Thursday, April 25, 2024

దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణ

గుజరాత్ లోని గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. దీనిని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ స్టేషన్ పైభాగంలో ఫైవ్ స్టార్ హోటల్ ను కూడా నిర్మించారు. దీనితో పాటు ప్రధాని సొంతపట్టణమైన వాడ్ నగర్ లోనూ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. తన చిన్నతనంలో మోదీ కూడా తండ్రికి సాయంగా ఇదే స్టేషన్ లో చాయ్ అమ్మేవారు. సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేట్టు తీర్చిదిద్దిన ఈ స్టేషన్, అత్యాధునిక సదుపాయాలకు నెలవుగా నిర్మించిన గాంధీనగర్ స్టేషన్ లు చూడముచ్చటగా ఉన్నాయి. అందులో సందేహమే లేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు అందిద్దాం.

నూతన అధ్యాయానికి నాంది

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి దేశంలోని మిగిలిన రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తే భారతీయ రైల్వేల చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు భావించవచ్చు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1853 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన రైల్వే వ్యవస్థ అత్యంత శక్తివంతమైంది, అత్యంత ప్రయోజనకరమైంది. ప్రయాణ వేగాన్ని, సుఖాన్ని పెంచిన తొలితరం వ్యవస్థ ఇదే. ఆ తర్వాతే విమానాలు వచ్చాయి. ‘భారతీయ రైల్వే’ ఏర్పడి కూడా ఇప్పటికి సరిగ్గా 70ఏళ్ళు (1951) పూర్తయ్యాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రైల్వే రంగం ఇంకా శక్తివంతంగా అనేక దశలు దాట వలసి ఉంది. ఇన్నేళ్ల పాలనలో  ఆశించిన ప్రగతి జరుగలేదు. ఇప్పటికీ చాలా రైళ్లు, రైల్వే స్టేషన్లు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగానే మిగిలి ఉన్నాయి. చుట్టూ ఉండే వాతావరణం మొదలు దొరికే ఆహార పదార్ధాలు శుచికి, రుచికి ఆమడదూరంలోనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 2011 లెక్కల ప్రకారం 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 1907కే రైల్వే రంగం లాభాలను ఆర్జించడం మొదలు పెట్టింది. ప్రపంచ యుద్ధం మిగిల్చిన చేదుఅనుభవాల్లో రైల్వే రంగం కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా  అప్పటి నుంచే ప్రత్యేక రైల్వే ఆర్ధిక విధానం, బడ్జెట్ అమలులోకి వచ్చాయి. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఆధునీకరణ ప్రయాణం నిరంతర స్రవంతి. అప్పటి అవసరాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత, ఆర్ధిక వనరులను బట్టి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. 1985 నుంచి ఆవిరి యంత్రాల స్థానంలో డీజిల్, విద్యుత్ యంత్రాలు వచ్చేశాయి. 1995నాటికి రిజర్వేషన్ వ్యవస్థలో కంప్యూటరీకరణ ఆరంభమైంది. దేశంలోని కొన్ని స్టేషన్లను ఆధునీకరించారు. కొత్త మార్గాలు, కొత్త రైళ్లు జత చేరాయి.

Also read: చైనా నైజం మారదా?

అభివృద్ధి ఇంకా జరగవలసి ఉంది

రోజుకు కొన్ని కోట్లమంది ప్రయాణం చేసే ఈ వ్యవస్థలను సంస్కరించడంలో, ఆధునికతను జోడించడంలో ఇంకా వెనుకబడే వున్నామన్నది వాస్తవం. పాలనలో,ఉద్యోగ నియామకాల్లో కొన్ని రాష్ట్రాల పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైల్వే జోన్ల విభజనలోనూ అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత లేదు. రైల్వే ట్రాక్ లను ఆధునీకరించి పటిష్ఠం చేయడం అత్యంత కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లోనే కాక, విడి సమయాల్లోనూ రైలు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం కలుగుతూనే వుంది. ఇంజన్లు, ట్రాక్ ల పర్యవేక్షణలోనూ సరికొత్తవాటిని అమర్చడంలోనూ ఆశించిన ఫలితాలు లభించడం లేదు. కొన్ని మార్గాలు నిత్యం రద్దీగా ఉంటాయి. కొన్ని మార్గాలు పూర్తి ఖాళీగా ఉంటాయి.వీటన్నిటిని సమతుల్యం చేసుకోవడం అవసరం. ఇంకా అనేకమార్గాలకు రైళ్ళే లేవు. ఆ డిమాండ్లు ఎప్పటికప్పుడు అటకెక్కుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. బిజెపి ప్రభుత్వం ఆ దిశగా మరింత వేగంగా ముందుకు కదులుతోంది. దీనిపై ఉద్యోగసంఘాలు, శ్రామిక వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సౌకర్యాలు, సదుపాయాలు పెరగడాన్ని, ఆధునీకరణను ఎవ్వరూ వ్యతిరేకించరు. సంస్కరణల పేరుతో, అభివృద్ధి నెపంతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్ వ్యక్తులకు,శక్తులకు ధారాదత్తం చేయడంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోంది. లాభాల బాటను పట్టించడంలో,సత్ఫలితాలను రాబట్టడంలో,వృధాను అరికట్టడంలో, పనిలో నాణ్యతను పెంచడంలో చేపట్టాల్సిన మార్గాలను వెతకడం బదులు, ప్రైవేటుపరం చేయడం ఏమాత్రం సహేతుకం కాదనే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆధునికీకరించిన గాంధీనగర్ రైైల్వే స్టేషన్

అనుమానాలు పెంచుతున్న ప్రైవేటీకరణ ప్రతిపాదన

బ్రిటిష్ కాలంలోనూ ప్రైవేటు వ్యక్తులు రైల్వే నిర్మాణంలో భాగస్వామ్యులైనప్పటికీ, మొత్తం అజమాయిషీ ప్రభుత్వం చేతిలోనే ఉండేది. అత్యాధునికతను అందించడంలో ఎవరి సాయం తీసుకున్నా వ్యవస్థలు ప్రభుత్వాల చేతులు దాటి వెళ్ళకూడదు. ఉద్యోగస్తులు,వాటి మీద ఆధారపడ్డ ఉపాధిజీవులు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోకూడదు. వారి ఆదాయానికి రక్షణ ప్రశ్నార్ధకం కాకూడదు. ప్రైవేటు రంగం ప్రవేశిస్తే ఇవన్నీ జరుగుతాయానే భయాలు ఉద్యోగ, వేతనజీవుల్లో కలుగుతున్నాయి. రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయని సామాన్య ప్రయాణీకులు కలవరపడుతున్నారు. సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిపోతుందా అని యువలోకం భయపడుతోంది. ప్రైవేటీకరణ, ఆధునీకరణ నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ఈ ప్రశ్నలకు, అనుమానాలకు, సందేహాలకు పాలకపెద్దలు హేతుబద్ధమైన సమాధానాలు చెప్పాలి. భారతీయ రైల్వే వ్యవస్థలో ఆది నుంచి వెనుకుబాటుకు గురవుతున్నది తెలుగుప్రజలు, తెలుగు ప్రాంతాలు.ఉదాహరణగా చెప్పాలంటే? విశాఖపట్నం రైల్వే జోన్ అంశం ఒక్కటి చాలు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తుంటే, ఇన్నాళ్లకు ప్రకటించారు. కానీ, ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు.ఆంధ్రప్రదేశ్ రైల్వే వ్యవస్థపై ఒరిస్సా మొదలైన రాష్ట్రాలవారి పెత్తనమే ఇంకా కొనసాగుతోంది. రైల్వే బడ్జెట్ ప్రకటించినప్పుడల్లా వినిపించే మాట ఒకటే – ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ కు మొండిచెయ్యే!! గుజరాత్ లో మొదలైన రైల్వేల ఆధునీకరణ పర్వం అన్ని దిక్కులకూ పయనించాలి. తెలుగురాష్ట్రాలను ఇప్పటికైనా కరుణించాలి.

Also read: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో యువతకు ప్రాధాన్యం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles