Thursday, December 8, 2022

అధికార పార్టీలో అంతా ఆసమర్థులేనా?

వోలేటి దివాకర్

అధికార వైఎస్సార్ సిపికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లను కూడా నియమించారు. ఇది జరిగి దాదాపు 6నెలలు గడుస్తుంది. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా మారిన కీలకమైన రాజమహేంద్రవరం నగరానికి మాత్రం ఏడాదిన్నర కాలంగా కోఆర్డినేటర్ ను నియమించలేకపోతున్నారు. ఇది పార్టీ నాయకత్వ అసమర్థతా … లేక నాయకత్వ లేమా అర్థం కావడం లేదు .రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా రాజమహేంద్రవరంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అధికార పార్టీ కనీసం నగర కోఆర్డినేటర్ ను కూడా నియమించుకోలేని నిస్తేజంలో ఉండటం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ నాయకులు ప్రకటించినట్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా సమర్ధుడైన మేయర్ అభ్యర్థి కనిపించడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థి పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

Also read: ఉండవల్లికి ఊరట…రామోజీకి చుక్కెదురు!

నేనుండగా కోఆర్డినేటర్ ఎందుకు?

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇటీవల మాట్లాడుతూ తనుండగా కోఆర్డినేటర్ ఎందుకని ప్రశ్నించడం గమనార్హం. గతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన రాజమహేంద్రవరం తన అడ్డాగా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న   ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయనే మరో సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. సహజంగా కోఆర్డినేటర్ ఎమ్మెల్యేగా పోటీలో ఉంటారు. రాజమహేంద్రవరంలో మాత్రం అధికార పార్టీకి సరైన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో  అధికార పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పైకి చేతులు కలిపినా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు కనిపించడం లేదు.

Also read: సెల్ ఫోన్ లో డబ్బు పంపినట్టు… పితృదేవతలకు ఆహారం పంపవచ్చు!

వారిద్దరి రాజకీయ భవిష్యత్ ఏమిటి?

 గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తరువాత ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణంను రాజమహేంద్రవరం కోఆర్డినేటర్గా నియమించారు. ఎంపి మార్గాని భరత్ రామ్, జక్కంపూడి రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను అనూహ్యంగా తప్పించి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు గత ఏడాదిలో పార్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు కట్టబెట్టారు.  కొద్దిరోజుల పాటు హడావుడి చేసిన ఆకుల ఆతరువాత రంగం నుంచి దాదాపు అదృశ్యమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు లేకున్నా  ఒకవైపు రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, ఎంపీ పోటీకి సిద్దం అని  ప్రకటించారు. అయితే రౌతు, శ్రీఘాకోళ్లపు మాత్రం రాజకీయంగా నిస్తేజంగా ఉండిపోతున్నారు. ఇక వారి రాజకీయ భవిష్యత్ లేనట్టేనా?

Also read: మోడీ మాట కూడా లెక్క చేయని పవన్… ఇదే నిదర్శనం!

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles