Friday, December 2, 2022

గోదారంగనాథుల లాజహోమం

9 వారణమ్ ఆయిరమ్ (గజసహస్రం)

వరిశిలై వాళ్ ముగత్తు ఎన్నై మార్ తాం వందిట్టు

ఎరిముగమ్ పారిత్తు ఎన్నై మున్నే నిఱుత్తి

అరిముగన్ అచ్చుతన్ కైమ్మేలే ఎన్ కై వైత్తు

పొరిముగందట్ట క్కనా క్కండేన్ తోళీ నాన్

ప్రతిపదార్థాలు

వరిశిలై వాళ్ ముగత్తు = విల్లువంటినుదురుకలిగి కాంతిమంతమగు ముఖారవిందముతో,  ఎన్నై మార్ = నా అన్నదమ్ములు, తాం వందిట్టు = ప్రేమతో వచ్చి, ఎరిముగమ్ పారిత్తు = అగ్ని ముఖమును చూచునట్టు, ఎన్నై = లజ్జవలన వెనకనిలిచిన నన్ను, మున్నే నిఱుత్తి = ముందు నిలిపి,అరిముగన్ =శత్రువులకు ఎదిరింప శక్యముగాని, సింహముఖముతో దివ్యతేజోవిరాజితంబైన, అచ్చుతన్ = ఆశ్రితులను ఎన్నడూ వీడని అచ్యుతుడైన శ్రీ కృష్ణుడి, కైమ్మేలే = శ్రీహస్తములపైన, ఎన్ కై వైత్తు = నా చేతినుంచి, పొరి = లాజలను (పేలాలను) ముగన్దు = ఎత్తి, అట్ట= అగ్నిలో నుంచినట్టు, క్కనా క్కండేన్ = కల గన్నానే, తోళీ=చెలీ,  నాన్= నేను.

తెలుగా భావార్థ గీతి

సోదరులు దరిజేరి లజ్జావనత వదనను నను హోమాగ్నికెదుట నిలిపి

సాదరంబున నా హస్తంబులన్  పురుష సింహుని అచ్యుతుని శ్రీహస్తంబులన్

వేద మంత్రోక్తముగనుంచి, దోసిళ్ల లాజలన్ నింపి, హవిస్సులుగనర్పించినట్లు

నాదు స్వప్నమున లాజహోమ వైభవమును కన్నులార గాంచితినే చెలీ

Also read: గోద పాదాలతో సన్నికల్లు తొక్కించిన శ్రీకృష్ణుడు

వివరణ

వంచిన వింటి వంటి కుదురైన కనుబొమలుకలిగి అపూర్వ ముఖకాంతితో విరాజిల్లు నా సోదరులు ప్రేమతో వచ్చి, హోమాగ్నిపై సమిధలుంచి,సిగ్గుతో తలవంచుకుని వెనుకనిలబడి ఉన్న (లజ్జావనత వదనయగు) నన్ను ఆ పవిత్రాగ్నికెదురుగా నిలిపి, ప్రత్యర్థులకు సింహమువంటి వాడు పురుష సింహము, సమాశ్రితులకు సులభమై ఆశ్రితులను ఎన్నడూవిడువని గుణము కలిగినఅచ్యుతుని శ్రీ హస్తము మీద నా హస్తమునుంచి నా చేత లాజలను (పేలాలను) అగ్నికి మంత్రయుక్తముగా సమర్పించి మాచేచేయించిన హోమవైభవమును (పోరియదళ్ వైభవం) నా స్వప్నములో నేను నా కనులారా చూచినానే చెలీ అంటున్నారు గోదాదేవి ఈ తొమ్మిదో పాశురంలో.

Also read: అగ్ని సాక్షి, గోదా రంగనాథుల ఏడడుగులు

వివాహ క్రతువులో అమ్మికల్లు లేదా సన్నికల్లును వధువుతో తొక్కించే తంతు జరిగిన తరువాత లాజహోమం నిర్వహిస్తారు. లాజలుఅంటే పేలాలు. వధువు దోసిటి పట్టినపుడు ఆమె సోదరులు ఆ దోసిటిలో పేలాలునింపుతారు. వరుడు ఆ పేలలపై నేయి చుక్కలువేయాలి. తరువాత అయిదు వేదమంత్రాలుచదవాలి. ఒక్కో మంత్రం తరువాత హోమాగ్నిలో లాజలను హవిస్సుగా సమర్పించాలి. ఆ తరువాత వరుడు వధువు నడుముకు అంతకుముందు కట్టిన దర్భ బంధాన్ని విప్పుతాడు.  ఆ తరువాత వారుణ మంత్రం పఠిస్తూ వివాహబంధం లోకి వధువును ఆహ్వానిస్తాడు.

Also read: గోదా వధువు చేయి పట్టిన గోపాలుడు

లాజహోమం వివాహ క్రతువులో చివర వచ్చే ప్రక్రియలలో ఉంటుంది. లాజలను నవదంపతులకు మంగళం కలగాలని ఆశిస్తూ అగ్నికి హోమద్రవ్యంగా సమర్పిస్తారు. వివాహ మంటపంలో హోమకుండం ఏర్పాటుచేస్తారు. ఆ పవిత్రాగ్నిలో లాజలను స్వాహా చేసే కార్యక్రమంలో సోదరులను భాగస్వాములను చేస్తారు. రెండు కుటుంబాల మధ్య ఈ వివాహంతో బంధం ఏర్పడుతుందని ఈ ప్రక్రియ సూచిస్తుంది. మూడుసార్లు హోమాగ్నికి ప్రదక్షిణ చేస్తూ పేలాలను సమర్పిస్తూ ఉంటారు. యమ, వరుణ, అగ్ని దేవతలను ఆరాధిస్తూ నవదంపతుల ఆనందం అభివృద్ధి కోసం ప్రార్థనలు చేస్తారు.

Also read: మధురాధిపతేరఖిలం మధురం

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles