Saturday, April 20, 2024

రాజకీయం కాదంటే కుదురుతుందా?

ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్షనేతల భేటీ ముమ్మాటికీ రాజకీయపరమైన సమావేశమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెసేతర ప్రతిపక్షాలు పాల్గొనడమే విశేషం. మోదీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుదిశగా వీళ్ళందరూ ఏకమవుతున్నారనే అంశాన్ని కొట్టి పారేయలేం. ఇది రాజకీయ సమావేశం కాదని, ఓకే రకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మధ్య భేటీ మాత్రమే అని సీపీఐ నేత నీలోత్పల్ బసు సమావేశం అనంతరం ప్రకటించారు. తాను స్థాపించిన ‘రాష్ట్ర మంచ్’  సమావేశం పవార్ ఇంట్లో జరుపుకుంటున్నాం తప్ప, మూడో కూటమి భేటీ కాదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ముందుగానే ట్విట్టర్ లో వివరించారు. కాకపోతే ఈ సమావేశానికి శరద్ పవార్ అధ్యక్షత వహిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. బిజెపిని ఎదుర్కొనేందుకు మూడు లేదా నాలుగో కూటమి ఏర్పాటు సాధ్యపడుతుందనే విశ్వాసం తనకు లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొన్న సోమవారం నాడే స్పష్టం చేశారు.

Also read: లాక్ డౌన్ ఎత్తివేసినా అజాగ్రత్త ప్రమాదకరం

పైకి ఏదో చెబుతారు

ఈ నెలలో 10 రోజుల తేడాతో  రెండుసార్లు శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నిన్నటి ఎన్నికల్లో మద్దతు తెల్పినవారికి ధన్యవాదాలు తెలిపే భాగంలో కలిశామని ప్రశాంత్ కిషోర్ ఆ రోజే వివరించారు.మొన్న సోమవారం సమావేశంలోనూ ఎటువంటి రాజకీయ అంశాలు లేవని ఆయన చెప్పారు. ఇలా పైకి ఎవరేమని చెప్పినా, అంతా రాజకీయమేనని, మోదీకి /బిజెపికి వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే పరిశీలకులు భావిస్తున్నారు. మిషన్ 2024 చుట్టూనే ఇవన్నీ జరుగుతున్నాయని అంచనా వెయ్యవచ్చు. తాజాగా పవార్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఎనిమిది రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపీ సింగ్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, కెసీ సింగ్ మొదలైన మేధావులు కూడా పాల్గొన్నవారిలో ఉన్నారు. పాల్గొన్న నేతల్లో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఝా వంటివారు ఉన్నారు. వీరికి తోడు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఎలాగూ సారథ్యం వహించారు. కరోనా మేనేజ్ మెంట్, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించినట్లు వీళ్ళు వెల్లడించారు. నిన్నటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ బిజెపితో భీకరంగా పోరాడి గెలవడంతో ప్రతిపక్షాలకు ధైర్యం పెరిగింది. దాన్ని బలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మోదీకి దీటుగా ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని నిలబెట్టాలనే వ్యూహంలోనే వారున్నారని చెప్పాలి. మమతా బెనర్జీ, శరద్ పవార్ వీరిద్దరిలో ఎవరో ఒకరు దానికి అర్హులని వారి భావన అయ్యి ఉండవచ్చు. చాలా రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్ దెబ్బతినడం, రాహుల్ గాంధీ సమర్ధుడుగా అనిపించకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ ను ఈ సమావేశానికి దూరంగా ఉంచారని భావించాలి. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నేతల్లో శరద్ పవార్ శక్తిమంతుడు, కాకపోతే శారీరక ఆరోగ్యం లేకపోవడమే ప్రతిబంధకం.

Also read: శరీరం, మనసు కలిసిన యోగవిద్య

జమిలైతే వ్యవధి రెండేళ్ళే

లోక్ సభ ఎన్నికలు రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఒకవేళ, జమిలి ఎన్నికలు వస్తే సుమారు రెండేళ్ళు మాత్రమే వ్యవధి వుంది. దీనికి ముందుగా కొన్నినెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటి తర్వాత మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తంగా, 2022లో 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటిలోకీ ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకమైంది.దేశంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు అక్కడే వున్నాయి. ఈ నేపథ్యంలో, రేపు జరుగబోయే ఎన్నికల్లో బిజెపియేతర పార్టీలను గెలిపించుకోవాలని, ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నది ప్రతిపక్షాల ప్రధాన మైన వ్యూహం. పశ్చిమ బెంగాల్ లో వలె, సర్వశక్తులు ఒడ్డి, ఉత్తరప్రదేశ్ లో కూడా బిజెపియేతర ప్రతిపక్షం అధికారం చేపడితే, ఆ రాజకీయ, నైతిక బలాలతో ఈ విజయాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలనే వ్యూహంలో ప్రతిపక్షాలు ఉన్నాయని అర్ధమవుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉన్నా దానికుండే ఆకర్షణ దానికి ఉంది. అతిపెద్ద జాతీయ పార్టీగా ప్రజల్లో ఎంతోకొంత ఇమేజ్ ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్ డి ఏ కు జాతీయ స్థాయిలో ప్రతిగా ఉన్నది యూపీఏ మాత్రమే. మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ దీనితో ఏకం చేస్తే ప్రతిపక్షాల బలం మరింతగా పెరుగుతుందనే విశ్వాసం బహుశా ప్రశాంత్ కిషోర్ కు ఉందేమో.

Also read: ‘సత్య’మేవ జయతే!

ప్రాబల్యం తగ్గిన బలవంతుడు మోదీనే

నరేంద్రమోదీ గ్రాఫ్ తగ్గిందని అంటున్నారు. గ్రాఫ్ తగ్గినా, అగ్రస్థానం ఆయనదేనని చెబుతున్నారు. కరోనా కష్టాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధిలేమి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త వ్యవసాయ బిల్లులపై ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకతలు మొదలైనవి బిజెపికి ఎదురవుతున్న సవాళ్లు. వీటిల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టినా, మళ్ళీ నరేంద్రమోదీకి ప్రజలు పట్టం కడతారని కొందరు విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. రాబోయే రెండుమూడేళ్లల్లో తన గ్రాఫ్ ను పెంచుకొనే పథకాలను, చర్యలను నరేంద్రమోదీ తప్పకుండా చేడతారని భావించవచ్చు. వచ్చే ఎన్నికల సమయానికి బిజెపి అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తవుతుంది. దాని వల్ల ప్రజల్లో కొంత మొహంమొత్తే వాతావరణం రావచ్చు. కానీ, ప్రతిపక్షాల బలం పెరగకపోతే, ప్రధాని అభ్యర్థిపై వారు స్పష్టతకు రాకపోతే వాళ్ళ ఆశలు అడియాశలే అవుతాయి. ఇంతకూ, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే సంకల్పం ఉందో లేదో కూడా తెలియరావడం లేదు. నిజంగా ఉంటే, తన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రస్తుతం ప్రజల్లో అతనిపై విశ్వాసం లేదు. మమతా బెనర్జీ, శరద్ పవార్, రాహుల్ గాంధీ వీరి ముగ్గురులో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా, ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడంతో పాటు, బిజెపి/ నరేంద్రమోదీపై వ్యతిరేకత ఎన్నికల సమయానికి పెరిగితే తప్ప  ప్రతిపక్షాలకు అధికారం సాధ్యపడదు. అదే సమయంలో నరేంద్రమోదీని తక్కువ అంచనా వేయరాదు. ప్రజలను అసలు తక్కువఅంచనా వెయ్యవద్దు. ఈ లోపు ఉత్తరప్రదేశ్ వంటి కీలకమైన రాష్ట్రాల్లో గెలుపుఓటములు భవిష్య రాజకీయాలను నడిపిస్తాయి.

Also read: దేశమంతటా రాజకీయాలాట!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles