Wednesday, April 24, 2024

సంక్షోభాలు – సైన్స్ సమాధానాలు

(రాజా రాజా)

ఫిబ్రవరి 28 – ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ సైన్స్ దినోత్సవం ప్రాధాన్యత గురించి నేటి మన సమాజంలో సరైన చర్చ, తగు అవగాహన లేకపోవడం ఒక విషాదకరమైన వాస్తవం.

నిజానికి మన సామాజిక జీవనంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు సాధారణంగా ప్రముఖ వ్యక్తుల జీవితాలకు సంబంధించినవి. వారి విజయాలకు సంబంధించినవి. ఉదాహరణకు గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ మొదలైనవారి జయంతులు, వర్ధంతులు. ఇవే కాకుండా, మన దేశ చరిత్రలో నమోదైన కొన్ని విజయ ఘట్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆగస్టు 15, జనవరి 26. అలాగే, అనేక తరగతుల ప్రజలు – విద్యార్థి,యువజన, మహిళ, వృద్ధులకు సంబంధించి ప్రత్యేక రోజులు ఉన్నాయు. అనేక రంగాల వారీగా ప్రత్యేక రోజులు – కార్మిక, ఆరోగ్య, పర్యావరణ, భాష, మొదలగునవి మనకు తెలుసు.

Also Read : మోడీ స్టేడియం పిచ్ పై విమర్శల వెల్లువ

సైన్స్ డే ప్రాధాన్యం ఏమిటి?

మరి, నేటి సైన్స్ డే ఫిబ్రవరి 28 ఏ రకమైనది ? మనదేశ ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న  తన ప్రఖ్యాత ప్రయోగం – రామన్ ఎఫెక్ట్ ను ప్రతిపాదించిన రోజుగా దీనికి ఒక గుర్తింపు ఉంది. ఈ ప్రయోగానికే ఆయనను నోబుల్ బహుమతి వరించింది.  కానీ ఈ ఫిబ్రవరి 28 కేవలం రామన్  సంస్మరణ దినోత్సవం కాదు. భారత ప్రభుత్వం అధికారికంగానే ఈరోజుకు అంతకుమించిన ప్రాధాన్యాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. దేశ ప్రగతిలో శాస్త్ర పరిశోధనలకు గల సముచిత పాత్రను గుర్తించడం ఈ రోజు ప్రాధాన్యత. అలాగే దేశ ప్రజలలో శాస్త్రీయ స్పృహను పెంపొందించడానికి ఈరోజు ఒక సరైన సందర్భం కూడా. ఆ విధంగా మన దేశ సామాజిక జీవనంలో ఒక నిర్దిష్ట ఆలోచనకు,  భావజాలానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రచారం చేయడం ఈ సైన్స్ డే యొక్క విశిష్టత.

నిర్దిష్టమైన భావజాలనికి పెద్దపీట

దేశపౌరులలో ప్రభుత్వం తాను ఆశించే ఆలోచన క్రమాన్ని పెంపొందించేందుకు, కార్యాచరణకు వారిని సన్నద్ధం చేయడానికి రామన్ శాస్త్ర పరిశోధనను ఒక భూమికగా చేసుకున్నది. ఈ విధంగా వ్యక్తుల, ఘటనల, విజయాల ప్రశంసలకు, ప్రచారాలకు పరిమితం కాకుండా నిర్దిష్ట భావజాలానికి పెద్దపీట వేయడాన్ని ఈ జాతీయ సైన్స్ దినోత్సవ స్ఫూర్తిగా ముందుగా మనం గ్రహించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో శాస్త్ర ప్రచారానికి పర్యాయపదంగా నిలిచిన జన విజ్ఞాన వేదిక కూడా తన ప్రస్థానాన్ని ఈ రోజునే అనగా ఫిబ్రవరి 28, 1988 నాడు ఉద్దేశపూర్వకంగానే ప్రారంభించింది.

Also Read : ఫీజు కోసం ప్రైవేట్ స్కూల్ దాష్టీకం

నేటి కాలపు శాస్త్ర వైరుధ్యం

మరి, 21వ శతాబ్దంలో కూడా శాస్త్రరంగం ప్రాధాన్యత గురించి ప్రజలలో ఇంకా ప్రచారం చేయవలసిన అవసరం ఉందా ? ఆదిమ, మధ్య యుగాల మానవుడి నుండి ఆధునిక మానవుడిగా పరిణామం చెందడంలో శాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాధాన్యతను బట్టి ఎవరైనా సులభంగా ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాని క్షేత్రస్థాయిలో ప్రజలపై ప్రభావం చూపుతున్న అనేక అంశాలను నేటి సమాజంలో పెరుగుతున్న అనేక మౌఢ్య, సంకుచిత ధోరణులు బహిర్గతం చేస్తున్నాయి. నేడు మన దేశంలో రోజు ఏదో ఒక చోట కులం-మతంపై భక్తితో, దేవుడు-దయ్యం పై భయంతో దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవి మన ప్రజలలో ఇంకా సజీవంగా ఉన్న అనేక అశాస్త్రీయ ప్రభావాలను సూచిస్తున్నాయి.

National Science Day 2021 : crises and science answers

కరోనాకు సమాధానం వచ్చేది సైన్స్ నుంచే

నేడు ప్రపంచ మహమ్మారిగా పరిణమించిన కరోనాకు కేవలం వైద్య శాస్త్రమే పరిష్కారాలు చూపుతున్నది. ఇది ప్రపంచ ఉమ్మడి అనుభవం కూడా. కరోనా లాక్డౌన్ నేపద్యంలో వినోదానికి మాత్రమే ఇప్పటిదాకా పరిమితమవుతున్న డిజిటల్ / ఆన్లైన్ సాంకేతికత నేడు విద్యార్థుల జీవితంలో విడదీయరాని రోజువారి అంశంగా మారింది. అలాగే గడప దాటి బయటకు రాలేని నేటి పరిస్థితులలో కూడా మనం అంగారకుడి పైకి, చంద్రుడిపైకి ప్రయాణం చేయగలుగుతున్నాం. కానీ నాణానికి ఇదంతా ఒక వైపు మాత్రమే.

Also Read : రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం

అలాగే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో పునర్జన్మ, దైవం పేరుతో హత్యకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాదాంతం. ఢిల్లీలో ప్రభువు పిలుస్తున్నాడని ఒకే కుటుంబంలో దాదాపు 11 మంది ఆత్మహత్య. గోదావరి జిల్లాల్లో ప్రార్ధనలతో చచ్చిన మనిషి బతికి వస్తారని రోజంతా ప్రార్థనలు. ఇవే కాకుండా స్వస్థత కూటములు, పవిత్ర జలం, రంగురాళ్లు, న్యూమరాలజీ, తాయత్తులు, బాణామతి పేరుతో ప్రజల పై జరుగుతున్న ధన, మాన దోపిడి, హత్యలు – ఇవన్నీ నాణానికి మరోవైపున నిత్యం కళ్ళకు కడుతున్నాయి. మన ప్రజల ఆలోచనా దృక్పధంలో, ప్రవర్తన రీతులలో ఇది ఒక పెద్ద శాస్త్ర వైరుధ్యం. ఈ వైరుధ్య పరిష్కారం పైనే ప్రజలలో శాస్త్రీయ స్పృహ పెరుగుదల సాధ్యం. అంతిమంగా అది దేశ ప్రగతికి సోపానం.

శాస్త్రీయ దృక్పథం – రాజ్యాంగ రక్షణలు

వాస్తవానికి స్వాతంత్య్రానంతర తొలి పాలకులు, ప్రధానంగా పండిట్ నెహ్రూ మన దేశ ప్రగతి శాస్త్రరంగం ద్వారానే సాధ్యమని గ్రహించారు. ఆ దిశగా గట్టి చర్యలు కూడా చేపట్టారు. 1945-50 మధ్య ప్రపంచంలో దాదాపు వందకు పైగా దేశాలు వలస పాలన నుంచి విముక్తి పొందాయి. స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. కానీ వీటన్నిటిలో శాస్త్ర పరిశోధన,  అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణానికి పెద్దపీట వేసింది మన దేశం మాత్రమే. ఆధునిక ఉదారవాద భావాలు, హేతువాద దృక్పథం, ప్రపంచ అవగాహన మెండుగా గల నెహ్రూ, శాస్త్రంపై ఆధారపడి మన దేశ ప్రగతికి పునాదులు వేశారు. ఆనాటికి అభివృద్ధి చెందిన ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన దేశం వివిధ రంగాలలో స్వావలంబన సాధించేలా ప్రణాళికలు రూపొందించారు.

Also Read : నట `మిక్కిలి`నేని

మొట్టమొదట ‘శాస్త్రీయ దృక్పథం’ అన్న వ్యక్తి నెహ్రూ

వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల, రోదసి, అణుశక్తి, విద్య, వైద్యం మొదలగు అనేక రంగాలలో మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఈ సందర్భంగా నెహ్రూ గురించి ఒక విషయం చెప్పాలి – నేడు ప్రపంచమంతా చాలా విరివిగా వాడుతున్న “శాస్త్రీయ దృక్పథం” సైంటిఫిక్ టెంపర్ అనే పద ప్రయోగాన్ని తొలిగా ఉపయోగించింది కూడా పండిట్ నెహ్రూనే. ఆ తర్వాత, 1976లో  చేసిన 42వ రాజ్యాంగ సవరణలో కొత్తగా కొన్ని ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో 51 ఏ అధికరణం ద్వారా ప్రజలకు ఇచ్చారు. అందులోని 51 ఏ (హెచ్) అధికరణం మన దేశ ప్రజలకు ఇచ్చిన బాధ్యతను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. “ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతను, ప్రశ్నించే తత్వం (జిజ్ఞాస) మరియు సంస్కరణాభిలాష కలిగి ఉండాలని” ఈ అధికరణం పేర్కొంటున్నది. ఈ రకమైన పౌర బాధ్యతను ప్రపంచంలో కేవలం మన దేశ రాజ్యాంగంలోనే రూపొందించారు.

పెరుగుతున్న అశాస్త్రీయ ధోరణులు

ఈ విధంగా మన సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అవసరమగు అనేక రాజ్యాంగ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలతో మన దేశం తన సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించింది. దీనికి మనం ఎంతో గర్వించాలి. కానీ ఎంతో విశిష్టమైన ఈ శాస్త్రీయ స్పృహను నీరుగార్చే చర్యలకు, విధానాలకు తదుపరి ప్రభుత్వాలే పూనుకోవడం ఒక చారిత్రక విషాదం. దీని ఫలితమే నేడు సమాజంలో  ప్రశ్నపై నిర్బంధాలు, అశాస్త్రీయ మౌఢ్య ధోరణుల పెరుగుదల.  దీంతో ప్రజానీకంలో గందరగోళం, పరస్పర విరుద్ధ భావజాల ప్రభావం వేగంగా పెరుగుతున్నాయి.

Also Read : సరళ స్వభావుడు… సు­మధుర గాత్రుడు­

పెచ్చరిల్లుతున్న కుహనా సైన్సు వాదనలు

ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో పాలకులే స్వయంగా అనేక అశాస్త్రీయ, కుహనా సైన్సు అభిప్రాయాలను చాలా బలంగా ముందుకు తీసుకు వస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లలో ఈ రకమైనటువంటి అశాస్త్రీయ అంశాలను మన ప్రాచీన దేశ కీర్తి ప్రతిష్టల పేరుమీద ప్రచారంలో పెట్టారు. దీనితోపాటు అనేకమంది నాయకులు తమవంతుగా యధాశక్తిన వివిధ సందర్భాలలో సైన్స్ వ్యతిరేక అభిప్రాయాలను, భావాలను నిజమైన సైన్స్ గా ప్రజల మీదకి రుద్దు తున్నారు. వీరితో పాటు కొందరు శాస్త్రవేత్తలు కూడా తమ గళం కలపడం చాలా శోచనీయం. పురాణ కాలం లోనే మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిందనేది వీరి  కుహనా సైన్స్ వాదనల సారాంశం. కౌరవుల  జననం – స్టెమ్ సెల్ సాంకేతికత అని, వినాయకుడికి ఏనుగు తల అతికించడం – ప్లాస్టిక్ సర్జరీ అని, ఆ కాలంలోనే పుష్పక విమానం లాంటి విమానాలు మన పూర్వీకులు వాడారని…. ఇలా అనేకానేక కట్టు కథలను, కల్పితాలను సైన్స్ గా,  మన ప్రాచీన భారతదేశ శాస్త్ర ప్రగతిగా వారు పదే పదే పేర్కొంటూ వచ్చారు. ఈ విధంగా చరిత్రను – పురాణాలను,  విశ్వాసాలను – విజ్ఞానాన్ని కలగాపులగం చేసి మనదేశ ప్రజలలో ఒక గందరగోళాన్ని, అయోమయాన్ని,  జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.

ఈ ప్రయత్నాలతో రెండు ప్రమాదాలు ఉన్నాయి

1) వేల సంవత్సరాల ఘనమైన చరిత్రగల మన ప్రాచీన భారతదేశ నిజమైన వి‌షయాలు, శాస్త్ర సాంకేతిక విజయాలు ఈ హోరులో మరుగున పడిపోతాయు.

2) రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వైజ్ఞానిక సమాజం దృష్టిలో మన దేశం నవ్వుల పాలవుతుంది.

ఈ తరహా సూడో‌ సైన్స్ వాదనలను ఇండో-బ్రిటిష్ రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా తీవ్రంగా ఖండించాడు. వీటికి పరిష్కారం జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేసే ప్రజాసైన్స్ ఉద్యమాలేనని ప్రకటించాడు కూడా. మన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు సర్కస్ లాగా మారిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : బందీగా కంటే బలిదానమే మిన్న:ఆజాద్

తాజా అనుభవాలు

ఒకసారి  మన తాజా అనుభవం పరిశీలిద్దాం. అది కరోనా విషయంలో మనదేశ వైఖరి. చివరి చివరిలో వైజ్ఞానిక సమాజం సూచించే పరిష్కారాలను అంటే శాస్త్రీయ పద్ధతిలో తయారయ్యే వ్యాక్సిన్ ద్వారానే కరోనాను  నిరోధించగలమని మన పాలకులు అంగీకరించారు.  అందుకు అనుగుణంగా దాదాపు 35 వేల కోట్ల రూపాయలను కూడా ఇప్పటివరకు మన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. సంతోషం. కానీ కరోనా ప్రారంభమైన కొత్తలో దీని గురించి అవగాహన కలిగించడంలో, దీని ప్రభావాన్ని తగ్గించడంలో చాలా అశాస్త్రీయ వైఖరులను ప్రచారంలో పెట్టారు. ఉదాహరణకు దీపాలు వెలిగించడం, పళ్ళాలు కొట్టడం, సాంప్రదాయ వైద్యం పేరుతో నిరూపణ లేని చిట్కా వైద్యాలు ప్రచారం చేయటం, ‌ ఆవు మూత్రం తాగడం వల్ల, పవిత్ర గ్రంథాలు చదవడం ద్వారా కరోనా ని దూరం చేయొచ్చు అంటూ అనేక అశాస్త్రీయ విధానాలను ప్రజలలో ప్రచారం పెట్టిన సంగతి మనకు తెలుసు‌.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. దీన్ని యధాతధంగా అమలు చేయడానికి తద్వారా పాలకుల మెప్పు పొందడానికి అనేకమంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు తమ శక్తి మేరకు పని చేశారు. ఆ మేరకు ప్రజలలో గందరగోళం, కుహనా సైన్స్ వాదనలను చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు.

Also Read : బహుజన బంధువు పీవీ

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ తలపెట్టిన గో సైన్స్ పరీక్షా ప్రహసనం ఈ కోవలోదే. చివరకు ఈ ప్రహసనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే సరికి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం పునరాలోచన చేయడం అందరికీ ఒక ఉత్సాహాన్నిస్తుంది. ఈ రకమైనటువంటి ఒత్తిడిని దేశ విశాల ప్రయోజనాల కోసం శాస్త్రవేత్తలు, సైన్సు ప్రేమికులు, సైన్స్ సంస్థలు మరింత పెద్ద ఎత్తున చేపట్టాలి.

అలాగే, మన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన బెనారస్ విశ్వవిద్యాలయం వారు భూతవైద్యంలో కోర్సు ప్రవేశపెట్టడం మనదేశంలో పాలకవర్గాల మద్దతుతో విశృంఖలంగా పెరిగిపోతున్న అశాస్త్రీయ, మౌఢ్య ధోరణులకు ఒక పరాకాష్ట.

కరోనా నిరోధక మాందు ‘కరోనిల్’ ప్రహసనం

అదేవిధంగా, స్వామి కార్యం స్వకార్యం లాగా ఈ తరహా కుహన సైన్సు ప్రచారాలతో తమ అశాస్త్రీయ భావజాల వ్యాప్తి మాత్రమే కాకుండా, ఇందులో వ్యాపారాన్ని కూడా చూసే పతంజలి సంస్థ వారి నిర్వాకం కూడా మనం గమనించాలి. ‘కరొనీల్’ పేరుతో కరోన నివారణ “మందును” పతంజలి సంస్థ ఈనెల 19న  మార్కెట్లోకి మరోసారి ప్రవేశపెట్టింది. ఈ సమావేశంలో స్వయానా వైద్యులు అయినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు పతంజలి వారి ఈ  కరొనీల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని ఒక అసత్య ప్రచారాన్ని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కానీ ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ కరోన నివారణ కోసం ప్రపంచంలో ఏ రకమైన సాంప్రదాయ వైద్య చికిత్సకు మేము ఇప్పటివరకు ఎటువంటి సర్టిఫికెట్లు మంజూరు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. ఈ విధంగా కేంద్ర మంత్రులు కూడా బాబా రాందేవ్ తో కలిసి కరోనాతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ అశాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేశారు.  ఈ అసత్య ప్రచారాలను  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటుగా ప్రజా వైద్యులు, శాస్త్ర ప్రచారకులు తీవ్రంగా ఖండించారు.

Also Read : అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర

మరి కింకర్తవ్యం?

మన దేశానికి దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత సుదీర్ఘమైన చరిత్రగల మనకు ఎంతో ఘనమైన శాస్త్ర సాంకేతిక వారసత్వం కూడా ఉంది. గణితము, ఖగోళం, వైద్యం, మెటలర్జీ మొదలగు అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కరణలు మన సొంతం. అదేవిధంగా వ్యవసాయం, నీటిపారుదల, పట్టణాల నిర్మాణం మొదలగు రంగాలలో మనకు ఎంతో గొప్ప విజయాల చరిత్ర ఉంది. ఇంత సుదీర్ఘ ప్రస్థానంలో మనం అనేక శాస్త్ర విజయాలు సాధించాం. అలాగే భావజాల రంగంలో మన దేశానికే గర్వకారణమైన  ఒక గొప్ప  హేతుబద్ధ తాత్వికతను రూపొందించుకున్నాం. వీటి సహాయంతో గతమంతా అనేక అశాస్త్రీయ, మౌఢ్య సంకుచిత భావాలను తిరస్కరిస్తూ వచ్చాం.  ఈ క్రమంలో భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం వంటి మనదేశ ప్రత్యేక స్వభావాన్ని సంతరించుకున్నాం.

ఇలా గతమెంతో ఘనం. మరి నేడు మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సవాళ్లలో అవకాశాలు చూసుకోవడమే తెలివి. అలాంటి తెలివితేటలు, దూరదృష్టి, విశాల స్వభావం నేడు మనం పెంపొందించుకోవాలి.

Also Read : తల్లి దండ్రుల కన్నుగప్పుతున్న అమ్మాయిలు

ఈ ఆశయాల సాధన కోసం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాలి :

1) శాస్త్రీయ విద్య ఆవశ్యకత

నేడు మన పాఠశాలలో బిడ్డలు నేర్చుకుంటున్న విద్య ఎంతటి లోపభూయిష్టమైనదో మనందరికీ తెలుసు. గుడ్డి కంఠస్థాలు, మార్కుల కోసం తిప్పలు – నేటి మన విద్యలో ప్రధాన భాగాలు. ఇలాంటి  నిస్సారమైనటువంటి చదువులున్నప్పుడు వాటి సారం పిల్లలకు ఎలా వంట పడుతుంది ? అందుకనే నేడు విద్యావంతులకు కూడా మూఢనమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి దీనికి పరిష్కారం బడి విద్యను సంస్కరించడం. జ్ఞాపక శక్తికి విలువనివ్వడం కాకుండా పరిశీలన, ప్రయోగాల ఆధారంగా విద్యా బోధన ఉండాలి. అటువంటి చదువు ద్వారానే విద్యార్థికి నిజమైన వికాసం కలుగుతుంది. సమాజం ప్రగతి సాధిస్తుంది.

2 ) ప్రశ్నించే తత్వాన్ని ప్రజలలో పెంపొందించాలి

నేడు అసహనం పెరిగిపోతోంది. ప్రశ్న పట్ల ద్వేషం, విముఖత పెరుగుతున్నాయి. ప్రశ్నించే వాళ్ళందరనీ తమ ద్రోహులుగా, అభివృద్ధిని ఆటంకపరిచే శక్తులుగా చూస్తున్నారు. ఇది సరికాదు. ప్రశ్న ప్రగతికి సోపానం. మనదేశ ప్రాచీన తాత్విక దర్శనం ఉపనిషత్తులు కూడా ప్రశ్నకు పెద్ద పీట వేశాయి. విభిన్న ఆలోచనలు అన్ని దిశల నుండి రావాలని ఋగ్వేదం చెబుతోంది. మన ప్రాచీన నాగరికత విభిన్న ఆలోచనలను, అభిప్రాయ భేదాలను స్వాగతించింది. గౌరవించింది. మన సాంస్కృతిక వారసత్వం విభిన్నతకు ప్రతిబింబం. కాబట్టి అభిప్రాయ భేదాలను, ప్రశ్నలను, భిన్న ఆలోచనలను నిరసించే, అణచివేసే ప్రయత్నాలను మానుకోవాలి. శాస్త్ర ప్రగతికి తొలిమెట్టు కూడా ప్రశ్న అన్న విషయం మరచిపోరాదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది కూడా ప్రశ్నతోనే. కాబట్టి శాస్త్రీయ, ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించుకోవడం నేటి సైన్స్ డే స్ఫూర్తి.

Also Read : కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?

Where knowledge is free…..

Where the clear stream of reason has not lost its way…..

My father, let my country awake

— Rabindranath Tagore

వేర్ నాలెడ్జీ ఈజ్ ఫ్రీ

వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీసన్ హజ్ నాట్ లాస్ట్ ఇట్స్ వే

మై ఫాదర్, లెట్ మై కంట్రీ అవేక్

– రవీంద్రనాథ్ ఠాగూర్

(రచయిత రాష్ట్ర కార్యదర్శి, జనవిజ్ఞాన వేదిక)

రచయిత మొబైల్ : 9490098908

(ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం)

Also Read : అమెరికా, చైనా నువ్వా-నేనా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles