Wednesday, April 24, 2024

నాయకత్వ లోపం కాంగ్రెస్ కు శాపం

  • నేతల మధ్య సమన్వయలేమి
  • నైర్యాశ్యంలో పార్టీ శ్రేణులు

పట్నా: బీహార్ ఎన్నికల్లో సీఎం పీఠానికి ఆమడ దూరంలో ఆగిపోయిన మహాకూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర, మహా మహులను దేశానికి అందించిన కాంగ్రెస్ పార్టీ అపజయాలతో కునారిల్లుతోంది. నాయకత్వ లేమితో ప్రత్యర్థి పార్టీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితికి చేరుకొంది. దీంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. వరుస ఓటములు ఎదురవుతున్నా పార్టీ అధినాయకత్వం  ఉదాసీన వైఖరి అవలంబించడంతో సీనియర్ నేతలు కూడా అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఓ వైపు నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థులకు అస్త్రాలను ఇచ్చినట్లయింది. కాలానుగుణంగా మారేందుకు కాంగ్రెస్ సమాయత్తం కాకపోవడం, యువతను ఆకర్షించలేకపోవడం,  సరైన వ్యూహంతో ఎన్నికల్లో దిగకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ను నైరాశ్యంలోకి నెడుతున్నాయి.

గుణపాఠం నుంచి పాఠాలు నేర్వని కాంగ్రెస్

బీహార్ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సీట్ల పంపకంలో మితిమీరిన జాప్యం జరగడం వల్లే తమ పార్టీ ఓటమి పాలైందని కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ అన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉందని ఒప్పుకున్న అన్వర్  దీనిపై ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

ప్రచారంలో కానరాని శ్రద్ధ

బీహార్ లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికలు దగ్గర పడ్డాక సీట్లు ఖరారు చేయడంతో పార్టీ ఓటమి పాలైందని కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిదాలు జరగకుండా పార్టీ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్వర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉండటం కూడా ఓ కారణమని ఆర్జేడీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎన్నికల సమయంలో విందు వినోదాల్లో రాహుల్

అన్వర్ వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. సీట్ల పంపకంలో జాప్యం లేదని ఆర్జేడీ తెలిపింది. ఎన్నికల ప్రచారం సమయంలో 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస 70 ప్రచార సభల్లో కూడా పాల్గొనలేదని ఆర్జేడీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ విమర్శించారు. మూడు రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ అనంతరం పిక్నిక్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు. బీహార్ కు సంబంధం లేని వ్యక్తులు ప్రచారం నిర్వహించారని తివారీ విమర్శించారు. అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు ఆరాటపడ్డ కాంగ్రెస్ ఆ సీట్లను గెలుచుకునేందుకు చేయాల్సిన ప్రచారంలో మాత్రం పూర్తిగా వెనకబడిపోయిందని అన్నారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ వ్యవహారించే తీరు ఇది కాదని తివారీ హితవు పలికారు.

అధినాయకత్వంపై సొంత పార్టీ నేతల విమర్శలు

మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శించిన తీరును చూస్తే ఎన్డీఏని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ ఉందా అని సందేహాలు వ్యక్త మవుతున్నాయి. దీనిపై ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబ్బల్ అనుమానం వ్యక్తం చేశారు.  సంస్థాగత లోపాలు సరిదిద్దుకోకుండా పార్టీ నిలదొక్కుకోవడం అసాధ్యమన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావించలేదని సిబాల్ అన్నారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారని సిబ్బల్ విమర్శించారు. బీహార్ ఫలితాలపై అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్సందన రాలేదన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles