Friday, June 9, 2023

‘ఆస్కార్’లో చోటు దక్కిన నాటు నాటు…

  • తెలుగు సినిమాకు అఖండ ఖ్యాతి
  • లగాన్ తర్వాత అస్కార్ కు నామినేటైన చిత్రం

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో మన పాట నిలిచింది, గెలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఈ అద్భుతమైన అర్హత లభించింది. అత్యుత్తమ ప్రమాణాలు కొలబద్దగా సాగే ఎంపిక ప్రక్రియలో మనకు చోటు దక్కడం ఆషామాషీ కాదు. అందునా భారతీయ సినిమాకు, అందులోనూ తెలుగుపాటకు. లగాన్ తర్వాత భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం చిత్రం!! ఈ ఎంపికతో ఈ సినిమాకు, ఈ పాటలో భాగస్వామ్యులైన వారందరికీ ఘన గౌరవం దక్కింది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తప్ప అందరూ తెలుగువారే కావడం పరమానందకరం! పాటను రాసిన చంద్రబోస్, స్వరపరచిన కీరవాణి, పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, అమోఘమైన నృత్యం చేసిన నటద్వయం నందమూరి తారకరామారావు, చరణ్, అద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళి వందనీయులు, అభినందనీయులు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ పాటను ధియేటర్ లో చూసినప్పుడు పూనకాలు వస్తాయి! తెలుగు తెర తీరాలను దాటి ప్రపంచ వీధుల్లో భారతీయ జయపతాకను ఎగురవేసిన ఈ విజయగీతిక మన ప్రతిభా ప్రభను చాటే విపంచిక.

అప్పుడు శ్రీశ్రీ, ఇప్పుడు చంద్రబోస్

‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రరాజం కాసులవర్షంతో పాటు కీర్తి కానుకలను కూడా కురిపిస్తోంది. ఒక తెలుగు పాటకు ఇంత పేరు రావడం మాటలు కాదు! తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ పురస్కారాన్ని శ్రీశ్రీ అందిస్తే, నేడు ప్రపంచ పురస్కారాన్ని చంద్రబోస్ అందించాడు. గీతకారులుగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు. ‘నర్తనశాల’ సినిమా తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఘనతను ఇన్నేళ్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇక నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనతను చాటిచెప్పుకొనే సౌభాగ్యం, మన తెలుగుసీమకు దక్కింది. దక్కించినవాడు రాజమౌళి. కథను అందించి ఈ అద్భుతాన్ని పండించినవారు విజయేంద్రప్రసాద్. తండ్రి,కొడుకులు ఇరువురూ విజయేంద్రులే. ‘అవతార్’ లాంటి హాలీవుడ్ చిత్రాలను దాటి జపాన్ 46వ అకాడెమి అవార్డు గెలుచుకున్న ఈ పాట ఇప్పటికే ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని వరింపజేసుకుంది.

జపాన్ లో జనాలు  బారులు కట్టారు

మన సినిమా జపాన్ లో విడుదల కావడం ఒక ఆశ్చర్యమైతే, నెలల తరబడి ప్రదర్శన పొందుతూ డబ్బుపూలు పూయిస్తోంది, కీర్తి పరిమళాలు వీయిస్తోంది. జపాన్ ప్రజలు ఈ సినిమాను చూడడానికి ఇప్పటికీ బారులు తీరుతున్నారు. ఆసియా ఖండపు చిత్రానికి అఖండఖ్యాతిని అందిస్తున్న అపూర్వ ఘట్టం నేడు తెరతీసుకొని రెపరెపలాడుతోంది. ఈ విజయం వెనకాల, ముందూ  ఎందరిదో స్వేదం జీవనాదంగా మార్మోగింది. వారి శ్రమైక జీవన సౌందర్యమే ఆశీస్సులై నేడు ఈ అద్భుతాన్ని అందించింది. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. పోట్లగిత్తలా దూకి, పోతరాజులా ఊగి, కర్రసాము సేసి… నా పాట సూడు… నా పాట సూడు… అంటూ వీరనాటు వేసింది,

వీరతాళ్లు వేయించుకుంటోంది. భూమి దద్దరయ్యేలా వీరంగం సేసినట్టు దుమ్ము దులుపుతోంది. తెలుగువారి యవ్వారం ఏంటో ఎరుకపరిచిన ఈ సందర్భం గొప్ప సంరంభం!

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles