Friday, October 4, 2024

మహనటుడి వర్ధంతి అంటే…వెన్నుపోటు గుర్తుకు వస్తుంది!

వోలేటి దివాకర్

మహా నటుడు ఎన్టీ రామారావు వర్థంతి అనగానే ఆ వెంటనే వెన్నుపోటు ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. చిత్ర సీమ ద్వారా ప్రజాజీవితంలోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించిన ఎన్టీ రామారావు మరణించి 27 ఏళ్లు గడుస్తున్నాయి. అలాగే ఆయన వెన్నుపోటుకు గురై కూడా 27 ఏళ్లు దాటింది. ఆగస్టు సంక్షోభం తరువాత ఎక్కువ కాలం ఆయన జీవించలేదు. 1995 ఆగస్టు 23న పిల్లనిచ్చిన అల్లుడి చేతిలోనే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారు. దీంతో మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్ 1996 – జనవరి 18న కన్నుమూశారు. సహజంగానే ఎన్టీఆర్ వర్ధంతి రోజున వెన్నుపోటు, ఈ సంఘటనల ఆవెనుకే ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడే గుర్తుకు వస్తారు.

ఈ రెండు సంఘటనలను చంద్రబాబు సహా నాటి ఆయన సహచరులు మర్చిపోయినా… తెలుగువారు, ఎన్టీ రామారావు అభిమానులు, ఆపార్టీని ఇప్పటికీ అభిమానించే కార్యకర్తలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆగస్టులో టిడిపి పార్టీలో నెలకొన్న సంక్షోభం, కొద్దికాలానికే జరిగిన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో అతిశయోక్తి కాదు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఆయన పైనే పోటీ చేస్తానని బాబు సవాల్ విసిరారు. అంతకు ముందు  పరిణామాల్లో చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బాబు రాజకీయ చురుకుదనాన్ని గమనించి ముచ్చటపడిన ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం చేశారు. ఆతరువాత మామగారి పంచన చేరిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పై ఆధిపత్యాన్ని సంపాదించేందుకు జిత్తులు, ఎత్తులు పన్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన లక్ష్మీ పార్వతీ పార్టీలో చక్రం తిప్పడానికి ప్రయత్నించారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబునాయుడు అండ్ కో పార్టీలోని మిగిలిన నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఎన్టీఆర్ పై తిరుగుబాటుకు ఉసిగొల్పారు. టిడిపి ఎమ్మెల్యేలకు మాయమాటలు చెప్పి వైశ్రాయ్ హోటల్ కు తరలించారని చెబుతారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి, ఆయన కుమారులు దివంగత హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితర కుటుంబ సభ్యులను కూడా బుట్టలో వేసుకున్నారు. తిరుగుబాటు సమయంలో స్పీకర్‌గా వ్యవహరించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బహిరంగంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు విషయంలో చంద్రబాబుకు సహకరించారు. ఈనాడు అధిపతి రామోజీరావు కూడా వైశ్రాయ్ శిబిరంలో ఎమ్మెల్యేలు సంఖ్యను ఎక్కువగా ఉన్నట్లు తన పత్రికలో ప్రకటించి పరోక్షంగా ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటులో బాబుకు బాసటగా నిలిచారు.

 అయితే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అప్పటికి లక్ష్మీపార్వతి వైపే ఉన్నారు. సొంత అల్లుడే ద్రోహం చేయడంతో ఎన్టీ రామారావు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. మానసిక వ్యధతో 1996 జనవరి 18న కన్నుమూశారు. నాడు వైశ్రాయ్ హోటల్ లో చంద్రబాబునాయుడు ఆధీనంలో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన ఎన్టీఆర్ పై రాళ్లు, చెప్పులు వేయించి 26 ఏళ్లుగా ప్రతీ ఏటా వర్ధంతి సభలు నిర్వహించి ఆయన పై ఎంతో భక్తి, ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించడం  చంద్రబాబు, వెన్నుపోటు ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషించిన నాయకులకే   చెల్లింది.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles