Monday, November 11, 2024

మాదకద్రవ్యాల కేసులో బీజేపీనేత ప్రమేయం: మహారాష్ట్ర మంత్రి ఆరోపణ

షారుఖ్ ఖాన్ ను వేధించేందుకే ఈ దాడి

బీజీపీ నాయకుడికీ, ప్రైవేటు డిక్టెవ్ కీ అక్కడేం పని?

మహారాష్ట్రను బదనాం చేయడమే లక్ష్యం

ఒక బీజేపీ నేతకూ, ఒక ప్రైవేటు అపరాథపరిశోధకుడికీ విహార నౌకపైన మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో (నరోటిక్స్ కంట్రోల్ బ్యూరో –ఎన్ సీబీ) దాడి చేయబోతున్నట్టు ముందే తెలుసునని మహారాష్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ మరోసారి ఆరోపించారు. దాడి జరిగిన రాత్రి తెల్ల కారు దిగి, ఎన్ సీబీ ముంబయ్ ఆఫీసులోకి నడిచి వెడుతుండగా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కెపి గోవాసీకీ, బీజేపీ నాయకుడు మనీష్ భానుశాలీకీ మధ్య జరిగిన సంభాషణ వీడియోను మంత్రి ట్వీట్ చేశారు. మాలిక్ మహారాష్ట్రలో కేబినెట్ మంత్రి. క్రూయిజ్ నౌకపై దాడి చేసిన నాటి రాత్రి ఎన్ సీబీ ఆఫీసులోకి ప్రవేశిస్తున్న గోవాసీ, మనీష్ భానుశాలీల దృశ్యాలు ఇవిగో అంటూ మెసేజ్ పెట్టారు.

ఎన్ సీబీ మరో ఇద్దరికి ఈ కేసులో ఇరికించాలని కోరిందంటూ ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖెడే చేసిన ప్రకటన గురించి కూడా ప్రస్తావించారు. వాస్తవానికి అరెస్టు చేసింది ఎనిమిదిమందినే అయితే ఎనిమిది నుంచి పదిమంది దాకా అరెస్టు చేశామని వాంఖెడే అనడం అనుమానాలకు దారితీస్తున్నదని మంత్రి అన్నారు.

మహారాష్ట్రకు చెడ్డపేరు తేవడానికి బీజేపీ కుట్రపన్నిందని బుధవారంనాడు పెట్టిన విలేఖరుల గోష్ఠిలో మంత్రి మాలిక్ అరోపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షా రుఖ్ ఖాన్ ను వేధించేందుకు ఈ  కేసులో ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ ని ఇరికించారని కూడా ఆరోపించారు. తరువాతి లక్ష్యం షారుఖ్ ఖాన్ అంటూ నెలరోజులుగా క్రైంరిపోర్టర్లు చెప్పుకుంటున్నారని కూడా మాలిక్ అన్నారు. శివసేన నాయకత్వంలోని వికాస్ అఘాదీ ప్రభుత్వంలో ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములు. మనీష్ భానుశాలీ ఎన్ సీబీ దాడిలో ఎట్లా పాల్గొన్నారని మాలిక్ ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెడ్డపేరు ఆపాదించేందుకు బీజేపీ ఎన్ సీబీని ప్రయోగించిందని మాలిక్ ఆరోపించారు.

ఎన్ సీబీ కస్టడీలోకి అర్బాజ్ మర్చెంట్ వెడుతున్నప్పుడు ఆమె వెంట ఉన్నది తానేనని భానుశాలి అంగీకరించాడు. అయితే తనకు ఎన్ సీబీ దాడిలో పాత్ర ఉన్నదనే ఆరోపణను ఖండించారు. మాదకద్రవ్యాల గురించీ, విహారనౌకలో జరుగుతున్న పార్టీ గురించీ ఎన్ సీబీకి ఉప్పు అందించిన వ్యక్తిగా ఏమి జరుగుతోందో చూద్దామని తాను నౌకదగ్గర ఉన్నమాట వాస్తవమేననీ, కానీ తనకూ బీజేపీతో ఎటువంటి సంబంధం లేదనీ భానుశాలి అన్నారు.

వైరల్ గా చెలామణి అయిన వీడియోలో ఆర్యన్ ఖాన్ తో ఉన్న బోడిగుండు వ్యక్తి ప్రైవేటు అపరాథపరిశోధకుడు కిరణ్ గొసావి అని మాలిక్ ప్రకటించారు. కిరణ్ గొసానీనీ, భానుశాలీని స్వతంత్ర పరిశీలకులుగా ఎన్ సీబీ పేర్కొన్నది. ఇదివరకు సుశాంత్ రాజ్ పుత్ మరణం విషయంలో బాలీవుడ్ లో మాదకద్రవ్యాల చెలామణి గురించి చేసిన పరిశోధన తాలూకు ఆరోపణలనే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారనీ, ఎన్ సీబీ స్వతంత్ర్య, న్యాయబద్ధంగా దాడి చేసిందనీ ఎన్ సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles