Thursday, September 19, 2024

ఐరోపాలో మోదీ పర్యటన

  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా ప్రాధాన్యం
  • భారత్ వైఖరిని వివరించేందుకు మోదీకి అవకాశం
  • యుద్ధం వల్ల నష్టమేనంటూ మోదీ వ్యాఖ్య

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడురోజుల యూరప్ పర్యటనపై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్- రష్యా మధ్య భీకరంగా పోరు జరుగుతున్న వేళ, తటస్థ వైఖరితో సాగుతున్న భారత్ వైపు అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా భిన్నంగా చూస్తున్నాయి. రష్యాపై యూరప్ దేశాలన్నీ గుర్రుగానే ఉన్నాయి. అదే సమయంలో యూరప్ దేశాలన్నీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.         మిగిలిన దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా, భారత్ పట్ల ఆ దేశాలకు ప్రత్యేక గౌరవం ఉన్నదనే చెప్పాలి. ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద దేశమైన భారత్ తో వాణిజ్యపరమైన అవసరాలు కూడా ఉన్నాయి. నరేంద్రమోదీ పర్యటనలో ప్రధానంగా ఇంధన భద్రతపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని మొదటి నుంచీ వినపడుతోంది. భారతదేశం సహజంగానే శాంతికాముక దేశమని, తోటి దేశాలకు సాయం అందించడంలో, ఉభయ తారకంగా వ్యవహరించడంలోనూ ముందుంటుందనే అభిప్రాయం యూరప్ దేశాలన్నింటికీ బలంగా ఉంది.

Also read: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది!

ద్వైపాక్షిక సంబంధాలలో కొత్తపుంతలు

సహకారస్ఫూర్తిని బలోపేతం చేసుకోవడంలోనూ, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలోనూ ఈ పర్యటన మంచి ఫలితాలను ఇస్తుందనే ఆశాభావాన్ని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఇంధన భద్రతా అంశానికి ప్రాధాన్యం పెరిగింది. జర్మనీ,డెన్మార్క్,ఫ్రాన్స్ దేశాలలో సాగుతున్న ఈ పర్యటనలో ఎనిమిదిమంది ప్రపంచనేతలతో భారత ప్రధాని  చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశాలన్నీ భారత విదేశీ వ్యవహారాల పరిణతికి, ప్రగతికి దోహదపడితేనే అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి. వివిధ దేశాధినేతలతో పాటు 50మంది అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతోనూ జరిగే సమావేశాలు భారత ఆర్ధిక ప్రగతికి  ఆసరా ఇవ్వడానికి తోడ్పడాలి. మాతృభూమి ప్రాభావాన్ని పెంచడంలో  ప్రవాస భారతీయుల సహకారాన్ని  తీసుకోవడం కూడా చారిత్రక బాధ్యత. డెన్మార్క్ నిర్వహిస్తున్న ‘ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సదస్సు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో పాటు, ఇంధన వనరుల ప్రాధాన్యంతో పాటు, కరోనా అనంతర ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత మొదలైనవన్నీ కీలకమైన చర్చనీయాంశాలు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంపై నరేంద్రమోదీ చేసిన   వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ యుద్ధంలో చివరకు మిగిలేది పెనువిషాదం, విధ్వంసం మాత్రమేనని భారత ప్రధాని యూరప్ దేశాలకు బలంగా తెలిపారు. ఈ కష్టనష్టాలను మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోందనే ఆవేదనను కూడా ఆయన వ్యక్తపరచారు. ఆ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలికి తీరాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడం మంచి విషయం.

Also read: లంకలో అఖిలపక్ష ప్రభుత్వం

జర్మనీతో పర్యవరణంపై భారత్ ఏకాభిప్రాయం

నరేంద్రమోదీ – జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో జరిగిన ముఖాముఖిలో, వారిద్దరి మధ్య ప్రపంచ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడుకొనే అంశాల్లో జర్మనీ – భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం, ఆ దిశగా అడుగులు పడడం మంచి పరిణామం. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి భారత్ కు సహాయం అందించడానికి జర్మనీ ముందుకు రావడం కీలకమైన మలుపు. వ్యవసాయం, పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి రాయితీతో భారతదేశానికి రుణాలను అందించడానికి జర్మనీ సిద్ధం కావడం, ఆ దిశగా ఒప్పందం కుదరడం మరో మంచి మలుపు. ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటన ముగిసేనాటికి మరిన్ని కీలకమైన ఒప్పందాలు, అంగీకారాలు కుదురుతాయని విశ్వసించవచ్చు. చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, ఆహారం, ఎరువుల కొరత పెరగడం మొదలైనవి ప్రపంచ ప్రజలకు పెనుభారంగా మారాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధమే. యుద్ధం ముగింపు దిశగా యూరప్ దేశాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తమ విధానాలను కూడా మార్చుకోవాల్సిన తరుణం అందరికీ వచ్చింది. అందులో అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా ఉన్నాయి.

Also read: ప్రజల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న మరో ప్రపంచయుద్ధం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles