Wednesday, April 24, 2024

ఏకవ్యక్తి సైన్యం, మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు)

ప్రేమే కాదు, ప్రేమని గెలిపించిన నాన్న జ్ఞాపకాల్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా భావాల్ని కూడా  గౌరవించి ఏ మత సాంప్రదాయ పద్ధతులూ లేకుండా బుద్దుడు, అంబేద్కర్, రాజ్యాంగ ప్రవేశిక సాక్షిగా కేవలం కొద్దిమంది మిత్రుల సమక్షంలో జరిగిన మా వివాహానికి అండంగా నిలిచిన నాన్న స్మృతుల్ని ఈరోజు తల్చుకోవడమే ఆయన పట్ల ప్రేమంటాను నేను. తన ఆధ్యాత్మికత ఏమైనప్పటికీ నాకెన్నడూ అడ్డుచెప్పని గొప్ప వ్యక్తాయన. అందుకే, నా వంతుగా ఈ అక్షర నివాళి!

మూడ్నాలుగు వ్యాసాలతో కలిపి పది వరకూ,  నాన్న రాసిన రచనలు, రైటప్ లు. షష్టిపూర్తి నాటి ప్రత్యేక వ్యాసాలతో కలిపి మరో పది విడి వ్యాసాలు. ముప్పై వరకూ ఇతరుల విలువైన అభిప్రాయాలు. ఇంకా పేపర్ కటింగులు, కరపత్రాలతో కలిపి ఏకంగా వంద ఫ్యామిలీ & పర్సనల్ ఫొటోలు. చివరగా సుమారు నూటేభై మంది నివాళులు అర్పించిన బంధుమిత్రుల పేర్లు వెరసి ఏకవ్యక్తి సైన్యం, మేకా సత్య నారాయణ శాస్త్రి (బాంబు) జీవితం, ఆచరణ గురించి ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రచురించిన పుస్తకం రూపొందింది!

గౌరవ్ వివాహ సందర్భంగా

ఏడాది కాలంలో నాన్న స్మృతిలో తీసుకొచ్చిన ఎనిమిది విశిష్ట అనువాదాలు, రెండు వ్యాస సంకలనాలతో మొత్తం పది పుస్తకాలు. నాన్న అభిప్రాయాలతో ఉన్న అనంగీకారాల్ని అధిగ మించి ఒక్క ఏడాది కాలంలో అక్షరాలతో ఆయనకు నా వంతుగా అర్పించిన నివాళులే ఈ పుస్తకాలు. భావాలతోనే కాని బంధాలతోనూ, మానవ సంబంధాలతోనూ నాకు ఎప్పుడూ అసమ్మతులు లేవు, తండ్రిగా ఆయన వ్యక్తిత్వానికి నేనివ్వదగ్గ చిరు నివాళులివని నా భావన. స్మారకచిహ్నాలుగా పది ప్రజాహిత ప్రచురణలు తీసుకు రావడం నాకు తెలిసీ, మహా మహులకి సైతం  సులభంగా సాధ్యం కాని పని. ఆ రకంగా నా వరకూ నాకు సంతృప్తి కలిగించే విషయం!

ఐనప్పటికీ, చిట్టచివరి నిమిషం వరకూ చేసిన వ్యాయామం చిన్నది కాదు.  అనుకోని అవాంతరాలు, అసలు పుస్తకంగా తేవడం సాధ్యపడుతుందా అనే సందేహాలు, ఎప్పుడూ అలవాటైన ఆర్ధిక ఒడిదుడుకుల ఒత్తిళ్ళ వల్ల ఇంకా సేకరించాల్సిన సందేశాలు, చేర్చాల్సిన రచనలు ఉండి పోయాయి. టైప్ సెట్టింగ్ మొదలు ప్రింటింగ్ దాకా మన అవసరాన్ని బలహీనతగా భావించే స్వార్ధపరుల వల్ల, నాలుగైదు చేతులు మారడం వల్ల, రెండింతల భారాన్ని అంచనాలకు మించి మోయాల్సి వచ్చింది. తల్లడిల్లుతూనే ఐనా, తడుముకోవాల్సి వచ్చింది. ఒకదశలో వదిలేద్దామా అనుకునేంతగా డబ్బు కోసం చికాకు పెట్టారు!

By the way, I pity of them. ఎందుకంటే  అక్రమ సంపాదన కంటే  సక్రమ సంకల్పం చాలా పెద్దది. సంస్కారం వల్ల అబ్బిన విలువలకే అది సాధ్యం. మోసాలు, ద్రోహాల తో నిండిన బతుకు బాట మీద మానవత్వపు సౌధాల్ని నిర్మిస్తున్న వాడిని. నా దగ్గర డబ్బు కోసం బఫూన్లవడం మినహా ఆ సొమ్ముతో వారు బాపుకుందీ లేదు, నా కష్టాలతో పోలిస్తే నాకొచ్చింది నష్టమే కాదు. కాకపోతే, నా మనసులో వాళ్ళు కోల్పోయిన నమ్మకానికి మాత్రం ఇంకేది  సాటిరాదు, ఎందుకంటే, అది మళ్ళీ ఎప్పటికీ నిర్మించబడదు కనుక !

ఇలాంటి విపత్కర పరిస్థితులలో నాకు ధైర్యం అతి కొద్ది మంది మిత్రులు. ఎప్పుడూ అండగా వెన్నంటి ఉన్న నేస్తాలు. మేమున్నా మంటూ చేయూతనిచ్చిన ఒకరిద్దరు దోస్తులు. పేరు కోసమో, కీర్తికోసమో కాదు, నా కోసం నేనంటే ఉన్న ప్రేమ కోసం స్వచ్చందంగా ముందు కొచ్చిన హితులు. వార్ని నా నుండి విడదీసి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పి కృతకంగా మిగిలిపోలేను. ఎందుకంటే, ఎప్పటికైనా నా అక్షరాలకి అర్ధం చెప్పేది, వాట్ని ఆచరణాత్మకంగా తీర్చిదిద్దేది వారే కనుక. వెల్ అండ్ గుడ్!

(నాన్న స్మృతిలో తీసుకొచ్చిన ఈ పుస్తకం ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా నేను, నాతోపాటు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇంకా టెక్నికల్ టీం అందరి సహకారానికి ప్రత్యక్ష తార్కాణం. కొన్ని భావాలతో నాకు సమ్మతి లేకపోయినా నాన్న కోసం  వర్క్ చేయడానికి పూనుకున్నాను. చేసి తీరతానని గ్రహించిన కొద్దిమంది కక్కుర్తి స్వార్ధ పరులు అదును చూసుకుని వాళ్ళ అసలురంగు చూపించారు. హఠాత్తుగా పని ఆగిపోవడం తో ఒక దశలో స్ట్రెస్ కి లోనయ్యాను. అనుకున్న సమయానికి తీసుకురాలేమోననే ఫీలింగ్ వచ్చేసింది. కానీ, మొత్తానికి ఎలాగోలా గట్టెక్కించాను. మా ప్రేమని గెలిపించ డానికి ముందుండి నడిపిన నాన్న కోసం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని చిన్న పుస్తకమే అయినా పెద్ద పని పెట్టిన ఈ వర్క్ గురించి ఇప్పటికిలా ఈ చిన్న రైటప్.)

 –  గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles