Sunday, December 8, 2024

ఎన్టీపీసీ అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

  • దేశంలో నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్
  • త్వరలో పూర్తికానున్న నిర్మాణం
  • మే నుంచి ఉత్పత్తి ప్రారంభం

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్యుత్  డిమాండ్‌ కు అనుగుణంగా ఉత్పత్తి జరగడంలేదు. అయితే అవసరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అవసరాలకు తగ్గట్లు విద్యుత్ డిమాండ్ నెరవేర్చేందుకు థర్మల్‌ విద్యుత్తుపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాల వల్ల తీవ్ర కాలుష్యంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమిస్తూ భవిష్యత్తు డిమాండ్‌ను అందుకునేందుకు సౌర విద్యుత్తు ఉత్పత్తిపైనే  ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించాయి.

థర్మల్ విద్యుత్ తో వాయు కాలుష్యం:

బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలతో వెలువడే కాలుష్యంతో పర్యావరణానికి, మనుషులకు, జంతువులకు పెను ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో ఇప్పటివరకు ప్రతిపాదనల్లో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే  మరో పదేళ్లలో ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకు పెరిగే వాయుకాలుష్యంతో ఏటా లక్షలాది మంది మృత్యువాత పడతారని పలు అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే ఉద్గారాల కారణంగా సంభవించే ముందస్తు మరణాలు 2030 నాటికి రెండుమూడు రెట్లు పెరగనున్నట్లు పర్యావరణ వేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఆథారిత విద్యుత్ ఉత్పత్తినుంచి ఉద్గారరహిత పునరుత్పాదక ఇంధన వనరుల వైపు దృష్టి సారించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పర్యావరణవేత్తలు కూడా విద్యుత్ ఉత్పత్తికి  సంప్రదాయ పద్దతులను అవలంబించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతోంది.

Also Read: సెప్టెంబర్‌ కల్లా 300 మెగావాట్ల సింగరేణి సోలార్‌ సిద్ధం..

పెద్దపల్లి జిల్లా | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం | భారతదేశం

ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా నిర్మిస్తోంది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో మే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. వీటిలో రిజర్వాయర్లపైనే 217 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో రామగుండంలోని ఎన్టీపీసీలోని శ్రీరాం సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ ఉపరితలంపై 100 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ సోలార్ విద్యుత్ కేంద్రానికి సుమారు 423 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనావేసింది. ఈ నిర్మాణం ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ లలో దేశంలో ఇదే అతి పెద్దదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

Also Read: సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక

సాధారణంగా ఒక మెగావాట్‌ ఉత్పత్తికి ఐదెకరాల భూమి అవసరం కానుండగా, నీటిపై తేలియాడే ప్లాంట్లకు పెద్దగా భూ సేకరణ కూడా అవసరంలేదని ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు. రామగుండంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మరిన్ని ఫ్లోటింగ్‌ సోలార్‌ యూనిట్లను నిర్మించే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేరళలోని కయంకుళంలో 92 మెగావాట్లు, సింహాద్రిలో 25 మెగావాట్ల యూనిట్లను ఎన్టీపీసీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles