Friday, March 29, 2024

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి : వీహెచ్

  • ఘనంగా సంజీవయ్య శతిజయంతి ఉత్సవాల ముగింపు వేడుక
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడూ, మాజీ కేంద్రమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని సంజీవయ్య స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు కోరారు. గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సోమవారం నాడు జరిగింది. సభలో పాల్గొన్న వక్తలంతా కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో హనుమంతరావుతో పాటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ప్రముఖ సంపాదకులు  రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, ప్రజాగాయకుడూ, వాగ్గేయకారుడూ గద్దర్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడూ, మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి జి. వినోద్, సంజీవయ్య సమీప బంధువు దామోదరం నాగేందర్,  తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను తెలిపే విడియోను నిర్వాహకులు ప్రదర్శించారు.

 ఇంతమంది సంజీవయ్య గురించి గొప్పగా మాట్లాడినందుకు నాగేందర్  ధన్యవాదాలు తెలిపారు.

పేదరికంలో పుట్టి పేదరికంలోనే అస్తమించిన నేత : రామచంద్రమూర్తి

‘‘దామోదరం సంజీవయ్య జీవితం ఈ తరానికి ఆదర్శం. పేదరికంలో పుట్టినా తన ప్రతిభ తో కాంగ్రెస్ పార్టీ లో అత్యున్నత స్థానానికి ఎదిగారు. పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగి, ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించినా పేదరికంలోనే చనిపోవడం సంజీవయ్య గొప్పతనం. ఆయన 1972లో దిల్లీలో చనిపోయినప్పుడు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున అంత్యక్రియలు జరిగితే వేలమంది వచ్చారు. అటువంటి నాయకులను గుర్తుపెట్టుకోవడం లేదంటే మనం ఎంత దిగజారామో అర్థం చేసుకోవాలి,’’ అని సీనియర్ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి అన్నారు. సంజీవయ్య సేవలను గుర్తు పెట్టుకొని ఆయన జయంతి, వర్థంతి సభలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు హనుమంతరావును ఆయన అభినందించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సిద్ధాంతాలను వదలని మనిషి దామోదరం సంజీవయ్య అనీ, అటువటి వ్యక్తిని దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి గా చేయడం కాంగ్రెస్ పార్టీ లోనే సాధ్యం అయ్యిందనీ, ఆయన తన హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మంచి సంక్షేమ నేతగా గుర్తింపు పొందారనీ రామచంద్రమూర్తి అన్నారు. రాజాజీ మంత్రివర్గంలో తన 29 వఏటనే చేరినప్పటి నుంచీ వెనక్కి తిరిగి చూడకుండా సంజీవయ్యకు ఒక పదవి తర్వాత ఒక పదవి వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు. పదవులను ప్రజాసేవకే వినియోగించారు కానీ స్వప్రయోజనాలకు ఉపయోగించలేదని అన్నారు.

జగన్ కు కలుసుకొని అడుగుతా : వీహెచ్

‘‘దామోదరం సంజీవయ్య లాంటి గొప్ప మహనీయలు తెలుగువాడు కావడం మనకు గర్వకారణం.. దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని రాయాలని రామచంద్రమూర్తి గారిని కోరుతున్నా.. వచ్చే జయంతి నాటికి పుస్తకాన్ని అవిష్కరించాలి. కర్నూల్ జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టడానిక్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కోరుతాం,’’ అని సంజీవయ్య మోమోరియల్ ట్రస్ట్ చైర్మన్ హనుమంతరావు అన్నారు. శతసంవత్సర వేడుకలు జరుపుకోవడంలో కొంచెం జాప్యం జరిగిందని వీహెచ్ అన్నారు. కర్నూలు జిల్లా పెదపాడు గ్రామానికి తాను వెళ్ళాననీ, ఆంధ్రప్రదేశ్ నుంచి హర్షకుమార్ కూడా వచ్చారనీ, అక్కడ సభలూ, ఊరేగింపులూ జోర్దార్ గా జరిగాయనీ, ఏడెనిమిది వందల మంది వచ్చారనీ వీహెచ్ తెలియజేశారు. సంజీవయ్య మరదలి భర్త, ఐఏఎస్ అధికారి కెఎస్ఆర్ మూర్తి నిర్వహించే బాధ్యతలను తనకు అప్పగించారనీ, అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంజీవయ్య కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాననీ హనుమంతరావు చెప్పారు. ఒక జిల్లాకు ఎన్ టీ ఆర్ పేరు పెట్టారు, మరో జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టారు, ఇంకోజిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు, అదే వరుసలో కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చేసిన మంచిని చెప్పుకోవడం చేతకాని కాంగ్రెస్ : కె. శ్రీనివాస్

చేసిన మంచిని కూడా చెప్పుకోలేని ప్రత్యేక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నదని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కె. చంద్రశేఖరరావు తెలంగాణ సాధిస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని హామీ ఇచ్చి నెరవేర్చని నేపథ్యంలో దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిని 1960లలోనే కాంగ్రెస్ నియమించిందని చెప్పుకోవడం అవసరమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు వంశపారంపర్య పార్టీలేననీ, జాతీయ పార్టీలలోనే దళితులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందనీ చెప్పారు. సంజీవయ్య వంటి గొప్ప వ్యక్తి విస్మృతిలో పడిపోవడం దరదృష్టకరమనీ, ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా ఉండాలనీ, తెలుగువారి పాఠ్యాంశాలలో సంజీవయ్య జీవితం గురించి లేకపోవడం శోచనీయమనీ శ్రీనివాస్ అన్నారు.

సంజీవయ్య తాత్త్వికత గొప్పది : గద్దర్

సంజీవయ్య కావాలంటే బాగానే సంపాదించుకునేవారనీ, కానీ ఆయన తాను సంపాదించుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారనీ, ఆ నిర్ణయానికే జీవితపర్యంతం కట్టుబడి ఉన్నారనీ, అందుకే పేదగా పుట్టి, పేదగా మరణించారనీ వాగ్గేయకారుడు గద్దర్ అన్నారు. తాను సంజీవయ్య తాత్త్వికత  గురించి ఆలోచిస్తున్నానని గద్దర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బూర్జువా పార్టీ అనీ, ఈ పార్టీలో అవినీతిపరులు ఉన్నట్టే త్యాగమూర్తులు కూడా ఉన్నారనీ, వావిలాల గోపాలకృష్ణయ్య, సంజీవయ్య వంటి నిష్కల్మషులు, నిజాయతీపరులు ఉంటారనీ, అందుకు ఈ పార్టీ ఇంతకాలం బతికి ఉన్నదనీ ఆయన అన్నారు. కాంగ్రెస్ ఉదారవాద పార్టీ కనుకనే అన్ని రకాలవారూ ఆ పార్టీలో మనగలుగుతారని చెప్పారు.  త్యాగధనులపైన తాను రాసి పాడిన పాటలో రెండు చరణాలు పాడి వినిపించారు.

మంచి నాయకులే పార్టీకి సంపద: కోదండ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఎందరో మంచి నాయకులు ఉన్నారనీ, వారంతా పార్టీకి సంపద అనీ, కాంగ్రెస్ పార్టీ సంకుచితంగా ఆలోచించకుండా ఉదారంగా ఉండే పార్టీ అనీ జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ్ రెడ్డి చెప్పారు. సంజీవయ్య వంటి నిస్వార్థపరులైన నాయకులు ఎందరో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలకు తగినట్టు తన ప్రాథమ్యాలను మార్చుకుంటూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాగ్దానభంగం చేయదు : పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదనీ, చేసిన వాగ్దానాన్ని భంగపరచదనీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పంజాబ్ లో తొలిసారి దళితుడైన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి గుర్తు చేశారు. దళితులకూ, ఆదివాసీలకూ సేవ చేసేందుకు సంజీవయ్య తనకు వచ్చిన పదవులను వినియోగించుకున్నారని అన్నారు. వితంతు పించన్లు ఇప్పించిన ముఖ్యమంత్రి సంజీవయ్య అని గుర్తు చేశారు. సమాజంలో కులాలకు అతీతంగా బలహీనులను ఆదుకోవాలనే సిద్ధాంతాన్ని సంజీవయ్య విశ్వసించారని చెప్పారు. తనకు రాజకీయంగా ప్రత్యర్థి అయినప్పటికీ సాయం చేసే గుణవంతుడు సంజీవయ్య అని లక్ష్మయ్య అన్నారు. ఆ విధంగా సంజీవయ్య చేతుల మీదుగా సహాయం స్వీకరించిన ఆయన విరోధులు తనకు తెలుసునని అన్నారు.

ఏ సహకారానికైనా సిద్ధం : వినోద్

సంజీవయ్య తన తండ్రి వెంకటస్వామి సన్నిహితులనీ, సంజీవయ్యను అన్ని తరాల నాయకులూ ఆదర్శంగా తీసుకోవాలనీ, సంజీవయ్యను భావి తరాలకు పరిచయం చేసే కార్యక్రమంలో తాను కూడా చురుకుగా పాల్గొంటాననీ, ఏ సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జి. వినోద్ అన్నారు.

బోనస్ సంజీవయ్య అని పిలిచేవాళ్ళం : దయానంద్

సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు మొదట బోనస్ ఇప్పించింది సంజీవయ్యేననీ, అందుకే కార్మికులు ఆయనను బోనస్ సంజీవయ్య అని ప్రేమగా పిలుచుకునేవారనీ సింగరేణి కార్మిక నాయకుడు దయానంద్ చెప్పారు. కార్మికులకూ, కర్షకులకూ, పేదవారికీ సంజీవయ్య చాలా మేలు చేశారని ఆయన అన్నారు.

భావితరాలకు ప్రేరణ : మహేష్ కుమార్ గౌడ్

సంజీవయ్య సేవలను భావితరాలకు గర్తుండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనీ, అటువంటి నిజాయతీపరుడైన నాయకుడి అడుగుజాడలలో కొత్త నాయకులు నడిచే విధంగా ప్రేరణ కల్పించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంజీవయ్య సేవలను కొత్త తరాలకు తెలియజేయడానికి కృషి చేస్తున్నందకు హనుమంతరావును గౌడ్ అభినందించారు.

సంజీవయ్య అందరికీ ఆదర్శం : కవిత

అంబేడ్కర్, సంజీవయ్య వంటి నాయకుల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నామనీ, అందరినీ కలుపుకొని పోతూ పేదలను సేవించుకోవడానికి పార్టీ వేదికను వినియోగించుకుంటున్నామనీ, ఈ తరం నేతలు సంజీవయ్యను ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా అవినీతికి దూరంగా ఉంటూ ప్రజాసేవ చేయాలని మహిళాకాంగ్రెస్ నాయకురాలు కవిత ఉద్భోదించారు.

యువతరానికి సంజీవయ్య స్ఫూర్తి : శ్రీధర్ బాబు

‘‘విద్య, సంస్కారం ఆదర్శాలు, నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడం లాంటి గుణాలు దామోదరం సంజీవయ్య నుంచి నేర్చుకోవాలి. విహెచ్ నూ, కోదండరెడ్డినీ చూసి ఎంత శక్తిమంతంగా, చురుకుగా పని చేయవచ్చునో నా తరంవారు నేర్చుకోవాలి. దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలి,’’ అని శాసనసభ్యుడూ, మాజీమంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘దామోదరం సంజీవయ్య వృధ్యాప్యపు పింఛన్లను ప్రారంభించారు, అవినీతి నిరోధక శాఖ ను ఏర్పాటు చేశారు. సింగరేణి లో బొనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్యగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక విప్లవాత్మక విధానాలు, పథకాలు చేపట్టినా అవి ప్రజల కోసం, దేశం కోసం చేసిన పనులు కానీ నేడు బీజేపీ సోషల్ మీడియా వేదిక గా అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయి’’ అంటూ శ్రీధర్ బాబు విమర్శించారు.

మాజీ ఎంఎల్ఏ మహేశ్వరరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి, మాజీ రాయబారి, కేంద్ర సర్వీసులలో ఉన్నతోద్యోగి వినోద్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ కూడా ప్రసంగించారు. సంజీవయ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు, సభికుల చేత చేయించారు.

డి. రామలింగం రచించిన సంజీవయ్య జీవిత చరిత్రను హిందీలోకి డాక్టర్ జీ.వీ. రత్నాకర్ చేత తర్జుమా చేయించి ‘రాజనీతీ కే సఫల్ హస్తాక్షర్ దామోదరం సంజీవయ్య’ పేరుతో  గీతాప్రకాషన్ వారు ప్రచురించిన పుస్తకాన్ని రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బోయి భీమన్న భార్య హైమవతీ భీమన్నకు అంకితమిచ్చారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles