Wednesday, April 24, 2024

కొత్త సిలబస్

కొత్త సిలబస్

ఏడ్చినా నవ్వినట్టే ఏడ్వు

కన్నీటికి కరిగే గుండెల్లేని ఎడారిలో

కోకిల పాటకి శ్రోత వుండడు..

మాట్లాడినా, మాట్లాడనట్టే ..మాట్లాడు

వంచనాలంకారమే

ముఖారవిందమైన అద్దం ముందు

స్వచ్ఛతకి ప్రతిబింబం వుండదు..

రెండు పెగ్గుల ఆలింగనాల మధ్య

కరచాలనం చేస్తూ

పెదవులు పూలు పూయటం

స్నేహ రుతువుకు సంకేతం కాదు

అనివార్యాల ఒడంబడిక మాత్రమే

జీవితం వ్యాపారమై పోయిన వ్యవస్ధలో

రోజూ మరణించడం

మళ్ళీ రోజూ బ్రతకటం

స్నానమయ్యాక బట్టలు తొడిగినట్టే..

ఇప్పుడు నీతి వాక్యాలు

వచన ప్రవచనాలు కాదు కావలసింది

ప్రమాదం అంచుల్లో చిక్కుకోక

తప్పించుకుంటూ

బ్రతకడం నేర్పే కొత్తసిలబస్..!!

Also read: సజీవస్పర్శ..!

Also read: ఇనుపచెట్లు

(కవి మొబైల్ : 9849230443)

Perugu Ramakrishna
Perugu Ramakrishna
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles