Thursday, September 19, 2024

మనుషులు – వస్తువులు – సంస్కృతి

మండపేట సభలో ప్రసంగిస్తున్న గౌవర్

 (ప్రసంగ వ్యాసం)

(ప్రజల మనిషి చల్లా వెంకట్రావుగారి 14 వ వర్ధంతి సందర్భంగా జూలై 24, 2002, ఆదివారం సాయంత్రం మండపేటలోని నాళం వారి కళ్యాణ మండపంలో “మనుషులు – వస్తువులు- సంస్కృతి” అంశం పై  వక్తగా నా సంక్షిప్త ప్రసంగ పాఠం

చల్లా వెంకట్రావు గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. అయినప్పటికీ డా. చల్లా రవికుమార్ గారితో కల్సి వివిధ సామాజిక అంశాల మీద పని చేయడం వల్ల ఆయన గురించి విన్నాను. ఈ రోజు మీ అందర్నీ ఇలా కలుసుకోవడం సంతోషం.

మిత్రులారా,

 రాజు మరణించె నొక తార రాలిపోయె

  కవియు మరణించె నొక తార గగనమెక్కె

  రాజు నిద్రించు రాతి విగ్రహములందు,

  సుకవి జీవించె ప్రజల నాలుకలయందు.”

ఈ రోజు నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి 51 వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ ప్రసంగాన్ని మూడు భాగాలుగా చేయదల్చుకున్నాను. మొదట మనుషుల గురించి, రెండు వస్తువుల గురించి మూడు సంస్కృతి గురించి, చివరగా ఈ రోజు ఈ ప్రసంగం ఆవశ్యకత గురించి సంక్షిప్తంగా చెప్పాలని నా ఉద్దేశం.

మనిషిని నిర్వచించడం కష్టం

మనిషి అనే పదం పలకడానికి సులువుగానే ఉండవచ్చు కానీ మనిషిని మనిషిగా నిర్వచించుకోవడం ఈ రోజున్న పరిస్థితుల్లో అంత సులభం కాదు. తినే తిండి, వేసుకునే బట్ట, మాటాడే మాటలు, వ్యక్తీకరించే భావనల పై నిరవధికమైన ఆధిపత్యం కొనసాగుతున్న వేళ మనిషి పక్షాన నిల్చిన వారి కోసం మాట్లాడుకోవడం మనుషులుగా మన కనీస కర్తవ్యమని నా అభిప్రాయం.”To be Radical means to go to the Root, and the Root is man himself” అంటాడు మార్క్స్. మనుషుల్నీ, వస్తువుల్నీ, సంస్కృతినీ సృష్టించేది మనిషే, కాన ఏపాటి యత్నానికైనా మనిషే ప్రమాణం కావాలనేది మార్క్స్ అభిప్రాయం. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అని గురజాడ అన్నా, “మానవుడే నా సందేశం” అని శ్రీశ్రీ అన్నా ఆ భావనతోనే.

కులమతాలకు అతీతంగా మనిషి పక్షాన నిలవడమనేదాన్ని స్వాగతించే లక్షణం ఈ విద్వేష వ్యవస్థ లో లేదు కనుకనే డా. నరేంద్ర దభోల్కర్ మొదలుకొని గోవింద పన్సారే, కల్బుర్గీ, గౌరి లంకేష్ ల వరకూ బలిగొన్నారు. ఆ ప్రమాదాన్ని ఎన్నడో గ్రహించబట్టే ఠాగోరు నాటి భావ కవుల్ని ఉద్దేశించి, “కవిగా జీవించగలిగితే చాలదు. నువ్వు ముందు మనిషిగా జీవించగలిగితేనే కవిగా జీవించినట్టు..” అని ప్రకటించారు. ఆ స్పూర్తిని అందుకున్న మహాకవి కృష్ణశాస్త్రి గారు స్పష్టంగా, “ఆధునిక యుగంలో రెండు ఉద్యమాలు బయలుదేరాయ్, ఒకటి మానవోద్యమం, మరొకటి హిందూ ధర్మ పునరుద్ధరణోద్యమం. మొదటి దానికి ప్రవర్తకుడు రాజారామ్మోహన్ రాయ్. నేను మానవోద్యమానికి చెందిన వాణ్ణి” అని ప్రకటించారు.

రెండు వస్తువులు

ఇక రెండు వస్తువులు. వస్తువులంటే ఏమిటీ, సరుకులంటే ఏమిటీ దానికి సంబంధించిన రాజకీయార్ధిక వివరాల్లోకి నేను పోబోవడం లేదు. పైగా మిత్రులు కృష్ణారావు గారు అది వివరించారు. మనిషి శ్రమతో ప్రకృతి ముడి పదార్థాలతో తయారైన వాటిని వస్తువులంటాం. అయితే, మనిషి ఉపయోగం కోసం కాకుండా లాభం కోసం చేసే వస్తూత్పత్తికి పెట్టుబడి కావాలి. అలా తయారైన సరుకుల్ని అమ్ముకోడానికి ఒక స్థలం కావాలి. దానినే మార్కెట్ అంటాం. మరి మార్కెట్ అంటే ఏమిటి? శ్రీ శ్రీ ఆత్మకథ “అనంతం” లో ఒక మిత్రుడు శ్రీ శ్రీ తో, ” Mr. Sri Sri, Can you define A Market Place?” (మార్కెట్ అంటే ఏంటో చెప్పగలవా?) అంటాడు. శ్రీ శ్రీ తనకి తెలియదంటాడు. అప్పుడాయన, “ఇద్దరు వ్యాపారస్తులు ఒక టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చుని వాళ్ళిద్దరిలో ఎవరు ఎవరిని ముందుగా హెచ్చుగా మోసం చేయగలరనేది ఒక్క క్షణంలో తేల్చుకునే స్థలమే మార్కెట్ ప్లేస్ (విపణి)” అంటాడు. అది రాస్తూ శ్రీ శ్రీ “పెట్టుబడిదారీ విధానపు వేదాంత సారమంతా కాచి వడబోసి సూత్రీకరించాడు” అంటాడు. కాబట్టి మార్కెట్ అంటే ప్రజల్ని ఒక్క క్షణంలో మోసం చేసేందుకు పెట్టుబడిదారులు ఏర్పాటు చేసుకున్న స్థలం.

మనుషులు వస్తువులుగా మారి యాంత్రికంగా బతుకీడుస్తుంటే, ఆ వస్తువుల్ని ఆరాధించడమే సంస్కృతి గా ఈ రోజు చలామణి అవుతోంది. అవసరాలకీ విలాసాలకీ తేడా తెలియని తరాలు వీలైనన్ని వస్తువుల్ని ఎక్కువ ప్రమాణంలో వినియోగించడమే నాగరికతకు చిహ్నంగా భావించడం జరుగుతోంది. “ప్రవేశించిన ప్రతీ జీవిత సందర్భంలోనూ నేనొక అవాంఛనీయమైన అపరిచితుడ్ని” అంటాడొక చోట సి. వి. సుబ్బారావు. అలాంటి స్థితి గురించే చలం ఎన్నడో తన మ్యూజింగ్స్ లో , “..చాలా త్వరలో మనుషులు మరలూ, కీలుబొమ్మలు, రోబోట్స్ గా తయారౌతారు” అని వాపోతాడు. కంపెనీలకి వినియోగదారులుగా, ప్రభుత్వాలకి ఓటర్లుగా, మతాలకి భక్తులుగా, పరిశ్రమలకి ఉద్యోగులుగా మాత్రమే అస్తిత్వాన్ని నిర్మించుకుంటూ నిష్క్రమిస్తోన్న తరాలకి చైతన్యవంతమైన స్రవంతుల గురించి తెలుసుకోవడం అవసరం. ‘మాయమైపో తున్నడమ్మా మనిషన్నవాడు..’ అని అందెశ్రీ అన్నా, ‘మా ఊరు పోయింది’ అని కృష్ణశాస్త్రి అన్నా అది ఆ భావనతోనే. దానినే అమృతం కురిసిన రాత్రి లో 80 ఏళ్ళ క్రితం ‘పాడువోయిన ఊరు..’ కవితలో తిలక్ ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ;

అది అంతా ఇసుక

 చరిత్రలో ఒక మసక

ఇది నశించిన ఒక గ్రామం

విశ్వశించే ఒక శ్మశానం

గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర,

వర్తమానం నీ కన్నులు గప్పిన ఒక పొర,

కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది

ఒక వెగటు ఏదో నన్నావరించుకుంది..

కాలం పాడునుయ్యిలా కన్నులకు కనబడింది.”

స్వాతంత్ర్యం వచ్చిన సరిగ్గా ఏడాదికి అంటే, ఆగష్టు 15, 1948 న ఆనందవాణి పత్రికలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు “వాణిజ్యం – అరాజకం – విరుగుడు” అనే వ్యాసం రాసారు. అందులోని ప్రారంభ వాక్యాలు చూడండి :

“మనకు స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరం గడిచింది కానీ కరువుకాటకాలేమీ తగ్గలేదు. మరియు ధరలు దినదిన ప్రవర్ధమాన మగుచున్నవి. ఏ వృత్తిలోనైనా నిలకడగా ఎంత సంపాదించుకున్నా నిమిషములో హరించి పోవుచున్నది. వర్తకం చేసుకొని దొంగ లాభాలు కట్టుకునే వారికి తప్పా ఎవరికీ ఏమీ మిగలకున్నది. ఏవో మోసపు మాటలు చెప్పి ఇతరుల వద్ద గల ధనమును దోచేవారికి తప్ప నిజముగా కష్టపడేవారికి రోజు గడియకున్నది.” అంటారు. 75 ఏళ్ళ తరువాత కూడా ఈనాటికీ ఇది కొనసాగుతోంది.

మనిషి + ప్రకృతి = సంస్కృతి

ఈ రోజు సంస్కృతి గురించి మాట్లాడుకునేప్పుడు ప్రకృతి గురించి కచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకంటే, ” సంస్కృతి ని కేవలం మనుషులు రూపొందించి కాపాడి అభివృద్ధి చేయలేరు. మనిషి, ప్రకృతి కలయికతోనే సంస్కృతి పుడుతుంది. రూపుదిద్దుకుంటుంది…నిజమైన సంస్కృతి ప్రకృతి లో పుట్టి స్వచ్ఛందంగా సీదాసాదాగా , అణుకువగా ఉంటుంది ” అంటారు గడ్డిపరకతో విప్లవం రచయిత, వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక ఒక జీవన విధానంగా ప్రచారం చేసిన మసనోబు ఫకువోకా. “ప్రకృతి ని కూడా జయించగలిగిన మానవుడు తన ప్రవృత్తిని మాత్రం జయించలేకపోయాడ” ని నార్ల అన్నది బహుశా అందుకేనేమో.

1959 లో క్యూబా విప్లవం తర్వాత ఆ దేశం పారిశ్రామికీకరణకి పెద్దపీట వేసింది. కానీ 90వ దశకంలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత క్యూబా దేశంలోని ఇంధన వనరులన్నీ ఇంకిపోయాయ్. దేశం మొత్తం సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో వాళ్ళు ప్రత్యామ్నాయ జీవన ప్రమాణాల పై దృష్టి సారించారు. దాన్నొక నిత్యజీవిత సంస్కృతిగా పాటించారు. అందులో భాగంగానే ప్రజా రవాణా వ్యవస్థనీ, రసాయన రహిత వ్యవసాయాన్ని, నిరాడంబర జీవితాన్ని అలవర్చుకున్నారు. అద్బుతమైన మార్పు సాధించారు. అదేమీ ఒక్క రోజులో సాధ్యమవలేదు. ఐనా, వాళ్ళు నిరుత్సాహ పడలేదు. పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, నీలి విప్లవం, సాంకేతిక విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసే వర్దమాన దేశాలు పనిగట్టుకొని అధ్యయనం చేయాల్సిన పురోగతిని క్యూబా సాధించింది. ఇంకా ఆసక్తి ఉన్న మిత్రులు “Cuba Without Isms” అనే పదిహేను పేజీల కరపత్రాన్నీ, The Power Of Community: How Cuba Survived Peakoil’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఉచితంగా అంతర్జాలంలో చూడవచ్చు. పెట్రోల్ డీజిక్ గ్యాస్ రేట్లు రోజుకో రకంగా పెరుగుతున్నాయని అనుకునేవారు తప్పనిసరిగా peak oil గురించి అధ్యయనం చేసి తీరాలి. ఇదేదో కమ్యూనిస్టు పార్టీ లకి సంబంధించిన అంశం కాదు. ఈ రోజు మనిషనబడే ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గది.

నిజమైన ఆధునికత ఏది?

ఇక్కడే విజ్ఞాన శాస్త్రం అంటే, సైన్సు గురించి కూడా ప్రస్తావించాలి. సైన్సు ప్రకృతి కీ, మానవ మనుగడకీ విరుద్దం కాదు. “సైన్సు ఫలితాల లక్ష్యం సత్యాన్వేషణ మాత్రమే కాదు, సమాజ అభ్యుదయం కూడా…” అని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభల్ని ప్రారంభిస్తూ నాటి ప్రధాని నెహ్రూ అన్న మాటలివి. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా మారిందంటే స్వయంగా ప్రధానే సైన్సు అంతా ఎన్నడో మా పురాణాలలో ఉందని సైన్స్ సభల్లో చెబుతూంటే, అంతమంది శాస్త్రవేత్తలు కిక్కురుమనకుండా వింటున్నారు. కనీసం ప్రశ్నించే పరిస్థితి లేదు. “నిర్భయత్వం నిండిన అంతరంగమే నిజమైన ఆధునికత” ( True Modernism is Fearlessness of Consciousness ” అని జె. ఎన్. యు కవి విద్రోహి పదేపదే అన్నది అందుకేనేమో మరి. సైన్స్ కీ, సంస్కృతికీ ఉన్న సంబంధాల్ని మరింత పటిష్ఠం చేసుకోవడం కూడా ఈ రోజు అవసరం. సైంటిఫిక్ కల్చర్ ని వృద్ది చేసుకోవాలి మనం. అందులో భాగంగా ప్రకృతిని పరిరక్షించడం అంటే సాంకేతికతని క్రమబద్దీకరించుకోవడం అని గుర్తించాలి. ఎన్నో సంఘర్షణల తర్వాత నేటి ఈ రూపంలో ఉన్న నాగరిక మానవుడ్ని మళ్ళీ రాతి యగానికి తీసికెళ్ళడం సబబు కాదు. కానీ, Capitalism  కీ Robotism కీ భిన్నంగా Humanism కోసం ప్రయత్నించాలి. ఈ రోజు సమాజంలో స్త్రీ లకి, పీడితులకీ శాస్త్ర సాంకేతికత కారణంగా అందుబాటులోకి వచ్చిన సౌలభ్యాలను నిరాకరించడం అమానవీయమే కాని ఆధునికత కాదు. కాబట్డి ఏ దృక్కోణంతో సైన్సు ఫలితాలను చూడాలనేది ప్రధానం.

సాలరీ అంటే ఉప్పు!

వ్యక్తి వికాసం సంస్కారం అయితే, ఒక జాతి లేదా సమూహం వికాసం చెందే రీతిని లేదా విధానాన్ని స్థూలంగా సంస్కృతి అనచ్చు.

సరిగ్గా 141 ఏళ్ళ క్రితం జన్మించి 61 ఏళ్ళ క్రితం మరణించిన సంఘ సంస్కరణోద్యమకారుడు, బాల సాహిత్య బ్రహ్మ నాళం కృష్ణారావు గారు మొట్టమొదటి సచిత్ర పత్రికగా తెలుగులో “మానవసేవ” అనే పత్రిక స్థాపించారు. కందుకూరి వీరేశలింగం కంటే ముందే జంధ్యాన్ని విసిరికొట్టి కులతత్వం పై తిరుగుబాటు చేసారు. స్వాతంత్ర్యోద్యమం మొదలు ఎన్నో రకాల సాంఘిక పరివర్తనలకి సజీవ సాక్ష్యంగా నిలిచిన రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయాన్ని తన 17 వ ఏట స్థాపించింది కూడా ఆయనే. వితంతు వివాహ చరిత్ర మొదలుకొని ఎన్నో గ్రంథాలు రాసిన ఆయన మహాత్ముడ్ని విష్ణవతారాలతో పోలుస్తూ  “గాంధీ మహాత్ముని దశావతారాలు” అనే పుస్తకం రాసారు. ప్రభుత్వం దానిని నిషేధించింది. అందులో ఉప్పు సత్యాగ్రహం గురించి చెబుతూ ఉప్పు చరిత్ర గురించి ఎంత లోతుగా శోధించారంటె, “రోమనులు నౌకర్లకు, సైనికులకు ఉప్పు రూపంలో జీతములిచ్చు చుండిరి. ఆ జీతమునకు వారి భాషలో ‘Salary’ అని పేరు. సాలరీ లాటిన్ పదం salt అనే ఇంగ్లీషు పద వ్యుత్పత్తిగా వచ్చింది…” అంటారు. ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ సమావేశం జరుగుతున్న ఈ నాళం వారి సత్రం కూడా తర్వాత కాలంలో ఏ రూపేణా మారినప్పటికీ మొదట్లో ఒక సాంస్కృతిక మర్పు కోసమే స్థాపించబడిందని గుర్తించాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే నాళం కృష్ణారావు గారు ఈ మండపేట వాస్తవ్యుడు. మరుగునపడ్డ అలాంటి వార్ని స్మరించుకోవడం నేటి అవసరం.

అంబేడ్కర్ పేరుకు అభ్యంతరమా?

ఏ దేశంలోనైనా ఒక ప్రాంతానికి ఆ దేశ రాజ్యాంగ నిర్మాత పేరు పెడితే ఆనందోత్సవాలు జరుపుకుంటారు. కానీ ఇక్కడ మన జిల్లాలో విధ్వంసం చేసారు. అంతేకాదు అంబేద్కర్ బొమ్మల్ని వాడి పారేసే ప్లేట్ల పై ముద్రించి మొత్తం దేశ సంస్కృతిని కించపరిచారు. ఇక్కడ వివక్షే ఒక బలమైన సాంస్కృతిక సాధనం. ఏ సాంస్కృతిక వికాసానికైనా ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి. 1. వికసిత స్వభావం 2.విస్తృత దృక్పథం 3. విభిన్నతని స్వాగతించే గుణం. అలాంటి మానవీయ సంస్కృతిని నిర్మించడంలో భాగంగానే డా. బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారు. అందుకే నిరుపయోగమైన రాజ్యాంగాన్ని తగల బెట్టడంలో తానే ముందుంటానని ధైర్యంగా ప్రకంటించగలిగారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఈ రోజు భారతీయులుగా మనందరికీ రాజ్యాంగం ఒక దిక్సూచి. ముందు ఆ రాజ్యాంగ సంస్కృతిని కాపాడుకోవాలి. ప్రజాతంత్ర విధానాన్ని ఒక సంస్కృతి గా మలుచుకోవాలి.

మత సంస్కృతికీ, యంత్ర సంస్కృతికీ భిన్నంగా మానవ సంస్కృతిని పెంపొందించుకోవాలి.

మొక్కల్నీ, పిల్లల్నీ సవ్యంగా పెంచాలి

ఈ దేశ సాంస్కృతిక వికాసం కొరకు సరిగ్గా 75 ఏళ్ళ క్రితం డెహ్రాడూన్ లో “ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్” స్తాపిస్తూ  యం. యన్. రాయ్, ఆ సంస్థ లక్ష్యం, “Educate the Educators” అంటాడు. ఈ రోజు ఆ దృష్టి కోణం అవసరం. ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని గురించి చెబుతూ మనం చేయదగ్గ రెండు విప్లవాత్మక పనులున్నాయని మనమంతా గుర్తించాలి. అవి, 1. మొక్కలు పెంచడం 2. పిల్లల్ని పెంచడం ఈ రెండూ సవ్యంగా చేసిన ఏ వ్యవస్థ లో నైనా మార్పు సాధ్యమే. ఇదంతా అనుకున్నంత సులభం కాదు, కానీ మనకిక మార్గాంతరం లేదు. ఆసక్తి ఉన్న మిత్రులు సాంస్కృతిక వికాసోద్యమంలో భాగంగా రాజకీయ పక్షాలకీ, ఇతరేతర ముద్రలకి భిన్నంగా కొద్ది మంది మిత్రులుగా మేం చేస్తున్న కొద్దిపాటి ప్రయత్నాల్లో భాగం కావాలని అనుకుంటే అందుకు ఇదే వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలా ఒక మంచి సంస్కృతిలో భాగమే ఈనాటి ఈ సమావేశం కూడా అని తెలుపుతూ సమయాభావం వల్ల ఇక్కడికి ఆపుతున్నాను. ధన్యవాదాలు.

– గౌరవ్, సామాజిక కార్యకర్త

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles