Wednesday, September 18, 2024

వంతెనపై పొద్దుపొడుపు

Lines composed upon Westminster Bridge

William Wordsworth

“Earth has not anything to show more fair

Dull would he be of soul who could pass by

A sight so touching in its majesty

The city now doth like a garment wear

The beauty of the morning; silent, bare

Ships, towers, domes, theatres and temples lie

Open unto the field and to the sky;

All bright and glittering in the smokeless air;

Never did Sun more beautifully steep

In his first splendour, valley, rock or hill;

Never saw I, never felt, a calm so deep!

The river glideth at his own sweet will:

Dear God! the very houses seem asleep

And all that mighty heart is lying still!”

William Wordsworth

వంతెనపై ప్రొద్దు పొడుపు

అతిలోక సుందరమ్మైనదీ దృశ్యమ్ము;

రంజిల్ల నేరునే రసహీన హృదయమ్ము;

కోక వలె పురకాంత కొంగు బంగారాలు;

గంభీర, నీరవ, దిగంబరాకారాలు;

గోపుర సమూహాలు, గుడులు, సౌధాగ్రాలు

నాట్యశాలలు, విమల నౌకా మయూఖాలు;

నిర్మల మహానగర నిర్ధూమ గగనాలు;

కనుమేర తిమిరాంత మణికాంతి కిరణాలు;

హృదయమా! భూదేవి ఉదయ సౌందర్యాలు;

గిరుల, లోయల, శిలల, విరియు గాంభీర్యాలు;

నిబిడ నిశ్చల శాంత నిశ్శబ్ద శృంగాలు;

జీననదిలో పొంగు స్వేచ్ఛా తరంగాలు;

ఈశ్వరా! నలుదెసల ఇల్లిల్లు కనువాల్చె;

అణువణువు మహితాత్మ ధ్యానముద్రను దాల్చె!

తెనుగుసేత: వ్యాసరచయిత

దాదాపు  రెండు వందల ఇరవై సంవత్సరాల నాటి మాట. క్రీశ 1802 సంవత్సరం, జులై 31వ తేదీ, తూరుపున సింధూర కాంతులు వెల్లివిరుస్తున్న వేళ, విలియమ్ వర్డ్స్ వర్త్, ఆయన సోదరి డారతి వర్డ్స్ వర్త్, లండన్ మహానగరం నుండి కాలాయిస్ అనే పట్టణానికి వెళుతున్నారు. వారి గుఱ్ఱపు బండి లండన్ మహానగరం లోని థేమ్స్ నదిపై గల వెస్ట్ మినిస్టర్ వంతెన మీదుగా ప్రయాణిస్తున్నది. ఉదయశోభ లండన్ మహానగరాన్ని క్రమ క్రమంగా ఆవహిస్తున్నది. వెస్ట్ మినిస్టర్ వంతెనపై వెళ్ళే వర్డ్స్ వర్త్ మహాకవికి ఈ దృశ్యం నయనానందకరంగా తోచింది.  

Also read: నీ పదములు

నిర్మల ప్రత్యూష గగనం

ఫాక్టరీ గొట్టాల నుండి, లేదా, ఇళ్ళకప్పుల నుండి వెలువడే  ధూమరేఖలెక్కడా అగుపించని  నిర్మల ప్రత్యూష గగనం; నిశ్చలసమాధిలో మునిగిన మహానగరం; నిర్మానుష్య పురవీధులు; నిశ్శబ్దంగా నగరంలో పాదం మోపుతున్న స్వచ్ఛ సుందర సూర్యకాంతి; వర్డ్స్ వర్త్ హృదయాన్ని పరవశింప జేసినవి.

ఫలితంగా, ఆ మహాకవి లేఖిని నుండి అప్రయత్నంగా జాల్వారిన పద్యం, ఏడేండ్ల తర్వాత, అనగా, 1809, సెప్టెంబర్ 3వ తేదీన తొలిసారి ప్రచరణకు నోచుకున్నది.

1802 నాటి లండన్ మహానగరానికి,  ఆధునాతన మైన ఇరవై యొకటవ శతాబ్దపు లండన్ మహానగరానికీ ఎట్టి పోలికలూ లేవు. రెండు శతాబ్దాల క్రిందట ఇంగ్లండు దేశం పారిశ్రామిక యుగంలోకి  అప్పుడప్పుడే అడుగు పెడుతున్నది. దేశ ప్రజానీకంలో అధికభాగం ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే వున్నారు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

ఆ నాటి దీనుల దుర్భర జీవనాలకు డికెన్స్ నవలలు, విలియమ్ బ్లేక్ కవితలు, అద్దం పడతాయి. పచ్చని చెట్లు, అందమైన పచ్చికలు,  నిసర్గ రమణీయమైన ప్రకృతి,  నగరాన్ని ఆవరించిన కాలమది.

వర్డ్స్ వర్త్ భావకవిత్వ యుగానికి (romantic age) చెందిన మహాకవి. వర్డ్స్ వర్త్ హృదయంలో ప్రకృతి సౌందర్యానికే అగ్రస్థానం. సగటు మానవుల పైనే దృష్టి. వీటితో బాటు సమస్త చరాచర సృష్టిపై ఎడతెగని దయ, వాత్సల్యము, ప్రేమా. ఈ లక్షణాలన్నీ గుమిగూడి వర్డ్స్ వర్త్ కవితల్లో ప్రతిబింబిస్తాయి.

హృదయం, ఆత్మా మమేకం

తానేది వర్ణిస్తున్నాడో ఆ వస్తువుతో హృదయము, ఆత్మా, మమేకం చెందుతాడు వర్డ్స్ వర్త్. ప్రతి మనిషిలో, ప్రతి పసిపాపలో, ప్రతి గడ్డిపోచలోనూ, పరమాత్మనే దర్శిస్తాడు. వర్డ్స్ వర్త్ ప్రయోగించే కోమల లయాత్మక శబ్దాలు పఠిత మనస్సుకు అనిర్వచనీయమైన అనుభూతిని, అలౌకికమైన ఆనందాన్ని, అపూర్వమైన శాంతినీ, ప్రసాదిస్తాయి. ప్రతి శబ్దం అవధులు లేని నిశ్శబ్దాన్ని ఆత్మలో తట్టి లేపుతుంది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

ఉదయించే సూర్యకాంతిలో, నగ్నంగా, నిశ్శబ్దంగా మెరిసే నగరం రూపురేఖలను, పద్యం మొదటి ఎనిమిది పాదాలలో  వర్డ్స్ వర్త్ వర్ణిస్తాడు. తక్కిన ఆరు పాదాల్లోనూ, వర్డ్స్ వర్త్, క్రమక్రమంగా అంతర్ముఖుడై, తన అంతరంగాన్ని ఆవహిస్తున్న నిబిడ నిశ్శబ్దాన్ని, నిశ్చల ప్రశాంతతనూ వర్ణిస్తాడు.

ఈ చివరి ఆరుపాదాల క్రమంలో మొదటిది, ఉదయ కిరణాల్లో ఆవిష్కరింపబడే అపురూప ప్రకృతి సౌందర్యాన్ని కవి తన చర్మచక్షువులతో వీక్షించడం. ఈ బహిర్ సౌందర్యాన్ని కవి ఇట్లా ప్రకటిస్తున్నాడు: “Never did Sun more beautifully steep in his first splendour, valley rock or hill”.

ధేమ్స్ నది వర్ణన

ఈ క్రమంలో రెండవది, కవి ఆత్మచక్షువులకు గోచరించే ప్రకృతిలోని ప్రశాంత గాంభీర్యం. ఈ భావనను వర్డ్స్ వర్త్  ఇట్లా వ్యక్తీకరిస్తున్నాడు:

“Never saw I never felt a calm so deep”

ఈ క్రమంలో మూడవది, ఉదయకాంతిలో మెరుస్తూ,  స్వేచ్ఛా వాహినియై ప్రవహించే థేమ్స్ నది వర్ణన. ఈ నదీప్రవాహం, బహిరంగ నిర్బంధాలకు లోబడని కవి ఆత్మలో ప్పొంగే స్వచ్ఛంద భావవాహినికి ప్రతీక.  “The river glideth at his own sweet will”.

ఈ క్రమంలో నాలుగవది   ఉషోదయ మహానగరంలో నలుదెసలా నిదురిస్తున్నట్లు కనపడే శతసహస్ర గృహవాటికలు. ఇవి  కవిలో మేల్కొనే తపస్సమాధికి ప్రతీకలు. “Dear God! The very houses seem asleep”. 

చివరి పాదంలో, లండన్ మహానగరం సైతం  ధ్యాన మగ్నమై, నిశ్చలాకృతి దాలుస్తుంది. ధ్యానముద్రను దాల్చిన మహానగరం, ధ్యానంలో మునిగిన పరమాత్మకు ప్రతీక.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

“And all that mighty heart is lying still”.

శతసహస్ర మానవులకు ఆలవాలమైనది లండన్ మహానగరం. సమస్త జీవకోటికీ ఆలవాలమైనది ఈ అనంతసృష్టి. భౌతికదృష్టి కలవారికి లండన్ మహానగరం మహితాత్మ. ఆధ్యాత్మిక దృష్టిలో పరాత్పరుడే మహితాత్మ. (mighty heart). ఇట్లా లండన్ మహానగరంలో పరమాత్మను ధ్వనింపజేయడం వర్డ్స్వర్త్ లోని ఋషిత్వానికి నిదర్శనం.

వర్డ్స్ వర్త కవితల్లో సనాతన హైందవ భావాలు

కొన్ని కొన్ని వర్డ్స్ వర్త్ కవితల్లో సనాతన హైందవ భావనలు అంతర్లీనమై స్ఫురించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ ఆరుపాదాల అనువాద క్రమమిది:

హృదయమా! భూదేవి ఉదయ సౌందర్యాలు

గిరుల, లోయల, శిలల, విరియు గాంభీర్యాలు

నిబిడ నిశ్చల శాంత నిశ్శబ్ద శృంగాలు

జీవనదిలో పొంగు స్వేచ్ఛాతరంగాలు

ఈశ్వరా! నలుదెసల ఇల్లిల్లు కనువాల్చె

అణువణువు మహితాత్మ ధ్యానముద్రను దాల్చె!”

ఈ పద్యం సానెట్ అనబడే ఆంగ్ల ఛందోవిశేషం. ఇయాంబిక్ పెంటామీటర్ అనే ఛందో పధ్ధతితో నడిచే సానెట్ లో పద్నాలుగు పాదాలుంటాయి. ప్రతిపాదం యొక్క నిడివీ ఇదు సమాన భాగాలు ( five equal feet) గా విభజింప బడి వుంటుంది.

సంస్కృత జనితమైన భారతీయ భాషా సాహిత్యాల్లో అక్షరగణాలు, లేదా మాత్రాగణాలుంటాయి.  నాన్ ఫోనెటిక్ భాషలతో కూడిన పాశ్చాత్య సాహిత్యాల్లో, అక్షరగణాలకు ప్రాధాన్యత లేదు. వాటి బదులు, పద్యం యొక్క ప్రతి పాదంలోనూ Stressed syllables  వుంటాయి  (ఒత్తిపలికే శబ్దాలు).

అంత్యప్రాసలు

ఆంగ్లసానెట్ లో ప్రతి పాదం యొక్క నిడివి, తెలుగు ఛందస్సులోని “ఇరవై మాత్రా కాలాల”కు స్థూలంగా సమాన మౌతుందని చెప్పవచ్చు. సానెట్ లో అంత్యప్రాసలు వుంటాయి. పాశ్చాత్యుల సానెట్లలో అంత్యప్రాసల  రైమ్ స్కీమ్ abba abba cc dd ee అని వుంటుంది. అనగా మొదటి  పాదానికి, నాల్గవ పాదానికి అంత్యప్రాస. రెండవ పాదానికి, మూడవ పాదానికి అంత్యప్రాస. ఇదే పద్ధతి ఐదు నుండి ఎనిమిది పాదాలకు కూడా కొనసాగుతుంది. తర్వాతి పాదాల్లో, తొమ్మిది-పది పాదాలకు అంత్యప్రాస. పదకొండు-పన్నెండు పాదాలకు అంత్యప్రాస. పదమూడు-పద్నాలుగు పాదాలకు అంత్యప్రాస.

కొన్ని సానెట్లలో abab abab abab cc స్కీమ్ వుంటుంది. అనగా, ఒకటి-మూడు పాదాలకు అంత్యప్రాస. రెండు-నాలుగు పాదాలకు అంత్యప్రాస. ఈ పద్ధతి పన్నెండవ పాదం వరకు సాగుతుంది. చివరగా పదమూడు-పద్నాలుగు పాదాలకు అంత్యప్రాస వుంటుంది. ఇట్టి పద్ధతులు తెలుగు సాహిత్యానికి క్రొత్త.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

ఆధునిక తెలుగు కవిత్వంలో సానెట్ పద్ధతిని ప్రవేశపెట్టిన కవి అబ్బూరి రామకృష్ణరావు గారు. అబ్బూరి వారి సానెట్ లలో పాదానికీ 24 చొప్పున మాత్రలు వుంటాయి. అబ్బూరి వారి తెలుగు సానెట్లలో ఒకటి  ప్రముఖ మేధావి,  రాడికల్ హ్యూమనిజం ఉద్యమ స్థాపకుడు ఎమ్ ఎన్ రాయ్ మరణించినప్పుడు ఆయన రచించిన ఎలిజీ (మానవేంద్ర నాథ రాయి మరణించిన నాటి రాత్రి).

నేటి నా అనువాదంలో ఆంగ్ల సానెట్ నిడివితో దాదాపు సమానమైన 20 మాత్రా కాలాలు ప్రతిపాదంలోనూ ప్రయోగించినాను. అంత్య ప్రాసలు aabbcc పధ్ధతిలో వాడుకున్నాను. ప్రతిపాదాన్ని రెండుగా విభజించి, మొదటి/పదకొండవ మాత్రాశబ్దాలకు, యతి లేదా ప్రాసమైత్రి పాటించినాను.

ఈ వర్డ్స్ వర్త్  పద్యాన్ని తమ బాల్యంలో ఇష్టపడిన వారిలో ప్రముఖ భారతీయ రచయిత నీరద్ సి చౌదరి కూడా ఒకరు. తన ఆత్మకథ The Autobiography of an unknown Indian లో ఆయన ఇట్లా పేర్కొన్నాడు:

“English poetry was to me and my brother, even before we could understand it fully, the most wonderful reading in the world. We read the usual things, Wordsworth’s “Lucy Gray”, “We are seven” and “Daffodils”. We liked them, but we were too young to understand all their subtlety. The poem by Wordsworth which moved me most strongly at the time was “Lines Composed on Westminster Bridge”. As I read it, the heavenly light of dawn with its purity and peace seemed to descend on us”.

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

శిధిల వైభవ వర్ణన

వెస్ట్ మినిస్టర్ వంతెన నుండి లండన్ మహానగరాన్ని వీక్షించిన వర్డ్స్ వర్త్ మహాకవి హృదయంలో ఎట్లా కవిత్వం పెల్లుబికిందో, “బ్రిడ్జ్ ఆఫ్ సైస్” (bridge of sighs) అనే వంతెన నుండి నీటిపై తేలే వెనిస్ నగరాన్ని వీక్షించిన వేళ బైరన్ మహాకవి గుండెలో విషాదభావన చోటు చేసుకొన్నది.  శిల్పకళలో పాశ్చాత్యజగత్తుకే తలమానికమైన వెనిస్ నగరం శిథిలవైభవాన్ని ఆయన ఇట్లా వర్ణిస్తున్నాడు:

“In Venice Tasso’s echoes are no more

And silent rows the song less gondolier

Her palaces are crumbling to the shore

And music meets not always now the ear

Those days are gone – but beauty is still here

States fall, arts fade but nature does not die

Nor yet forget how Venice once was dear

The pleasant place of all festivity

The revel of the earth, the masque of Italy!

లండన్ మహానగరాన్ని, వెస్ట్ మినిస్టర్ వంతెనను లక్షలాది మంది ప్రతిదినం వీక్షిస్తారు. కానీ, ఇంగ్లండు దేశంలో ఎవరూ కానని పర్వత సానువుల్లో టింటర్న్ అబీ అనేచోట గల ఒక కొండవాగును చూసి ముగ్ధుడై వర్డ్స్ వర్త్ క్రీశ 1798లో రచించిన కవిత జగత్ప్రసిద్ధి చెందింది.

మొదటిసారి వర్డ్స్ వర్త్ ఆ కొండవాగును చూసినప్పుడు పొంగని కవిత్వం ఐదేండ్ల తర్వాత మళ్లీ అదే కొండవాగును ఆ మహాకవి దర్శించినప్పుడు హృదయం నుండి వెల్లువలై పొంగి పారింది. ఆయన మాటల్లోనే చెబితే:

“Five years have past; five summers with the length

Of five long winters and I now hear

These waters rolling from the mountain spring

With a soft inland murmur–once again

Do I behold these steep and lofty cliffs,

That on a wild secluded scene impress

Thoughts of more deep seclusion; and connect

The landscape with the quiet of the sky:”

ఐదు దశాబ్దాల తర్వాత….

ఐదు దశాబ్దాల క్రిందట కళాశాలలో చదివే రోజుల్లో Lines Composed upon Westminster  కవితలోని అరుణోదయ సౌందర్యాన్ని తొలిసారి హృదయ చక్షువులతో దర్శించినాను.  యాభై వసంతాల తర్వాత, యాభై సుదీర్ఘమైన హేమంత శిశిరాల తర్వాత, ఈ తెలుగుసేతలో అదే అరుణోదయాన్ని ఆత్మచక్షువులతో  మళ్ళీ దర్శించి పరవశం చెందుతున్నాను.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

నలభై ఏండ్ల క్రిందట దూరదర్శన్ లో ధారావాహికగా Civilisation (నాగరకత) అనే బిబిసి కార్యక్రమం ప్రసార మయ్యేది. కెన్నెత్ క్రార్క్ అనే విద్వాంసుడు దాని వ్యాఖ్యాత. ఆ కార్యక్రమంలో భాగంగా కెన్నెత్ క్లార్క్ స్వయంగా  Tintern abbey వద్దకు వెళ్ళి టీవీ ప్రేక్షకులచే ఆ కొండవాగును దర్శింపజేసేవాడు. ఆ వాగు వద్ద నిలబడి, తన మధుర కంఠంతో వర్డ్స్ వర్త్ Tintern abbey కవితను పఠించడం, ఆ సుదీర్ఘకవితలోని ప్రతి పాదాన్ని ప్రేక్షకులకు వివరించి చెప్పడం మరపురాని మధురానుభవం.

మా యింటి వద్ద ఆదర్శప్రాయుడైన ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. మధురంగా, అనర్గళంగా ఆంగ్లభాషలో ప్రసంగించే వాడు. మూర్తీభవించిన గాంధేయవాది ఆయన. ముతక ఖద్దరు ధరించేవాడు. చీకటిలో లేచి చీపురుతో వీధులు శుభ్రపరిచేవాడు. విరివిగా చదివేవాడు. ఆయన వద్ద తీసుకొన్న Selections from English Poetry అనే ఒక పాత పుస్తకంలో నాకు పరిచయమైనది వెస్ట్ మినిస్టర్ కవిత. మహనీయుడైన ఆ ఉపాధ్యాయుణ్ణి స్మరించి నేడు జీవితం ధన్యత గడించింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

నివర్తి మోహన్ కుమార్

Previous article
Next article
Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles