Thursday, May 19, 2022

జాతి గ‌ర్వించే మ‌హోన్న‌త వ్య‌క్తి ఎన్టీఆర్‌

ఆయ‌న ఏ  పాత్ర చేసినా గుండెల‌కు హ‌త్తుకుంటుంది…

ఏ డైలాగు చెప్పినా హృద‌యాన్ని ఆలోచింప చేస్తుంది…

భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుల‌లో ఆయ‌న అగ్ర‌గ‌ణ్యుడు…

 పౌరాణిక , జానప‌ద, సాంఘీక చిత్రాల‌లోని  వైవిధ్య‌మైన మ‌ర‌పురాని పాత్రల‌కు ఆయ‌న చిరునామా…

రాముడైనాకృష్ణుడైనా  ఇలా ఏ పౌరాణిక పాత్ర పోషించినా ఆయ‌న‌దో ప్ర‌త్యేకమైన  శైలి ..

 అందుకే తెలుగు వారి హృద‌యాల‌లో    ఆరాధ్య దైవంగా నిలిచాడు…

ఒక రాజ‌కీయ పార్టీని స్థాపించి కేవ‌లం తొమ్మిది నెల‌ల కాలంలోనే ముఖ్య‌మంతి పీఠాన్ని అధిరోహించిన గొప్ప నేత ఆయ‌న‌…

క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, ఆత్మాభిమానం, అంతులేని ఆత్మ విశ్వాసాలే ఆయ‌న ఆభ‌ర‌ణాలు…

అందుకే  తెలుగువారు ఆయ‌న‌ను ప్రేమ‌తో అన్న‌గా పిలుచుకున్నారు.. త‌మ కుటుంబ స‌భ్యునిగా ఆరాధించారు.. ఏకంగా ఏడు సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా పీఠాన్నిచ్చి త‌మ అభిమానాన్ని చాటు కున్నారు…

ఆయ‌నే స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు.

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు పేరు విన‌గానే స‌క్సెస్ గుర్తుకొస్తుంది… కావ‌ల్సినంత విషాదం గుండెల్లో చేరుతుంది.  ఓ సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన వ్య‌క్తిగా ఎద‌గ‌డానికి ఆయ‌న చేసిన కృషి అనంతం.. అన‌న్య సామాన్యం…ఆ కృషే ఆయ‌న‌ను ఓ స‌హ‌జ న‌టుడిగా తీర్చి దిద్దింది.. ఓ మ‌హోన్న‌త నాయ‌కునిగా మ‌లిచింది.

నిమ్మకూరులో నందమూరి

N. T. Rama Rao filmography - Wikipedia
అమాయకత్వం ఉట్టిపడే మొహం

నందమూరి తారక రామారావు 1923 సంవ‌త్స‌రం  మే 28 వ తేదీన  కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి లక్ష్మయ్య. తండ్రి  వెంకట రామమ్మ .  ఎన్టీఆర్ పుడుతూనే సిల్వ‌ర్ స్పూన్ తో పుట్ట లేదు. ఆయ‌న జీవితంలో అనేక ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి.  చిన్న‌త‌నం నుంచి ఆయ‌న‌కు న‌ట‌నంటే ప్రాణం. ఆ కార‌ణంగానే ఆయ‌న స‌బ్ రిజిస్ట్రార్ ఉద్యోగం కూడా వ‌దులుకున్నారు. సినిమాల్లో వేషాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న కాలంలోనే ఎల్ వి. ప్ర‌సాద్ ద్వారా నిర్మాత బి.ఏ. సుబ్బారావు ఆయ‌న‌ను మ‌ద్రాసు పిలిపించారు. తాను నిర్మించే ‘ప‌ల్లెటూరి పిల్ల’ చిత్రంలో క‌ధానాయ‌కుడి వేషం ఇచ్చారు.  కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా ‘మనదేశం’ చిత్రంలో అవకాశం రావడంతో దానిలో నటించారు. 1949లో వచ్చిన ఆ చిత్రంలో ఆయ‌నో  పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించారు. 1950లో ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు ‘షావుకారు’ కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. చ‌ల‌న చిత్ర జీవితం ప్రారంభ‌మైన త‌రువాత ఆయ‌న త‌న మ‌కాంను మద్రాసుకు మార్చారు.   ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో నివ‌సిస్తూ త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు.

1951లో కె.వి.రెడ్డి ‘పాతాళభైరవి’, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి ‘మల్లీశ్వరి,’ 1952లో ఎల్వీ ప్రసాదు ‘పెళ్ళిచేసి చూడు,’ ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం ‘చంద్రహారం’ ఆయ‌న‌కు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాల‌న్నీ విజయావారివే. ఆయా చిత్రాల‌లో న‌టించినందుకు ఆయ‌న‌కు ప్రతీ చిత్రానికి  నెలకు 500 రూపాయిలు జీతం, 5000

రూపాయిల పారితోషికమూ ఇచ్చారు.

మాయాబజార్ తో  వైభవం

NTR, man of many roles
పౌరాణిక పాత్రలలో సాటిలేని మేటి

1956లో విడుదలైన ‘మాయాబజార్‌’లో ఆయ‌న తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధిక పారితోషికంగా రికార్డుల‌ కెక్కింది.  ఇదే క్ర‌మంలో 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసారు. 1960లో విడుదలయిన ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ భారీ విజయాన్ని  సాధించింది. ‘శ్రీమద్విరాటపర్వం’లో అయ‌న  ఐదు పాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.  ఇక్క‌డ విశేష‌మేమంటే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు ఆయ‌న పారితోషికం నాలుగు లేదా ఐదు  అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.

Also read: వివేకానందుని మాట‌లు వ‌న్నె త‌ర‌గ‌ని స్ఫూర్తి మంత్రాలు

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘సీతారామ కళ్యాణం.’ 1961లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆయ‌న  సోదరుడు త్రివిక్రమరావు అధీనంలోని “నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసారు.  1977లో విడుదలైన ‘దాన వీర శూర కర్ణ’లో ఆయ‌న మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం నిర్వ‌హించారు.  1978లో ‘శ్రీరామ పట్టాభిషేకం’ చిత్రానికి కూడా ఆయ‌న  దర్శకత్వం వహించారు.  ఎన్టీఆర్ నటించిన  అనేక చిత్రాలు  గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి.

క్రమశిక్షణ, పరిశ్రమ

ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్‌లో అభ్యాసం చేసేవారు. ‘నర్తనశాల’ చిత్రం కోసం ఆయ‌న   వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తిపట్ల ఆయ‌న  నిబద్ధత అలాంటిది.

NTR: The Star Who Became A God | Film Companion
శ్రీకృష్ణావతారం

 ఒక ప‌క్క న‌టుడిగానే ఎదుగుతూ త‌న రాజ‌కీయ పార్టీ గురించి వ్యూహాలు ర‌చించారు. త‌న‌ను నటుడిగా ఆద‌రించిన తెలుగు ప్ర‌జ‌ల కోసం ఏదో ఒకటి చేయాల‌న్న‌ది ఆయ‌న ఆశ‌యం. ఆ ఆశ‌య‌మే 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ ఏర్పాటుకు కార‌ణ‌మైంది.  ఈ క్ర‌మంలో  ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెస్  పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందనీ, దానిని  ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్ర‌క‌టించారు.. కాంగ్రెస్ పార్టీ  నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆయ‌న  నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. దీని ఫ‌లితంగా 1983 జనవరి 7 న  తెలుగుదేశం 199 స్థానాల‌తో  97 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించింది.  1983 శాసనసభ ఎన్నికల్లో ఆయ‌న  సాధించిన అపూర్వ విజయం ఆయ‌న  రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం.

వివాదాస్పద నిర్ణయాలు

అయితే అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోయారు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుంచి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయ‌న‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపిక‌య్యారు. నెలరోజుల్లోనే ఆయ‌న  ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.

Also read: అద్భుత చిత్రాల సృష్టిక‌ర్త‌… విక్టరీ మ‌ధుసూద‌న‌రావు

ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయ‌న ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమారంగంలో “స్లాబ్ విధానాన్ని” అమలుపరిచారు.  శాసనమండలిని రద్దు చేసారు. హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.

ఏకసామ్యం వల్ల పరాజయం

M. G. Ramachandran : సీనియర్ ఎన్టీఆర్, ఎంజీర్ మధ్య ఉన్న ఈ సిమిలారిటీస్ మీకు  తెలుసా? - Latest News Telugu
ఎంజీఆర్ తో ఎన్టీఆర్

1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వల్ల ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యారు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించారు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్ కు  ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు.

1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు.  తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు.

1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. అయితే ఆయ‌న  రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నార‌నే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగు దేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఆయ‌న  ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు . అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. తర్వాత, 18 జనవరి 1996న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు.

Also read: పాత్రలకు ప్రాణం పోసిన మ‌హాన‌టి సావిత్రి

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడి గా బిరుదాంకితుడైన ఆయ‌న త‌న  44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు.

తెలుగువారి అన్నగారు

images images: sr.ntr images high quality
రాజకీయాలలో ముఖ్యమంత్రిగా ఉండగా వివేకానందుడిగా వేషధారణ.

 

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఆయ‌న  తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. 1968లో   భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి  గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ ‘ స్వీకరించారు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది.

Also read: నియమ, నిష్ఠల అపూర్వ సంకల్పం అయ్యప్ప దీక్ష

 స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చినా,  బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించినా ఆయ‌నకే చెల్లింది. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే. అన్ని కులాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు.    తెలంగాణాలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారారు. ఎన్టీఆర్  అంటే ఓ శ‌క్తి … ఓ  స‌మ్మోహ‌న శ‌క్తి… తెలుగు ప్ర‌జ‌లు బ‌తికున్నంత కాలం, వారి  హృద‌యాల‌లో ఎన్టీఆర్ బ‌తికే ఉంటారు. తెలుగు జాతి గ‌ర్వించే వ్య‌క్తి ఎన్టీఆర్‌.

Also read: తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌నం బాపు బొమ్మ‌

(జ‌న‌వ‌రి 18 ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం)

దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

మొబైల్ :  7794096169

Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles