Friday, March 29, 2024

ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు

రామాయణమ్203

‘‘అదుగో నికుంభిల! అక్కడే ఇంద్రజిత్తు హోమము చేయుచున్నాడు,’’అని లక్ష్మణునకు విభీషణుడు చూపెను‌.

అన్న అనుజ్ఞ తీసుకొని హనుమదాదులను ఇతర వానర సైన్యమంతటినీ వెంటనిడుకొని ఇంద్రజిత్తును ఎదుర్కొనుటకు లక్ష్మణుడు విభీషణుని వెంట బయలుదేరినాడు.

Also read: మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు

‘‘అదుగో రాక్షస సైన్యము. ఆ సైన్యమంతటినీ చెల్లాచెదురగునట్లుగా కొట్టినగానీ ఇంద్రజిత్తు అగుపడడు.’’

విభీషణుడు పలికిన వెంటనే లక్ష్మణుడు తన ధనుస్సును ఎక్కుపెట్టి బాణవర్షమును కురిపించెను. వానరులందరూ రాక్షసులపై బడి ఘోరయుద్ధము సలుపసాగిరి.

హనుమ ఒక మహావృక్షమును పెకిలించి దానిని అటునిటూ ప్రచండవేగముతో తిప్పుతూ రాక్షస సంహారము కావించసాగెను.

Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు

రాక్షస సైన్యము గగ్గోలుపడి చెల్లాచెదురైపోసాగినది. అది గమనించిన ఇంద్రజిత్తు హోమము పూర్తికాకుండగనే  లేచి విల్లుచేతబూని మృత్యువుకు మరోరూపమా ఇతడు అన్నంత భయంకరముగా వెలుపలికి వచ్చెను.

వస్తూ వస్తూనే హనుమపైకి తనరధమును పోనిమ్మని సారధికి ఆజ్ఞ ఇచ్చి హనుమస్వామి శిరస్సుపై బాణములను, ఖడ్గములను, పట్టిసములను వరుసగా విసిరెను.

వారు ఘోరముగా ద్వంద్వయుద్ధము చేయుచుండగా విభీషణుడు లక్ష్మణుని వైపు చూసి ‘‘అదుగో ఇంద్రజిత్తు హనుమకు హాని కలిగించకముందే నీవు నీ వాడి శరములతో రావణపుత్రుని సంహరింపుము’’ అని హెచ్చరించెను.

Also read: మరోసారి లంకాదహనం

‘‘ఇదుగో మఱ్ఱిచెట్టు ఇది ఇంద్రజిత్తు హోమము చేయుప్రదేశము. ఇక్కడే ఇంద్రజిత్తు భూతబలిగావించి యుద్ధమునకు బయలుదేరును. అతనికంటె ముందే నీవచటికి చేరి అతని మాయా గుర్రములను, రధమును సారధిని ధ్వంసము చేయుము’’ అని పలికిన విభీషణుని మాటలు విని లక్ష్మణుడు తన ధనుస్సునుండి చిత్రవిచిత్రముగా ధ్వనులు వినిపింపచేసెను.

మరుక్షణములో ఇంద్రజిత్తు కోపావేశముతో లక్ష్మణుని ముందునిలిచినాడు.

పినతండ్రి వైపు చూసి, ‘‘ఛీ దుర్మార్గుడా!  శత్రువుతో కలిసి ఇంటిగుట్టు బట్టబయలు చేయుచుంటివికదా. పినతండ్రివి అయివుండి నాకు ద్రోహము చేయుదువా’’ అని తిరస్కారభావముతో తృణికరించి మాట్లాడెను.

‘‘ఓయీ, నీతండ్రి చేసిన ధర్మభ్రష్టమైన పనిలో నేను పాలుపంచుకోను. అతనిని సమర్ధించుట తీవ్రమైన విషముగల పామును ముద్దాడి కౌగలించుకొనుట  వంటిది. ధర్మభ్రష్టమైన శీలము, పరభార్యాస్పర్శనము, పరధనాపహరణము, తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అత్యంత ప్రమాదకరములు, అత్యంత హేయములు…తను, తనవారల ఐశ్వర్యమును నాశనము చేయు దుర్గుణములు కలవాడయినాడు నీ తండ్రి. అందుచేతనే తోడబుట్టిన వాడయినప్పటికీ నీ తండ్రిని వదిలి వేసితిని.

Also read: ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం

‘‘ఇక నీవు ఉండవు. నీ లంకాపురి ఉండదు. నీవు నీ హోమము చేయజాలవు.

వీరశ్రేష్ఠుడు, నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణునితో యుద్ధము చేయుట తప్ప నీకు మార్గము లేదు…’’అని విభీషణుడు ఇంద్రజిత్తుతో అత్యంత దృఢముగా సంభాషించెను.

విభీషణుని పలుకులకు ఇంద్రజిత్తు ముఖము ఎర్రనైపోయినది. కోపముతో వణికిపోయి తటాలున రధముమీదకు దూకి సర్రున కత్తిదూసినాడు. ఇంకొక చేతిలో ధనుస్సు పట్టుకొని సకల ఆయుధములు సిద్ధము చేసికొని ఎదురుగ నిలచిన లక్ష్మణుని తేరిపార చూసినాడు. ఆ చూపులు మామూలు మనుషులను యమపురికి సాగనంపెడెవి. అంత భయంకరమైన ధృక్కులతో హనుమ భుజముపై ఉదయ పర్వతముపై సూర్యుని వలె కూర్చునియున్న సౌమిత్రిని కాంచినాడు…‘‘రా ..రా …నాతో తలపడు. నా ప్రతాపమేమో చూతువుకాని, నా బాణముల పదును రుచిచూతువుగాని, నా బాణములనుండి పుట్టిన అగ్ని మీ శరీరములను దూదిని దహించినట్లు దహించివేయును’’ అని గర్జిస్తూ శత్రుభయంకరమైన రూపముతో యున్న మేఘనాధుని ప్రశాంతముగా వీక్షించినాడు లక్ష్మణుడు.

‘‘రాక్షసా! ఎందుకు ఈ వృధాలాపములు! వీరుడైనవాడు చేయదలచుకున్నపనిని చేసిచూపును. అంతియే కానీ ఈ వాగాడంబరమేల నీకు? ఇప్పటి వరకు మాతో జరిగిన యుద్ధములలో నీవు కనపడకుండా దొంగవలే యుద్ధము చేసితివి. రా! నీ బాణములు ప్రయోగించుము. నేను సిద్ధము’’ అని సౌమిత్రి పలికెను.

అప్పుడు ఇంద్రజిత్తు మహావేగముగా ఒక బాణముతో లక్ష్మణుని కొట్టెను. జివ్వున రక్తము పొంగి శరీరము అరుణిమదాల్చి పొగలేని నిప్పుకణికవలే సౌమిత్రి మెరిసి పోయెను. అప్పుడు రోషముతో రామానుజుడు ఐదుబాణములు ఒకేసారి సంధించి ఆకర్ణాంతము నారి సారించి ఇంద్రజిత్తుగుండెలు కదిలిపోవునట్లుగా కొట్టెను. ఒకరినొకరు జయించవలెనన్న పట్టుదలతో పోరుసాగుచుండెను.

Also read: అతికాయుని యమపురకి పంపిన రామానుజుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles