Tuesday, November 5, 2024

అనివార్యమైన లాక్ డౌన్

కరోనా కేసులు, మరణాల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని మొన్ననే సుప్రీంకోర్టు కూడా సూచించింది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీ ఏ ఐ టీ ) నిర్వహించిన సర్వేలోనూ 67శాతం మంది లాక్ డౌన్ కు మద్దతు పలికారు. లాక్ డౌన్ విధించే పరిస్థితులు తెచ్చుకోవద్దు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ మధ్య అన్నారు.

ఆఖరి అస్త్రం

అది చివరి ఆయుధమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా వ్యాఖ్యానించారు. వివిధ సమాఖ్యలతో పాటు ఎయిమ్స్ డైరెక్టర్, కొందరు ఆరోగ్య నిపుణులు కూడా లాక్ డౌన్ ను సమర్థిస్తున్నారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ పౌచీ కూడా భారతదేశంలో కొన్ని వారాలపాటు లాక్ డౌన్ అవసరమని అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం కరోనా మొదటి దశలో లాక్ డౌన్ విధించడం వల్ల కొంత కట్టడి చేయగలిగామన్నది వాస్తవం. ఇన్ని కోట్లమంది జనాభా కలిగిన ఇంత పెద్దదేశంలో ఎక్కువమంది కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకోగలిగినందుకు ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అప్పుడు చాలా ప్రశంసలు  వచ్చాయి. మంచిదే.  కానీ వలసకార్మికుల కష్టాల విషయంలోనూ, లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజల విచక్షణా రహిత ప్రవర్తన అంశంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి.

కరోనాతో తప్పని కాపురం

కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పోదు, దానితో కొంతకాలం కాపురం చేయక తప్పదు అని ముందే తెలిసివుండి, ముందు జాగ్రత్తచర్యలను తీసుకోవడంలో వైఫల్యం చెందినందుకు ప్రభుత్వాలు, పాలకులపై తారాస్థాయిలో అగ్రహావేశాలు పెరుగుతున్నాయి. అంతర్గత ఆలోచనలు ఏమై ఉన్నప్పటికీ, ప్రపంచ మీడియా మొత్తం భారత ప్రభుత్వాన్ని, పాలక పెద్దలను దుమ్మెత్తి పోస్తున్నాయి. స్థానిక, సోషల్ మీడియా నుంచి ప్రపంచ మీడియా వరకూ భారత్ లోని కరోనా కరాళ నృత్యాల దృశ్యాలు తాండవం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని విషాదంగా మారుతున్న వేళలో నేడు దేశ వ్యాప్త లాక్ డౌన్ వైపు మద్దతు పెరుగుతోంది.

ఉదయం మాత్రమే సంచారం

ఇప్పటికే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో కేసుల తీవ్రత ఎక్కువ ఉన్న చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. తాజాగా,దిల్లీలో లాక్ డౌన్ పొడిగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో, నేటి నుంచి పగలు కర్ఫ్యూ కూడా అమలులోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే ప్రజలు వీధుల్లోకి రావడాన్ని అనుమతిస్తారు. 144 వ సెక్షన్ అమలులో ఉంటుంది. జనం గుమిగూడడానికి వీలులేదు. ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా తిరగడానికి వీలులేదు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు కూడా పూర్తిగా నిలిపివేస్తున్నారు. అత్యవసర సిబ్బంది, సేవలు తప్ప సర్వ వ్యవస్థలు స్తంభించనున్నాయి.

చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్

ఇది ఒకరకంగా సంపూర్ణ లాక్ డౌన్ వంటిది. కొన్ని గంటలు మాత్రమే మినహాయింపు ఉంది.తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మే 15వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు బీహార్ ప్రకటించింది. కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. జమ్మూ, హరియాణాలోనూ పాక్షిక, వారాంతపు లాక్ డౌన్ నడుస్తోంది. గతంలో వలె కాక, ఈసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపులపై నిర్ణయా విచక్షణను రాష్ట్రప్రభుత్వాలకే వదిలివేసింది. ఈ నేపథ్యంలో, ఒక్కొక్క రాష్ట్రం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటోంది. మొత్తంమీద  దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ పాక్షికంగా, భిన్న రూపాలలో అమలులో వుంది. దేశ వ్యాప్తంగా  కొన్ని వారాలపాటు సంపూర్ణ లాక్ డోన్ విధించే విధంగా వివిధ రంగాల నుంచి సూచనలు వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారా?

ఈ తరుణంలో బహుశా దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించే సందర్భం ఆసన్నమైందని చెప్పాలి. బతుకు – బతుకుతెరువు మధ్య మళ్ళీ పోరాటం ఆరంభమైంది. గత సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవాలు, అనుభూతులు మాటలకందనివి. మళ్ళీ ఆ దుస్థితి, అంతకు మించిన దుర్గతిని ఎదుర్కోవాల్సిన దుర్ముహూర్తం రాకుండా చూసుకోవాలి. సగటుజీవులు, వేతన ప్రాణులు, చిరువ్యాపార జీవనులు, రెక్కల కష్టమే నమ్ముకున్న కార్మికులు, వలస కూలీలు, దినవెచ్చంగాళ్ళకు దినదిన గండం మళ్ళీ ముంచుకొస్తోంది. వీటి నుంచి పూర్తిగా బయటపడేసే మార్గాలు లేకపోయినా, వీలైనంత మేరకు ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఆ దిశగా ప్రభుత్వాలు సంసిద్ధమై ఉండాలి.

తోటిమనిషికి తోడుగా నిలవాలి

సామాన్యుడి శ్రమ దోపిడిపై భువనభవనాలు కట్టుకున్న డబ్బున్న పెద్దలు  ఈసారి మూకుమ్మడిగా మనిషిగా, తోటిమనిషికి తోడుగా నిలవాల్సిందే. కేవలం ప్రభుత్వాలు ఇంతమందిని ఆదుకోలేవు. అందరూ తలొక చెయ్యి వేయాల్సిందే. మానవత్వాన్ని చాటుకోవాల్సిందే. మనుషులను బతికించుకుంటే, మళ్ళీ ఎన్నైనా, ఏవైనా సంపాయించుకోవచ్చు. ఇది పేదవాడి పట్ల ఉదారంగా ఉండాల్సిన సందర్భం. ఇదంతా ఆర్ధిక కోణం, బతుకుతెరువు భాగం. దీనికి మించిన ఆరోగ్య కోణాన్ని అత్యంత సమర్ధవంతంగా స్పృశించి, నిర్వహించాల్సిన బరువు,బాధ్యతలు ప్రభుత్వాలపైనే ఉన్నాయి. ఆక్సిజన్, చికిత్స మొదలు అస్పత్రుల్లో అన్నిరకాల వసతులను సమృద్ధిగా ఉండేట్లు చూడడం.

అందరికీ టీకాలు అందుబాటులోకి తేవాలి

అందరికీ వ్యాక్సినేషన్ సమర్ధంగా పూర్తయ్యేట్లు పర్యవేక్షించడం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టడం చాలా ముఖ్యమైనవి. వ్యాక్సినేషన్ విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంటోంది. మొదటి దశలో, 60ఏళ్ళు దాటినవారిలో చాలామందికి మొదటి డోసే అందలేదు. మొదటి డోస్ తీసుకొని కూడా రెండవ  డోస్ వేసుకొనివాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. రెండవ దశలో, 45ఏళ్ళు దాటినవారికి అనుమతి వచ్చినా, స్టాక్ కొరత వల్ల ఎక్కువమంది ఇంకా మొదటి డోసే తీసుకోలేదు. మూడవ దశలో, 18ఏళ్ళు పైబడినవారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అమలులోకి వచ్చిందని హడావిడి జరిగినా అది కేవలం ప్రచార ఆర్భటికే సరిపోయింది. మొత్తంగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఘోర వైఫల్యాల మధ్య నడుస్తోంది. వ్యాక్సిన్ వేసుకుంటే, కరోనా నుంచి రక్షణ కలుగుతుంది, అనే ప్రచారం పెద్దఎత్తున  జరుగుతోంది.

ప్రచారానికి తగిన ఆచరణ ఏదీ?

మంచిదే. దానికి తగ్గట్టుగా ఆచరణే లేదు. వ్యాక్సిన్ల ధరలపై కూడా గందరగోళం నడుస్తోంది.వాటి సామర్ధ్యతపై ఇంకా విశ్వసనీయత పెరగాల్సి వుంది. ప్రభుత్వాలు -ప్రైవేట్ రంగాలు -డబ్బున్న బడాబాబులు -ప్రజలు కలిసి సాగాల్సిన సందర్భం ఇది. కరోనాపై పోరు మరో స్వాతంత్ర్య సమరం వంటింది. మరో మాంద్యం ఇది.మన ఎదుర్కుంటున్న సమస్యలు, ఆర్ధిక, రాజకీయ స్వార్ధాలే నేటి మన శత్రువులు. పరాయివాడైనా, ఈ తరుణంలో, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ పౌచీ చేస్తున్న సూచనలు చాలా విలువైనవని పలువురు దేశీయ నిపుణులు భావిస్తున్నారు.

ఆంథోనీ పౌచీ చేసిన విలువైన సూచనలు

(1) సైన్యాన్ని రంగంలో దింపి, వారి సాయంతో ఎక్కడికక్కడ తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటుచేయడం (2) వైద్య పరికరాలతో పాటు సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని తీసుకోవడం (3) కొన్ని వారాలపాటు పూర్తి లాక్ డోన్ విధించడం (4) చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకె వంటి దేశాలు అవలంబించిన మార్గాలను అధ్యయనం చేసి అనుసరించడం (5) భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం. వ్యాక్సిన్ సరఫరాకు ముందుకొచ్చే ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవడం (6) ఆక్సిజన్, చికిత్స భారాన్ని తగ్గించేందుకు కృషి చేయడం. ఇవన్నీ ఆంథోనీ పౌచీ చూపించిన మార్గాలు. వీటికి తోడు, వ్యక్తి స్థాయిలో ఎవరికి వారు స్వయం క్రమశిక్షణ పాటించడం, దేశీయమైన ప్రాచీన చిట్కాలను పాటించడం, భయాలను వీడి రెట్టింపు మనోధైర్యాన్ని కలిగిఉండడం శ్రేయోదాయకమని పెద్దలు సూచిస్తున్నారు. సింహాలకు కూడా కరోనా సోకుతోందని తాజాగా వార్తలు వస్తున్నాయి. మనిషితో పాటు జంతుజాలం కూడా కరోనాకు గురికావడం బాధాకరం. త్వరలో అన్నింటినీ అధిగమించగలమని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles