Saturday, April 20, 2024

కొత్త తీరాలకు తీసుకొని వెళ్ళే బడ్జెట్, నిర్మలాసీతారామన్

భారత దేశాన్ని నవ్యపథంలోకి తీసుకువెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టిందని మోదీ అభిమానులు అంటున్నారు. నిరుద్యోగం పెరిగిపోతున్నా ఉద్యోగాలు సృష్టించడానికి ప్రయత్నం జరగలేదని విమర్శకులు అంటున్నారు. ద్రవ్యోల్బణం మరో సమస్య. దీని కారణంగా ఉద్యోగవర్గాలకు ఎన్ని రాయితీలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని వాదిస్తున్నారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు పది లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఇది ఉద్యోగాల కల్పనకు నమ్మకమైన మార్గమనీ ప్రభుత్వ మద్దతుదారులు వాదిస్తున్నారు.

ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ప్రజల చేతిలోకి డబ్బులు పెట్టడమేననీ, దాని వల్ల ద్రవ్యోల్బణం విజృంభించిందనీ, సంపన్నదేశాలు కరోనా సమయంలో డబ్బు ప్రజల చేతుల్లో పెట్టాయనీ, అందుకే ధరలు పెరిగాయనీ, ఆ పని మరోసారి చేయకూడదనీ మోదీ సమర్థకులు అంటున్నారు.

ఈ సంవత్సరం చైనా నుంచి దిగుమతులు వంద మిలియన్ యూఎస్ డాలర్ల వరకూ పెరిగాయనీ, ఒక వైపు అనేక ప్రాంతాలలో చైనాతో సంఘర్షణ ఉండగా, ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకోవడం ఆత్మనిర్భరత ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దిగుమతులు చేసుకోకపోతే ఎగుమతులు కూడా చేయలేరనీ, ఈ సంవత్సరం దిగుమతులు పెరగడంతో పాటు  ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయనీ మోదీ సమర్థకులు చెబుతున్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్న దేశానికి దిగుమతులు తప్పవని చెబుతున్నారు.

హరిత ఆర్థికవ్యవస్థ నిర్మించేందుకు పెట్టుబడులు పెంచాలని బడ్జెట్ లో ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ ప్రతిపాదించారు. ఇది పరివర్తన కోసం ఉద్దేశించిన బడ్జెట్ అనీ, సుదీర్ఘమైన దృష్టితో ప్రతిపాదనలు చేశారని మోదీ అభిమానులు వాదిస్తున్నారు.

ఆదాయం పన్నులో భారీ రాయితీ

సాలీనా ఏడు లక్షల ఆదాయం వచ్చేవారికి ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఇదివరకు అయిదు లక్షలు ఉన్న పరిమితిని ఈ సారి ఏడు లక్షలకు పెంచడం విశేషం. అయితే, కొత్త పన్నుల విధానానికి అంగీకరించినవారికే  ఈ రాయితీ వర్తిస్తుందని షరతు విధించారు. 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్నుల విధానం ప్రకారం ఆదాయం పన్నుకోసం లెక్కకట్టే జీతంలో జీవిత బీమా కిస్తీకీ, మూచువల్ ఫండ్ కిస్తీకీ, గృహరుణాలు చెల్లించే కిస్తీలకీ మినహాయింపు ఉండదు. పాత పన్ను విధానంలో ఈ కిస్తీలకు మినహాయింపు ఉండేది. అందుకే ఉద్యోగులు గృహరుణాలు తీసుకునేవారు. కొత్త పన్నుల విధానానికి ప్రజాదరణ దక్కలేదు. సున్నా నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం  ఉన్నవారికి పన్ను కట్టనక్కరలేదు. ఇంతవరకూ రెండున్నర లక్షల ఆదాయం ఉన్నవారికి ఆదాయం పన్ను ఉండేది కాదు. ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఆదాయం పొందేవారు పది శాతం పన్ను చెల్లించాలి. తొమ్మిది లక్షల నుంచి 12 లక్షల వరకూ పొందేవారు 15శాతం పన్ను చెల్లించాలి. 12 లక్షల నుంచి 15 లక్షల వరకూ సాలీనా ఆదాయం పొందేవారు 20 శాతం పన్ను కట్టాలి. సంవత్సరానికి 30 లక్షలూ, అంతకంటే ఎక్కువ ఆదాయం పొందేవారు 30 శాతం పన్ను చెల్లించాలి. దేశంలో అత్యధిక పన్నును 42.7 నుంచి 39 శాతానికి తగ్గించారు. పాత పన్ను విధానాన్నికోరినవారికి మాత్రమే దాన్ని వర్తిస్తామనీ, లేకపోతే కొత్తపన్ను విధానం అమలులోకి వస్తుందనీ మంత్రి స్పష్టం చేశారు.

తన 87 నిమిషాల ప్రసంగంలో చివరి అంకంలోనే పన్నుల విధానాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం పాత విధానంలోనైనా,కొత్త విధానంలోనైనా అయిదు లక్షల ఆదాయం వచ్చేవారు ఆదాయం పన్ను కట్టనక్కరలేదు. కొత్త పన్ను విధానంలో రిబేటును ఏడు లక్షలకు పెంచుతున్నామని ఆర్థికమంత్రి అన్నారు. ఆమె ఈ మాటలు అంటున్నప్పుడు ఆమెనూ, ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ సభ్యులు బల్లలు చరిచారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles