Thursday, April 25, 2024

శనివారం … పోలవరం!

వోలేటి దివాకర్

  • ఏ వారమైనా ఒకటే
  • పనులు జరగడం లేదు
  • ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో తెలియదు

 ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి, సీనియర్ జర్నలిస్టుతో కలిసి గత శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లాము. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. పోలవరం సందర్శనకు కొన్ని వారాల ముందే వెళ్లాల్సి ఉన్నా … అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఉదయమే వెళ్లి మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ఆసక్తిగా పరిశీలించాము. ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్ వే, ప్రధాన కాలువలు, వాటికి అనుసంధానంగా కొండలను తొలిచి నిర్మించిన నీటి సరఫరా మార్గాలు, కాఫర్ డ్యామ్, జల విద్యుత్ ప్రాజెక్టు, పట్టి సీమ పంపింగ్ స్కీమ్ తదితర నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఈసందర్భంగా దక్కింది.

Also read: గోదావరి తీరం …. భక్త కాంతులతో దేదీప్యమానం!

 ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రముఖ కాంట్రాక్టు సంస్థ ఇంజనీర్ కూడా మాతో రావడంతో ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. వీరభద్రరావు అనే ఆ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్టును ఆద్యంతం బాధ్యతగా చూపించడంతో పాటు అక్కడి పరిస్థితులు, నిర్మాణ ప్రగతిని కూలంకుషంగా వివరించారు.

అదే సమయంలో ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్టు అధారిటీకి సంబంధించిన ఉన్నతాధికారి ఒకరు తనిఖీ చేశారు. ఒక విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు ప్రత్యేక అనుమతి పై వచ్చారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప పోలవరం లాంటి బహుళార్థక సాధక జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తున్న జాడలే ఆప్రాంతంలో లేవు.  కూలీలు, ఇంజనీర్ల హడావుడి, కోలాహాలం ఏమాత్రం కనిపించలేదు. ప్రస్తుతం పోలవరంలో ఇటీవల వరదలకు దెబ్బతిన్న దిగువ కాఫర్ డ్యామ్ పునరుద్ధరణ పనులు, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు మాత్రమే జరుగుతున్నాయి. అక్కడి పరిస్థితులు సామాన్య ప్రజలు ఊహించుకున్న దానికి భిన్నంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం.

Also read: పార్టీ ఒకటే కానీ … వారి పంథాలే వేరు!

 అదే సోమవారం పోలవరం అయితే …

 తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు సందర్శక ప్రదేశంగా మారిపోయింది . ప్రతీ సోమవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని సమీక్షించేవారు. దీంతో సోమవారం పోలవరం అనే నినాదం అప్పట్లో అధికారులు, ప్రజల్లో బాగా నానింది. అలాగే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, గ్రామాలు, నగరాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా ప్రజలను సమీకరించి పోలవరం సందర్శనకు ప్రత్యేక బస్సుల్లో పంపారు. నిర్మాణ ప్రగతి సంగతి ఎలా ఉన్నా సమీక్షలు, సందర్శకులతో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సందడి కనిపించేది. చంద్రబాబునాయుడుతో సహా టిడిపి మంత్రులు తమ హయాంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని గంభీరంగా గడువులు ప్రకటించినా ఆచరణ సాధ్యం చేయలేకపోయారు.

Also read: రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!

ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము!

‘నేను బతికి ఉండగా పోలవరం పూర్తవుతుందో లేదోనని ‘ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకసారి నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని స్పష్టంగా చెప్పేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల పోలవరం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టు సంస్థలకు ఇప్పట్లో ప్రాజెక్టు పూర్తి కాదన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఆచరణలోకి వచ్చేందుకు ఐదేళ్లకు పైగా సమయం పట్టవచ్చని వారు  చెబుతున్నారు. టిడిపి హయాంలో కనీసం ప్రాజెక్టు సందర్శనకు ఆటంకం ఉండేది కాదు. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు సందర్శనపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలకు నిషేధం అమల్లో ఉంది. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, కూలీలు, ఢిల్లీ నుంచి వచ్చే పోలవరం ప్రాజెక్టు అధారిటీ ఉన్నతాధికారులకు మినహా ఇతరులకు అనుమతులు లేవు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో  ప్రజలకు తెలిసే అవకాశాలు అసలే లేవు.

Also read: సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles