Tuesday, November 12, 2024

అధికారం… అహంకారం

* డబ్బు- డాబు ఇవే సూపర్ ఇగోలకు కారణం

మన కళ్ల ముందు తిరిగిన మనిషి హఠాత్తుగా సెలెబ్రిటీలు అయితే అతడి/ ఆమె గురించి మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం. మా ఇంట్లో తిరిగే వారని, మేము పెడితే తినే వారని, వారికి డబ్బులు లేకుంటే మా అమ్మనో/ నాన్ననో అడిగి ఇచ్చామని… ఇలా చెప్పుకుంటారు. ఎన్నడూ వారి ఉసేత్తని వారు కూడా స్వచ్చంద సంస్థల ద్వారా పిలిచి సన్మానం చేసి ఇంద్రులు చంద్రులు అని పొగుడుతారు. ఇక అంతే.  అతడు / ఆమె ఆకాశంలో విహరిస్తారు. తమ హోదా గొప్పదని భావిస్తారు. అప్పుడు బాల్యంలోనో బంధువుల్లోనో వారితో కలిసి తిరిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇస్తే వారికి టిఫిన్ తినిపించిన రోజులు, ఫుట్ పాత్ మీద పానీ పూరి తిన్న రోజులు గుర్తుకు తెస్తారనీ, దానివల్ల తన పరువు దిగజారుతుందనీ భావిస్తారు.

సూపర్ ఇగో

అసలు పరువు తాకట్టు పెట్టి చీత్కారాలు అందుకునే డబ్బో.. అధికారం పొందే వారికి కొత్తగా ‘సూపర్ ఇగో’ మొదలవుతుంది. ఇక వాళ్లు అతిశయోక్తులకు…అహంకారానికి అంతు ఉండదు. ఇతరుల పట్ల అసహ్య ధోరణి ప్రదర్శిస్తారు. వాళ్లలో సుపీరియార్టీ కాంప్లెక్స్ మొదలు అవుతుంది. ఈ ఆధిపత్య పోరులో తన వాళ్లు నా వాళ్ళు అని మరిచి పోతారు. తన గురించి మితి మీరిన అంచనాలతో ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. దీన్ని మానసిక శాస్త్రంలో “సూపర్ ఇగో” అంటారు.  ఇలాంటి వారు అహంభావ వైఖరి ప్రదర్శిస్తారు.ఇతరుల పట్ల అవహేళనగా మాట్లాడుతారు. ఈ భ్రమ వారికి అధికారం లేదా డబ్బు కోల్పోయినప్పుడు వారు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. అప్పుడు వీరితో బాల్యంలో స్నేహం చేసిన వారెవ్వరూ తిరిగి స్నేహానికి అంగీకరించరు.

Also Read : బహుజన బంధువు పీవీ

అధికారాంతమున

అధికారం, డబ్బు ఉన్నప్పుడు వీళ్ళ వెంట తిరిగిన వారు కూడా వాటికి దూరమైన తర్వాత వారిని దగ్గరికూడా రానివ్వరు.. వీళ్లు రెంటికి చెడ్డ రేవళ్లు అవుతారు. తమ స్వీయ విలువ ఎక్కువని భావించే వారు ఆధిపత్య ముసుగు తీయరు. తమ కంటే గొప్పవాళ్ళు లేదా పదవుల్లో ఉన్నవారు, బాగా డబ్బు ఉన్న వారి పట్ల వీరు మొగ్గు చూపుతారు.  మధ్యతరగతి వారు, నిజంగా వారిని అభిమానించే వారి పట్ల వారు చులకన భావంతో చూస్తారు. వీరి మానసిక స్థితి “ధనమెచ్చిన మదమెచ్చును.. మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్” అనే విధంగా ఉంటుంది. తన గురించి గొప్పగా ఆలోచించడం, ఇతరులను చిన్న చూపు చూస్తూ వారి తప్పులను వెదకడం అహంకారుల లక్షణం.

రావణాసురుడికీ, దుర్యోధనుడికీ అహంకారం

ఓర్వలేని గుణం, అధికార మదం, రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ కన్ను మిన్ను కానకుండా అంతా నాదే… నేను చెబితే ఏదైనా జరుగుతుంది అనే వారు  ప్రతి యుగంలోనూ ఉంటారు…అన్ని యుగాల్లో ఇలాంటి వారి కథలు వినబడతాయి!  కౌరవుల అతి ఆశ, అధికార దాహం వల్ల వంశం మొత్తం నాశనం అయింది! రావణాసురుడి అహంభావం వల్ల జరిగిన కథ మనకు తెలుసు! దుర్యోధనుడు కానీ రావణాసురుడు గానీ సూపర్ ఇగో,  సుపిరియార్టీ కాంప్లెక్స్ ఒంటి నిండా పూసుకున్న వారు.  ఒక రోజు దుర్యోధనుడు తాను ఇంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నా కూడా నేను రాజ్య మిచ్చిన కర్ణుడిని “దాన కర్ణుడు” అంటుంటారు. నేను దానాలు, ధర్మాలు చేస్తున్నా కూడా ఆ పేరు రావడం లేదనే ఈర్ష్య ద్వేషాలు వస్తాయి… అందుకే ఒక గంట ఏర్పాటు చేసి ఆ గంట మోగించిన వారికి ఏది అడిగినా ఇమ్మని మంత్రులను దుర్యోదనుడు పురమాయిస్తాడు.

Also Read : కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశం

ఒక రోజు ఈ ప్రస్తావన కృష్ణుని దగ్గర  కూడా తెస్తాడు! లౌక్యంగా కర్ణుని పేరు ఎత్తకుండా “నా గురువు మీ అన్నా బలరాముడు కన్నా ఎక్కడ చూసినా మీ పేరు వినబడుతుంది బావ. నువ్వు చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంటావు కానీ పెట్టినట్టు కనబడవు” అంటాడు. దుర్యోధనుడి మనసులో ఉన్న ఈర్ష్య ను కనిపెట్టి “నీకు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నా… దాన గుణం లేదు బావా” అంటాడు కృష్ణుడు. అప్పుడు దుర్యోధనుకి ఇగో హార్ట్ అవుతుంది… కృష్ణుణ్ణి మనసులో తిట్టుకొని “దానగుణంలో కర్ణుని కన్నా గొప్పవాణ్ణి” అంటాడు దుర్యోధనుడు…వెంటనే “అది కాలమే నిర్ణయిస్తుంది”  అంటాడు కృష్ణుడు.

వర్షాకాలంలో పరీక్ష

అనుకున్నట్టే వర్షాకాలం వస్తుంది…భారీ వర్షాలు పడుతుంటాయి. అలాంటి సమయంలో కృష్ణుడు బ్రాహ్మణ మారు వేషంలో మొదట దుర్యోధనుడి దగ్గర కు వెళ్లి గంట మోగిస్తాడు! ‘అయ్యా మన రాజ్య యోగ క్షేమాల కోసం భారీ యజ్ఞం చేయ తలపెట్టాం…మేము డబ్బు- ధాన్యం అడగడం లేదు. యజ్ఞానికి కావలసిన వేలాది బండ్ల సమిధలు అడుగుతున్నాం,’ అంటాడు మారు వేషంలో ఉన్న కృష్ణుడు. దానికి దుర్యోధనుడు ఇంత భారీ వర్షంతో మా రాజ్య యోగ క్షేమాల కోసం యజ్ఞం చేయనవసరం లేదు. అలాగే ఈ వర్షంలో అన్ని సమిధలు కూడా సమకూర్చలేమని కరాఖండిగా చెబుతాడు దుర్యోధనుడు. వెంటనే మారు వేషం విడిచి “దుర్యోధనా నీ దానగుణంలో నువ్వు ఎంత వెనుకబడి పోయావో ఇప్పుడు నా వెంట మారు వేషంలో రా… వచ్చి తెలుసుకో” అని దుర్యోధనుని వెంట బెట్టుకొని అదే బ్రాహ్మణ వేషములో కర్ణుని ఇంటికి వెళతారు ఇద్దరూ. కర్ణుడు ముందు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇద్దరికి పాదాభివందనం చేసి… భోజన తాంబూలాదులు ఇచ్చి అప్పుడు వారు వచ్చిన పని చెబుతుండగా భారీ వర్షం కురుస్తూనే ఉంటుంది. దుర్యోధనుడు తన దానధర్మ గుణం ముందు కర్ణుడు ఓడిపోవాలని “ఇంకా బాగా వర్షం కురావాలి” అని మొక్కు కుంటుంటాడు. ఇంతలో వచ్చిన పని చెబుతాడు కృష్ణుడు… “హస్తిన బాగు కోసం, మా రారాజు క్షేమం కోసం చేస్తున్న యజ్ఞం కోసం సమిధలే కాదు, డబ్బు ధాన్యం కూడా సమకూరుస్తానని” వెంటనే పని వాళ్ళను పురామాయించి…తనకు దుర్యోధనుడు ఇచ్చిన అతి పెద్ద ఇంటిలో ఒక భాగాన్ని కూల్చి వేసి వాసాలు, దూలాలు అప్పటికప్పుడు బండ్లలో నింపించి యజ్ఞానికి ఏర్పాటు చేస్తాడు. దుర్యోధనుడు సిగ్గుతో తల వంచుకొని తాను పెట్టిన గంటను తొలగిస్తాడు. అలా ఉంటుంది దుర్యోధనుడి అధికార ధన అహంకారం.  అలాంటి వారి మదం అణిచే కృష్ణులు కూడా ఉంటారు.

Also Read : తల్లి దండ్రుల కన్నుగప్పుతున్న అమ్మాయిలు

వ్యక్తిత్వ గారడీ

సూపిరియార్టీ కాంప్లెక్స్ ఉన్న వారు వ్యక్తిత్వ గారడీ చేస్తుంటారు.. వాళ్లు తీవ్ర మానసిక స్థితిలో దురహంకారం ఒంటి నిండా పులుముకుంటారు.  తెలిసిన వారు ఎదురైనా తెలియనట్టు పోజు కొడతారు..ఈ “మదం”  ఎనమిది రకాలు గా ఉంటుంది..అన్న మదం, అర్థమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం, ఉద్యోగమదం, యవ్వన మదం. అన్నింటికన్నా సరికొత్త నిర్వచనం అధికారమదం దీనికి అంతూపొంతూ ఉండదు…కాళ్ళా వేళ్ళా పడి పదవీ సంపాదించుకున్న తరువాత అందరూ తన కాళ్ళ దగ్గర పడిఉండాలనే మదం చాలా హీనమైంది.

‘నేనూ’, ‘నా’ అంటారు, ‘మనం’ అనరు

ఇలాంటి వారు “నేను” “నా” అంటారు తప్పా మనం అనరు. వీరిలో ఐదు లక్షణాలు ఉంటాయి…పదవి ఉన్నప్పుడు అసూయ, అపరాధం, ఆందోళన, భయం, కోపం..ఇవీ డామినేట్ చేస్తాయి.. మనస్తత్వశాస్త్రం అధ్యయనంలో ” బిగ్ ఫైవ్ హై ఆర్డర్ వ్యక్తిత్వ లక్షణాల్లో న్యూరోటిసిజం ఒకటి… దీని వల్ల అధికారమదం ఉన్నవారు పైలక్షణాలు  కలిగి ఉంటారు. వీళ్లు ఫై మెంటల్ డిజార్డర్ కు లోనవుతారు. చాలా మంది రాజకీయ నాయకులు డిఫ్రెషన్ మూడ్ లోకి వెళ్ళి లేని రోగాలను తెచ్చుకుంటారు. వీరికి తరచుగా గుండె నొప్పి వస్తుంది. అధికారం దూరమవుతుందేమో అనే ఆందోళన పట్టి పీడిస్తుంది.

Also Read : బంధువులు… బహుముఖాలు!

అందమైన అమ్మాయిలాగానే

అందమైన అమ్మాయి తన రూపం పోతుందని తనకు వృద్ధాప్య లక్షణాలు రావద్దని తలలో తెల్ల వెంట్రుకలు కనబడితే ఎలా డిఫ్రెషన్ కు లోనవుతుందో అలాగే పదవీ కాంక్ష గలవారు కూడా పదవిని కాపాడు కోవడానికి లేదా పదవి సంపాదించడానికి అలాంటి ఆందోళన లో ఉంటారు. ఈ సూపర్ ఇగో వాళ్ళు గుర్రం మీద రైడ్ చేస్తున్నట్టు ఫీలవుతారు. గుర్రం తిరగబడి కాళ్ళు ఎత్తేస్తే బొక్కబోర్ల పడతారు. గుర్రాన్ని మార్గనిర్దేశం చేసే రైడర్ నిర్ణీత స్థలాన్ని చేరతాడు… లేదా కోరికలు గుర్రాలైతే పరిగెత్తే మార్గం మారుతుంది…చివరకు చేతిలో హంటర్ మిగులుతుంది. గుర్రం ఈయనను  వదిలేసి తన దారిన తాను పోతుంది!

Also Read : కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

1 COMMENT

  1. P.V. gaari kutumbam KCR uchulo chikkukundemo anipistundi. KCR gaariki P.V. kutumbam pai abhimaanam kante pratyartulanu irakaatamlo pettalane aalochane ekkuvaga kanipinchindi. Mee vyaasam ee vishayam chaala chakkaga vivarincharu sir

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles