Tuesday, September 10, 2024

ఆయ‌న తీసిన ప్ర‌తీ చిత్రం… ఒక్కో క‌ళా ఖండం…

తెలుగు చిత్ర సీమ బ‌తికున్నంత కాలం గుర్తుంచుకునే అపురూప ద‌ర్శ‌కుల‌లో కె.వి.రెడ్డి     (క‌దిరి వెంక‌ట రెడ్డి) ఒక‌రు. కె.వి. రెడ్డిగా సుప‌రిచితుడైన ఆయ‌న పేరు విన‌గానే ఆయ‌న సాధించిన విజ‌యాల ప‌రంప‌ర స్ఫుర‌ణ‌కు వ‌స్తుంది. మాయాబ‌జ‌ర్‌, పాతాళ భైర‌వి లాంటి క‌ళాఖండాల‌తో పాటు ఆయ‌న పెద్దమ‌నుషులు, దొంగ రాముడు లాంటి  సాంఘిక చిత్రాలు కూడా గుర్తుకువ‌స్తాయి.  చిత్ర నిర్మాణాన్ని ఓ దైవ కార్యంగా భావించి సినిమాలు తీసి విజ‌య ఢంకా మ్రోగించిన ఘ‌న‌త ఆయ‌న‌ది.

Also read: హాస్య రచనలతో నవ్వులు పండించిన ముళ్ళ‌పూడి…

కదిరి వెంకటరెడ్డి 1912 వ సంవ‌త్స‌రం జూలై 1వ తేదీన జ‌న్మించారు.  మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో  మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశారు.  త‌న చిన్న‌నాటి స్నేహితుడు    మూలా నారాయణస్వామి పిలుపు మేర‌కు  సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించారు.

వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమైన ఆయ‌న సినిమా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ 1942లో భక్త పోతన సినిమాకు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగింది. ఆ చిత్రం  విజయం సాధించ‌డంతో  వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పాటు చేసి , అందులో కె.వి.రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరారు. అనంత‌రం ఆయ‌న   వాహినీ, విజయా వంటి నిర్మాణ సంస్థల్లో చిత్రాలు చేశారు.

Also read: నాన్నంటే బాధ్య‌త‌…

సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశారు.  ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాక  ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవారు కాదు.  బడ్జెట్ విషయంలోనూ ఆయ‌న చాలా  ఖ‌చ్చితంగా ఉండేవారు. వేసిన బడ్జెట్ మించి ఒక్క రూపాయి ఎక్కువ పడినా తానే పెట్టుకుంటానని చెప్పగలిగిన సామర్థ్యం ఆయ‌న‌కు ఉండేది. కొందరు దర్శకులు లక్ష అడుగుల ఫిల్మ్ ఎక్స్ పోజ్ చేసి చివరికి ఎడిటింగ్ లో 18-19 వేల అడుగులకు ఎడిట్ చేయించుకునే రోజుల్లోనే 18 వేల అడుగుల ఫిల్మ్ తీయాలంటే కేవలం 300 అడుగులు మాత్రమే అటూ ఇటూ అయ్యేలా ఖచ్చితత్వంతో తీసేవారు.

స్క్రిప్ట్ దశలో అసిస్టెంట్లు డైలాగ్ చెప్తుంటేనూ, తర్వాతి దశలో నటులు రిహార్సల్స్ చేస్తూండగానూ స్టాప్ క్లాక్ వాడి ఏ డైలాగ్ ఎంత సమయం పడుతుందో, అలా ఏ సీన్ ఎంత సమయం అవుతుందో లెక్కించుకుని అంచనా కట్టడం కె.వి.రెడ్డి పద్ధతుల్లో ఒకటి.

Also read: న‌వ్వుల పూదోట‌ మ‌హా ద‌ర్శ‌కుడు.. జంధ్యాల‌

సినిమా చిత్రీకరణ ముందు దశలోనే సినిమాని బట్టి కళా దర్శకులు గోఖలే-కళాధర్ లతో కూర్చుని కిరీటాలు, కంకణాలు సహా ప్రధాన పాత్రల రూపకల్పన, చిన్న చిన్న డీటైల్స్ తో సహా సెట్స్ వివరాలు తయారు చేయించుకునేవారు. చిత్రీకరణకు ముందు విధిగా రిహార్సల్స్ ఉండేవి. ఆ రిహార్సల్స్ కేవలం నటుల విషయంలోనే కాకుండా ఒక్కోసారి లైటింగ్, కెమెరా కదలికలు వంటి సాంకేతికాంశాలు సరిజూసుకునేందుకు డమ్మీగా అసిస్టెంట్లను పెట్టి కూడా చేసేవారు.

కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన చిత్రం  విజయం సాధించ‌డంతో  వాహినీ ప్రొడక్షన్స్ (అంతకుముందున్న వాహినీ పిక్చర్స్ పంపిణీ సంస్థగా మిగిలిపోయింది) ఏర్పడగా, పాతాళ భైరవి సాధించిన ఆర్థిక విజయం విజయా సంస్థ స్థిరపడడానికి సహకరించింది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటులు, పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటి కవులు, రచయితలు సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి   కె.వి.రెడ్డి చిత్రాలు దోహ‌దం చేశాయి.  ఎన్.టి.రామారావును కృష్ణుడిగా ప‌రిచ‌యం చేసి , అతని పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే కావ‌డం విశేషం. దుక్కిపాటి మధుసూదనరావు, ఎన్.టి.రామారావులు లాంటి మ‌హామ‌హులు  తమ గురుతుల్యుడు  కె.వి.రెడ్డే న‌ని గ‌ర్వంగా చెప్పుకునేవారు.  కె.వి.రెడ్డి చిత్రాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. దీనితో 1950ల్లో మొదలై 60ల తొలినాళ్ళ వరకూ ఆయ‌న‌తో చిత్రాలు తీయడానికి పోటీపడే పరిస్థితి ఉండేది. ఆయ‌న చేసిన  మాయాబజార్ (1957) ,శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951), జగదేకవీరుని కథ (1961) వంటి జానపదాలు, పెద్దమనుషులు (1954), దొంగ రాముడు (1955) వంటి సాంఘిక చిత్రాలు, భక్త పోతన (1943), యోగివేమన (1947) వంటి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు విశేష‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొంద‌డ‌మే కాకుండా ఆయా చిత్ర నిర్మాణ సంస్థ‌ల‌కు విప‌రీతంగా లాభాలు తెచ్చిపెట్టాయి.   అయితే 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) చిత్రాలులు వరుసగా పరాజయం పాలు కావడంతో ఆయ‌న‌తో చిత్రాలు  చేయడానికి ఎవరూ ముందుకురాని ప‌రిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కె.వి.ని గురువుగా భావించే ఎన్.టి.రామారావు ఆయ‌న‌పై ఉన్న గౌర‌వంతో తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) చిత్రం  తీయించి తిరిగి కె.వి.రెడ్డిని సక్సెస్‌పుల్ డైరెక్ట‌ర్ గా నిల‌బెట్టారు. అంత‌కు ముందు కె.వి. రెడ్డి జయంతి అనే స్వంత సంస్థ నెలకొల్పి మూడు చిత్రాలు తీశారు.  అలాగే అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కు ఒక సినిమా చేశారు.

Also read: అందానికి , అద్భుత న‌ట‌న‌కు చిరునామా….

1968లో భాగ్య చక్రం విడుదలయ్యాకా ఇక కె.వి.రెడ్డికి రెండేళ్ళ పాటు ఏ అవకాశం రాలేదు. దీనికి తోడు తన రచయితల‌ను, సాంకేతిక నిపుణులను విజయా ప్రొడక్షన్స్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకు ఇచ్చిన కారును వెనక్కి తెప్పించుకోవడం వంటివాటిని అవమానంగా భావించి ఆయ‌న మ‌రింత  క్రుంగిపోయారు.   మరో చిత్రం  చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చివరి చిత్రాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోననే భ‌యం ఆయ‌న‌ను అనుక్ష‌ణం వెంటాడేది.  ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు. ద‌ర్శ‌కునిగా ఆయ‌న‌కు ఎవ్వ‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇలాంటి  స్థితిలోనే  కె.వి.రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ స‌త్య చిత్రం చేయించాయి.  పలు ఉపకథలతో సాగిన ఈ చిత్రంలో చాలా భాగం తీశాకా కె.వి.రెడ్డి అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ ఉంటే రామారావు ఆయ‌న‌ను  కూర్చోబెట్టి సూచనలు తీసుకుంటూ చిత్రాన్ని పూర్తిచేశారు. 1971 డిసెంబరు 24న విడుదలైన శ్రీకృష్ణసత్య మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్ర దర్శకత్వం, దాని ఫలితం కె.వి.రెడ్డికి చాలా సంతృప్తిని కలిగించాయి. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూండడంతో మరో సినిమా తీయడం ఆయ‌న‌కు సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబరు 15న కె.వి. రెడ్డి మరణించారు.  దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించాయి. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశారు.  కె.వి.రెడ్డి లాంటి ఉత్త‌మ  ద‌ర్శ‌కులు తెలుగు చిత్రలో పుట్ట‌డం తెలుగు చిత్ర సీమ చేసుకున్నపుణ్యం. ఆయ‌న లేని లోటు ఎన్న‌టికీ తీర్చ‌లేనిది.

Also read: తెలుగు చిత్ర‌సీమ గ‌ర్వించ‌ద‌గిన మ‌హాన‌టుడు అక్కినేని

(జూలై 1న కె.వి. రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం)

దాసరి దుర్గా ప్ర‌సాద్‌

  మొబైల్: 7794096169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles