Sunday, June 26, 2022

బీహార్ బాహాబాహీ: ఉరకలేస్తున్న యువతరం

  • మిలీనియం ప్రతినిధుల హవా
  • తేజస్వియాదవ్ కు పెరుగుతున్నజనాదరణ
  • యువనాయకులతో రంగంలోకి కొత్త సాంకేతిక పరిజ్ఞానం
  • అన్ని పార్టీలలోనూ యువత ముందంజ   

బీహార్ లో తరం మారుతోందా? గాలి మారుతోందా? రాజకీయ నాయకత్వం యువతరం చేతుల్లోకి మారుతోందా? మార్పు గాలిలో కనిపిస్తున్నది. మాటల్లో వినిపిస్తున్నది. జనాభిప్రాయ సర్వేల ఫలితాలకూ, రాజకీయ పండితుల ఊహాగానాలకూ భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వియాదవ్ తన తండ్రి సహచరుడైన నితీశ్ కుమార్ చేతిలోనుండి బీహార్ ప్రభుత్వ పగ్గాలను స్వీకరించినా ఆశ్చర్యం లేదు. నవంబర్ 9వ తేదీన తన తండ్రి లాలూ ప్రసాద్ జైలు నుంచి విడుదలై వస్తారనీ, పదిన నితీశ్ కుమార్ కి వీడ్కోలు పలుకుతామనీ ఎన్నికల సభలో తేజస్విని అన్న మాటలు నిజమైనా కావచ్చు.  ‘మిలీనియల్’ ల హడావిడి ఇటువంటి అభిప్రాయాన్ని బలపరుచుతున్నది.

‘మిలీనియల్’ అనే మాటను జనాభా లెక్కలను విశ్లేషించే సంస్థ ‘స్ట్రాస్ అండ్ హోవ్’ వాడుకలోకి తెచ్చింది. ‘ప్యూ రీసర్చ్ బ్యూరో’ దీన్ని మరింతగా అధ్యయనం చేసింది. 1981 నుంచి 1996 వరకూ పుట్టినవారిని మిలీనియల్స్ అంటున్నారు. మిలీనియల్స్ లో అందరికంటే పెద్దవారికి 39 సంవత్సరాలు. అందరికంటే పిన్నలకి 24 ఏళ్ళు. 1996 తర్వాత పుట్టినవారిని జనరేషన్ – జెడ్ అంటున్నారు. తాజా తరం. నవంబర్ 3న అమెరికా అధ్యక్షపదవికి జరుగుతున్న ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి పదిమందిలో ఒకరు జడ్ జనరేషన్ కి చెందిన వ్యక్తి.  మిలీనియల్స్ కీ, జనరేషన్ – జెడ్ కేటగరీలకు చెందిన వారందరికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వైయక్తికంగానూ, సామూహికంగానూ తమది ప్రత్యేక తరహా అనీ, ప్రత్యేక తరం అనీ వారు భావిస్తారు. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. సాంకేతిక పరిజ్ఞానం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతిభను గుర్తించి గౌరవించే లక్షణం ఉన్నవారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతారు. వారు స్వాప్నికులు కారు. ఆచరణవాదులు. ఉత్సాహం, ఉత్తేజం దండిగా ఉన్నవారు. సాహసికులు.

పాతతరం నేతలకు తెర

ఈ తరానికి చెందిన యువ రాజకీయ నేతలు బీహార్ ఎన్నికలను శాసిస్తున్నారనీ, బీహార్ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయనీ ‘టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ కు చెందిన అశ్వనీకుమార్ అంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెరమరుగు అవుతారో లేక అయిదేళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల తర్వాత అవుతారో తెలియదు కానీ వృద్ధతరానికి చెందిన నాయకుల రాజకీయాలకు క్రమంగా తెరబడుతోంది. పదిహేనేళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మరో పదిహేనేళ్ళు లాలూ మాజీ సహచరుడు నితీశ్ కుమార్ రాజ్యం చేసిన తర్వాత సోషలిస్టులుగా, వెనుబడినవర్గాల నాయకులుగా నలభై అయిదు సంవత్సరాల కిందట జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఆత్యయిక పరిస్థిని ఎదిరించి పోరాడిన ధీరనేతల యుగం ముగింపునకు వచ్చింది.

యువతరానికి ప్రతినిధి తేజస్వి

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ శిష్యులుగా రాణించి బీహార్ రాజకీయాలను శాశించినవారిలో ముఖ్యులు ముగ్గురు – లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రాంవిలాస్ పాసవాన్. లాలూ యుగం ముగిసింది. పశువుల దాణా కుంభకోణానికి చెందిన నాలుగు కేసులలో దోషిగా తేలి రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. లాలూ లేకుండా జరుగుతున్న మొదటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇవి. లాలూ రెండో కుమారుడు తేజస్వి యాదవ్ రాష్ట్రీయజనతాపార్టీ (ఆర్జేడీ)ని సమర్థంగా నడిపిస్తున్నారు. అతగాడు చదువులో రాణించలేదు. అందుకే ఉద్యోగం సంపాదించే అర్హతలేని తేజస్వి పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానంటూ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎద్దేవా చేస్తున్నారు. బడికీ, కాలేజీకి వెళ్ళి చదువుకోకపోయినా రాజకీయ నాయకుడికి అవసరమైన క్షేత్రపరిజ్ఞానం తేజస్వికి పుష్కలంగా ఉంది. తండ్రి, తల్లి ముఖ్యమంత్రులుగా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించడం దగ్గరి నుంచి చూసిన యువకుడు తేజస్వి. 2015 ఎన్నికల నాటికి పాతికేళ్ళ కుర్రవాడుగా ప్రచారంలో అంత ప్రభావం చూపించలేకపోయినప్పటికీ ఇప్పడు (మెగా స్టార్ చిరంజీవి సినిమా భాషలో చెప్పాలంటే) ‘రఫ్’ ఆడేస్తున్నాడు. అతని సభలకు జనం విరగబడుతున్నారు. ఆర్ జేడీ అధినేతగా తేజస్వి, కాంగ్రెస్ నాయకుడుగా రాహుల్ గాంధీ యువతరానికి ప్రతినిధులు. 31 ఏళ్ళ తేజస్వి మిలినియల్ తరానికి ప్రతినిధి.

బీహార్ లో సంచలం సృష్టిస్తున్న మరో యువకుడు చిరాగ్ పాసవాన్. 37 సంవత్సరాల చిరాగ్ బాలీవుడ్ లో అదృష్టం పరిశీలించుకొని సినిమాల కంటే రాజకీయాలు భేషని నిర్ణయించుకున్నాడు. తండ్రికి వారసుడుగా బీహార్ బరిలో దిగాడు. మూడు టరమ్ లు ముఖ్యమంత్రిగా పని చేసిన నితీశ్ కుమార్ పట్ల ప్రజలకు మొహం మొత్తిందనీ, జనం ఆగ్రహంగా, అనాసక్తిగా ఉన్నారనీ ఏడాది కిందటే గ్రహించి ముఖ్యమంత్రికి వ్యతిరేకండా ఉద్యమం ప్రారంభించిన యువకుడు చిరాగ్. తండ్రి అనారోగ్యంగా ఉన్న రోజులలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) పగ్గాలు చేతుల్లోకి తీసుకొని దాన్ని ఉద్యమసదృశంగా  నడిపిస్తున్నాడు. గుండె ఆపరేషన్ తర్వాత కొంతకాలం ఆస్పత్రిలో ఉండి జీవనయాత్ర చాలించిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్ కు తగిన వారసుడుగా చిరాగ్ పేరు తెచ్చుకున్నాడు.

నితీశ్ పై చిరాగ్ ఉద్యమం

రెండు దశాబ్దాల కిందట ఎల్ జేపీని నెలకొల్పినప్పటి నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదో ఒక కూటమిలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయడం కారణంగా ముప్పయ్ నియోజకవర్గాలకు మించకుండా అభ్యర్థులను నిలబెట్టడంతో మొత్తం ఓట్లలో ఆరు శాతం మించి ఎన్నడూ ఎల్ జేపీకి రాలేదు. అందరూ ఈ ఆరు శాతం ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని మాట్లాడుతున్నారు. అందుకని ఈ సారి స్వతంత్రంగా పోటీ చేసి ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సీట్ల సంగతి ఎట్లా ఉన్నా ఓట్ల శాతం పెంచుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అందుకని నితీశ్ కుమార్ తోనూ, ఆయన నాయకత్వంలోని జేడీయూ తోనూ తెగతెంపులు చేసుకొని నరేంద్రమోదీనీ, బీజేపీనీ ప్రేమిస్తున్నట్టు ప్రకటించాడు. దిల్లీలో బీజేపీ నాయకులు అమిత్ షానూ, నడ్డానూ కలుసుకున్నాడు. మంతనాలు ఆడాడు.  బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి అభిప్రాయానికి  విరుగుడుగా తమకు చిరాగ్ తో ఎటువంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు ప్రకటించారు. చిరాగ్ తో జతకట్టి ఎల్ జేపీ టిక్కెట్టుపైన బరిలో దిగిన పదిమంది బీజేపీ తిరుగుబాటుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు.

అంతుపట్టని చిరాగ్ వ్యూహం

బీజేపీ అధినేత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారంనాడు బీహార్ లో ప్రచారం ప్రారంభించారు. నితీశ్ కుమార్ ని పొగుడుతున్నారు కానీ చిరాగ్ తో తమకు సంబంధాలు లేవని ప్రకటించలేదు. చిరాగ్ ను మందలించలేదు. విమర్శించలేదు. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని టైమ్స్ ఆఫ్ ఇండియా –సీ ఓటర్ సర్వే వెల్లడించింది. దాదాపు 80 స్థానాల వరకూ బీజేపీ గెలుచుకోవచ్చునంటున్నారు. కారణం ఏమంటే బీజేపీ, దాని మిత్ర పక్షం వికాస్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పోటీ చేస్తున్న 121 స్థానాలలో ఎల్ జేపీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. జేడీయూ, దాని మిత్రపక్షం హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ ఏఎం) పోటీ చేస్తున్న 122 స్థానాలలో మాత్రం గట్టిపోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఎల్ జేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో బీజేపీ నాయకులూ, ఓటర్లూ ఎట్లా వ్యవహరిస్తారనే దానిపైన ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. చిరాగ్ తో అమిత్ షాకి రహస్య ఒప్పందం ఉన్నదనే అంశంపైన సందేహాలు ఉన్నాయి. చిరాగ్ వ్యూహం ఏమిటో అంతుపట్టక జేడీయూ నేతలు జుట్టుపీక్కుంటున్నారు. బీజేపీ నేతలూ, కార్యకర్తలూ అయోమయంలో ఉన్నారు.

నితీశ్ కుమారుడి అనాసక్తి  

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కి కూడా కొడుకు ఉన్నాడు. నితీశ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. బీహార్ విద్యున్మండలిలో ఉద్యోగం చేశారు. దాన్ని వదిలేసి రాజకీయాలలో ప్రవేశించారు. నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా ఇంజనీరే. అతని ఒంటికి రాజకీయం పడదు.

నరేంద్రమోదీని అంకుల్ అని పిలుస్తాడు. తండ్రి విజయాలపట్ల తనివితీరా ఆనందం వెలిబుచ్చుతూ మాట్లాడుతారు. జీవితంలో మొదటిసారి 2019లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు.  నిశాంత్ కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు కనుకనే ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిశోర్ ను ముఖ్యమంత్రి దగ్గరికి తీశారు. 2018లో ప్రశాంత్ కిశోర్ కి పార్టీ పదవి ఇచ్చి తన తర్వాత స్థానంలో పక్కనే కూర్చోబెట్టుకొని ప్రోత్సహించారు. కానీ నితీశ్ కూ, ప్రశాంత్ కూ మధ్య విభేదాలు వచ్చాయి. నితీశ్ ను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించడంతో ప్రశాంత్ ని పార్టీ నుంచి బహిష్కరించారు. నితీశ్ భార్య మంజూ కుమారి సిన్హా 2007లో నిమోనియా వ్యాధి కారణంగా కన్నుమూశారు. ఒకే ఒక కుమారుడు రాజకీయాలకు దూరం.

ఎగసిపడుతున్న యువకెరటం

తేజస్వి యాదవ్, చిరాగ్ పాసవాన్ తో పాటు ముఖేష్ సహానీ (35), శ్రేయసి సిన్హా (29), గరీబ్ దాస్ (26), పుష్పం ప్రియా చౌదరి వంటి యువనాయకులు బీహార్ ని ఒక ఊపు ఊపుతున్నారు. ఈ మిలీనియల్స్  కాకుండా  సీపీఐకి చెందిన, జేఎన్ యూ విద్యార్థినాయకుడు కన్హయాకుమార్ చాలా నెలల నుంచి బీహార్ లో పర్యటిస్తున్నాడు. అతడు ప్రతిభావంతుడైన యువనాయకుడు. మంచి వక్త. మిలీనియల్ నాయకులలో అత్యధికులు వెనుకబడిన తరగతులకు చెందిన వారు. జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు లేకపోయినా, ప్రాంతీయస్థాయిలో వారికి పలుకుబడి ఉంది. జనాలను సమీకరించే నేర్పు, సహనం ఉన్నాయి. వీరంతా బీహార్ రాజకీయాలను మరింత సంపద్వంతం చేయబోతున్నారు. ప్రజాస్వామ్యాన్నిసమాజంలో అట్టడుగువర్గాల అనుభవంలోకి తీసుకొని వెడుతున్నారు. నేల విడిచి సాము చేయడం వీరికి తెలియదు. రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం, మర్యాదలు అతిక్రమించకుండా, శక్తివంచన లేకుండా కొట్లాడటం, ప్రజలతో నిత్యసంబంధాలు కొనసాగించడం వీరికి తెలుసు. తండ్రులకు మించిన తెలివితేటలతో, ఎలక్ట్రానిక్ పరికరాల పరిజ్ఞానంతో, ప్రజలతో మమేకమయ్యే శైలితో యువతరం నాయకుడు దూసుకుపోతున్నారు.

రవి శంకర్ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీ వంటి బీజేపీ నాయకులూ, సదానంద సింగ్, మదన్ మోహన్ ఝా వంటి కాంగ్రెస్ నేతలూ, నితీశ్ కుమార్ వంటి జేడీయూ నేతలూ పాతతరానికి చెందినవారు. వారు తప్పుకొని కొత్తతరానికి అవకాశం ఇవ్వలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బీహార్ ఓటర్లలో యువతదే ఆధక్యం

బీహార్ జనాభాలో 65 శాతం మంది యువతీయువకులు. వారి సంఖ్య ఎనిమిది కోట్లు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువత 58 శాతం ఉన్నారు. 18-40 మధ్య వయసున్న ఓటర్లు బీహార్ లోని మొత్తం 7.6 కోట్లు ఓటర్లలో 56 శాతం మంది. అంటే సుమారు మూడున్నర కోట్ల కంటే ఎక్కువ మంది మిలీనియల్స్ బీహార్ లో ఈ సారి ఓటు హక్కు కలిగి ఉన్నారు. కొత్తతరం నాయకులలో ఎక్కువ మంది వారసులే. కానీ కొత్త శక్తియుక్తులు కలిగిన వారసులు. తండ్రులకు మించిన రాజకీయ వ్యూహకర్తలు.

దక్షిణాదిలో వయసుపైబడినవారిదే రాజ్యం

ఉత్తరాదిలో మిలీనియల్ తరం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నట్టు దక్షిణాదిలో చేయడం లేదు. కేరళలో యువనాయకులు అగ్రస్థానంలో లేరు. తమిళనాడులో వారసుడు స్టాలిన్ వయస్సు ఆరుపదుల పైమాటే. కర్నాటకలో యడ్యూరప్ప (బీజేపీ), మల్లిఖార్జున ఖర్గే, శివకుమార్ (కాంగ్రెస్), కుమారస్వామి (జెడీఎస్) వంటి సీనియర్ నాయకులు ఇంకా రంగంలో ఉండి పోరాడుతున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమారుడు తారకరామారావు, అల్లుడు హరీష్ రావు సరుకున్న యువరాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 47 సంవత్సరాలు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు (71) ఓటమి తర్వాతనైనా పార్టీ పగ్గాలు కుమారుడు లోకేష్ కు ఇస్తారనుకుంటే ఆయనే గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రాబాబునాయుడు పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతేనే పార్టీ పోరుబాటలో ఉంటుంది. ప్రయోగాలు చేయవలసిన సమయం ఇది కాదని ఆయన భావించి ఉంటారు.

ఉత్తరాదిలో అఖిలేష్,జ్యోతిరాదిత్య, సచిన్

ఉత్తరాదిలో యువత ముందు పీటీకి వస్తోంది. యూపీలో ములాయం స్థానంలో అఖిలేష్ కుదురుకున్నాడు. మాయావతి ప్రాబల్యం తగ్గుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వయస్సు జగన్ మోహన్ రెడ్డి వయస్సు కన్నా ఒక సంవత్సరం ఎక్కువ (48). రాజస్థాన్ లో సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్యసింధియా ముందు వరుసలోకి చేరిపోయారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ వయస్సు 45 సంవత్సరాలు. అన్ని రాష్ట్రాల కంటే బీహార్ లోనే యువతరంగం ఉప్పొంగుతోంది. ఉరుకులు తీస్తోంది. పరుగులు పెడుతోంది. దూసుకుపోతోంది. అక్టోబర్ 28న బీహార్ లో ప్రారంభమయ్యే మూడంచెల పోలింగ్ ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ అన్ని పార్టీలలో యువతీయువకులకు పట్టం కట్టవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles