం నుండి భూగోళాన్ని ఎత్తే ఈజిప్ట్ దేవుడు ‘నన్’ ను హిందువుల వరాహావతారంతో పోల్చవచ్చునన్నాడు. రిచర్డ్ హెచ్. విల్సిన్సన్ అమెరికన్ రచయిత. ఈజిప్టు తవ్వకాలపై 25 ఏళ్లు పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్. సృష్టి కొనసాగించడానికి అంతరాయం ఏర్పడుతుంది. భూమి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు. మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు. ఇది మహావిష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది. ‘’సేషత్’ – ప్రాచీన ఈజిప్టు దేవత. రచన, సంగీతం, ఊహాశక్తి, గణితం, ఖగోళశాస్త్రం, నిర్మాణ శాస్త్రం వంటివన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయని అక్కడి జనుల విశ్వాసం. ఆమె మధురంగా శ్రావ్యంగా గానం చేసినప్పుడు భూమి దేవుడు చలించిపోయి, పారవశ్యంలో కరిగినప్పుడు భూగర్భ జలాలు ఏర్పడ్డాయని ఈజిప్షియనుల నమ్మకం. ఈ ఈజిప్టు ‘సేషత్’ కు భారతీయ వైదిక ధర్మంలోని చదువుల తల్లి సరస్వతికి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి.  

ఈజిప్టు సంస్కృతి, నాగరికతలు అతి పురాతనమైనవి. వారి సంస్కృతీ సంప్రదాయాలు, పురాణాలు భారతీయ హిందూ పురాణాల కన్నా పాతవి. అలాగే పాళీ భాషలో ఉన్న బౌద్ధుల రచనలన్నీ సంస్కృతంలో రాయబడ్డ హిందూ పురాణాల కన్నా పాతవి. అంటే ఈ విషయాల వల్ల తేలేది ఏమిటి? పాత వాటి ప్రభావం తరువాత వచ్చిన వాటి మీద తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రపంచమంతా ఒక్కటి. మానవ జాతి అంతా ఒక్కటే గనుకు, ఒక ప్రాంతపు ప్రభావం మరో ప్రాంతంపై పడడమన్నది సహజం. అలా దేవుళ్లను రూపొందించుకోవడంలో కూడా జరిగే ఉంటుంది. అందులో ఆశ్చర్యంలేదు. నిజాయితీగా ఒప్పుకోవడంతోనే మానవీయ విలువలకు గౌరవం పెరుగుతుంది. ఆదిమ జాతుల విశ్వాసాలు, భావనలు ఏ ప్రాంతానివి అయినా ప్రాథమికంగానే ఉంటాయి. అక్కణ్నించి మనిషి ఎదుగుతూ వస్తున్నాడు. సమాజాన్ని ముందుకు తెస్తున్నాడు. ఎదిగిన సమాజంలో ఇంకా కొందరు ఎదగకుండా మిగిలిపోతున్నారు. అలాంటి వారు ఎప్పుడూ మనకు ఆదర్శం కాదు. ఎదుగుతున్న మనిషే మనుకు ఆదర్శం!! ఇంతకూ చరిత్రకూ, పురాణానికీ తేడా తెలియని వాళ్లని మనుషులనే అంటారా?

Also Read: 2035 నాటికి చైనా భూగర్భంలో రహస్య పట్టణాలు

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles