Thursday, March 28, 2024

‘మహా’సంక్షోభం

  • జోరుగా ఆపరేషన్ కమల్
  • పావులు కదిపిన ఫడ్నవీస్

మహారాష్ట్ర రాజకీయ క్షేత్రంలో మళ్ళీ ముసలం చెలరేగింది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన తరుణంలో మహారాష్ట్ర సంక్షోభ అంశం రసకందాయంగా మారింది. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును దించుతున్నట్లు బిజెపి అధికారికంగా ప్రకటించింది. దీనితో అభ్యర్థుల ఎంపిక అంశానికి ఇరుపక్షాల నుంచి తెరపడింది. ఇక గెలుపుఓటములే తేలాల్సిఉంది. ఇది ఇలా ఉండగా,’మహారాష్ట్ర వేదికగా ‘ఆపరేషన్ కమల్’ శరవేగంగా కదులుతోంది. రాజకీయాలు గుజరాత్ -దిల్లీకి చేరుకున్నాయి. మహారాష్ట్రలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ‘మహా వికాస్ అఘాడీ కూటమి’గా నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని కొందరు విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు జోస్యం చెబుతున్నారు. బిజెపి తరపున ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. శివసేనలో సంక్షోభానికి మూలవిరాట్ గా చెప్పుకొనే ఏక్ నాథ్ షిండేకు ఉపముఖ్యమంత్రి పదవిని కేటాయించి,ముఖ్యమైన భూమికను ఇచ్చే పరిస్థితులు కూడా రావచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు.  పడ్నవీస్, ఏక్ నాథ్ షిండే మధ్య మొదటి నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు.

Also read: నాద యోగ దినోత్సవం

వైసీపీ, బీజేడీ ఎన్ డీఏ అభ్యర్థివైపే

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని అధికార-ప్రతిపక్షాలు రెండూ చూస్తున్నాయి. విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా గట్టిపోటీని ఇచ్చేట్లుగా వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ, బిజెడి మద్దతు కీలకంగా నిలిచే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు బిజెపి అభ్యర్థినే బలపరచువచ్చునని భావించాలి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం విషయానికి వస్తే,శివసేనలోని అంతర్గత విభేదాలు ముఖ్య కారణంగా బయటకు వినపడుతోంది. మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. బిజెపి -శివసేన మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర – కేంద్రప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరు కూడా నడిచింది. కొన్నాళ్లపాటు అది కొంచెం సర్దుకున్నట్లు కనిపించింది. ఏక్ నాథ్ షిండే రూపంలో మళ్ళీ మహాముసలం వచ్చింది.

Also read: ఇదేమి ఆగ్రహం?

శరద్ పవార్ అడ్డంకి

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన తరపున ఏక్ నాథ్ షిండే పేరు మొదట్లో వినపడింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అతని అభ్యర్థిత్వాన్ని తోసి పుచ్చి, ఉద్దవ్ ఠాక్రే వైపు మొగ్గారు. దీనితో షిండేకు ముఖ్యమంత్రి సింహాసన స్థానం తృటిలో తప్పిపోయింది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. షిండేకు కొన్ని కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగించారు. దానితో పెద్దగా వివాదం చెలరేకుండా శివసేన -ఎన్సీపీ -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదీ గత చరిత్ర. కొన్నాళ్ళుగా ప్రభుత్వంలో, శివసేన పార్టీలో సంజయ్ రౌత్ పెత్తనం ఎక్కువైపోయిందని చెప్పుకుంటారు. షిండేకు కేటాయించిన శాఖల్లోనూ ఇటు సంజయ్ రౌత్-అటు సీఎంఓ ప్రభావం పెరిగిపోయిందని పార్టీలో అంతర్గత విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య జోక్యం కూడా పెరిగిందని వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే వర్గీయులు తాడోపేడో తేల్చుకోడానికే సిద్ధమయ్యారు. షిండేతో కలుపుకొని 22మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి దిశగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. సుమారు రెండు వారల నుంచి మహారాష్ట్రలో  చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.రాజ్యసభ ఎన్నికల్లో శివసేన-కాంగ్రెస్ మధ్య క్రాస్ ఓటింగ్ జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి.దీనితో బిజెపికి అదనంగా మరో రాజ్యసభ సీటు దక్కిందని చెప్పుకుంటున్నారు. శాసనమండలి ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పెద్ద ప్రచారం జరిగింది.శివసేనకు చెందిన 12మంది ఎమ్మెల్యేలు బిజెపికి ఓటువేసినట్లుగా తెలుస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు, చిన్నాచితకా పార్టీల అభ్యర్థుల సహకారం కూడా శివసేనకు దక్కలేదు.మొత్తం ఈ ఎపిసోడ్స్ లో బిజెపికి లాభం జరిగింది, శివసేనకు నష్టం జరిగింది. ఈ వ్యవహారాల్లో ఏక్ నాథ్ షిండే కీలకంగా వ్యవహరించారని గట్టిగా వినపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి పడ్నవీస్,కేంద్రమంత్రి నారాయణ రాణే,ఏక్ నాథ్ షిండే కలిసి ఈ మొత్తం మంత్రాంగాన్ని రచించినట్లు రాజకీయ క్షేత్రంలో చర్చ జరుగుతోంది.’ఆపరేషన్ కమల్’ ను అమలుచేయడంలో ఈ ముగ్గురి పాత్రను రాజకీయ విశ్లేషకులు ప్రముఖంగా చూస్తున్నారు. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేకు శక్తివంతమైన నేతగా పేరుంది.అప్పుడు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడడంలో షిండే తెరవెనుక చక్రం తిప్పారని చెప్పుకుంటారు. కాకపోతే శరద్ పవార్ వల్ల ముఖ్యమంత్రి కుర్చీలో షిండే కూర్చోలేకపోయారు.

Also read: కేసీఆర్ కలలు సాకారం అవుతాయా?

నాలుగు విడతలు ఎంఎల్ఏగా…

మరాఠా వర్గానికి చెందిన షిండే ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.1980 నుంచి శివసేనతో ఆయనకు అనుబంధం ఉంది. బాలాసాహెబ్ ఠాక్రే ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి షిండే. ఠానే ప్రాంతంలో జరిగే ప్రజాఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించి గుర్తింపు తెచ్చుకున్న ఘటికుడు. 2004 నుంచి ఎమ్మెల్యేగా,మంత్రిగా అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఠానే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలోనూ ఆయన భూమిక కీలకం. షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్ సభ సభ్యుడు (ఎంపి)గా ఉన్నాడు. సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్ గా ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే, రాజకీయాల్లో తన కుటుంబసభ్యులతో పాటు తన వర్గాన్ని కూడా షిండే బలంగా నిర్మించుకున్నారని అర్ధమవుతోంది. శివసేనలో ఉంటూనే, సమాంతరంగా బిజెపి నేతలతోనూ బంధాలు ఏర్పరుచుకున్న నేర్పరిగా షిండేకు పేరుంది. ఠాక్రేలతో పడకపోవడం,బిజెపితో దోస్తానా, మరికొన్ని కారణాలతో శివసేనలో వేరుకుంపటి పెట్టి, షిండే నేడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. మహారాష్ట్రలో బలాబలాలను పరిశీలిస్తే 106 అసెంబ్లీ స్థానాలతో అతిపెద్ద పార్టీగా బిజెపి అగ్రస్థానంలో ఉంది. షిండే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే బిజెపి బలం 128కు చేరుకుంటుంది.స్వతంత్రులు, చిన్నపార్టీల మద్దతును బిజెపి కూడగట్టుకొంటే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతుంది.సంకీర్ణం వికీర్ణమవుతుంది. మహారాష్ట్రలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288. ఇటీవల శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించారు. దీనితో 287కు తగ్గింది.అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144 దాటాలి.మహా వికాస్ అఘాడీ కూటమి బలం 152.

Also read: సర్వమత సహనం, సమభావం మన జీవనాడి

అధికార కూటమి సంఖ్యాబలం

ఇందులో శివసేన -55, ఎన్సీపీ-53, కాంగ్రెస్ -44 చొప్పున సంఖ్యాబలంతో ఉన్నాయి. శివసేనకు చెందిన 55మందిలో 22మంది ఎమ్మెల్యేలు సూరత్ లోని ఒక హోటల్ లో ఉన్నట్టు సమాచారం.వీరంతా శివసేన నుంచి వైదొలిగితే దాని సంఖ్యాబలం 33కు తగ్గుతుంది. సంకీర్ణ ప్రభుత్వ బలం 130కు పడిపోతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ 133గా ఉంటుంది. తమకు 135మంది ఎమ్మెల్యేల బలముందని  బిజెపి చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది. బిజెపి కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేయాల్సి వస్తుంది. అధికారం కోసం మేము ఎన్నటికీ మోసానికి పాల్పడమని షిండే ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ట్వీట్ చేసిన గంటలోనే ట్విట్టర్ బయోలో ‘శివసేన’ పదాన్ని తొలగించడం గమనార్హం. తిరుగుబాటు జెండా ఎగురవేసిన 22మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శివసేన ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా షిండేను తొలగించి, ఆయన స్థానంలో అజయ్ చౌదరిని నియమించినట్లు శివసేన పార్టీ వెల్లడించింది. శివసేన నుంచి తొలగించబడిన షిండే వర్గం బిజెపిలో చేరుతుందా? కొత్తపార్టీని స్థాపిస్తుందా? తేలాల్సిఉంది. మొత్తంమీద, ఏక్ నాథ్ షిండే రూపంలో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అక్కడి పరిణామాలు భవిష్య రాజకీయ చిత్రపటాన్ని మారుస్తాయేమో చూడాలి.

Also read: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కసరత్తు ప్రారంభం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles