Friday, July 19, 2024

మనసు చేసే మాయాజాలం

Mind and its Games

భగవద్గీత – 2

ఒక వస్తువును చూడటమంటే మన కన్ను ఆ వస్తువునుండి వచ్చే కిరణాలను గ్రహించి మన మెదడుకు చేరుస్తుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మన మెదడులో ముద్ర వేయబడుతుంది.

మనం పదే పదే ఆ వస్తువును చూశామనుకోండి. చూసిన ప్రతిసారి దాని ముద్ర మన మెదడులో స్థిరంగా ఉండి పోతుంది. అప్పుడు ఆ వస్తువు మీద ఒక రకమయిన మమకారం ఏర్పడుతుంది, మమకారం అనేది ఒక ఆలోచనా స్రవంతి!

కొన్నిఆలోచనల సమాహారం! ఆ వస్తువో లేక ఆ మనిషో వాటి పట్ల మన అనుభవం (చూడటం) ఒక ఆలోచనా ప్రవాహంగా మారుతుంది. అది మన స్వంతము అనే భావన ఏర్పడుతుంది. ఆ స్వంతమయినది ఏ కారణం చేతనయినా దూరం చేసుకోవాల్సి వస్తే? లేదా దూరమయితే? ఆ భావన మనిషిని కుదురుగా ఉండనీయదు. అది దూరం కాకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. దక్కకపోతే దిక్కుతోచనివాడవుతాడు! అదే విధంగా ఇతర ఇంద్రియాల వల్ల మెదడులో తిష్ఠ వేసిన జ్ఞాపకాల పట్ల కూడా మనిషి ‘‘నావి’’ అనే భావన పెంచుకుంటాడు. ఇది  మనసు చేసే మాయాజాలం !

ఉదాహరణకు: రావణుడు మొదట సీత అందం గురించి విన్నాడు (చెవి కర్ణేంద్రియం ద్వారా అతని మెదడు గ్రహించింది). తరువాత చూశాడు (కన్ను దృశ్యేంద్రియం ద్వారా మెదడు గ్రహించింది). ఆ తరువాత ఆవిడ స్పర్శ సుఖం కావాలనుకున్నాడు. ఆ వెంటనే అందుకు ఏంచెయ్యాలి? ఒకదాని తరువాత మరొక ఆలోచనలను తన అనుభవాలనుండి ఉత్పత్తి చేసుకున్నాడు. ఆవిడ ఇంకొకరికి చెందినది! ఆతనికి ప్రతిఘటన ఎదురయ్యింది. దానిని ఎదుర్కొనే శక్తి లేక పతనమయి పోయాడు. ఇలా మనసు వ్యాపారము చేస్తూ ఉంటుంది !

ఇలాంటి మనో వ్యాపారాన్ని అదుపులో ఉంచుకుంటేనే జీవితం మనం అనుకున్న దిశలో వెడుతుంది. లేక పోతే ‘‘వరదలో కొట్టుకుపోయే కట్టెముక్కే!’’ జీవితం!

ఒక పెద్ద చెరువున్నది. అందులో కొన్ని ఆకులను దొప్పలుగా చేసి పడేశాం. ఇప్పుడు ఆ దొప్పల్లో కాస్త చెరువులొ నీరు తీసి పోశాం. దొప్పకు చిల్లి పడనంతవరకే నీరు దొప్పలో ఉంటుంది. ఏ మాత్రం చిల్లి పడ్డా మరల నీరు ఎక్కడనుండి వచ్చిందో అక్కడికి చేరుకుంటుంది. అంటే చెరువులో కలిసిపోతుంది. దొప్పల వంటివి మన శరీరాలు!

నీరు శరీరంలో చైతన్యం అనుకుంటే, శరీరం శిధిలమవ్వగనే వ్యక్తి చైతన్యం విశ్వచైతన్యంలో లీనమవుతుంది. అంటే ఎక్కడనుండి వచ్చామో మరల అక్కడికే చేరుకుంటాము మనము. మరి మనకు చావు పుట్టుకలు ఉన్నట్లా లేనట్లా?

‘‘పార్ధా, రణరంగంలో శత్రువుల తలలతో బంతులాట ఆడవలసిన ఈ సమయంలో ఈ బేలతనమేమిటయ్యా? శోకింపదగని వారి కోసం శోకిస్తున్నావు. పండితుడయినవాడు బ్రతికివున్న వారి గురించిగాని పోయిన వారి గురించిగాని ఏడవడయ్యా, నీవు, నేను ఈ సమస్త రాజలోకము ఉండని కాలము లేదయ్యా! ఉన్నాము, ఇంక ముందు కూడా ఉంటాము. ఇంద్రియములు, వాటివలన ఉత్పన్నమయిన మనస్సు అవి చేసే మాయాజాలం. గుర్తించవయ్యా!

‘‘సత్తు’’కి నాశనంలేదు! అసత్తు అనేదానికి అసలు ఉనికే లేదు. ఆత్మకు నాశనంలేదు! మనం ఏవిధంగా అయితే చిరిగిపోయిన పాత బట్టలు విడిచివేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఆత్మకు ఈ శరీరం దుస్తుల వంటిది. శరీరం శిధిలమయి పనికిరానప్పుడు కొత్త శరీరం ధరిస్తుంది. అంతేకాని ఆత్మకు నాశనంలేదు. ‘‘నీవు’’ అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకో. ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకడు దీని తత్త్వాన్ని ఆశ్చర్యంగా వర్ణిస్తాడు. ఇంకొకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినా కొందరికి దీనిగురించి ఏమీ అర్ధం కాదు.

‘‘కాబట్టి అర్జునా, నువ్వు చంపేవాడు లేడు. నీచేతిలో చచ్చేవాడులేడు. యుద్ధం చేయటం సుక్షత్రియుడిగా నీ ధర్మం. యుద్ధం చేయక పోతే పిరికిపందవయి పారిపోయావు అని అంటారు. అట్లాంటి అపకీర్తి చావు కంటే దుర్భరమైనది. బాధాకరమైనది. పోరాడితే పోయేదేమున్నది? ప్రాణం కోల్పోయావా స్వర్గలక్ష్మి, విజయం సాధించావా రాజ్యలక్ష్మి!

హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్యావా భాక్ష్యసీమపే

Also read: భగవద్గీత

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles