Sunday, September 15, 2024

మరోసారి లంకాదహనం

రామాయణమ్200

హనుమంతుడు జీవించిఉన్నాడా?  బలహీనమైనస్వరం ఒక వృద్ధుడిది వినపడ్డది విభీషణునికి. ఇంద్రజిత్తు సృష్టించిన మారణహోమంలో ఆ రోజు కోట్లకొలదిగా వానరులు అసువులు బాశారు. అందరినీ చూసుకుంటూ వస్తున్నారు విభీషణ, ఆంజనేయులు.

Also read: ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం

రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగదాదులంతా ప్రాణం ఉండి కూడా కట్టెలలాగా కదలికలేకుండా పడిపోయారు. అందరినీ చూసుకుంటూ వృద్ధుడైన జాంబవంతుడి వద్దకు వచ్చి  ఆగి  పరామర్శించినపుడు ఆయన అడిగిన ప్రశ్న అది.

విభీషణుడికి ఆశ్చర్యం వేసింది.  అదేమిటి? రాముడి గురించి అడగలేదు. లక్ష్మణుడిగురించి అడగలేదు. తమ మహారాజు సుగ్రీవుడి యోగక్షేమాలు అడగలేదు. హనుమంతుడే ఎందుకు?

ఉండబట్టలేక అదే విషయాన్ని పైకి అడిగేశాడు విభీషణుడు జాంబవంతుణ్ణి!

Also read: అతికాయుని యమపురకి పంపిన రామానుజుడు

అప్పుడు జాంబవంతుడు నీరసంగా నవ్వి , ‘‘నాయనా, వాడు బ్రతికి ఉంటే మనము చనిపోయినా తిరిగి బ్రతుకగలం. వాడు చనిపోతే మనము బ్రతికిఉన్నా చనిపోయినట్లే. అంత గొప్పవాడు హనుమ!

విభీషణుడి వెనకాల నిలబడి ఈ మాటలు వింటున్న హనుమస్వామి ముందుకు వచ్చి తాతపాదాలకు వినయంగా నమస్కారం చేశాడు.

‘‘నాయనా ఆంజనేయా, అందరిబాధలు తీర్చగలవాడివి నువ్వే! నీ పరాక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చినది.

‘‘అందరికీ గుచ్చుకున్న బాణాలనుండి విముక్తి కలగాలంటే నీవు ఒక పని చేయాలి ……. హిమాలయాలలోని కైలాసశిఖరాన్ని ఆనుకుని ఓషధీ పర్వతం ఉన్నది. దానిమీద సకల దివ్యౌషధాలు ఉన్నాయి’’ అని చెపుతూనే ఉన్నాడు జాంబవంతుడు. ఆంజనేయుడు గాలిలో ఉన్నాడు.

Also read: తమ్ముడి మరణంతో బేజారైన రాక్షసరాజు

ఆంజనేయుడు కైలాస శిఖరాన్ని క్షణకాలంలో చేరుకున్నాడు. ఆ శిఖరం మీదనుండి చూశాడు. ఆ పక్కనే ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ  ఔషధాలతో నిండి ఉన్న ఓషధిశిఖరం కనపడ్డది.

తమనే చూస్తున్నట్లగా తమకోసమే ఆంజనేయుడు వచ్చినట్లుగా గ్రహించాయి ఆ ఔషధాలు.

వెంటనే అవి తమకాంతిని ఉపసంహరించుకొని కనపడకుండా మాయమయి పోయాయి.

ఆంజనేయుడు ఓషధీ శిఖరము యొక్క ఈ ధిక్కారాన్ని సహించలేకపోయాడు. గిరిశిఖరాలు భళ్ళున బ్రద్దలయ్యేటట్లుగా భీషణనినాదం చేశాడు. ‘‘కనపడరా మీరు? ఇదుగో చూసుకోండి’’ అన్నట్లుగా తొడిమ త్రుంపినట్లుగా ఆ పర్వతశిఖరాన్ని తుంపి తన అరచేతిలో పెట్టుకొని తిరిగి పయనమయ్యాడు.

తిరిగి వచ్చి వానరసైన్య మధ్యభాగంలో ఎత్తైన ఆ శిఖరాన్ని ఉంచాడు

ఆ దివ్యౌషధుల మీదనుండి వచ్చే సుగంధపరీమళాలు అందరినీ మేల్కొలిపాయి. అంతకు ముందురోజులలో ప్రాణాలు కోల్పోయి యుద్ధరంగంలో కళేబరాలుగా పడివున్న వానరాలు కూడా తిరిగి ప్రాణంపోసుకున్నాయి.

Also read: కుంభకర్ణుని వధ

అందరూ స్వస్థులయ్యారు యుద్ధానికి మరల సిద్ధమయినారు.

రావణుడు చేసిన ఒక మూర్ఖపు పని అతనికి నష్టం తెచ్చింది. లెక్క తెలవడం కోసమని చనిపోయినవాడు చనిపోయినట్లుగా తన వారందరినీ సముద్రం పాలు చేశాడు…..లేకపోతే వారుకూడా ఈ ఓషధీగంధంతో మరల బ్రతికెడి వారే!

….

అందరు వానరులు నిద్రనుండి లేచినట్లుగా లేచినారు. అప్పుడు సుగ్రీవుడు హనుమంతునితో సంప్రదింపులు చేసి తన సైన్యమునంతటికీ లంకను తగులపెట్టమని ఆజ్ఞ ఇచ్చినాడు.

ఉద్యానవనాలు, స్కంధావారాలు, ఆయుధాగారాలు అన్నీ తగులపెట్టాలి ఏ ఒక్కటీ వదిలి పెట్టవద్దు అని ప్రత్యేకముగా చెప్పి మరీ పంపినాడు.

అసలే వానరులు! ఆపై రాజుగారు అనుమతించినాడు. ఇక వారి ప్రతాపము చూపించినారు. ఇదీఅదీ అని లేకుండా అన్నీ తగులపెట్టి వినోదము చూసినారు.

ప్రజ్వరిల్లిన అగ్ని జ్వాలల కాంతిలో ఎర్రగా ఉన్న లంకానగరాన్ని,  ఆ ఎరుపు ప్రతిఫలించి రక్తవర్ణములోనికి మారి కనపడుతున్న లవణ సముద్రాన్ని ఆనందంగా వీక్షించసాగారు అందరూ.

భవనాలు ఫెటిల్మని పేలుతున్న చప్పుడు. సౌధాలు కూలుతున్న చప్పుడు.

ఇళ్ళలోనుండి పిల్లలను చంకనేసుకొని ఏడుస్తున్న ఆడవారి దీనాలాపాలు, హాహాకారాలు, అగ్నిదేవుడికి స్వాహాకారాలుగా వినిపించగా ఆయన ఇంకాఇంకా ప్రజ్వరిల్లుతూ తన సప్తజిహ్వలనూ చాచి పట్టణాన్ని కబళిస్తున్న వైనం గమనించిన వానరుల ఆనందోత్సాహాలతో కేరింతలు పెడుతున్నారు. ప్రాణభయంతో పరుగెత్తే  రాక్షసులను పిలిచిమరీ వారు కవ్విస్తున్నారు….

 ఆ రాత్రి లంకానగర దీప్తి పరిసమాప్తి.

అది రక్కసిమూకలకు కాళరాత్రి.

వీటికి తోడు రాముడు ధనుస్సు చేతబూని చేసిన టంకారధ్వనికి పుట్టిన ప్రకంపనలు ఆకాశమంతా నిండి లంకానగర సౌధాల గోపురాలు బీటలువారి నేలకొరిగాయి .ఆయన పుంఖానుపుంఖాలుగా విడుస్తున్న బాణాలు అన్ని సౌధాలలో నిండిపోయాయి.

లంకానగరవాసుల గుండెలలో గుబులు పుట్టింది. తమ భవిష్యత్తుమీద తొలిసారి దిగులు పుట్టింది.

రావణుడు ఈ అల్లకల్లోలము చూసి ప్రళయకాలరుద్రుడైనాడు. కుంభకర్ణుడి కుమారులైన కుంభనికుంభులను రావించి యుద్ధానికి పంపించాడు.

Also read: కుంభకర్ణుడి స్వైరవిహారం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles