Monday, November 28, 2022

మమతా, పీకే రాజకీయ విన్యాసాలు

  • కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావడం సాధ్యమా?
  • తృణమూల్ కాంగ్రెస్ తక్షణం జాతీయ పక్షం కాగలదా?
  • మమత, కేజ్రీవాల్ మోదీ విజయానికి సోపానాలు అవుతారా?
  • కాంగ్రెస్ పైన కక్షకట్టిన పీకే

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. రాజకీయాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు ఆశించే అధికారం ఉంది. మూడో సారి ముఖ్యమంత్రిగా ఘనవిజయం సాధించిన మమతాబెనర్జీ ప్రధాని కావాలని కోరుకోవడం సహజమే. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా తన వంతు ప్రయత్నం చేయాలని ఆమె సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇటీవల మూడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ముంబయ్ వెళ్ళి రెండు రోజులు గడిపి వచ్చారు. అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవాత్ తోనూ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేతోనూ సమాలోచనలు జరిపారు. ఆ రెండు పార్టీలూ కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం నడిపిస్తున్నాయి.

శరద్ పవార్ ని కలుసుకున్న తర్వాతనే విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘‘యూపీఏ ఎక్కుడుంది? అది ఎప్పుడో పోయింది,’’ అంటూ మమత పొగరుగా వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీని ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఎదిరించి పోరాడితే బాగుంటుంది. కానీ ఒక పార్టీ (కాంగ్రెస్)పోరాటానికి సిద్ధంగా లేకపోతే ఏం చేస్తాం?’’ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడారు. ‘‘ఎప్పుడూ విదేశాలలో పర్యటించేవారు ఏమి నాయకత్వం వహిస్తారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. శరద్ పవార్ జాగ్రత్తగా మాట్లాడారు. ప్రతిపక్షాల సమైక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ మమతకు సమాధానం చెప్పారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ పైన పోరాటం అసాధ్యమంటూ స్పష్టం చేశారు.

పీకే, మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ విజయమే స్ఫూర్తి

పశ్చిమబెంగాల్ లో 2021 ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు కరోనాను సైతం ఖాతరు చేయకుండా, కరోనా నివారణ చర్యలను పట్టించుకోకుండా  అత్యధిక సమయం వెచ్చింది విపరీతంగా ప్రచారం చేసినప్పటికీ లోగడ జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కంటే ఎక్కువ స్థానాలూ, ఓట్లూ తృణమూల్ కాంగ్రెస్ సాధించింది. అటువంటి పార్టీ అధినేత ఆత్మవిశ్వాసం కొండంత ఎత్తుకు పెరగడాన్ని అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ప్రశాంత్ కిశోర్ అనే ఎన్నికల ప్రవీణుడు ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో, పశ్చిమబెంగాల్ లో, తమిళనాడులో ఘనవిజయాలు సాధించి మంచి ఊపుమీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం నిరాకరించడంతో అతని అహం దెబ్బతిన్నది. కాంగ్రెస్ పార్టీకి మున్తియార్నామా (సర్వహక్కులూ దఖలు పరిచే అంగీకారపత్రం)రాసి ఇవ్వాలని ఆయన నేరుగా సోనియాగాంధీకీ, రాహుల్ కీ, ప్రియాంకకీ చెప్పారు. పార్టీ తన చేతిలో పెడితే, దానికి కాయకల్ప చికిత్స చేసి, పోరాటానికి సంసిద్ధం చేస్తాననీ, 2024లో విజయం సాధించి పెట్టేందుకు కృషి చేస్తాననీ చెప్పారు. పూర్తి స్వేచ్ఛ కావాలనీ, తాను చెప్పినట్టు గాంధీ కుటుంబ సభ్యులు కూడా చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Also read: భారత ఎన్నికల వ్యవస్థ నిర్మాణంలో అంబేడ్కర్ అసాధారణ పాత్ర

ప్రశాంత్ కిశోర్ (పీకే)కి కాంగ్రెస్ అంటే పెద్ద గౌరవం లేదు. గాంధీ కుటుంబ సభ్యులన్నా లెక్క లేదు. కానీ కాంగ్రెస్  కి దేశంలో 20 శాతం ఓట్లు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ. అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు లేవు. దేశంలోని దాదాపు 200 లోక్ సభ స్థానాలలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది కనుక స్ట్రైకింగ్ రేటు (పోటీ చేసిన స్థానాలలో గెలుపొందేవి ఎన్నని రేటు లెక్కిస్తే) ఆ 200 నియోజకవర్గాలలోనే బీజేపీకి ఎక్కువ. తక్కిన స్థానాలలో ప్రాతీయ పార్టీలు గట్టిగా ప్రతిఘటిస్తాయి. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె, యూపీలో సమాజ్ వాదీపార్టీ, బీహార్ లో ఆర్ జేడీ, మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు గట్టిగా నిలబడి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నచోట్ల (దుబ్బాక,హుజూరాబాద్) టీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. అదే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలుపొందింది.

కాంగ్రెస్ దుర్బలంగా ఉన్నదనే మాట వాస్తవమే

కాంగ్రెస్ ను పటిష్ఠం చేయవలసిన అవసరం ఉన్నదనే మాట వాస్తవం. కాంగ్రెస్ ను ఎవరికో ఒకరికి అప్పజెప్పే ఉద్దేశం కానీ, బాడుగకు ఇచ్చే ఉద్దేశం కానీ సోనియాగాంధీకి కానీ ఆమె సంతానానికి కానీ లేదు. రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ముందు పీటీలో నిలబెట్టాలనీ, ఆయన నాయకత్వంలోనే 2024 ఎన్నికలలో పోరాడాలనీ, వీలైతే ఇతర ప్రతిపక్షాలతో కలిసి యూపీఏ-3 నిర్మాణం చేయాలనీ, ఈ సారి ఏ మన్మోహన్ సింగ్ వంటి వ్యక్తినో కాకుండా రాహుల్ గాంధీనే ప్రధానిగా గద్దెనెక్కించాలన్నది సోనియా స్వప్నం. ఎప్పటికైనా బీజేపీ బదనాం అయితే, బలహీనపడితే ప్రజలకు కాంగ్రెస్ మినహా మరో జాతీయ పార్టీలేదనే ధీమా వారిది. ఇది నిజం కూడా. కాంగ్రెస్ తప్ప బీజేపీని ఎదిరించే జాతీయ పార్టీ మరొకటి లేదు. 2024లోపు తృణమూల్ కాంగ్రెస్ కానీ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కానీ జాతీయ పార్టీగా అవతరించే అవకాశం లేదు. గోవా, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ వాదులను పార్టీ ఫిరాయింపజేయడంలో పీకే విజయం సాధించవచ్చును కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని చీల్చి తృణమూల్ పార్టీని బలోపేతం చేయడం పీకే వంటి కేవలం ఎన్నికల ప్రవీణుడి వల్ల కాగల కార్యం కాదు. అదే విధంగా మమతా బెనర్జీలాగానే, లేదా మమత కంటే ముందునుంచే ప్రధాని పీఠం పైన కన్ను వేసిన అరవింద్ కేజ్రీవాల్ కూడా 2024లోపు జాతీయ పార్టీగా తన పార్టీని మార్చే అవకాశం లేదు. కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం కాకుండా స్వంత ఎజెండాతో, దిల్లీలో తన ప్రభుత్వ పనితీరు చూపించి తన పార్టీని విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. విద్య, ఆరోగ్య రంగాలలో దిల్లీ ప్రభుత్వం సాధించిన విజయాలే ఎజెండాగా ఆయన సకారాత్మకంగా ముందుకు పోతున్నారు. పంజాబ్ లో ఆప్ గెలిచినా ఆశ్చర్యం లేదు. గోవాలో పోటీ లో ఉంది. రాజస్థాన్, గుజరాత్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో మెల్లగా విస్తరిస్తోంది. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి అది కాంగ్రెస్ స్థానంలో బీజేపీకి దీటైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశాలు లేవు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే సూచనలు లేవు.  మమతాకో, కేజ్రీవాల్ కో కాంగ్రెస్ ని అప్పగించి ప్రేక్షకపాత్ర వహించే ఉద్దేశం సోనియాగాంధీకి కానీ ఆమె పిల్లలకు కానీ లేదు.  

Also read: పౌరసమాజమే శత్రువు అంటారా దోవల్?

‘‘ప్రతిపక్షాలకు నాయకత్వ పాత్ర కాంగ్రెస్ కు కానీ గాంధీ కుటుంబానికి కానీ దైవదత్తమైనదేమీ కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వ పాత్రకు నాయకులను ఎన్నుకోవాలి,’’ అంటూ పీకే వ్యాఖ్యానించారు. ఏ లెక్కన మమతా బెనర్జీని ప్రతిపక్ష నాయకురాలుగా ఎన్నుకోవాలి? ఏ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఆమె ప్రధాని అభ్యర్థి కాగలుగుతారు? పశ్చిమ బెంగాల్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కారణంగా, ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీకి ఉన్న పేరుప్రతిష్ఠల కారణంగా బీజేపీ దాడిని తిప్పికొట్టగలిగారు. ఆ రాష్ట్రం వెలుపల మమతా బెనర్జీకి ప్రాబల్యం ఉన్నదా? ఉదాహరణకు తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్ లోనో మమతా బెనర్జీ దుకాణం పెడితే జయప్రదం అవుతుందా? కర్ణాటకలో, తమిళనాడులో కుదురుతుందా?అక్కడ పాతుకొని పోయిన ప్రాంతీయ పార్టీలు మమత నాయకత్వాన్ని అంగీకరించాలని ఏముంది?

ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల జోలికి వెళ్ళనంటున్న మమత

మహారాష్ట్ర వంటి రాష్టాలలో ప్రతిపక్షాలే పరిపాలిస్తున్నాయి కనుక వాటి జోలికి వెళ్ళబోమని కూడా మమత అన్నారు. అంటే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా కుంపటి పెట్టగలం కానీ ఆ పని చేయబోము అన్నారు. అటువంటి మమత ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఏమి చేస్తారు? అక్కడ పీకే సాయం పొందిన వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉంది. పీకే చెప్పినట్టు జగన్ మోహన్ రెడ్డి వింటారా? మమతను నాయకురాలుగా అంగీకరించి బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరుతారా? పోనీ, టీడీపీ తృణమూల్ తో కలసి బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరుతుందా? 1995 నుంచీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పని చేసిన నారా చంద్రబాబునాయుడు మమతా బెనర్జీ ప్రధాని అవుతానంటే ఒప్పుకుంటారా? ఆయనైనా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటడానికి సిద్ధంగా ఉన్నారా? 2018లో మోదీ పని అయిపోయిందని పొరపాటు అంచనా వేసుకొని మోదీనీ, ఆయన భార్యనూ అసెంబ్లీలోనూ, బయట సభలలోనూ విమర్శించి, కోల్ కతా, లక్నో వెళ్ళి, అక్కడ బహిరంగ సభలలో మోదీని దుయ్యబట్టి భంగపడిన చంద్రబాబునాయుడు మరోసారి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడగలరా? 2024లో బీజేపీ,జనసేనతో కలిసి పొత్తుపెట్టుకోవాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు మమత ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తారా?

యూపీ వంటి రాష్ట్రంలో మమతా బెనర్జీ చేయగలిగింది ఏమిటి? కాంగ్రెస్, సమాజ్ వాదీని గెలిపించేందకు 2017లో పేకె ప్రయత్నించి దారుణంగా విఫలమైనారు. ‘యూపీకే లడకే’ అంటూ రాహుల్ గాంధీనీ, అఖిలేష్ నీ సంయుక్త సభలలో మాట్లాడించి, రాష్ట్రం అంతటా పర్యటింపజేసి బీజేపీకి ఘనవిజయం అందించిన పీకేకి యూపీ ఫార్ములా అంటూ ఉన్నదా? అఖిలేష్ పీకే మాట వింటారా? మాయావతి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారా?

వైవిధ్యభరితమైన ఇండియాలో ఇది సాధ్యమా?

ఇండియా వంటి విభిన్న ప్రాంతాలూ, సంస్కృతులూ, అభిమతాలుూ, నేపథ్యాలూ కలగలిసిన దేశంలో పశ్చిపబెంగాల్ లోనో, దిల్లీలోనో ఎన్నికలు గెలిచినవారు ప్రధాని పదవిని ఆశించడం దురాశ కాదా? ఒక వేళ మోదీ ప్రాబల్యం తగ్గిపోయి, 2024 ఎన్నికలలో బీజేపీకి 200 స్థానాలకంటే ఎక్కువ రాకపోతే అప్పుడు ప్రతిపక్షాలు ఏకమై యూపీఏ కాకపోతే మరో పేరుతో కూటమి ఏర్పాటు చేయవచ్చు.  ఆ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎవరు ఎన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకుంటారనే దానిపైన ఆధారపడి ఉంటుంది.  మమతా బెనర్జీ, కేజ్రీవల్, శరద్ పవార్ లు ముగ్గురు ప్రధానమంత్రి పదవిని ఆకాంక్షిస్తున్నవారే. ముగ్గురికీ కలిపి కూడా కాంగ్రెస్ కు వచ్చే స్థానాలు రావు. ముగ్గురిలో ఎవరో ఒకరిని ప్రధానిగా నిలబెట్టి బయటి నుంచో, లోపలి నుంచో కాంగ్రెస్ మద్దతు ఇస్తే ఎన్ డీ ఏ కి లేదా యూపీఏకీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ్, గుజ్రాల్ ప్రభుత్వం వంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అది ఎంత కాలం నిలుస్తుందో చరిత్ర తెలిసినవారికి చెప్పనక్కరలేదు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ అయిదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ స్వయంగా ఏర్పాటు చేసినవి (1980, 1984, 1991) లేదా కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు (2004, 2009) లేదా బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ఏన్ డీఏ -1, ఎన్ డీఏ -2, ఎన్ డీఏ-3 ప్రభుత్వాలు (1998, 1999, 2014, 2019). కాంగ్రెస్ కానీ బీజేపీ కాని ఇరుసుగా ఉన్నబండ్లే కొంతకాలం నడుస్తాయన్నది చరిత్ర స్పష్టంగా చెబుతున్న విషయం. చిన్నాచితకా పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు నిలబడలేవు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంటే మురార్జీ, వీపీ సింగ్  ప్రభుత్వాలు పతనమైనాయి. కాంగ్రెస్ మద్దతు వాపసు తీసుకుంటే చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు పడిపోయాయి. ఏడాది దాటి మనగలిగింది మొరార్జీదేశాయ్ ప్రభుత్వం ఒక్కటే. తక్కినవన్నీ నెలల ప్రభుత్వాలే. దేవెగౌడ, గుజ్రాల్ ప్రయోగాలు విఫలమైన తర్వాత వాజపేయి నాయకత్వంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే దేశంలో సుస్థిరత నెలకొన్నది. ఆ తర్వాత యూపీఏ, అనంతరం ఎన్ డీఏ ప్రభుత్వాలు వచ్చాయి కనుక పరిపాలనలో అపసవ్యాలు సంభవించి ఉండవచ్చును కానీ అస్థిరత లేదు. మళ్ళీ మమతా బెనర్జీనో, అరవింద్ కేజ్రీవాల్ నో ముందు పెట్టుకొని ప్రయోగం చేసే అవసరం ఉన్నదా? వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తేగీస్తే అది సుస్థిరంగా ఉంటుందా?

వాస్తవానికి అటువంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. ఇప్పుడు మమత, అరవింద్ ల పోకడల వల్ల ప్రతిపక్షం సమైక్యత సాధించే అవకాశం లేదు. కనుక మరోసారి, మూడో సారి, మోదీ విజయం సంభవమని అనిపిస్తోంది. రాహుల్ గాంధీకి ఏమైన శక్తి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల సంక్రమించిందే. కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడు. గ్రూప్-23గా పేరు తెచ్చుకొని, అధినాయకత్వంతో విభేదించిన సీనియర్ నేతలు సైతం పార్టీలో సంస్కరణలు కావాలనీ, కనిపించి నడిపించే నాయకత్వం కావాలని కోరుకుంటున్నారే కానీ రాహుల్ స్థానంలో వారిలో ఎవరో ఒకరు కూర్చోవాలని అనుకోవడం లేదు. మమతా బెనర్జీ, పీకే లు రాహుల్ గురించి తేలికగా మాట్లాడటానికి ముందే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అధినాయకత్వంపైన ధ్వజమెత్తారు. నాయకత్వం వైఖరి మారాలంటూ ఎలుగెత్తారు.

శరద్ పవార్ రెండు దశాబ్దాల కిందటే ఈ దారిలో  నడిచారు

రెండు దశాబ్దాల కిందటే శరద్ పవార్ ఇప్పుడు మమత చేస్తున్న ప్రయత్నమే చేసి విఫలమైనారు. సహస్రాబ్ది సంధి దశలో సోనియాగాంధీకి వ్యతిరేకంగా పనిచేశారు. సోనియా ఇటలీ దేశస్థురాలనీ, ఇక్కడ రాజకీయాలలో ప్రవేశం లేదనీ, కాంగ్రెస్ వంటి సంస్థను నడపడం ఆమె వల్ల కాదనీ భావించి తానున్నానంటూ బయలు దేరారు.  శరద్ పవార్ మహారాష్ట్రలో బలమైన నాయకుడు కానీ మహారాష్ట్ర వెలుపల కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే లేదా కాంగ్రెస్ సంస్థ లేదా దానికి సమానమైన సంస్థ ఆయన చేతిలో ఉంటే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలరు. కానీ అటువంటి సంస్థాబలం లేనప్పుడు బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ ప్రత్యామ్నాయం కాలేరు. ఈ సంగతి ఆయన 2004కు ముందుగానే గ్రహించి ప్రధాని పదవి పోటీ నుంచి ఐచ్ఛికంగా తప్పుకున్నారు. సోనియాగాంధీ 1998 నుంచీ ఇప్పటి దాకా కాంగ్రెస్ కు ఆ పార్టీ ఆవిర్భవించిన అనంతరం అత్యంత ఎక్కువ కాలం అధ్యక్ష పదవిని నిర్వహించిన నాయకురాలు.  ప్రధాని పదవిని తాను స్వీకరించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా నిలిపి వెనకనుంచి చక్రం తప్పి పరోక్షంగా దేశాన్ని ఏలిన నేతగా ఆమె చరిత్రలోకి ఎక్కారు. మొన్న మమతా బెనర్జీ తనను కలిసినప్పుడు బహుశా పవార్ కి పాత రోజులూ, తాను కిందామీదా పడి ఎదురు దెబ్బలు తిన్న రోజులూ గుర్తుకు వచ్చి ఉంటాయి. తాను సోనియాను సవాలు చేస్తే మమత సోనియా తనయుడు రాహుల్ ని సవాలు చేస్తున్నారు. మమతకు సైతం తనకు ఎదురైన అనుభవమే ఎదురౌతుందనీ,  తన దారికే వస్తుందనీ శరద్ మనసులో అనుకొని ఉంటారు.

మమతాబెనర్జీ ఆత్మవిశ్వాసం

పశ్చిమబెంగాల్ లో విజయం సాధించిన తర్వాత మమత ఒకసారి ప్రధాని పదవికోసం ప్రయత్నం చేయాలని సంకల్పించడం సహజం. ఆమె రాహుల్ కంటే 15 ఏళ్లు పెద్ద. ఇప్పుడామె వయస్సు 66 ఏళ్ళు. స్వశక్తిపైన ఆధారపడి, నిర్విరామంగా పోరాటం చేసి, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకున్నారు. సీపీఎం వంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీని నిర్ద్వంద్వంగా  ఓడించారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలనే విషయంలో ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసం లేకపోయినా పీకే వంటి ఎన్నికల మాంత్రికుడి మాటలు (పాతాలభైరవిలో ‘ధైర్యము సేయరా డింభకా’ అని మాంత్రికుడు చెప్పినట్టు) విశ్వసించడం వల్ల తన మీద తనకు నమ్మకం కలిగి ఉండవచ్చు. కానీ పీకే కాంగ్రెస్ నాయకత్వం తనను తిరస్కరించడం వల్ల క్రోధంతో ఉన్నారు. రాహుల్ గాంధీ పట్ల ద్వేషంలో రగిలిపోతున్నట్టు కనిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ మీద పగబట్టి ఉన్నారు. బీజేపీని వ్యతిరేకించి పోరాడటంలో మమతకు కానీ పీకే కి కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నది. భవిష్యత్తులో కూడా ఉంటుంది. వేరే మార్గం లేదు. ఇప్పటికీ దేశంలోని అగ్రగణ్యులైన రాజకీయ నాయకులందరిలో బీజేపీనీ,ఆర్ఎస్ఎస్ నీ, ప్రధాని మోదీనిీనిశితంగా, నిరవధికంగా విమర్శిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కరే. ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖెరా, గ్రూప్-23కి చెందిన ఆనందశర్మ వ్యాఖ్యానించినట్టు మమత రెండు విడతల వాజపేయి నాయకత్వంలోని ఎన్ డీఏ సర్కార్ లో మంత్రిగా పని చేశారు. ‘‘బీజేపీ సహజ మిత్రపక్షం’’ అంటూ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. పీకే ప్రస్థానం నరేంద్రమోదీని 2014లో గెలిపించడానికి సోషల్ మీడియానూ, తన ఎన్నికల ప్రావీణ్యాన్నీ ప్రయోగించడంతోనే ప్రారంభమైంది. గతం ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు బీజేపీపై కాలుదువ్వుతూ బస్తీమే సవాల్ అంటే ఫరవా లేదు కానీ అందరికంటే తానే నికార్సయిన పోరాటం చేస్తానంటే, ఇతరులెవ్వరూ తనకు సరిరారంటే కుదురుతుందా?

నేలవిడిచి సాము చేస్తున్న పీకే

పీకే అనే ప్రవీణుడు ఐ-ప్యాక్ (ఇండియాన్నేపొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థ పెట్టుకున్నారు. అది స్వచ్ఛంద సంస్థ కాదు. ఫక్తు వ్యాపార సంస్థ. ఎన్నికలలో పని చేయడం, తమ క్లయింట్ (ఖాతాదారు) విజయం కోసం సర్వశక్తులూ వినియోగించి కృషి చేయడం, ఫీజు తీసుకోవడం ఆయన వ్యాపార విధానం. సిద్ధాంతాలు లేవు. నియమనిబంధనలు లేవు. ఆయన రంగంలో ప్రవేశించిన తర్వాత, తన ఆధ్వర్యంలో ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు నైతికతకు ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పని చేసిన చరిత్ర లేదు. తాను పని చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపోటముల అవకాశాలే నిర్ణాయకాంశాలు కానీ వారి నైతిక వర్తనం, సేవానురక్తి వంటి ఉత్తమాంశాలు కావు. పీకే పని చేసిన పార్టీలలో నైతిక విలువలు పెంచే ప్రయత్నం చేసిన దృష్టాంతం లేదు. ఆయన సర్వీసులను వినియోగించుకునే పార్టీలు కూడా ధర్మపన్నాలు వినడానికి కాదు, ఆయన ప్రావీణ్యాన్నీ, యంత్రాంగాన్నీ వినియోగించుకునే ఉద్దేశంతోనే పీకే సర్వీసులను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయకుండా, కౌన్సిలర్ గా కూడా ఎన్నిక కాకుండా, నైతిక నిబద్ధత లేకుండా, సిద్ధాంతబలం లేకుండా కేవలం తన వృత్తిలో ఇటీవల సాధించిన విజయాలు ప్రాతిపదికగా పీకే తన వ్యాఖ్యలలో చాలా దూరం వెడుతున్నారు. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన, 2019లో ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన రాహుల్ గాంధీని నేరుగా అసమర్థుడంటూ విమర్శించడం, ఆయనకు దీటైన వ్యక్తిగా ఊహించుకోవడం, ఆయనకు ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీని తయారు చేయాలని ప్రయత్నించడం పీకే నేలవిడిచి సాము చేస్తున్నారడానికి ప్రబల నిదర్శనాలు.  మమతా, పీకే విన్యాసాలు ప్రస్తుతానికి ఫలప్రదమయ్యే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసి, ప్రతిపక్ష పమైక్యతకు దోహదం చేసి నరేంద్రమోదీనీ, బీజేపీనీ సవాలు చేయడం ఒక మార్గం. విడిగా ఎదగడానికి ప్రయత్నించి ప్రతిపక్షాన్ని బలహీనపర్చితే మోదీకీ, బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది. మమతా బెనర్జీకి ప్రాప్తకాలజ్ఞత ఉన్నదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులలో ఉంది. పీకే ఆడుతున్న ఆటలో పావు కాకుండా ఉంటే ఆమెకే గౌరవం. ఆకాశానికి నిచ్చెనలు వేయడానికి ఇది సమయం, సందర్భం కాదు.

Also read: శత్రువులకూ, మిత్రులకూ ఆశ్చర్యం కలిగించిన కాంగ్రెస్ ఫలితాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles