Thursday, November 30, 2023

కొత్త టీకాలకు స్వాగతం

ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా దిగుమతులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఫైజర్ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ -డి అత్యవసర వినియోగం అనుమతుల కోసం కంపెనీ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డి సీ జి ఐ ) కు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతులు వస్తే, ప్రపంచంలోనే తొలి డి ఎన్ ఏ ఆధారిత వ్యాక్సిన్ అవుతుంది. 12-18 ఏళ్ళ వారికి ఉపయోగంలోకి వచ్చే తొలి వ్యాక్సిన్ కూడా ఇదే. జైకోవ్ -డి కు అనుమతులు త్వరితగతిన వచ్చే అవకాశం ఉంది.

Also read:మహమ్మారి మూడో మృదంగం

రెండు రకాల టీకాలు తీసుకున్నా పర్వాలేదు

మొదటి డోస్ ఒక కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకొని, రెండో డోస్ వేరే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవచ్చనీ చెబుతున్నారు. మిశ్రమ డోసులు ఇంకా బాగా పనిచేస్తాయంటూ కొత్త సిద్ధాంతం తెరపైకి వస్తోంది. బ్రిటన్ లోని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం ఈ అంశంపై తాజాగా అధ్యయనం చేసింది. కోవీషీల్డ్ – ఫైజర్ మిశ్రమ డోసులు కరోనాపై ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని  వీళ్ళు అంటున్నారు. ఈ రెండింటిలో ఒక వ్యాక్సిన్ ను మొదటి డోస్ గా తీసుకొని, రెండో డోస్ గా రెండో వ్యాక్సిన్ ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి మరింత బలంగా ఉత్పన్నమవుతుందని వీరి తాత్పర్యం. మొదటి డోస్ కోవీషీల్డ్, రెండో డోస్ ఫైజర్ తీసుకుంటే యాంటీబాడీస్, టీ సెల్స్ స్పందనలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం బృందం అంటోంది. ఇవ్వన్నీ వింటానికి బాగానే ఉన్నాయి కానీ, మన దేశ ప్రజల విషయంలో ఎంతవరకూ ఫలితాలను ఇస్తాయన్నది ఇంకా నిర్ధారణ కావాల్సివుంది. ఇప్పటి వరకూ కోవాగ్జిన్,కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఎంతమందికి యాంటీబాడీస్ ఉత్పన్నమయ్యాయో, టీ సెల్స్ స్పందనలు పెరిగాయో తెలుసుకొని డేటాను రూపొందించడం ప్రభుత్వాల బాధ్యత. వ్యాక్సినేషన్ ఎంత పెరిగితే అంత మంచిదే కావచ్చు. గుడ్డెద్దు చేలోపడ్డ చందంగా కాకుండా, వ్యాక్సిన్ల పనితీరుపై పర్యవేక్షణ, సమీక్షలు చాలా అవసరం. కో వ్యాక్సిన్ మూడో డోస్ కూడా వేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే సరియైన ఫలితాలు వస్తాయని అర్ధం చేసుకోవాలా? వ్యాక్సిన్లు వచ్చిన కొత్తల్లో కోవీషీల్డ్, కోవ్యాక్సిన్  సంస్థలు ఒకదానిపై మరొకటి  దుమ్మెత్తి పోసుకున్నాయి. పంపుసెట్టు దగ్గర ఆడవాళ్ళ తగాదాల్లో అసలు నిజాలు బయటకు పొక్కుతాయి. రెండు కంపెనీల మధ్య జరిగిన వాగ్వివాదాల  నేపథ్యంలో చాలా రోజులపాటు ప్రజలు వ్యాక్సిన్లు వేసుకోడానికి ముందుకు రాలేదు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి  ముఖ్యులు వేసుకొని ప్రచారం చేసిన తర్వాత ప్రజలకు నమ్మకం కుదిరి, వ్యాక్సినేషన్ కు సిద్దమయ్యారు. తీరా ప్రజలు సిద్ధమయ్యే సరికి అక్కడ వ్యాక్సిన్ స్టాక్ అయిపొయింది. లాక్ డౌన్ సడలింపులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంకాకపోయే సరికి మళ్ళీ కరోనా విజృంభించింది. రెండో వేవ్ కొంపముంచింది.

Also read: కరోనా చైనా చేతబడేనా?

టీకాల ప్రక్రియ వేగవంతం

కొన్నిరోజుల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇది మంచిపరిణామామే అయినప్పటికీ, ఈ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ఇంకా అందరికీ విశ్వాసం కుదరడం లేదు. వాటి సమర్ధతపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. స్పుత్నిక్ లైట్ (సింగల్ డోస్ రకం)  కూడా అందుబాటులోకి వచ్చేస్తోందని ప్రచారం జరిగింది. దీనిపై కొంతమంది చాలా ఆశలు పెట్టుకున్నారు. వేరే కంపెనీల వ్యాక్సిన్లు తీసుకుంటే రెండు/ మూడు డోసులు పూర్తవడానికి సమయం పడుతుంది. అదే స్పుత్నిక్ లైట్ ఒక్కడోస్ తీసుకుంటే సరిపోతుందనే వార్తలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై కొందరికి ప్రత్యేకమైన ఆకర్షణ పెరిగింది. దీనిపై తుది పరీక్షలు ఇంకా ముగియలేదు. దీన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. స్పుత్నిక్ లైట్ కు సంబంధించిన మూడో దశ ప్రయోగాల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో అది కీలకపాత్ర పోషిస్తుందని పరిశీలకులు సైతం అంచనా వేశారు. ఎందుకో ప్రస్తుతం అనుమతి రాలేదు. సమీప భవిష్యత్తులో రావచ్చు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయితే, మూడో వేవ్ వల్ల ముప్పు పెద్దగా ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా తాజాగా అన్నారు. ఈ తరుణంలో, మరిన్ని సమర్ధవంతమైన వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చుకోవడం అత్యంత కీలకం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మరింత బలమైన అడుగులు వేయాలి.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles