Thursday, March 28, 2024

రావణుడికి మారీచుడి హితబోధ

రామాయణం 72

‘‘నేను ఆపదలో ఉన్నాను నన్ను గట్టెక్కించు తండ్రీ. నాకు కష్టాలు వచ్చినప్పుడు నీవే కదా దిక్కు నాకు. వాడెవడో రాముడట,  జనస్థానములో మునులకు భీతి గొల్పుతూ నిర్భయముగా సంచరించే నా వాళ్ళను పదునాల్గు వేలమందిని ఖర, దూషణ, త్రిశిరులతో సహా ఒక్కడే హతమార్చాడు.  వాడు తన కోపాన్నంతా తన ధనుస్సుపై ఆవాహన చేసి పాదచారిగా ఉండి  వాడి వాడిగా వాడి బాణాలు ప్రయోగించి ఒక్కడినీ వదిలి పెట్టకుండా మన వారందరినీ చంపి వేసి ఋషులు భయములేకుండా తిరిగేటట్లు చేశాడు ఆ దుర్మార్గుడు.

Also read: సీతాపహరణానికి రావణుడిని ప్రేరేపించి పంపిన శూర్ఫణఖ

‘‘ఆ రాముడు అధర్మవర్తనుడు. కఠినుడు. లుబ్దుడు. చెడ్డవాడు. ప్రాణుల కీడు కోరేవాడు. ఇంద్రియలోలుడు. తండ్రి కోపించి వెళ్ళగొడితే భార్యను తీసుకొని, తమ్ముడితో కూడి కట్టుబట్టలతో అడవిలో సంచరిస్తున్నాడు. దరిద్రుడు వాడు. మన శూర్పణఖను ఏ కారణము లేకుండా వికృతరూపను చేసినాడు. దాని ముక్కుచెవులు నిష్కారణముగా కోసివేసినాడు. వాడికి ప్రతీకారము చేయవలె. వాడి భార్య సీతను బలాత్కారముగా వాడినుండి దూరము చేయవలె. ఆ సీతను ఎత్తుకొని రావాలనుకుంటున్నాను. అందుకు నీ సహాయము కావలె నాకు’’ అని అడిగాడు రావణుడు మారీచుడిని.

‘‘నీవు మాయారూపాలు ధరించడములో ప్రవీణుడవు కావున వెండి చుక్కలతో బంగారు రంగుతో మెరిసిపోయే లేడి రూపాన్ని ధరించు. వారి ఆశ్రమ పరిసరాలలో సంచరించు. అందముగా ముచ్చటగొలిపే నిన్ను చూసి సీత మోహములో పడి నిన్ను పట్టి తెమ్మని అన్నదమ్ములను పంపిస్తుంది. వారిని నీవు దూరముగా తీసుకొని వెళ్ళిన తరువాత నేను ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోతాను. భార్య లేని రాముడు మనోవేదనతో కుంగిపోతాడు అప్పుడు చాలా సులువుగా అతనిని నేను కొట్టగలను’’ అని తన మనసులోని ప్రణాళిక బయట పెట్టాడు.

Also read: రావణాసురిడిని తూలనాడిన శూర్పణఖ

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మారీచుడు!

రాముడి పేరు వినబడగానే ఆతని ముఖము వాడిపోయింది. భయముతో గజగజ వణికి పోయాడు. ముఖములో కళతప్పి చనిపోయినవాడిలాగా అయిపోయాడు.  ఎండిపోయిన పెదవులను నాకుతూ దీనముగా ప్రాణం లేని చూపు చూశాడు రావణుని.

‘‘రావణా, నీకు ఎవరు చెప్పారు రాముడి జోలికి వెళ్ళమని? నీ గూఢచార వ్యవస్థ సక్రమముగా పనిచేస్తున్నదా? లేదు, పని చేయడము లేదు. అందుకే నీవు సద్గుణాలప్రోవు, వీరాధివీరుడు అయిన రాముని గూర్చి అనరాని మాటలంటున్నావు. రావణా, ముల్లోకాలలో ఉన్న రాక్షసులకు ఎదో కీడు మూడేటట్లే ఉన్నది. సీతాదేవి నీ చావుకోసమే పుట్టినట్లున్నది. ఆవిడ మూలాన నాకు కూడా మరణము సంభవించ వచ్చునేమో!

Also read: సీతను రావణుడు అపహరించాలని అకంపనుడి వ్యూహం

‘‘హాయిగా, స్వేచ్చగా, నిరంకుశముగా ఇప్పటిదాకా రాజ్యపాలన చేస్తున్నావు. రాక్షసుల సుఖ సంతోషాలు, లంకాపట్టణము నీ యీ చర్య వలన నశిస్తాయేమో అని అనుమానముగా ఉన్నది. నీవు అనుకున్నట్లుగా కౌసల్యా నందనుడు దుష్టుడు, దురాత్ముడు, కఠినుడు, అపండితుడు, ఇంద్రియలోలుడు  కాదు. ఆయన తన తండ్రిని కైకేయి మోసము చేయటము చూసి తండ్రిని సత్యవాదిని చేయటము కోసము తన అంత తానుగా అరణ్యానికి వచ్చాడు. ఆయన సకల భూత మనోహరుడు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః

రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ

‘‘రాముడుమూర్తీభవించినధర్మము. సత్పురుషుడు. సత్యమైన పరాక్రమము కలవాడు. దేవతలకు దేవేంద్రుడు వలెనె సర్వలోకములకు ప్రభువు. సీతమ్మ రాముడి రక్షణలో ఉన్నది. సూర్యుడినుండి ఆయన కాంతిని ఎవరైనా అపహరించగలరా? రాముడు ప్రజ్వరిల్లుతున్న నిప్పు. ఆయన బాణాలు ఎగసే అగ్నికణాలు. తెలిసి, తెలిసి ఆ మంటలలో దూకి బూడిద కావద్దు.

Also read: ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు

‘‘సీతాదేవి రాముడికి ప్రాణము. ఆవిడ ఎల్లప్పుడూ ఆయననే అనుసరించే వ్రతము కలది. ఆవిడ మరొక అగ్నిజ్వాల! వ్యర్ధమయ్యే ఈ పనిలోకి ఎందుకు ప్రవేశిస్తావు. రాముడి తేజస్సు ఇంత అని చెప్పటానికి సాధ్యము కాదు. రాముడు ఏనాడైతే రణరంగములో నిన్ను చూస్తాడో ఆనాడే నీకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి. రాముడి కన్ను పడనంతవరకే నీ బ్రతుకు. హాయిగా పదికాలాలు రాజ్యము చేయాలని అనుకొంటే ఈ పిచ్చి ఆలోచన మానుకో. వెళ్లి విభీషణాదులతో చర్చించి నీ బలమెంతో, రాముని బలమెంతో సరిగా అంచనా వేసుకొని నీ కేది హితమో ఆ పని చెయ్యి’’ అని మారీచుడు స్పష్టముగా రావణునికి హిత బోధ చేశాడు.

ఇంకా రాముడి పరాక్రమము గురించి తన అనుభవము చెప్పసాగాడు.

Also read: పెద్ద సేనతో రాముడిపై యుద్ధానికి బయలుదేరిన ఖరుడు

వూటుకూరుజానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles