Tuesday, November 29, 2022

ఉద్వేగభరితమైన రచన – లేడీ డాక్టర్స్!

(21- 08 – 2022 ఆదివారం రామచంద్రాపురం డా. చెలికాని రామారావు భవన్ లో జరిగిన లేడీ డాక్టర్స్ పుస్తకావిష్కరణ సభలో గౌరవ్ ప్రసంగం)

మిత్రులారా,

ఇంతమంది డాక్టర్లు, డాక్టరేట్లు కలిగిన ప్రముఖులు వక్తలుగా శ్రోతలుగా ఉన్న ఈ సభలో నన్ను మాట్లాడమని కోరడమంటే, అది అభిమానంతోనే కానీ ఇందుకు అర్హుడినని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, ఇదో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సందర్భం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలోనూ, కనీసం వందేళ్ళ అభ్యుదయ సాహిత్యంలోనూ కూడా తడమని అంశం. మహిళా వైద్యుల గురించి చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ప్రస్తావన ఉంది. అలాంటి అంశం పై ఒక లోటును పుస్తకం పూరించిందని చెప్పవచ్చు!

Also read: సమసమాజమే సోమసుందర్ స్వప్నం!

ఈ నాగరిక ప్రపంచంలో మనందరం ఎవరికి కృతజ్ఞులమై ఉన్నా లేకున్నా మనం పుట్టినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా ఈ ప్రపంచంలోకి రావడానికి కారణమై, మన ఉనికికి అవకాశం కల్పించిన డాక్టర్స్ కి కృతజ్ఞులమై ఉండాలి. అలా వ్యక్తిగతంగా నేను జీవించి ఉండడానికి కారణం ఇద్దరు వైద్యులు. ఒకాయన కీ. శే.  డా. ఈశ్వర సుబ్రమణ్యం, రెండు డాక్టర్ రాజ్ కుమార. ఈయన పేరు తప్ప ఎవరో నాకు తెలియదు. కానీ ఈయనే లేకుంటే నేను బతికేవాడ్ని కాదని మాత్రం తెలుసు. ఐయిదు నెలల ప్రాయంలో నాకు ఆపరేషన్ చేసి ప్రాణం పోశాడాయన!

చరిత్రలో మహిళా వైద్యుల ప్రస్తావన లేదు

ఇక చరిత్రలో కూడా మహిళా వైద్యుల గురించిన వివరాలు ఎక్కువ లేవు. ఎమీలియా హిలారియా అనే మహిళ వైద్యం పై మక్కువతో వైద్యవిద్యను అభ్యసించిందని రోమన్ సామ్రాజ్య చరిత్ర తెలుపుతుంది. ప్రాచీనకాలం మన దేశంలో కూడా బౌద్ధం ప్రభావంతో కొద్దిమందైనా స్త్రీలు వైద్యం పై ఆసక్తి చూపించి ఉండవచ్చు. కానీ వాళ్ళ వివరాలు మనకి అందుబాటులో లేవు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకి సంబంధించిన లోతైన అధ్యయనాలు జరిగితే ఆ వివరాలు దొరికే అవకాశం ఉంటుంది!

Also read: మనుషులు – వస్తువులు – సంస్కృతి

మన దేశంలో స్త్రీ ని దేవతగా పూజించడం, బానిసగా వేధించడమే కానీ మనిషిగా చూసింది లేదు. ఈ ఆధిపత్యం ఈనాటికీ కొనసాగుతోంది. దాదాపు  నూటయాభై ఏళ్ళ క్రితం సామినేని ముద్దు నరసింహం మూఢ నమ్మకాలను, ఛాందస భావాలనూ చెండాడుతూ హితసూచని అనే అద్భుతమైన గ్రంథం రాశాడు. ఆయన ఆస్తికత్వం మినహా అన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘాలు సొంతం చేసుకుని ప్రచారం చేయవలసిన గొప్ప పుస్తకం అది. ఆ కాలానికి గురజాడ ఇంకా పుట్టనే లేదు, కందుకూరి అయిదేళ్ళ బాలుడు. ఆ మహత్తర గ్రంథంలో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే,”స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి” అన్నది. అంటే అప్పటివరకూ కుట్టుపనులు, అల్లికలు, ముగ్గులు, వంటలు మాత్రమే స్త్రీల పనులనే భావనను పటాపంచలు చేస్తూ స్త్రీలకు సమాన విద్యలు అందుబాటులోకి వస్తున్నాయనే భావనతోనే ఆయనీ వాక్యం రాసారు !

అందుకు కారణాలు లేకపోలేదు. ఆనాడు  కందుకూరి రాసిన దేహారోగ్య ధర్మబోధినీ (1889), ప్రసూతి, శిశుపోషణకి సంబంధించి పత్నీహిత సూచని (1896)తప్పా ఎక్కువ పుస్తకాలేవీ పెద్దగా లేవు. సాంస్కృతిక వికాసానికి దోహదం చేసిన మరో విశిష్ట సంఘటన ఏమంటే, మాలపల్లి రచయిత గొప్ప సంఘసంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్త్రీల కోసం సరిగ్గా వందేళ్ళ క్రితం శ్రీ శారదా నికేతన్ అనే వృత్తివిద్యా కళాశాల స్థాపించడం. అంటే స్త్రీలను వృత్తి చేయడానికి అర్హులుగా పరిగణించే వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక పునర్వికాసానికి నిజంగా ఇదో ఆశావాహ పథం!

Also read: అంతరాత్మ పెట్టిన కన్నీళ్ళు అంబేద్కర్ అనుభవాలు!

ఇవేవీ సులువుగా జరిగినవి కావు, సులభంగా దక్కినవీ కావు. ఇందుకోసం అడుగడుగునా అనేక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా మన దేశంలో స్త్రీ విద్య కోసం ప్రస్తావించిన ప్రతిసారీ ఇద్దరు మహిళా మూర్తుల్ని గుర్తు చేసుకుని తీరాలి. ఒకరు మాతా సావిత్రీబాయి ఫూలే కాగా మరొకరు ఫాతిమా షేక్. స్త్రీలు చదవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సనాతన సమాజం వీళ్ళిద్దరిని చెప్పలేనన్ని హింసలకు గురి చేసింది. నిత్యం రాళ్ళతోనూ, పేడ నీళ్ళతోనూ కొట్టి కొట్టి వేధించింది. అయినప్పటికీ మహిళలు చదవడం, సొంత కాళ్ళ మీద నిలవడం, ఆత్మ గౌరవంతో జీవించడం ఎంత ముఖ్యమో గ్రహింపు ఉండబట్టే వేటికీ వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగారు. మహిళా వైద్యుల గురించి తల్చుకుంటున్న ఈ సందర్భంలో అసలు మహిళా విద్యకి అవకాశం కల్పించిన సావిత్రీబాయి ఫూలే, ఫాతిమా షేక్ లిద్దరినీ ఈనాడు మతసమైక్యత ప్రాధాన్యత దృష్ట్యా కూడా ప్రస్తావించి తీరాలి!

ఈ రోజు ఈ పుస్తకం పరిచయం చేసిన ప్రకాశరావు గారికీ ప్రచురించిన చెలికాని రామారావు మెమోరియల్ కమిటీకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే, ఇంగ్లీషు లో కవితారావు గారి పుస్తకం వచ్చిన ఏడాదిలోపే బహుశా మరే భారతీయ భాషలోనూ ఇంకా రాకుండానే తెలుగువారికి ఈ పుస్తకాన్ని పరిచయం చేసి అందుబాటులోకి తీసుకుని రావడం చిన్న విషయం కాదు. ఈ పుస్తకం సమీక్షలో ఈసరికే నేను రాసినట్లు పుస్తకం అత్యంత సరళమైన పరిచయం. ఇది కేవలం పరిచయమో, తర్జుమానో కాదు. అంతకు మించిన గొప్ప ప్రయత్నం. అడుగడుగునా పుస్తకంలో మనకి కనిపించే సామెతలు, పలుకుబడులు, పాదసూచికలు పరిచయకర్త దీని కోసం చేసిన పరిశోధనని తెలుపుతాయ్. ఈ పుస్తకాన్ని ప్రకాశరావు మాష్టారు తప్పా మరెవరు చేసినా ఇంతకంటే బాగా చేయొచ్చు లేదా బాగా లేకపోవచ్చు కానైతే ఇంత గొప్పగా చేసి ఉండకపోవునని నా అభిప్రాయం!

Also read: చారిత్రాత్మక పోరాటాల అవలోకనం

చివరగా సమాజం కోసం పరితపించే మనుషుల సంఖ్యే తక్కువైపోతున్న సందర్భంలో సామాజిక స్పృహ ఉన్న వైద్యులపై దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు గుర్తుకు తెచ్చుకోవలసిన ఇద్దరు వ్యక్తులు ఒక డాక్టర్, ఒక స్త్రీ. ఆ డాక్టర్ పేరు డా. నరేంద్ర దభోల్కర్, స్త్రీ బిల్కిస్ బానో. ఈ రెండు రోజులుగా బానోకి జరిగిన అన్యాయం గురించి సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఇక ప్రజల్లో ప్రశ్నించే ధోరణిని నిర్మించినందుకు నరేంద్ర దభోల్కర్ హత్య చేయబడ్డారు. ఆయన హత్య తర్వాత మహరాష్ట్ర లో మూఢనమ్మకాల నిరోధక చట్టం వచ్చింది. పదేళ్ళవుతున్నా హంతకులని పట్టుకోలేదు. ఈ వేదికపై నుండి విజ్ఞాన వేదిక మిత్రులకి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, విజ్ఞాన వేదిక ఏర్పడి 35 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ లేడీ డాక్టర్స్ పుస్తకాన్ని విద్యార్థులు యువతలోకి విస్తృతంగా తీసికెళ్ళడం, అలాగే మూఢ నమ్మకాల నిరోధక చట్టాన్ని చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం. ఈ రెండు అంశాల పై సానుకూల స్పందన ఆశిస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన నిర్వహకులకూ, నా ప్రసంగాన్ని ఓపికగా విన్న శ్రోతలకూ కృతజ్ఞతలు తెలుపుతూ, సెలవు!

Also read: కులనిర్మూలన – తులనాత్మక పరిశీలన

గౌరవ్

రామచంద్రాపురం

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (ఆం.ప్ర.)

Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles