Friday, December 2, 2022

ప్రజలే ప్రభువులు

                      ———-   ————

(‘THE KING’  FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)

అనువాదం : డా. సి. బి. చంద్ర మోహన్

                  13. సంచారి తత్వాలు

                      ——— ————–

            సాదిక్ సామ్రాజ్య ప్రజలు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ రాజ భవనాన్ని చుట్టు ముట్టారు. రాజు ఒక చేతిలో కిరీటం, రెండో చేతిలో రాజదండం పట్టుకుని  ప్రాసాదం మెట్లు దిగి వచ్చాడు.  అతని గంభీరత చూసి ప్రజలు మౌనం దాల్చారు. రాజు వారి ముందు నిల్చొని ఇలా అన్నాడు. ” మిత్రులారా! ఈ కిరీటమూ మరియూ రాజదండం ఇంకెంత మాత్రమూ నాకు  చెందినవి కావు. మీకు స్వాధీన పరుస్తున్నాను. నేనూ మీలో ఒకడినవుతాను. మన రాజ్యం మేలు కోసం మీతో కలిసి పని చేస్తాను. ఇంక రాజు అవసరం లేదు. మనందరం పొలాల్లోకి, ద్రాక్ష తోటల్లోకి వెళ్లి, చేయీ చేయీ కలిపి పని చేద్దాం. నేను ఏ పనికి వెళ్ళాలో మీరే నిర్ణయించండి. ఇపుడు ప్రతి ఒక్కరూ రాజే.”

Also read: సంచారి తత్త్వాలు

             ప్రజలు ఆశ్చర్య పోయారు. ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. ఇప్పటి వరకూ వారి అసంతృప్తికి ఎవరు కారణమనుకుంటున్నారో , ఆ రాజే స్వయంగా  కిరీటమూ, రాజదండమూ వారికిచ్చేసి  వాళ్లలో ఒకడయిపోయాడు.

             తరువాత ఎవరికి వారు వారి పనుల్లోకి  వెళ్లి పోయారు. రాజు కూడా వారిలో ఒకనితో కలిసి పొలానికి వెళ్ళాడు.

            కానిరాజు లేకుండా సాదిక్ సామ్రాజ్యం ఏమీ మెరుగు పడలేదు. అసంతృప్తి అనే  మంచు పొర ఇంకా ఆ సామ్రాజ్యాన్ని కప్పుకునే ఉంది. “మనల్ని పరిపాలించడానికి ఒక రాజు తప్పకుండా కావాలి. ” అని జనాలంతా బజారుల్లో హాహాకారాలు చేయసాగారు. పిన్నలూ, పెద్దలూ అందరూ ఏక కంఠంతో “మనకు రాజు కావాలి.” అన్నారు.

             పొలంలో శ్రమించే రాజును వెతికి పట్టుకున్నారు. అతని చేతికి కిరీటము, రాజ దండం ఇచ్చి సింహాసనం ఎక్కించారు. వారు రాజుతో ఇలా అన్నారు “మమ్మల్ని న్యాయంగా, సమర్థతతో పరిపాలించండి.”

Also read: సంచారి తత్త్వాలు

               రాజు వారితో “నేనైతే సమర్థతతో పరిపాలిస్తాను. న్యాయంగా పాలించడానికి భూమి మరియు ఆకాశ దేవతలు నాకు తోడ్పడతారని  ఆశిస్తున్నాను.” అన్నాడు.

                ఒక రోజు ప్రజలు (ఆడా, మగా ) అంతా కలిసి రాజు దగ్గరికి వచ్చారు. వారి పట్ల దుష్ప్రవర్తనతో ఉంటూ , వారిని సేవకులుగా చూసే ఒక జమీందారు గురించి ఫిర్యాదు చేశారు. వెంటనే రాజు ఆ జమీందారుని పిలిపించి , అతనితో ఇట్లా అన్నాడు ” భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమే. నీవు, నీ పొలంలోను, ద్రాక్ష తోటలలోను పని చేసేవారిని నీతో సమానంగా చూసుకోవడం లేదు. కాబట్టి నిన్ను ఈ రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. వెంటనే రాజ్యం వదిలి పో!”

Also read: సంచారి తత్త్వాలు

                 మరుసటి రోజు మరి కొంత మంది ప్రజలు వచ్చారు. కొండల వెనుక ఉన్న వారి ప్రాంతపు దొరసాని యొక్క క్రూరత్వాన్ని గురించి మనవి చేసుకున్నారు. ఆమె వారిని ఎన్ని బాధలు పెడుతోందో చెప్పారు. వెంటనే రాజు అమెను సభకు పిలిపించి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తూ ఇట్లా అన్నాడు .” నిరంతరం మన పొలాల్లోనూ, ద్రాక్ష తోటల్లోనూ శ్రమించే ప్రజలు- వారు చేసిన రొట్టెలు తినే, ద్రాక్ష సారా తాగే మనకంటే – ఉన్నత మైన వారు. నీకు ఇది కూడా తెలీదు కాబట్టి నీవు ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ల వలసిందే !”

                   తరువాత మరి కొంత మంది ప్రజలు వచ్చి, వారి బిషప్ మీద ఇట్లా  ఫిర్యాదు చేశారు. “ఆ బిషప్ చర్చి కట్టడానికి పెద్ద రాళ్ళను తెఛ్చి, వాటిని చెక్కమని చెప్పి మాతో పనులు చేయించుకుని, మాకు ఏమీ ఇవ్వలేదు. ఒక వైపు మేము డబ్బు లేక తిండి లేక బాధ పడుతుంటే, బిషప్ మాత్రం తన పెట్టెను బంగారం, వెండితో నింపుకున్నాడు.”

                 రాజు వెంటనే బిషప్ ను పిలిపించి ఇట్లా అన్నాడు ” నువ్వు నీ మెడలో ధరించిన శిలువ యొక్క అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ప్రజలకు అండగా ఉండాలి. కాని నీవు వారి జీవితాలను దోచుకుంటున్నావు. అందుచేత జీవితాంతం నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నాను.”

Also read: సంచారి  “తత్త్వాలు”

                అలా ఓ పక్షం రోజుల్లో ప్రజలు వచ్చి రాజుకు వారి బాధలు చెప్పుకోవడమూ , ఆ పక్షంలో ప్రతి రోజూ, రాజు ఒక దోపిడీ దారుని రాజ్య బహిష్కరణ చేయడమూ జరిగింది.

                  సాదిక్ ప్రజలు ఆశ్చర్య పోయారు. వారి హృదయాలు ఆనంద భరిత మయ్యాయి.

                  తదుపరి ఒక రోజు యువకులు, పెద్దలు అందరూ కలిసి, రాజ ప్రాసాదానికి వచ్చి రాజుని చూడాలని అడిగారు. రాజు, కిరీటం ఒక చేతిలో, రాజ దండం మరో చేతిలో పట్టుకుని కిందకు దిగాడు.

                 రాజు వారితో ఇలా అన్నాడు ” ఇప్పుడేం చేద్దాం? చూడండి, మీరు కోరినట్లుగా రాజ్యాధికారం తీసుకున్నాను. మరల మీకే అప్పగిస్తున్నాను.”

Also read: సంచారి తత్త్వాలు

                 ప్రజలు ఏడుస్తూ ఇలా అన్నారు ” లేదు! లేదు ! మీరే మాకు సరైన రాజు. రాజ్యంలో  విష సర్పాలు లేకుండా చేశారు. తోడేళ్లను తరిమేశారు. మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటానికి వచ్చాం. మీరే ఆ కిరీటానికి ఘనత, రాజ దండానికి కీర్తి తెఛ్చిపెట్టారు. అవి మీకే చెందుతాయి.”

                 అపుడు రాజు ఇలా అన్నాడు ” నేను కాదు! మీకు మీరే ప్రభువులు ! నన్ను బలహీనుడు గాను, చెడ్డ రాజు గానూ భావించినపుడు మీకు మీరే బలహీనులుగా ఉన్నారు. మిమ్మల్ని మీరే చెడుగా పరిపాలించుకున్నారు. ఇపుడు ఈ రాజ్యం చాలా బాగా ఉందంటే – అది మీ కాంక్ష మూలంగానే ! నేను మీ మనసుల్లో ఒక భావాన్ని మాత్రమే . ప్రభువు అనేవాడు ఎవరూ లేరు. ఎవరికి వారే వారిని పాలించుకుంటారు. “

                    కిరీటమూ, రాజదండం పట్టుకుని మరల రాజు కోటలోకి వెళ్ళాడు. ప్రజలు సంతృప్తిగా ఇంటి ముఖం పట్టారు.

                  ఒక చేత్తో కిరీటం, ఇంకో చేతిలో రాజదండం పట్టుకున్నట్లుగా ఊహించుకుని, ప్రతి ఒక్కరూ – వారికి వారు రాజుగా భావించుకున్నారు.

Also read: సంచారి “తత్త్వాలు”

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles