Saturday, April 20, 2024

చంద్రబాబుపై విరుచుకుపడిన నాని ద్వయం

అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమైన సోమవారంనాడు అధికార వైఎస్ ఆర్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నోటికి పని చెప్పారు. హద్దులు మీరి దూషించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇంగితజ్ఞానం కోల్పోయారని రవాణా, సమాచార, శాసనసభ వ్యవహారాల మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాటిచెట్టుకూ, పెద్దాయనకూ వయసొచ్చిందంటూ మాట్లాడారు. ‘ఆడూ వీడూ అంటూ సీఎం నీ, మంత్రులనూ చంద్రబాబునాయుడు సంబోధించడంపైన మంత్రి అభ్యంతరం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు బుద్ధీజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

‘ఏరా చంద్రబాబూ అనడం మాకెంతసేపు’

‘‘ఏరా చంద్రబాబుగా అనడానికి మాకెంత సేపు కావాలి? రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపింది చంద్రబాబు కాదా..?

రైతులకు పెట్టిన ప్రతి బకాయి మేం కడుతున్నాం. సంస్కారం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు.

రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటీ..? చంద్రబాబు.. ఆయన కొడుక్కి ఖర్జూర నాయుడు రాజ్యాంగం కావాలేమో..?

అసెంబ్లీ సమావేశాలంటే టీడీపీ సమావేశాలు కావని గుర్తుంచుకోవాలి. తుపాను వచ్చిన నెలన్నర లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం,’’ అని పేర్ని నాని వాగ్దాడి చేశారు.

రామానాయుడు పేరిచ్చి తాను మాట్లాడతానంటే ఎలా?

‘‘రామానాయుడు పేరిచ్చి.. చంద్రబాబు మాట్లాడతానంటే ఎలా..? తన పేరునే చంద్రబాబు ఇవ్వొచ్చుగా..? కన్నబాబు కాపు కాబట్టి.. కాపు సామాజిక వర్గానికే చెందిన రామానాయుడు పేరు ఇచ్చారు. మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కొ అని చంద్రబాబు అనొచ్చా..?చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంటికి పరిమితం అయితే బాగుంటుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు మా సూచనను పరిగణనలోకి తీసుకుంటే ఆయనకే మంచిది,’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.

‘ఒరేయ్ చంద్రబాబూ ఒళ్ళు దగ్గర పెట్టుకో’

మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి అల్జీమర్స్ జబ్బు ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు పిచ్చి పరాకాష్టకు చేరిందని చెబుతూ, ‘‘ఒరేయ్ చంద్రబాబు, ఒళ్లు దగ్గర పెట్టుకో. సీఎంని ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాం.కుక్కబతుక్కీ చంద్రబాబు బతుక్కీ ఏమైనా తేడా ఉందా? ఖర్జూరనాయుడు పేరు కానీ కిస్మిస్ నాయుడు పేరు కానీ మేం ఎత్తామా? చంద్రబాబుది దిక్కుమాలిన బతుకు. అడుక్కుతినేవాళ్లు మెట్లమీద కూర్చున్నట్టు చంద్రబాబునాయుడు కూర్చున్నాడు.  ప్రజలు చంద్రబాబు బట్టలూడదీసినా బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు,’’ అంటూ తూర్పారపట్టారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘నువ్వేం పీకుతావ్ ’ అని మాత్రం అన్నారు.

బీఏసీ సమావేశంలో మాటామాటా

బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అసెంబ్లీ ఎందుకు అలస్యమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘గౌరవనీయులైన అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నారని ఆలస్యంగా ప్రారంభించామని సీఎం జగన్ బదులిచ్చారు. కరోనా ఎక్కువగా ఉన్నదనీ, 70 ఏళ్లకు పైబడిన సభ్యులు సభలో ఉన్నారనీ, అందుకే కొద్ది రోజులు మాత్రమే సభ నిర్వహించాలని అనుకున్నామనీ అధికారపార్టీ ప్రతినిధులు అన్నారు. ‘మీరు సభలూ, సమావేశాలు పెట్టుకున్నప్పుడు కోవిడ్ సమస్య గుర్తురాదా’ అంటూ అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కరోనాకు భయపడి ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో అందరికీ తెలుసునని అచ్చెన్నాయుడు అన్నారు. ‘మేము ప్రజల దగ్గరికి వెడితే మాపై కేసులు పెడుతున్నారు’ అంటూ అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.

‘సీఎం గాలిలో తిరుగుతూ గాలి మాట్లాడుతున్నారు’

తుపాను వల్ల పంటనష్టంపైన టీడీపీ సభ్యుడు బిటి నాయుడు మాట్లాడుతూ, ‘సీఎం గాలిలో తిరుగుతూ గాలి మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. పంట నష్టం జరిగిన జిల్లాలలో మంత్రుల పర్యటించలేదని నాయుడు అన్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో లోకేష్ చెబితే తలదించుకుంటానంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యుల తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాయించిన ‘మనసులో మాట’ పుస్తకంలో వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యానించారని మంత్రి అన్నారు. అట్లా అన్నట్టు నిరూపిస్తే శాసనమండలి పదవులకు రాజీనామా చేస్తామనీ, లేకపోతే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలనీ టీడీపీ సభ్యుడు టిడి జనార్ధన్ సవాలు చేశారు.

‘ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి’

రైతు సమస్యల గురించి మాట్లాడటానికి తాము శాసనసభకు వచ్చామనీ, ప్రతిపక్షాలను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారనీ టీడీపీ సభ్యుడ బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నలలో హౌస్ నడవాలా? అంటూ బుచ్చయ్య ప్రశ్నించారు. దాన్యం ధర కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని అన్నారు. ప్రభుత్వం రైతులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదనీ, విశేషమైన అనుభవం కలిగిన చంద్రబాబును సైతం సభ నుంచి సస్పెండ్ చేశారనీ ఆయన వ్యాఖ్యానించారు. అదికారం శాశ్వతం కాదనీ, 151 మంది ఎంఎల్ఏలు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారనీ, పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే మిన్నకుండిపోయారనీ బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ‘మా నోర్లు మూయించగలరు కానీ ప్రజలను ఆపలేరు కదా, వాళ్ళే మీకు గుణపాఠం చెబుతారు,’ అని ఆయన అన్నారు.

‘రాష్ట్రంలో రైతుల భరోసా లేని వ్యవసాయం’

రాష్ట్రంలో రైతులు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారంటూ టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.  బీఏసీ సమావేశంలో పంటనష్టం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదని అన్నారు. ధరల స్థిరీకరణ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చు ఇన్ పుట్ సబ్సిడీని రూ. 15 వేలకు తగ్గించడం దారుణమని అన్నారు. ‘రైతు భరోసా రైతు దగా’గా మారిందని ఆరోపించారు.

పోడియం వద్దకు వెళ్ళి మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ సభ్యుల డిమాండ్ చేశారు. సభ ఆర్డర్ గా లేదంటూ రేపటికి వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రహ్మణ్యం.

‘ఏ పూనకంలో ప్రజలు ఓట్లు వేశారో’

‘‘సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని అర్థం’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘ఏ పూనకంలో ప్రజలు ఓట్లు వేశారో, రాష్ట్రం ఇట్లా తయారైంది. ప్రజలకోసం నా జీవితంలో ఎన్నడూ పడని తిట్లు పడుతున్నాను. ఫేక్ ఫెల్లోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. జగన్ అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారు. అలాగే ఇన్ పుట్ సబ్సిడీని నాశనం చేస్తున్నారు. నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు. నాకు చెబుతారా? నా లైఫ్ లో నేనెప్పుడూ వెల్ లోకి వెళ్ళలేదు. పరిటాల రవి హత్య సందర్భంలో కూడా నేను వెల్ లోకి  వెళ్ళలేదు. రైతుల విషయంలో సీఎం తీరు నచ్చకే బైఠాయించాను. గాలికి వచ్చారు. గాలికే పోతారు,’’ అని చంద్రబాబు సోమవారం సాయంత్రం విలేకరుల గోష్టిలో వ్యాఖ్యానించారు.

జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి : చంద్రబాబునాయుడు

‘‘జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి. శాసనసభను నియమాలకు విరుద్ధంగా ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా మమ్మల్ని హేళన చేస్తున్నారు. వరదలూ, వర్షాలపైన, పంటనష్టంపైన ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోంది. బూతులు మాట్లాడకపోవడమే నా బలహీనత అనుకుంటే తప్పు. అదే నా బలం. ఆయన (జగన్) మాస్క్ పెట్టుకోడు, మంత్రులూ పెట్టుకోరు. పెట్టుకున్నవాళ్ళని ఎగతాళి చేస్తారు,’’ అంటూ చంద్రబాబునాయుడు అన్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles