Tuesday, June 25, 2024

మురళీథరన్ బయోపిక్ : విజయ్ సేతుపతిపై అభిమానుల ఆగ్రహం

  • శ్రీలంక తమిళ క్రికెట్ వీరుడు అంతర్యుద్ధ సమయంలో రాజపక్షను బలపరిచాడు
  • శ్రీలంక తమిళుల పక్షాన నిలవలేదు
  • దీన్ని క్రికెట్ సినిమాగా మాత్రమే చూడాలనీ, రాజకీయ ప్రమేయం లేదనీ నిర్మాతల విజ్ఞప్తి
  • ‘మక్కల్ సెల్వన్’కి తాకుతున్న అభిమానుల సెగ

చెన్నై: ప్రఖ్యాత శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ బయోపిక్ లో నటించడానికి అంగీకరించినందుకు ప్రముఖ తమిళ హీరో విజయ్  సేతుపతిపైన ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన ప్రఖ్యాత క్రికెటర్ శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సను బలపరిచాడు. శ్రీలంకలో సైనికుల ఊచకోతకు గురైన తమిళుల పట్ల నిలబడలేదు. నిజానికి, 2009లో శ్రీలంక తమిళ పులుల (టైగర్స్) పైన శ్రీలంక సైన్యం విజయం సాధించినప్పుడు ముత్తయ్య మురళీథరన్ ఆనందం వెలిబుచ్చారు. అటువంటి వ్యక్తి జీవితాన్ని చిత్రిస్తున్న బయోపిక్ లో తమ నాయకుడు నటించడాన్ని సహించబోమని విజయ్ అభిమానులు అంటున్నారు. తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ తమ అభిమాన నటుడికి ట్వీట్ల మీద ట్వీట్లు పంపిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇది తమళ సినిమా పరిశ్రమలో వేడివేడి చర్చనీయాంశంగా మారింది.

బయోపిక్ టైటిల్ ‘800’

మురళీథరన్ తన జీవితంలో తీసుకున్న వికెట్ల సంఖ్య 800ని దృష్టిలో పెట్టుకొని సినిమా పేరు నిర్ణయించారు. ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఎనిమిది వందల వికెట్లు తీసుకోలేదు. భవిష్యత్తులో తీసుకునే అవకాశం కూడా లేదు. ఈ బయోపిక్ లో నటిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత విజయ్ ఒక శిక్షకుడిని పెట్టుకొని అదేపనిగా బరువు తగ్గుతున్నాడు. స్లిమ్ గా తయారై మురళీథరన్ పాత్రకు సరిపోయే విధంగా త్వరలో సిద్ధం కావాలని ప్రయత్నం.

రానా బ్యానర్ కింద సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నది. దర్శకుడు ఎం.ఎస్. శ్రీపతి. అతడు ‘కణిమొళి’ బయోపిక్ కు  దర్శకత్వం వహించడంతో కీర్తిగడించాడు. శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా తదితర దేశాలలో ఈ సినిమా షూటింగ్ కు ప్రణాళిక వేసుకున్నారు. 2012 డిసెంబర్ నాటికి విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా తమిళంలో ఈ సినిమాని తీసి, అన్ని దక్షిణ భారత భాషలలోకీ డబ్ చేయడంతో పాటు హిందీ, బెంగాలీ భాషలలో కూడా డబ్ చేస్తారు. ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో అంతర్జాతీయ ప్రేక్షకులకోసం సినిమాను సిద్ధం చేస్తారు.

విజయ్ తప్పుకుంటారా?

అభిమానుల ఆగ్రహం, సాధారణ ప్రజల విమర్శలు గమనించిన తర్వాత ఈ బయోపిక్ ప్రాజెక్టు నుంచి విజయ్ తప్పుకుంటారా? తప్పుకుంటారని వదంతులు చక్కెర్లు కొడుతున్నాయి. కానీ విజయ్ సేతుపతి ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ‘పిజ్జా’ సినిమా ఘనవిజయం సాధించడంతో విజయ్ ప్రముఖ హీరోల సరసన నిలిచాడు.

‘‘ఒక శ్రీలంక క్రికెటర్ బయోపిక్ ను మనం నిర్మించడం ఎందుకు? పాకిస్తాన్ ఆటగాడు అఫ్రిదీ బయోపిక్ ను ఎవరైనా ఇండియన్ తలపెడితే భారతీయులు సమర్థిస్తారా?’’ అంటూ ఒక వీరాభిమాని చురక వేశాడు. ‘‘శ్రీలంక ప్రభుత్వం వేలాదిమంది తమిళులని చంపివేసింది. ఇప్పటికీ వారిని అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారు. అటువంటి దేశానికి చెందిన ఒక క్రికెటర్ బయోపిక్ లో నువ్వు నటించడం ఎందుకు? నువ్వు అమ్ముడుపోయావ్,’’ అంటూ మరో అభిమాని అక్కసు వెళ్ళగక్కాడు. ఈ బయోపిక్ లో నటించే విషయం మరోసారి ఆలోచించుకోవలసిందిగా ప్రముఖ సినిమా దర్శకుడు సీను రామస్వామి విజయ్ కు సలహా ఇచ్చారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటన

ముత్తయ్య మురళీథరన్ బయోపిక్ నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది పూర్తిగా ఆటమీద, క్రీడాకారుడిపైన తీస్తున్న బయోపిక్ మాత్రమేననీ, దీనికి రాజకీయాలు పులమవలదనీ, ఈలం తమిళుల పోరాటం గురించి కానీ సైన్యంతో యుద్ధం గురించి కానీ ఎటువంటి ప్రస్తావనా ఉండదనీ సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వివరించారు. ‘కళకు సరిహద్దులు లేవు. దీనికి ప్రపంచంలో అందరినీ ఏకం చేసే శక్తి ఉంది. తమ లక్ష్యాలను ఛేదించేందుకు చాలామంది యువతీయువకులకు ఈ సినిమా ప్రేరణ ఇస్తుంది. తమిళ సమాజానికి చెందిన ఒక యువకుడు కష్టపడి అత్యధిక వికెట్లు సాధించి క్రికెట్ లో కీర్తిశిఖరాలను ఎట్లా అందుకున్నాడనే విషయం చూపించడానికి ఈ సినిమా ప్రయత్నిస్తుంది. తమిళ సమాజానికి బాధ కలిగించే దృశ్యాలు ఈ సినిమాలో ఏ మాత్రం ఉండబోవని హామీ ఇస్తున్నాము,’ అని వివరించారు.

అద్భుతమైన బౌలర్

కోలీవుడ్ నటుడు విజయ్, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ ఇటీవల ఐపీఎల్ టెలికాస్ట్ సందర్భంగా ఆన్ లైన్ లో ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. కంపోజర్ సీ.ఎస్. శామ్, సినిమాటోగ్రాఫర్ ఆర్.డి. రాజశేఖర్ కూడా ఈ సినిమాకి పని చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన బౌలర్ గా రాణించిన మురళీథరన్ తమిళ జాతి ప్రతిభకూ, అభిమానానికీ, ఆత్మగౌరవానికీ ప్రతీక. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆయన శ్రీలంక ప్రభుత్వాన్ని సమర్థించారు. అంతే. ఆయన జీవితాన్ని చిత్రించే బయోపిక్ పైన తమిళనాడులో విమర్శలు చెలరేగాయి. విజయ్ ఎట్లా స్పందిస్తారో, ఏ విధంగా ఈ వివాదానికి ముగింపు పలుకుతారో చూద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles