Thursday, April 25, 2024

ఫ్లెమింగో-15

ఆకాశం రంగుపూలు పూచిన దృశ్యం

రబ్బరు చెట్ల కొమ్మల్లో

ఫ్లెమింగో, పెలికాన్ ల కాపురం

విస్తరిస్తున్న అపార్ట్ మెంట్ సంస్కృతిలో 

వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం 

ప్రళయ కావేరి నీటి పడగల నీడలో

సైబీరియా ఆనందాల అభ్యంగనం

వేల మైళ్ళ దూరభారాల అలసట మరచి

నావికాదళ సైన్యంలా

మేఘమల్హార్ ఆలపిస్తున్న పక్షిపాట

ఈ సముద్రం రామ చిలుకకి

ఎన్నికుంచెలు తలవంచి నమస్కరించాయో

ఎన్ని కాన్వాస్ లు మొహాలు

తెల్లబోసుకున్నాయో

కువకువలు ప్రేమల్ని పొదిగే సింఫనీలో

ఎన్నారై గువ్వల ముద్దు ముచ్చట్ల నిశ్చల చిత్రం

మనసుకు రెక్కల సంగీతం నేర్పే సరిగమ

ఏడాదికోసారయినా..

జన్మభూమి కౌగిలి కోసం తపన

పురిటి గడ్డను ముద్దాడాలన్న భావన

బ్రతుకు మూలాలు మరచిన సమరంలో 

అంతర్ముఖాన్ని కోల్పోయిన మట్టిమనిషి

మరయంత్రమై పోయాక

ఇప్పటికైనా..యిక

పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే..!

ఉపసంహారం

అంతరాంతరాత్మలన్నీ ఏకీభావమౌతాయి

విశ్వాత్మా విభూతులన్నీ మహితాత్మలౌతాయి

భారతీయ నదీ సంగమ జలనిధిలో

తీర్ధస్నానం చేసి పవిత్రగాత్రాలౌతాయి

వలస పక్షుల పురాకృత సుకృతం యేమిటో

నిత్యం నీరంలోనే నారాయణున్ని తలుస్తాయి..! 

మొదటి ప్రచురణ ముందుమాటల నుంచి:

పెరుగు రామకృష్ణ ఈ కావ్యంతో ఫ్లెమింగో రామకృష్ణ అయ్యాడు. ఈ కవికీ ఈ దీర్ఘకవితకీ నేటివిటి వుంది. ఆ లక్షణమే ఈ కావ్యానికి జీవం పోసింది. ఒక మంచి కావ్యానికిమంచి వస్తువు దొరకడం మహాకష్టం. దొరికిందా అది కవి అదృష్టం. పక్షి భారతీయ కావ్య పరంపరలో ఒక బలమైన ప్రాకృతిక, ఆధ్యాత్మిక , సామాజిక ప్రతీక. రామకృష్ణ కొన్ని పంక్తుల్లో ఈ అంశాన్ని బాగానే గుర్తించాడు. ఈ కావ్యం అన్ని భాషల్లోకి అనువాదం కావాలి..అంతర్జాతీయ స్ధాయి రావాలి..!

-ఆచార్య ఎండ్లూరి సుధాకర్

కాలంతో ప్రారంభించిన కవిత్వాన్ని మళ్ళీ పక్షి దగ్గర్నుంచి కాలంతో అనుసంధానం చేస్తున్నాడు కవి. జీవనయాగ జ్ఞాని, సీమాంతర ద్వేషాలెరుగని ఆత్మీయ మిత్రుడైన, ఇంద్రియ చాపల్యం లేని విదేశీయోగి, కాలచక్ర రహస్యం దర్శించిన దివ్య జ్ఞాని అయిన పక్షి కాలానికి సంకేతం అంటాడు. భూత భవిష్యత్ వర్తమానాల సంగమగీతం అంటాడు..!

డాక్టర్ నలిమెల భాస్కర్

(ముగిసింది)

Also read: ఫ్లెమింగో-14

Also read: ఫ్లెమింగో-13

Also read: ఫ్లెమింగో-12

Also read: ఫ్లెమింగో-11

Also read: ఫ్లెమింగో-10

Previous article
Next article
Perugu Ramakrishna
Perugu Ramakrishna
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles