Wednesday, December 8, 2021

ఉపాధ్యాయ వృత్తిలో నుంచి విప్లవోద్యమంలోకి…

  • పోరాటయోధుడిని పట్టి పల్లార్చిన అనారోగ్యం
  • ఆర్కే జీవితమంతా పోరాటమయం
  • పలుసార్లు పోలీసు వలయం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటడిన విప్లవకారుడు
  • కళ్ళెదుటే కుమారుడు పోలీసులతో పోరాడుతూ మరణించాడు
  • మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వ స్థాయికి ఎదిగిన ఆర్కే

మావోయిస్టు నాయకుడు రామకృష్ణ వల్ద్ హరగోపాల్ వల్ద్ ఆర్కే ఆరోగ్యం కొన్ని సంవత్సరాలుగా బాగుండటం లేదు. మధుమేహం చాలా ఎక్కువస్థాయిలో ఉంది. కీళ్ళనొప్పులతో బాధపడుతూ ఉండేవారు. దీనికి తోడు మూత్రపిండం వ్యాధి. అడవులలో జీవితం వల్ల, ఒక పద్దతిలో ఆహారనిద్రలు ఉండవు కనుక అజ్ఞాతవాసంలో, ముఖ్యంగా అడవులలో ఉంటూ పోరాడుతున్నవారికి ఇటువంటి వ్యాధులు ఎక్కువే. అక్కడే పుట్టి అక్కడే పెరిగినవారి కంటే మైదానంలో పుట్టి అడవిలో నివసించేవారికి ఆరోగ్య సమస్యలు అధికం. వీటన్నికి తోడు మూడేళ్ళ కిందట ఎముక క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్లు చెప్పారు. ఇన్ని సమస్యల వల్ల 60 ఏళ్ళ ఆర్కే ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో బుధవారంనాడు కన్నుమూశారు.

గుంటూరు జిల్లా రెంట చింతల మండలం తుమృకోటలో రాజ్యలక్ష్మికీ, సచ్చిదానందరావుకీ జన్మించిన ఆర్కేకు అయిదుగురు తోబుట్టువులు. ఆర్కే ఈ తరానికి పెద్ద. తండ్రి హైదరాబాద్ రాజేంద్రనగర్ లో స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. ఆయనకూ విప్లవ భావాలు ఉండేవి. ఆర్కే ఇదే పాఠశాలలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1980 దశకంలో సచ్చిదానందరావు సకుటుంబంగా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆర్కే విద్యాభ్యాసం పల్నాడులోనే సాగింది. తమృకోటలోనే ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదివారు.  మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో ఇంటర్,  డిగ్రీ చదువుకున్నారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో క్రియాశీలక సభ్యుడు. పీపుల్స్ వార్ నాయకులతో పరిచయం కలిగింది. డిగ్రీ పూర్తయిన తర్వాత  గుత్తికొండలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు. మొదటి నుంచీ అధ్యయనశీలి. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఎదుగుతున్న పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో 1983లో చేరారు. అంతవరకూ చేస్తున్న ఉపాధ్యాయవృత్తికి స్వస్తి చెప్పారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. నల్లమల అడవులలో ఎక్కువ కాలం పని చేశారు. గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శిగా, 1996 నుంచి 2006 వరకూ ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా పని చేశారు.. 2008 నుంచి 2016 వరకూ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడుగా మరో మెట్టు ఎక్కారు. ఆ దశలోనే మావోయిస్టు ఉద్యమంలో పెద్ద నాయకులను పార్టీ కోల్పోయింది. కిషన్ జీ పశ్చిమ బెంగాల్ లోని జంగల్ మహల్ లో 2011లో మరణించారు. ఆయన సోదరుడు వేణుగోపాల్ కొంతకాలం నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. అబూజ్ మడ్ లో మావోయిస్టు నాయకులంతా సమావేశమై మేథోమథనం జరిపారు. సెంట్రల్ రీజియనల్ కమిటీ సభ్యుడుగా కూడా ఆర్ కె కొంతకాలంపాటు పని చేశారు.

ఆర్కే, వరవరరావు

ఉద్యమంలో ఉండగానే కందుల నిర్మల వల్ద్ శిరీష వల్ద్ శారద వల్ద్  పద్మను ఆర్కే పెళ్ళిచేసుకున్నారు. ఆమె డివిజన్ సభ్యురాలుగా ఉండేవారు. వారి కుమారుడు శివాజీ వల్ద్ మున్నా. ఉపాధ్యాయుడి పాత్రను కొనసాగిస్తూ ఉద్యమంలో చేరినవారికి శిక్షణ ఇచ్చేందుకు ఆర్కే  ప్రాధాన్యం ఇచ్చేవారు. సాయుథ చర్యలలో పాల్గొంటూనే సైద్ధాంతిక భూమికను కూడా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో ఆయనపై అలిపిరి దగ్గర జరిగిన దాడిలో పాల్గొన్నట్టు ఆర్కేపై కేసు ఉంది. బలిమెలలో గ్రేహౌండ్ దళాలపై దాడి కేసు కూడా ఆర్కేపై ఉన్న అనేక కేసుల్లో ఒకటి. ఆర్కేను పట్టిచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 12 లక్షలు, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ. 40 లక్షలు, ఒడిశా సర్కార్ రూ. 20 లక్షలు రివార్డు ప్రకటించాయి. ఇంత నిఘా ఉన్నప్పటికీ మూడు సార్లు రహస్యంగా హైదరాబాద్ వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకొని వారితో కొంత సేపు గడిపి తిరిగి అడవులకు వెళ్ళారు. తల్లిదండ్రులూ, తోబుట్టువులూ అంటే ప్రేమ ఎక్కువ. ఇద్దరు సోదరులు నైజీరియాలో ఉన్నారు. రాధేశ్యాం, సుబ్బారావు హైదరాబాద్ లో ఉన్నారు. సోదరి ఎల్ బి నగర్ లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు.

కేంద్ర కమిటీ సభ్యుడిగా నియుక్తుడైన తర్వాత ఆర్కే ఆరోగ్యం దెబ్బతిన్నది. కామ్రేడ్లు ఆయనను మంచంమీద పడుకోపెట్టుకొని సమావేశాలకు తీసుకువెళ్ళిన సందర్భాలు సైతం ఉన్నాయి. శాంతి చర్చలకోసం 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు దిల్ ఖుషా అతిథిగృహంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. నల్లమల అడవుల నుంచి బయటికి వచ్చినప్పుడ సాదరంగా స్వాగతం చెప్పిన పోలీసులే చర్చలు విఫలమైన తర్వాత రెండు వారాలలోనే చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో ఆర్కేపైన దాడి చేశారు. గ్రేహౌండ్స్ దళాల దాడి గురించి సమాచారం అందగానే విరసం నాయకుడు వరవరరావు, ఇతర ప్రజాసంఘాల నాయకులు నాటి హోంమంత్రి జానారెడ్డిని కలుసుకొని ఆర్కేకి అపకారం తలపెట్టవద్దని చెప్పారు. ఆ విధంగా ఆర్కేను మిత్రులు రక్షించుకున్నారు.

కొడుకు శివాజీ అలియాస్ మున్నా పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన సందర్భంగా విషణ్ణ వదనంతో మున్నా తల్లి, ఆర్కే భార్య శిరీష

శాంతి చర్చల సందర్భంగా సినియర్ ఎడిటర్లతోనూ, రిపోర్టర్లతోనూ కలివిడిగా మెసలిన ఆర్కే అనేక విషయాలు వారితో పంచుకున్నారు. మంజీర అతిథి గృహంలో మూడు రోజులు బస చేసిన ఆర్కే వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారు. తాము ఎందుకోసం, ఎవరికోసం పోరాడుతున్నదీ వివరించారు. తాను పేదల పక్షాన అంకితభావంతో ఏ విధంగా పోరాటం సలుపుతున్నదీ చెప్పారు. తన బాల్యం గురించి, కాలేజీ రోజుల గురించీ, పీపుల్స్ వార్ లో చేరడం గురించి తన విప్లవ యాత్ర గురించి జర్నలిస్టులతో వివరంగా చెప్పారు. ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావించి చాలా సంఘాలు మహజర్లు సమర్పించాయి. తమ గోడు వినిపించాయి. తమను ఆదుకోవలసిందిగా అభ్యర్థించాయి. నాటి చర్చల వైఫల్యం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకర్ కోలుకోకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీలో మరో ముఖ్యులు, సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కూడా చాలా సందర్భాలలో చర్చల ప్రస్తావన తెచ్చేవారు. తాను, ఇతర మిత్రులు నల్లమల అడవులలోకి వెళ్ళి ఆర్కేతో చర్చలు జరిపి ప్రభుత్వంతో శాంతి చర్చలకు ఎట్లా ఒప్పించిందీ వివరించేవారు. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా శాంతి చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు వివరంగా మాట్లాడేవారు. అందరినీ ఆర్కే తన వ్యవహరణ తీరుతో ఆకట్టుకున్నారు. అసలు నక్సలైట్ తో కానీ మావోయిస్టులతో కానీ ప్రభుత్వం చర్చలు జరపడమే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రప్రథమం. అంతకు ముందు లేదు. ఆ తర్వాత గడచిన 17 సంవత్సరాలలో చర్చల ప్రస్తావనే లేదు. భవిష్యత్తులో ఉండే అవకాశం కూడా లేదు. మావోయిస్టుల బలం కూడా క్షీణించింది. ఛత్తీస్ గఢ్, ఏఓబీకి ఎక్కువగా పరిమితమైంది.

అన్నట్టు మంజీర అతిథి గృహంలో నక్సలైట్ నాయకులు బస చేసిన రోజుల్లోనే పీపుల్స్ వార్, జనశక్తి విలీనమై మావోయిస్టు పార్టీ వెలిసింది. జనశక్తి నేత అమర్ మూడు రోజుల పాటు ఆర్కేతోనే ఉన్నారు. పదకొండు అంశాల ఎజెండాతో నక్సలైట్లు చర్చలకు వచ్చారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూములను పేదలకు పంచాలన్నది వారి మొదటి డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించాలన్నది మరో డిమాండ్. ఆర్కే తోడల్లుడు, ప్రముఖ రచయిత, విరసం నాయకుడు కల్యాణ్ రావు ఈ వార్త తెలిసిన వెంటనే ఆర్కే భార్య శిరీష ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరపాడులో వారు ఉంటున్నారు.

23 అక్టోబర్ 2016 నాడు ఒక సమావేశం జరుపుకుంటున్న మావోయిస్టులపైన గ్రేహౌండ్ దళాలు మాటు వేసి దాడి చేశాయి. అప్పటికే ఆర్కే ఆరోగ్యం దెబ్బతిన్నది. కుంటుకుంటూ నడుస్తున్నారు. ఆయన అక్కడే ఉన్నారు. సహచరుల సహకారంతో బతికి బయటపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లోనే ఆర్కే కుమారుడు శివాజీ వల్ద్ పృథ్వీ వల్ద్ మున్నా మరణించాడు. 2010 నుంచి సాయుధ పోరాటంలో ఉండిన శివాజీ పోరాడుతూనే తుది శ్వాస విడిచాడు. పోరాటంలో అనేక సందర్భాలలో పోలీసు వలలో చిక్కనట్టే చిక్కి బయటపడిన ఆర్కే అనారోగ్యంతో మరణించారు.

Previous articleమజిలీ
Next articleశివోహం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles