Monday, November 28, 2022

జనరల్ రావత్ దంపతులకు అంత్యక్రియలు

  • సకల సైనిక లాంఛనాల మధ్య వీరుడికి వీడ్కోలు
  • రవాత్, మథూలికలకు అంత్యక్రియలు నిర్వహించిన ఇద్దరు కుమార్తెలు కృతిక, తరిణి
  • బ్రిగేడియర్ లిడ్డర్ కూ సైనిక లాంఛనాలతో వీడ్కోలు

దిల్లీ: భారత దళపతి జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం దిల్లీలో బ్రార్ స్క్వేర్ క్రిమెటోరియంలో జరిగాయి. ప్రభుత్వాధినేతలూ, రాజకీయ నాయకులూ, సైనికాధికారులూ నిశ్శబ్దంగా జనరల్ రావత్ కు నివాళులు అర్పించారు. జనరల్ రావత్ కుమార్తెలు కృతిక, తరిణి తమ తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే చితిపైన రావత్, ఆయన భార్య మథూలిక భౌతిక కాయాలను పక్కపక్కనే పడుకోపెట్టారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జనరల్ కు నివాళిగా చితి పక్కనే నిలబడి ఉన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రభుత్వ ఉన్నతాధికారులూ వారి పక్కనే ఉన్నారు. శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి సీనియర్ సైనికాధికారులు వచ్చి ఈ కార్యక్రమంలో జనరల్ రావత్ కి గౌరవ సూచనగా పాల్గొన్నారు. దేశీయాంగ మంత్రి అమిత్ షా, జాతీయభద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఉదయం జనరల్ రావత్ నివాసానికి వెళ్ళి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నాయకులు కూడా జనరల్ రావత్ భౌతిక కాయానికి వందనాలు సమర్పించారు.

Prime Minister Narendra Modi paying tributes to Gen. Rawat and others on Thursday evening

జనరల్ రావత్ కు అంత్యక్రయలు జరగడానికి కొద్ది సేపటి క్రితమే ఆయనతో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ కు సైనికాధికారులు వీడ్కోలు చెప్పారు. సైనిక లాంఛనాలలో సుమారు 800 మంది సైనికులు పాల్గొన్నారు. పదాతిదళాలు, నౌకాదళం, వైమానిక దళానికి చెందిన సైనికులు, ప్రభుత్వ అధికారులూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ, జాతీయ పతాకాన్ని చేతిలోఊపుకుంటూ అమరుల భౌతిక కాయాలను మెల్లగా రవాణా చేస్తున్న శతఘ్నివాహనానికి ఇరువైపులా నడిచారు.

ప్రధాని నివాళి

దిల్లీలోజనరల్ రావత్ నివాసానికి ఉదయం పదకొండు గంటల నుంచి వందలాది పౌరులు వెళ్ళి వీరుడికి కడసారి వీడ్కోలు చెప్పారు. చైనా, అమెరికా, బ్రటిన్, ప్రాన్స్, జపాన్, ఇజ్రేల్, తదితర దేశాల నుంచి ప్రముఖులు సంతాపసందేశాలు పంపారు.

గురువారం రాత్రికల్లా జనరల్ రావత్, ఆయన భార్య, వారితో పాటు మరణించిన 11 మంది సైనికాధికారుల భౌతిక కాయాలను సీ130-జె సూపర్ హెర్క్యూలెస్ రవాణా విమానంలో దిల్లీకి తీసుకొని వచ్చారు. వెంటనే ప్రధాని నరేంద్రమోదీ నివాళి అర్పించినప్పుడు ఆవేశపూరితమైన వాతావరణం నెలకొన్నది. జనరల్ రావత్, భార్య మథూలిక, బ్రిగేడియర్ లిడ్డర్, లాన్స్ నాయక్ వివేక కుమార్ ల భౌతిక కాయాలను మాత్రమే ఇంతవరకూ గుర్తించారు. ఇతరుల కాయాలను గుర్తించేవరకూ వారి దేహాలను సైనిక స్థావరం ఆస్పత్రిలో ఉంచుతారు.

హెలికాప్టర్ ప్రమాదంలో బటయపడిన ఒకే ఒక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

నిలకడగా కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి

వెల్లింగ్టన్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 14 మంది ప్రయాణికులలో 13 మంది దుర్మరణం పాలైనారు. బతికి బయటపడిన ఒకే ఒక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. మొదట ఆయనకు వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. అనంతరం బెంగుళూరులోని సైనిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రమాదపుటంచుల్లో ఉన్నప్పటికీ నిలకడగానే ఉంది. 12 అక్టోబర్ 2020న చేసిన సాహస కృత్యానికి గుర్తింపుగా వరుణ్ సింగ్ కు రాష్ట్రపతి కోవింద్ 15 ఆగస్టు 2021న  శౌర్యచక్ర ప్రదానం చేశారు. చదువులో అంత బాగా రాణించకపోయినప్పటికీ జీవితంలో పైకి రావచ్చుననీ, ఘనకార్యాలు సాధించవచ్చుననీ తన జీవితం నిరూపించిందని సెప్టెంబర్ లో హరియాణాలో తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ కు రాసిన లేఖలో కెప్టెన్ వరుణ్ సింగ్ అన్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles