Thursday, April 25, 2024

కరోనా నేర్పిన కొత్త పాఠాలు

  1. మనుషులను కాపాడడం దేవుళ్లకూ, దైవాంశసంభూతులకూ సాధ్యం కాదు.

కరోనా ధాటికి తట్టుకోలేక అన్ని మతాల అందరి దేవుళ్ళూ  పారిపోయారు. యుద్ధంలో ఓడిపోయిన – ఎవరికీ ఉపయోగపడని ఆ దైవ భావనని ఇంకా నిలుపుకోవడం ఎందుకూ? మీకు నిజంగా సహాయపడ్డవారికి కృతజ్ఞతలు  చెప్పుకోండి. మీ విలువ పెరుగుతుంది. నిరంతరం మానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తల్ని గౌరవించుకోండి. వ్యాపార దృష్టి ఉన్న డాక్టర్లూ, ఇంజనీర్లూ ఉంటారేమో కానీ శాస్త్రవేత్తలు ఉండరు. అలాగే వ్యాపారానికి దూరంగా ఉంటూ – సేవా భావంతో పని చేసే ఇతర వృత్తుల వారినందరినీ గుర్తించండి. ఒక రకంగా కరోనా హేతువాదాన్ని తట్టిలేపింది. లేకపోతే మతం, భక్తి, పూజ, ప్రేయర్లు, నమాజులు – అన్నీ ఎందుకు పనిచేయలేదూ? అవన్నీ బతుకుతెరువు కోసం మార్గాలు-ఆత్మవంచనలు-నటనలు అని తేలిపోయింది!

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

మత విశ్వాసాన్ని మంచి ప్రవర్తనగా అనుకోకూడదు. ఎందుకంటే మతవిశ్వాసానికి నైతికతకు సంబంధం లేదు. మంచి ప్రవర్తనకూ, నైతికతకూ గట్టి సంబంధం ఉంటుంది. మత విశ్వాసకులే అనేక అనైతిక కార్యకలాపాలకు పూనుకుంటున్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం! నువ్వుమంచి వ్యక్తివా కాదా అనేది నీ మత విశ్వాసం మీదనో, నీ స్థాయి మీదనో, నీ సంస్కృతీసంప్రదాయాల మీదనో, నీ చర్మం రంగుమీదనో, రాజకీయ ధోరణి మీదనో ఆధారపడి ఉండదు. అది కేవలం నువ్వు ఇతర మనుషుల్ని ఎలా చూస్తావు, వారితో ఎలా వ్యవహరిస్తావు – అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

Also read: రే’ ను గూర్చి రేఖామాత్రంగా

  • ప్రపంచంలో దయాళువులకు కొదవ లేదు.

సినీ నటులు సోనూసూద్, ప్రకాశ్ రాజ్ లు తెరమీద విలన్లు. కానీ నిజజీవితంలో హీరోల్లాగా ప్రవర్తించారు. కొందరు సూపర్ స్టార్ లు మాత్రం ఇంట్లో దోశలు వేస్తూనో, చెట్లకు నీళ్లు పెడుతూనో కాలక్షేపం చేశారు. ఉన్నవాళ్ళు కోట్లలో విరాళాలు ప్రకటిస్తే, కొందరు సామాన్యులు వెలకట్టలేని దాతృత్వం ప్రదర్శించారు. హాస్టిటల్ లోఇంటెన్సివ్ కేర్ లోఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, ఇంటికొచ్చి వంటలు చేసి, వలస కార్మికుల ఆకలిబాధ తీర్చినవారున్నారు. ఎవరో దయార్ద్రహృదయలు, ఎన్నో సామాజిక సంస్థలు కుల, మత, ప్రాంతీయ భేదాలు చూడకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో ఆహారం అందించడం మనం చూశాం. రాజకీయాలకు అతీతంగా మనిషి లోని మానవత్వమే గెలిచి నిలిచింది.

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

  • పరిశుభ్రత – ఆరోగ్యాల ప్రాముఖ్యం తెలిసి వచ్చింది.

చేతులు కడుక్కుంటూ ఉండడం – సానిటైజర్ లు వాడుతూ ఉండడం మామూలై పోయింది. ఇమ్యూనిటీ గురించిన అవగాహన, విటమిన్ల పరిజ్ఞానం పెరిగింది. జీవ-వైద్య శాస్త్రాల ప్రాముఖ్యం తెలిసొచ్చింది. ఉన్నపళాన ఆక్సీమీటర్ వాకం పెరిగింది. గోరువెచ్చని నీరు తాగడం, అనవరసంగా బయటకు వెళ్ళకుండా ఉండడం జనానికి అలవాటైంది.

  • జంతు ప్రదర్శన శాలల్లో జంతువులు ఎలాంటి బాధను అనుభవిస్తాయో అర్థమయ్యింది.

స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే జంతువులు, మనుషుల వినోదం కోసం బందీలై, ముక్కుతూ మూలుగుతూ జంతుప్రదర్శనశాలల్లో ఎలా కాలం గుపుతాయో – హౌస్ అరెస్టయిన నాయకులు ఎలాంటి జీవితం గడపాల్సి వస్తందో…ప్రపంచవ్యాప్తంగా సామాన్య పౌరులు కూడా అలాంటి బాధను, వేదననూ అనుభవించాల్సి వచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్లు ప్రకటించినా … ఆ లాక్ డౌన్లు ఎన్నో ఇతర రంగాల మీద ప్రభావం చూపాయి. పరిస్థితుల్ని ఎదర్కొని, తట్టుకోలేని పిల్లల్లో, వృద్ధుల్లో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలకు విఘాతం కలిగింది. కొత్త జీవన విధానాలు అలవరచుకోవలసి వచ్చింది.

Also read: ‘రామ్ చరిత్ మానస్’ లో తులసీదాసు ఏమి రాశారు?

  • అమెరికన్లు వాళ్లు చెప్పుకునేంత తెలివిగలవాళ్ళు కాదు.

కారణం ఏమంటే, కోవిడ్ – 19 మరణాలు అక్కడ అత్యధికంగా సంభవించాయి. అప్పుడు అక్కడ దేశాధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నిర్ణయాలు దేశంలో కరోనాను కట్టడి చేయలేకపోయాయి. తమ దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో మందీమార్బలంతో భారత దేశానికి వచ్చి వెళ్ళాడు. ఇక్కడ మన దేశంలోకరోనా వ్యాప్తికి కారకుడయ్యాడు. భారత ప్రధాని ఆహ్వానంపైనే వచ్చాడు. కానీ, అది రావలసిన సమయం కాదు. అది ఆహ్వానించాల్సిన సమయం కూడా కాదు. తప్పు ఇరువైపుల నుంచీ జరిగింది. తిరిగి వెళ్ళిన తర్వాత ‘‘భారత్ ఒక్క చెత్త దేశం,’’ అని అన్నాడు. ఆహ్వానించిన దేశ ప్రధానికి ఎలా ఉండిందో కానీ, భారతీయులంతా ట్రంప్ ను అసహ్యించుకున్నారు. గొప్ప అభివృద్ధి చెందిన దేశమే అయినా, కోవిడ్ వాక్సిన్ ను మొదట ప్రపంచానికి అందించలేకపోయింది. అమెరికా కన్నా, ఇతర ప్రపంచ దేశాలలో, కోవిడ్ నివారణ అద్భుతంగా జరిగింది.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

  • అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలుగా ఏ మూల సూత్రంతో విభజించారో గానీ, అది తప్పు అని తేలింది.  అన్ని దేశాలూ ఒకే రకంగా కరోనా ఒడిలో చేరాయి. అందువల్ల నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది.

అమెరికా (డొనాల్డ్ ట్రంప్), బ్రెజిల్ (జైర్ బొల్సనారో), ఇండియా (మోదీ) దేశ నాయకులకు చాలా పోలికలు ఉన్నాయి. 1. ముగ్గురూ మెగలోమానియాక్ లే, 2. గొప్ప చదువులు చదివినవారు కాదు. 3.కేపిటలిస్టులంటే ప్రేమ. 4. కరోనాని అడ్డుపెట్టుకొని ప్రకృతి వనరులనూ, ప్రజాధనాన్నీ కేపిటలిస్టులకు దోచి పెట్టారు. 5. పర్యావరణ పరిరక్షణ మీద బాధ్యత లేదు. 6. సైన్స్ అంటే గౌరవం లేదు.  సైంటిఫిక్ టెంపర్ మెంట్ అంటే ఏమిటో తెలియదు. 7. శ్రమజీవులన్నా, కార్మికులన్నా అసహ్యం.  8. వర్గ వివక్ష, కుల వివిక్షను పెంచి పోషిస్తారు. ముఖ్యంగా ట్రంప్ ఎంత ప్రజావ్యతిరేకో ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. అలాగే దేశభక్తి అంటే నిరంతరం పక్కదేశాల్ని తిట్టడం కాదని, దేశాన్ని మింగుతున్న తిమింగళాల్ని వదిలేయడం కాదని ఈ దేశ నాయకులు గ్రహిస్తే బావుండును. కరోనా వ్యాప్తిలో కులమతాల ప్రసక్తి లేదని…వాటి మధ్య జరిగే అల్లర్లు, పోరాటాలు వాటిని ఇంకా బలపరుస్తాయని ఈ దేశ నాయకులు గ్రహిస్తే ఎంత బావుండునూ? ‘‘పూలను పెంచేది వాన. ఉరుము కాదు,’’ అన్న రూమీ మాటను గుర్తుంచుకోవాలి.

Also read: బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

  • మనిషి తన శాస్త్ర సాంకేతికాభివృద్ధిని చూసి విర్రవీగకూడదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.

కోవిడ్-19 కి వాక్సిన్ లు వచ్చినా, అవి నూటికి నూరుపాళ్ళు విజయవంతంగా పని చేస్తున్నాయన్న విషయం ఇంకా తేలలేదు.

  • మనిషి తప్పులు చేస్తే, గుర్తించుకొని వెంటనే పరిష్కరించుకోవాల్సింది కూడా మళ్ళీ మనిషేనన్నది రుజువైంది.
  • శాస్త్రవేత్తలయినా, మందుల కంపెనీవారైనా, డాక్టర్లయినా, పారామెడికల్ సిబ్బందయినా, సఫాయి కార్మికులయినా, పోలీసుయినా…శ్రమించి పని చేసేవవారే ‘హీరోల’వుతారు.
  • ఐ.టి. సెల్ పెట్టి వేల మందితో అబద్ధాలు ప్రచారం చేయించినంత మాత్రాన ప్రజల్ని విడదీయడం ఏ ప్రభుత్వానికీ చేతకాదు.

ఇతర దేశాల నుంచి ముస్లింలు రావడం వల్లనే ఇండియాలో కరోనా వ్యాపించిందన్న అబద్ధం ఏమైంది? వారసత్వ చట్టానికీ, ఇటీవలి నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారి గురించి – ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు? కులమత ప్రాతీయ భేదాలతో దేశ ప్రజలు విడిపోలేదే? ఐకమత్యంగానే ఉన్నారు. ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాల్ని తిప్పికొట్టారు

  1. డార్విన్ చెప్పిన ‘‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ ఎలాగో నిజజీవితంలో ప్రత్యక్షంగా చూశాం.

కాలి నడకన వలస కార్మికులు వేల కిలోమీటర్లు ప్రయాణించడం, దేశవ్యాప్తంగా షహీన్ బాగ్ లు, సింగూ బోర్డర్ లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రైతుల ఆందోళన తాజా ఉదాహరణలు. ఇవన్నీ కరోనా రాకముందూ, వచ్చిన తర్వాతా జరిగినవే! ఊపిరి వదిలి, ఊపిరి తీసుకోవడంలో ఒక సంఘర్షణ ఉంది! అడుగుతీసి, అడుగు వేయడంలో ఒక పోరాటం ఉంది!

Also read: మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?

  1. ప్రేక్షకపాత్ర పోషించిన ప్రభుత్వాధినేతల వల్ల ఏమీ జరగదని తేలిపోయింది.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారి రాష్ట్రాలలో కోవిడ్ – 19 చర్యలు తీసుకున్నారు. వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్సులు జరపడం తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసిందేమీ లేదు. నిధులిచ్చీందీ లేదు. ప్రోత్సహించిందీ లేదు. రెండు వాక్సిన్ లు బయటికి రాగానే ‘మానవత్వ పరిరక్షణలో భారత్ ఒకటి కాదు. రెండు వాక్సిన్ లు ప్రపంచానికి అందిస్తోంది,’ అని గొప్పలు చెప్పుకున్న ఈ దేశ నాయకుడు – వైజ్ఞానిక పరిశోధనా శాలలకు ఇవ్వాల్సిన నిధుల్లో ఎందుకు కోత విధించారూ? వాక్సిన్ లు బయటకు రావడంలో శాస్త్రజ్ఞుల కృషి మాత్రమే ఉంది. నిరంతరాయంగా ఆ ఇన్ స్టిట్యూట్ లు వాక్సిన్ లు కనిపెట్టుతున్నవే. వాటిని ప్రోత్సహించడంలో దేశ నాయకుడి పాత్రగానీ, కేంద్ర ప్రభుత్వం పాత్రగానీ ఏమీ లేదు. వారి వారి దేశాల్లో ట్రంప్, బొల్సోనారోల విధానాలూ ఇలాంటివే!

Also read: మహిళలు పురుషులతో సమానం కాదు, వారి కంటే అధికులు

  1. అసమర్థతతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేవారు కీలక స్థానాల్లో ఉన్నా జనం దృష్టిలో వారు ‘జీరో’లే.
  2. భక్తి, ఆధ్యాత్మికత, భజనలు, పూజలు అన్నీ వ్యర్థం! వివేకంతో మసలుకోవడమే ముఖ్యం.

నిజమే! అందుకే జనం వీటిని పక్కన పెట్టి, ఇమ్యూనిటీ పెంచుకోవడం గురించి తెలసుకుంటున్నారు. నిన్నటి దాకా ఎవ్వరికీ తెలియని ‘ఆక్సీమీటర్’ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటోంది. మదనపల్లెలో విద్యావంతులైన తల్లిదండ్రులే విద్యావంతులైన స్వంత కూతుర్లని చంపుకున్నారు. పైగా   వారు బతికి, తిరిగొస్తారని నమ్ముతున్నారు. ఇలాంటి విషయాల్ని అసహ్యించుకునే ప్రజలు నిజం వైపు, వాస్తవం వైపు మొగ్గు చూపుతున్నారు.

  1. ప్రమాదం కరోనా వల్ల ఎక్కువ జరుగుతోందా? లేక మనిషి వల్లనా అనేది ఇంకా తేలలేదు.

కరోనా మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ, భ్రమల్లో బతికే మనుషుల వల్ల ఎక్కువ  ప్రమాదం జరుగుతోంది. సత్వరం దాన్ని ఆపాలి!

Also read: ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పాయం భార్గవ

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles