Wednesday, February 1, 2023

నేటి పరిణామాలను 65 ఏళ్ళ కిందటే ఊహించిన లోహియా: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

దేశంలో ఇప్పుడు నెలకొన్నపరిస్థితులను రాంమనోహర్ లోహియా 1957లోనే ఊహించారనీ, ఆయన వశిష్టుడు, వాల్మీకి గురించి చేసిన విశ్లేషణ వర్తమాన పరిస్థితులకు చక్కగా సరిపోతుందనీ ముఖ్యఅతిథి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. రెఫరెన్స్ పుస్తకాలు లేకుండా, జైలులో ఉంటూ అటువంటి అసాధారణమైన వ్యాసాలు రాయడం లోహియాకే చెల్లిందని అన్నారు. లోహియా పుస్తకంపైనా, కల్లూరు భాస్కరం రాసిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే పుస్తకంపైనా జమిలి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. బద్రీవిశాల్ కారణంగా రాంమనోహర్ లోహియాను కలుసుకొనే అవకాశం వచ్చిందనీ, ఆయన గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాకుండా పురాణేతిహాసాలపైన లోతైన అవగాహన కలిగిన మేధావి అనీ అన్నారు. లోహియా స్వయంగా నిరీశ్వరవాది అయినప్పటికీ పురాణపాత్రలపైన గౌరవం ప్రదర్శిస్తూ వాటి గుణగణాలను చర్చించడం, చర్చను ప్రోత్సహించడం విశేషమనీ జస్టిస్ సుదర్శన రెడ్డి చెప్పారు.

పురాణ పాత్రలపై కొత్త వెలుగు

హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయ భాషానిలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో రాంమనోహర్ లోహియా వ్యాసాల సంకలనం ‘పురాణపాత్రలపై కొత్త వెలుగు’ ను ప్రొఫెసర్ ఆనందకుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆనందకుమార్ మాట్లాడుతూ లోహియా దూరదృష్టినీ, సమదృష్టినీ,హేతువాద దృష్టినీ కొనియాడారు. వశిష్టుడు, వాల్మీకిలో వాల్మీకి వల్లనే లోకానికి ఉపకారం జరిగిందనీ, వాల్మీకి రామాయణం అంతా అందరినీ కలుపుకొని వెళ్ళడం, ఉత్తరాదినీ, దక్షిణాదినీ ఏకం చేయడమేననీ లోహియా వివరించారని అన్నారు. ద్రౌపది, సావిత్రిలో సావిత్రికంటే ద్రౌపది గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పారు. ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నందుకు ఆమెను చిన్న చూపు చూడటం సరికాదనీ, తన భర్తలు అడగలేని ప్రశ్నలను, ప్రస్తావించని అంశాలను ఆమె ప్రస్తావించేదనీ, గొప్ప తెలివితేటలూ, గుండెధైర్యం కలిగిన వ్యక్తి ద్రౌపది అనీ ప్రొఫెసర్ ఆనందకుమార్ వ్యాఖ్యానించారు.

లోహియా ఇతిహాస వ్యాసాలను ఆరింటిని రావెల సాంబశివరావు, సురమౌళి, ఘట్టమరాజు హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. ‘పురాణ పాత్రలకు సామాజిక భాష్యకారుడు’ అనే శీర్షికతో కల్లూరి భాస్కరం ముందుమాట రాశారు. ‘పురాణ పాత్రలు- వర్తమాన రాజకీయాలు-లోహియా‘ అన్న శీర్షికతో ప్రముఖ రచయిత్రి వోల్గా రాశారు. ‘సాంస్కృతిక మొనోపలీకి విరుగుడు లోహియా’ అన్న శీర్షికతో రాణిశివశంకర శర్మ, ‘మెదళ్లకుండే దుమ్ము దులిపే ఆలోచనలు’ అన్న శీర్షికతో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ‘పురాణప్రతీక- ఆధునిక జ్ఞానవీచిక’ అన్న శీర్షికతో డాక్టర్ అవధానం రఘుకుమార్, ‘విశ్వమానవరాగం-లోహియా మానసగానం‘ అనే సమీక్షా వ్యాసం ఎస్వీ రామిరెడ్డి రాశారు.

వలసవాదులు మన దేశంపైన దండెత్తి రావడానికి రాజుల లేదా నాయకుడు అనైక్యత కారణం కాదనీ, సమాజంలో ఉపేక్ష కారణమనీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లోకానీ, భారత దేశంలో కానీ నిరంకుశ ధోరణులు పెరగడానికి పౌరసమాజం ఉపేక్షాభావం కారణమనీ వరిష్ఠ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి అన్నారు.

హిందీనుంచి లోహియా వ్యాసాలను అనువదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్ జి రంగా విశ్వవిద్యాయలం మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు మాట్లాడుతూ, ఇంగ్లీషు కంటే హిందీ నుంచి దర్జుమా చేయడం సులువైన పని అనీ, లోహియా  వ్యాసాలు అనువదించడం తనకు దక్కిన అరుదైన అవకాశమనీ చెప్పారు.

పుస్తకావిష్కరణలో్ పొల్గొన్న నాగసరి వేణుగోపాల్, రావెల సాంబశివరావు, రామచంద్రమూర్తి, ఫ్రొఫెసర్ ఆనందకుమార్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, చినవీరభద్రుడు, రఘుకుమార్, తదితరులు

లోహియా వ్యాసాలు తెలుగులో ప్రచురణ కావడం విశేషమనీ పుస్తకంలో వ్యాసాలు రాసిన ఆరుగురు రచయితలలో ఒకరైన నాగసూరి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. లోహియా వ్యాసాలను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలనీ, లౌకికదృష్టి పెరగడానికి ఇది దోహదం చేస్తుందనీ ఆయన అన్నారు.

ఒకరోజులో పుస్తకం చదివి, అదే రోజు ముందుమాట రాసి పంపిద్దామనుకున్నాననీ, ఒక రోజులో చదివి ముందుమాట ప్రారంభించాననీ, కానీ అది పూర్తికావడానికి పదిరోజులు పట్టిందనీ, తనను లోహియా ఆవహించాడనీ, ఇప్పటికీ వదిలిపోలేదనీ రచయిత, జర్నలిస్టు కల్లూరి భాస్కరం అన్నారు.

లోహియా సంకల్పించినట్టు రామాయణ మేళా జరిగి ఉన్నట్లయితే 1992లో బాబరీ మసీదు విధ్వంసం జరిగి ఉండేది కాదనీ, ప్రజల హృదయాలలో రాముడు నివసించేవాడు కానీ ఒక మసీదు కింద ఉండేవాడని ప్రజలు భావించే అవకాశం ఉండేది కాదనీ సభాధ్యక్షుడు వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ప్రచురణకూ, ఈ పుస్తకావిష్కరణ సభ జరగడానికీ ప్రధాన కారకులైన రావెల సోమయ్య, ఆయన సతీమణి అరుణ ఆదర్శ దంపతులనీ, వారితో 1995 నుంచీ పరిచయం ఉన్నదనీ, ఎన్నోసార్లు సోమయ్యను కలుసుకొని అనేక అంశాలు చర్చించేవాడిననీ వీరభద్రుడు అన్నారు.

సినియర్ న్యాయవాది అవధానం రఘుకుమార్ సభను నిర్వహించి వందన సమర్పణ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles