Tuesday, November 5, 2024

తెలుగు నేల కీర్తి పాములపర్తి

  • పీవీ జ్ఞానభూమిలో ఉదయం 9 గం. నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఆరంభం
  • పీవీ స్మారకోపన్యాసం డాక్టర్ శశిథరూర్ చే డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటలకు, ‘సకలం’లో

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని,  తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయగలిగారు పాములపర్తి వేంకట (పి.వి.) నరసింహారావు. దక్షిణ భారతావని నుంచి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన తొలి నేతగా,  ఒకే ఒక తెలుగువాడుగా, నరసింహారావు కార్యదక్షత, దార్శనికత ద్వారా ఖ్యాతి గడించారు. “పి.వి”గా లబ్దప్రతిష్టులైన ఆయన బహుభాషావేత్త, రచయిత. స్నాతకోత్తర న్యాయశాస్త్ర కోవిదులు, “అపర చాణక్యుడిగా” పేరొందారు.

లక్నేపల్లిలో జననం

ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పి.వి జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ “వందేమాతరం” గేయాన్ని పాడారు. దీంతో తాను విద్యనభ్యసిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వ విద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుని ఇంట్లోనే ఉంటూ, 1940 నుండి 1944 వరకు ఎల్.ఎల్.బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమం లోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు.

శాసనసభ్యుడిగా 1957లో రాజకీయాలు ప్రారంభం

శాసనసభ్యుడిగా 1957 లో రాజకీయ జీవితం ఆరంభించిన పివి, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా తమ మేధాశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడు. కాంగ్రెస్ హయాంలో పూర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని చాణక్య నీతితో పూర్తి కాలం నడిపించిన మేధావి.1957 లో మంథని నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 1962 లో మొదటిసారి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొంది, 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార మంత్రిగా, 1964 నుండి 1967 వరకు దేవాదాయ, న్యాయ, 1967 లో వైద్య ఆరోగ్య 1968 నుండి 1971 వరకు న్యాయ, సమాచార శాఖలను నిర్వహించారు.

భూ సంస్కరణల అమలు

1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి భూసంస్కరణలు అమలు చేశారు. దాని ఫలితంగా జైఆంధ్ర ఉద్యమం రావడంతో ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసేందుకు దిల్లీ వెళ్ళారు. 1977లో లోక్ సభకు ఎన్నికయ్యారు. జనవరి 1980 నుంచి  జులై 1984 వరకు కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రిగా,  జూలై 1984 నుండి  డిసెంబర్ 1984 వరకు కేంద్ర హోం శాఖమంత్రి, నవంబరు 1984  నుండి  ఫిబ్రవరి 1985 వరకు భారత ప్రణాళికా శాఖ మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జనవరి 1985 నుండి    సెప్టెంబరు 1985 వరకు కేంద్ర రక్షణ శాఖమంత్రిగా, సెప్టెంబరు 1985 నుండి జూన్ 1988 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా,  జూలై 1986 నుండి ఫిబ్రవరి 1988 వరకు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రిగా,  జూన్ 1988 నుండి డిసెంబర్ 1989 వరకు విదేశ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1991 నుండి  మే 29  1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగా,  జూన్ 1991  నుండి 1996 మే 10 వరకు భారత ప్రధానమంత్రిగా పని చేశారు.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణల అమలు

సీఎం పీఠం అధిష్టించగానే అసమ్మతి . ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ –  హైదరాబాదుల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది. పట్టణ భూ గరిష్ట చట్టాన్ని తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొదటిసారి హనుమకొండ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991 ఎన్నికలలో పోటీ చేయకుండా హైదరాబాద్ తిరిగి వచ్చేద్దామనే ప్రయత్నాలలో ఉన్న పీవీ రాజీవ్ హత్య కారణంగా దిల్లీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన  ఉపఎన్నికలో మృదుస్వభావి, తెలువాడనే గౌరవంతో పీవీపై పోటీచేసేందుకు టీడీపీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నిరాకరించారు. దీంతో ఐదు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొంది గిన్నిస్ రికార్డు సృష్టించి పదవ లోక్ సభకు ఎన్నికయ్యారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు

ఆర్థిక సంస్కరణలను అమలు చేసి  కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకుని, “భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా” పేరొందిన మేధావి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం చేపట్టిన సంస్కరణలు, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, ఆర్థిక శాస్త్రవేత్త గా, అధ్యాపకుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ ను ప్రత్యేకించి పిలిపించుకొని  దేశ ఆర్థిక మంత్రిని చేయడం ఆయనకే చెల్లింది. బంగారం తాకట్టు పెట్టాల్సిన స్థితి నుండి ఒక మోస్తరు ఆర్థిక శక్తిగా  తీర్చి దిద్దడానికి పునాది వేశారు. ఆర్థిక సంస్కరణల ద్వారా మార్కెట్ సరళీకరణ ఆర్థిక విధానాన్ని రూపొందించారు. 

పీవీ హయాంలో దౌత్య విజయాలు

సంస్కరణలలో భాగంగా 1992 లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు. పంజాబ్ తీవ్రవాదాన్ని అణచి వేసింది ఆయన ప్రభుత్వమే. కశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు, వారి డిమాండ్లను లెక్క పెట్టక బందీలను విడిపించిన ఘనత ఆయనదే. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి, ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం, పివి ప్రభుత్వం సాధించిన విజయమే. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టి ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించారు. రాష్ట్ర విద్యా మంత్రిగా రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలకు రూపకల్పన చేశారు.

బాబరీ మసీదు విధ్వంసం

ప్రధానిగా ఆయన హయాంలో 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటనలో పీవి వైఖరి వివాదాస్పదమైంది. ప్రధానిగా ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలను పివి ఎదుర్కొన్నారు. చివరకు కేసులన్నీ వీగి పోయాయి. తాంత్రికుడు చంద్రస్వామితో ఆయన సాన్నిహిత్యం అనేక ఆరోపణలకు దారితీసింది.

బహుభాషా కోవిదుడు, 14 భాషలలో అలవోకగా మాట్లాడగలిగిన మేధావి పీవీ. 1940 లో తన సోదరులతో, మిత్రులతో కలిసి కాకతీయ పత్రికను నిర్వహించారు. వ్యాసాలూ, కథలూ రాశారు.  1948 నుండి 1951 వరకు కాకతీయ పత్రిక “సంపాదకునిగా” పని చేశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత వేయి పడగలను, “సహస్ర ఫణ్” పేరుతో, హిందీలోకి అనువాదం చేశారు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది “ఇన్‌సైడర్” అనే  ఆత్మకథ. ‘లోపలి మనిషి’గా ఇది తెలుగులోకి అనువాదమయింది. 1983 లో స్పానిష్ భాషలో ప్రసంగించి అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షులు ఫిడేల్ ను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడు, తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీ పరుడు. చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి సొంత ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి.

జీవితమంతా పోరాటం

నిజాం వ్యతిరేక పోరాట యుద్ధ తంత్ర నిపుణునిగా చివరకు స్వతంత్ర్య సముపార్జన దినం నాడు, 1947 ఆగస్టు 15 న కూడా అటవీ క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్న పోరాట యోధుడు. 2004 డిసెంబర్ 23 న తుది శ్వాస వదిలా రాయన. పి.వి. స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు.  శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించి 19.10.2009 న ప్రారంభించారు.   పివికి భారత రత్న అవార్డు ఇవ్వాలని సీఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అధ్యక్షతన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసి అనుసరిస్తున్నారు.

శశిథరూర్ చే పీవీ స్మారకోపన్యాసం 23న

పీవీ స్మారకోపన్యాసాలను ప్రసిద్ధ పాత్రికేయుడు, సకలం సంపాదకులు కె. రామచంద్రమూర్తి 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రఖ్యాత రచయిత, తిరువనంతపురం నుంచి మూడు సార్లు లోక్ సభకు ఎన్నిక అవుతూ వస్తున్న మాజీ కేంద్రమంత్రి డాక్టర్ శశిథరూర్ పీవీ వర్థంతినాడే స్మారకోపన్యాసం చేస్తున్నారు. ఈ ఉపన్యాసాన్ని సకలం ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభంకానుంది. ఈ కింది ఫేస్ బుక్ లింక్ లో కూడా వీక్షించవచ్చు.

https://www.facebook.com/events/1179936942470193/

(డిసెంబర్ 23…. పి.వి. వర్ధంతి)

ఇదీ చదవండి:ఇద్దరు తెలుగు బిడ్డలు, ఇద్దరూ శాపగ్రస్థులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles