Saturday, April 20, 2024

మోదీ అమెరికా పర్యటనలో మోదం

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో భేటిీ

ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ తో చర్చలు

జపాన్ ప్రధాని సింజె అబేతో సమాలోచన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన తాజా అమెరికా పర్యటనపై ఎప్పటి వలె విస్తృత ప్రచారం జరిగింది. క్లిష్ట సమయంలో జరిగిన పర్యటన కాబట్టి మరింత ప్రాముఖ్యత వచ్చింది. అనుకున్నట్లుగానే ఎజెండా మేరకు సభలు, సమావేశాలు జరిగాయి. రెండు దేశాల మధ్య బంధాల బలోపేతం, క్వాడ్ భాగస్వామ్య దేశాల అధినేతల కలయిక, ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధుల సమావేశం ప్రధాన ఎజెండాలోని ముఖ్యమైన భాగాలు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజాప్రభుత్వం అంతమై, తాలిబాన్ ఉగ్రమూక అధికారంలోకి వచ్చి పట్టుమని పదిరోజులు మాత్రమే అయ్యింది.మానవాళిని గడగడ వణికించిన కరోనా కాలం ఇంకా ముగియలేదు. ఇస్లామిక్ ఉగ్రవాదపు ఊడలను పట్టుకొని ప్రపంచమంతా పాకాలని చూస్తున్న చైనా వైనం సభ్య సమాజాలను కలవర పెడుతోంది. దానికి వంత పాడుతున్న రష్యా విధానం కొత్త భయాలను సృష్టిస్తోంది. ఈ సందర్భాలను అందిపుచ్చుకొని, తన ఇష్టానుసారం ప్రవర్తించాలని పాకిస్తాన్ చూస్తోంది. ఈ అంశాలన్నీ ఇటు ఇండియాను -అటు అమెరికాను ఇబ్బంది పెట్టేవే. ముందు ముందు ఎటువంటి ముప్పులను ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అమెరికా,భారత్ ప్రముఖంగా ఉన్నాయి. ఇంతటి తీష్ణ వాతావరణంలో, మన ప్రధాని నరేంద్రుని ‘అమెరికా యాత్ర’ జరిగింది. పునరుక్తమైనా?

యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న నరేంద్రమోదీ

పీవీ దూరదృష్టి

పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావును ఈ సందర్భంలో తలచుకొని తీరాలి. చైనా, అమెరికా వంటి అగ్ర రాజ్యాలతో ఎప్పటికైనా మనకు ముప్పు తప్పదని,  ముందుగానే గ్రహించిన పాలకులలో అగ్రజుడు పీవీ నరసింహారావు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే, ఆ రెండు దేశాలతో మనకు ఎంతో అవసరం ఉందనే ఎరుక కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ఏదో ఒకరోజు, ఆ రెండు దేశాలు ఆధిపత్య పోరుతో కొట్టుకుంటాయని పీవీ ఊహించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విదేశాంగ విధానంలో కొత్త నడకలు నడిచారు. చైనాతో బంధాలు చెడిపోకుండా చూసుకుంటూనే, అమెరికాతో సంబంధాలు బలోపేతమవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అవి ఈరోజు ఎంతోకొంత అక్కరకు వస్తున్నాయి. పీవీ వేసిన ఆ మార్గాలలో తదనంతర పాలకులు కూడా నడిచారు. వారందరూ పీవీ విధానాలపై గౌరవం ఉన్నవారే కావడం విశేషం. వారిలో వాజ్ పెయి, మన్ మోహన్ సింగ్ ప్రధానులు. నరేంద్రమోదీకి కూడా పీవీ పట్ల ఎంతో గౌరవం, ఆయన విధానాల పట్ల విశ్వాసం ఉన్నాయి. మోదీ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచీ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేశారు. భిన్నమైన, ఆధునిక వ్యవహారశైలిలో పేర్లు పెట్టి పిలుస్తూ …. అటు చైనా అధిపతి జిన్ పింగ్ తోనూ -ఇటు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ తోనూ నరేంద్రమోదీ స్నేహయాత్ర ప్రారంభించారు.

Also read: మహాయశస్వి ఎస్పీ

ఈ ప్రయాణంలో ట్రంప్, మోదీ బాగా దగ్గరయ్యారు. వ్యక్తిగత స్నేహితుల్లా మెలిగారు. ట్రంప్ కు భారత్ లో ఘన స్వాగతం పలకడం, గుజరాత్ లో లక్షలాదిమందితో గొప్ప సభ ఏర్పాటు చేయడం,”హౌడీ మోడీ” పేరుతో అమెరికా వెళ్ళి అక్కడ  ట్రంప్ కు విస్తృతంగా ప్రచారం చెయ్యడం మొదలైనవన్నీ ఇరుదేశాల అధినేతలను బాగా కలిపాయి. కొన్ని కొన్ని అంశాల్లో,వ్యవహార శైలిలో ఇద్దరికీ పోలికలు ఉండడం కూడా కలిసివచ్చింది. దానికి తోడు, జిన్ పింగ్ కు -ట్రంప్ కు మధ్య విభేదాలు క్రమంగా పెరిగాయి. కరోనా వైరస్ రాకతో అవి ఆకాశాన్ని తాకాయి. ఇండియా, అమెరికా బాగా దగ్గరవుతున్నాయనే అనుమానం కూడా చైనాకు బాగా పెరిగిపోయింది. భారతదేశం, అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్ కలిసి ‘క్వాడ్’ (క్వాడ్రి లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ) గా ఏర్పడ్డాయి. తనకు వ్యతిరేకంగా వీరంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారని చైనా భావించింది. దీనిని రద్దు చేసుకోవాలని పదే పదే ప్రకటించింది. ఈ దేశాలపై బాగా కోపాన్నీ పెంచుకుంది. అగ్రరాజ్య స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కాంక్ష కూడా ఆ దేశానికి బాగా పెరిగింది.

ఆస్గ్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో ప్రధాని నరేంద్రమోదీ

చైనాతో చెడిపోయిన ద్వైపాక్షిక సంబంధాలు

ఈ నేపథ్యంలో  భారత్ – చైనా బంధాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో అలజళ్లు బాగా పెరిగాయి. ఒకదశలో…రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఆ సందర్భంలో భారత్ కు అన్నివిధాలా అండగా ఉంటామని అమెరికా అధిపతి డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కూడా. సరే! ఎన్నికలు జరిగాయి, ట్రంప్ దిగిపోయాడు, ఆయన స్థానంలో జో బైడెన్ వచ్చాడు. ఇంత నేపథ్యం తర్వాత  తాజాగా నరేంద్రమోదీ ఆమెరికా పర్యటన జరిగింది. కాబట్టి ఈ మూడు రోజుల పర్యటన, సమావేశాల పట్ల చైనాతో పాటు మిగిలిన దేశాలు కూడా ఎంతో ఆసక్తిని కనబరిచాయి. మన దేశ ప్రజలు కూడా దీనిని ‘ప్రత్యేక పర్యటన’గా భావించారు. వాణిజ్యంలోనూ చైనా పెత్తనం ఎక్కువైపోతోందని, అన్ని రకాలుగా దురాక్రమణకు సిద్ధమవుతోందని ఎక్కువ దేశాలు భావిస్తున్నాయి. చైనాను కట్టడి చేస్తూ, తమను తాము కాపాడుకొనే చర్యల్లో భాగమే ” క్వాడ్” రూపకల్పన. ఆ దేశపు దుశ్చర్యల వల్ల, చాలా దేశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మరిన్ని దేశాలు చైనా వ్యతిరేక కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ‘క్వాడ్’ సమావేశంలో సభ్య దేశాల అధినేతలు నలుగురూ తమ భవిష్య కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24 న జరిగిన ఈ సదస్సుకు శ్వేత సౌధం వేదికగా నిలిచింది. కరోనా,పర్యావరణ మార్పులు,ఇండో – ఫసిఫిక్ ప్రాంతంలోని సవాళ్లు, ప్రపంచంలో శాంతి స్థాపన మొదలైన అంశాల చుట్టూ సదస్సు సాగింది.

Also read: ఉత్తరకుమారుల విన్యాసం, ఉత్తరాంధ్ర విషాదం

చైనా విదేశాంగమంత్రి విమర్శ

ఈ సదస్సు, సమావేశాలను తప్పు పడుతూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చున్ యింగ్ తాజాగా విమర్శలు గుప్పించడం గమనార్హం. అమెరికా, ఆస్ట్రేలియా,జపాన్ ఎంతో బలమైన దేశాలు. ప్రపంచంలో చైనా తర్వాత అతిపెద్ద జనసంఖ్య కలిగిన దేశం భారత్. ప్రపంచంలోనే భారత్ మార్కెట్ చాలా పెద్దది. ఈ దేశాలన్నీ కలిసి సాగితే, ప్రపంచ వాణిజ్యం పెరగడంతో పాటు, భారతదేశ ప్రగతి వేగం మరెంతో ఊపందుకుంటుంది. అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం మనకు అనివార్యం. లేకపోతే, ఈ అగ్రరాజ్యాలు మనతో ఆడుకుంటూనే ఉంటాయి. అదే సమయంలో ఉగ్రవాదాన్ని అణగదొక్కడం అత్యంత అవసరం. ఆ దిశగా భావ సారూప్య దేశాలన్నీ ఏకం కావాలి. అఫ్ఘాన్,పాకిస్తాన్ కేంద్రాలుగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అఫ్ఘాన్ లో సైన్యాన్ని ఉపసంహరణ చేసుకున్న అంశంలో  అమెరికా పెద్దఎత్తున చెడ్డపేరు మూటకట్టుకుంది. ఆ పేరును పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఆ దేశానికి ఉంది.

జపాన్ ప్రధాని సింజో అబెతో ప్రధాని మోదీ

భారత్ పట్ల బైడెన్ అభిమానం

జో బైడెన్ మొదటి నుంచీ భారత్ పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశానికి అధినేత కూడా అయ్యారు. భారత మూలాలు కలిగివున్న కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆన్నీ కలిసివస్తే మరో నాలుగేళ్ళలో ఆమె అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఎంతో కలిసివచ్చే అంశాలు. మునుముందుగా  అన్నింటా మనం స్వయంసమృద్ధిని సాధించాలి. ఆ సాధనలో అందరి తోడ్పాటు తీసుకోవాలి. అదే సమయంలో, పూర్తిగా ఆమెరికాపై ఆధారపడడం ప్రమాదకరమని గుర్తెరగాలి. చైనాతో విభేదాలను పెంచుకోవడం కూడా వివేకం కాదు. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, సమతుల్యతను పాటిస్తూ, సమదూరంలో నడుచుకుంటూ సాగడమే మనకు శ్రేయోదాయకం. ఈ పర్యటన వల్ల అగ్రరాజ్యపు కొత్త అధినేతతో, మన దేశాధినేతకు పరిచయం ఇంకా పెరిగింది. ఐక్యరాజ్య సమితిలోను, ఆస్ట్రేలియా, జపాన్ అధినేతల దగ్గర మనవాణిని వినిపించడంలో మన ప్రధాని నరేంద్రమోదీ కృతకృత్యులయ్యారని విశ్వసిద్దాం. భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని ఆకాంక్షిద్దాం.

Also read: కీలకమైన మోదీ అమెరికా పర్యటన

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles