Friday, December 9, 2022

లంకలో అఖిలపక్ష ప్రభుత్వం

  • రాజపక్స సోదరుల అరాచకం
  • చైనాతో కుమ్మక్కైన ఫలితం
  • అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేని దుస్థితి
  • పిల్లలకు పాలపొడి కొనలేని దయనీయ పరిస్థితులు

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రధాని మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అధికారపక్షం నేత ప్రధానిగా ఉన్నారు. ఇక నుంచి అలా కాదు. అధికార- విపక్షాలు రెండూ కలిసి ‘అఖిలపక్ష ప్రధాని’ని ఎన్నుకోనున్నాయి. రాజకీయ యవనికలో, ఒకదేశ ప్రధానమంత్రిని అన్ని పక్షాలు కలిసి ఎంపిక చేయడం ఒక వింతగా ఉంది. ఈ విడ్డూరానికి శ్రీలంక వేదిక కానుంది. గతంలో ఇలా జరిగినట్లు ఎక్కడా ఎరుకలో లేదు. ఇటలీలో ఒకసారి జరిగినట్లు చెబుతారు. నేటి పరిణామాలతో రాజపక్స కుటుంబం మొత్తం అధికారానికి దూరం కానుంది. అక్కడ అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహిందా ఇద్దరూ అన్నదమ్ములే. నిన్నటి దాకా ఉన్న మంత్రులు కూడా ఎక్కువమంది వారి కుటుంబీకులే. ఈ మధ్యనే వారు తమ పదవులకు రాజీనామా చేశారు.

Also read: ప్రజల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న మరో ప్రపంచయుద్ధం

రాజపక్స కుటింబీకుల చలవే ఈ దుస్థితి

ఇరవై ఏళ్ళ నుంచి రాజపక్స కుటుంబీకులే రాజ్యమేలుతున్నారు. వీరి పాలనలో శ్రీలంక దహనమైపోయిందని అక్కడ ప్రజలు మండిపడిపోతున్నారు. వీరి ఏలుబడిలో ఆ రంగం ఈ రంగం అని కాదు! సర్వ రంగాలు సర్వనాశనమై పోయాయి. ఆర్ధికం, ఆహారం, ఇంధనం, వైద్యం, విద్య, విద్యుత్ అన్నీ కుదేలైపోయాయి. అన్నదమ్ములిద్దరూ తక్షణమే దిగిపోండని ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. చేసేదిలేక, ప్రధాని మార్పుకు, అధికారం మార్పుకు అంగీకరించక తప్పని పరిస్థితిలోకి అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రధాని ఒక్కరే మారుతున్నారు. అధ్యక్షుడి మార్పుపై ఇంకా స్పష్టత రాలేదు. అతను కూడా  రేపో ఎల్లుండో మారాల్సిందే. కాకపోతే, కేవలం అధికారపక్షం కాకుండా విపక్షాలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కానున్నాయి. ఆలోచనా విధానం మారకుండా కేవలం ప్రధాని మారడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతల నేపథ్యంలో,నాయకత్వం మార్పు అనే కొత్త చికిత్సకు శ్రీలంక సిద్ధమవుతోందని భావించాలి.కొత్త ప్రధానిని ఎంపిక చేసే దిశగా ‘నేషనల్ కౌన్సిల్ ‘ ను ఏర్పాటుచేయనున్నారు. అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త మంత్రిమండలి కూడా ఏర్పాటు కానుంది. ఇటీవలే అధికార కూటమి నుంచి 40మంది సభ్యులు వైదొలిగారు. అధికార కూటమిలోని 11పార్టీలు – విపక్షాల మధ్య ఇంకా అగ్గి రగులుతూనే ఉంది. ప్రస్తుత ప్రధానమంత్రి మహింద రాజపక్స, ప్రస్తుత కేబినెట్ మంత్రులు దూరంగా ఉంటేనే  ఎంపిక ప్రక్రియా సమావేశానికి హాజరవుతామని విపక్షనేతలు మెలిక పెడుతున్నారు. కొత్త ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారో ఇంకా తేలాల్సిఉంది. నేటి శ్రీలంకసంక్షోభం స్వయంకృతమే. ఈ ఇరవై ఏళ్ళలో, ఆ దేశాధినేతలు చైనాతో అంటకాగడమే కొంప ముంచింది. అవినీతి, బంధుప్రీతి మరింత దహించింది. ఈ పాపాల మాటున పసిపాపలకు పాలపొడి కూడా కొనుక్కోలేని దుస్థితిలోకి ప్రజలను నెట్టేశారు. కాగితం కొరతతో పరీక్షలు ఆగిపోయాయి. గంటలకొద్దీ కరెంటు కోతలతో మొత్తందేశం చీకట్లో కాపురం చేస్తోంది. తీవ్రమైన ప్రజావ్యతిరేకత నేపథ్యంలో,సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.ఈ నిషేధాగ్నుల నడుమనే ప్రజాఉద్యమాలు ఎగిసిపడ్డాయి.  అధికారమార్పిడి అనివార్యమైంది  శ్రీలంక ఆర్ధిక సంక్షోభం ప్రపంచ దేశాలకు అతి పెద్ద గుణపాఠం. దీనిని ‘కేస్ స్టడీ’ గా తీసుకొని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరం.దేశ పాలకులు ఏమేమి చేయకూడదో? ( డోంట్స్ ) ప్రధానంగా తెలుసుకోవచ్చు.

Also read: కాంగ్రెస్, పీకే: ఉభయతారకం తాజా నిర్ణయం

పదిహేనేళ్ళ కిందటే విషబీజం

శ్రీలంక కష్టాలకు 2007లోనే బీజం పడింది.  అప్పటి అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స తీసుకున్న నిర్ణయాలు విషవృక్షాల్లా పెరిగిపెద్దవి అయ్యాయి. దేశం అప్పులకుప్పగా మారడం అప్పటి నుంచే ఆరంభమైంది. ప్రభుత్వ బాండ్లను మార్కెట్ లో విచ్చలవిడిగా విక్రయించారు. చైనాకు అంతులేని ప్రాధాన్యాన్ని ఇచ్చారు. తమ సొంత ఓడరేవు హంబన్ టోటాను అభివృద్ధి చేసే నెపంతో… చైనా నుంచి భారీమొత్తంలో రుణాలు తీసుకున్నారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరకు ఆ ఓడరేవును 99ఏళ్ళకు చైనాకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఓడరేవును చైనా స్వాధీనం చేసుకున్నట్లే భావించాలి. శ్రీ లంకకు చెందిన ప్రధానమైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ చైనాకే ధారాదత్తమై పోయాయి. ‘ఎల్ టీ టీ ఈ’ తో చేసిన సుదీర్ఘ పోరాటం ఆ దేశానికి పెద్ద దెబ్బ కొట్టింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడంలోనూ తప్పటడుగులు వేసింది. పర్యాటకం శ్రీలంకకు ప్రధానమైన ఆదాయమార్గం. తేయాకు,రబ్బరు,వస్త్రాల వంటి ఎగుమతి మరో ముఖ్యమైన ఆదాయ మార్గం. 2013 ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా సరుకల ధరలు ఇబ్బడిముబ్బడిగా పడిపోయాయి. ఈ పరిణామం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై గొడ్డలిపెట్టుగా మారిపోయింది. 2008-9 ప్రాంతంలో వచ్చిన ‘ప్రపంచ ఆర్ధిక సంక్షోభం’ కూడా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించింది. విదేశీ మారక నిల్వలు  కరిగిపోయాయి. ఆ సమయంలో ‘ఐ ఎం ఎఫ్’ ( అంతర్జాతీయ ద్రవ్య నిధి) నుంచి రుణం తీసుకోవాల్సి వచ్చింది. ఎగుమతులు పుంజుకొకపోవడంతో, ఆ తర్వాత కూడా అనేక పర్యాయాలు అదే సంస్థ నుంచి రుణాలు తీసుకోక తప్పలేదు. ఈస్టర్ బాంబు దాడి పర్యాటకంపై పెద్దదెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన కోవిడ్ సంక్షోభంతో దేశం కోలుకోలేని ఆర్ధికసంక్షోభంలోకి వెళ్లిపోయింది. వీటికి తోడు, దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని విలయంలోకి తీసుకెళ్లాయి. వాటిల్లో ‘పన్నుల విధానం’ ప్రధానమైంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. 2021లో ఎరువుల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పూర్తిగా పడిపోయింది. మితిమీరిన అప్పులు, అనాలోచిత నిర్ణయాలు, చైనాకు దాసోహం కావడం, కోవిడ్ దుష్ప్రభావాలు మొదలైనవి శ్రీలంకను ఘోరమైన సంక్షోభంలోకి నెట్టేశాయి. విధానాలలో మార్పులు తెచ్చుకోవడం, పర్యాటకం అభివృద్ధి చెందడం అత్యవసరం. భారత్ వంటి దేశాలతో కలిసి సాగితే, ఉభయకుశలోపరిగా వ్యవహరిస్తే మళ్ళీ కోలుకుంటారు. చైనా కబంధహస్తాల నుంచి బయటపడడం అంతే కీలకం. శ్రీలంక సంక్షోభానికి మరో ప్రధానమైన కారణం కుటుంబ పాలన. ప్రధాని, అధ్యక్షుడు, ప్రధానమైన మంత్రులు అందరూ వారే. 75శాతం బడ్జెట్ నిధులన్నీ వారి హస్తాల్లోనే ఉన్నాయి. వాటన్నింటినీ వారి ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారు. దేశభక్తి, బాధ్యతతో కూడిన నీతివంతమైన, సర్వజనరంజన పాలన అందించడమే శరణ్యం. కుటుంబపాలన కాక,  ప్రజారాజ్యం కావాలి. శ్రీలంక సంక్షోభం ఆ దేశానికే కాదు, ఆ తరహాలో సాగే అన్ని రాజ్యాలకు పెద్ద గుణపాఠం.

Also read: జమ్మూ-కశ్మీర్ లో ప్రధాని పర్యటన

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles