Saturday, July 13, 2024

నిద్దుర లేచిన కుంభకర్ణుడు

రామాయణమ్ 192

కుంభకర్ణుడు ఒక పర్వతమంత పెద్దశయ్యమీద  నిద్రించుచూ చూపరులకు భయముగొలిపే రీతిలో ఉన్నాడు. అతని శరీరము నుండి కొవ్వువాసన వస్తున్నది. అతని శ్వాస పాతాళ బిలాలనుండి మహావేగంగా పైకి తన్నుకు వచ్చే వాయువును తలపిస్తున్నది. ఆ మహాకాయుని దగ్గరకు వెళుతుంటే ఆయన విడిచే గాలికి దూదిపింజలలా పైకి ఎగురుతున్నారు రాక్షస భటులు.

ఒకరిచేతిని మరొకరు పట్టుకొని ధైర్యము కూడగట్టుకొని తట్టిలేపుటకు ప్రయత్నించినారు. ఉహూ!  అంత సులభముగా లేచునా! కుంభకర్ణుని ముందు పరిమళధ్రవ్యాలు ఉంచినారు. రుచికరమైన భోజన పదార్ధములుంచినారు. వాటి వాసన కూడా లేపలేక పోయింది.

Also read: కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు సన్నాహాలు

అతని చెవులవద్ద భీకరంగా శంఖాలు ఊదినారు. అరచినారు. అందరూ ఒక్కుమ్మడిగా అతని ఒక్కొక్క అవయవాన్ని ఎత్తిపడవేసినారు. జబ్బలు చరచారు. బిగ్గరగా అరిచినారు. సింహనాదములు చేసినారు. అయినా ఫలితము కనపడలేదు. అప్పుడు ఒక్కొక్కరూ ఒక్కొక్క ఆయుధము తీసుకొని అతని శరీరమును ఎడాపెడా బాదినారు. అయిననూ లేపలేక పోయినారు.

గుఱ్ఱములను, గాడిదలను, ఒంటెలను, ఏనుగులను అతని శరీరముపై నడిపించినారు. పెద్దపెద్ద కర్రలు, స్తంభాలతో అవయవాలన్నింటిమీద ఎడతెరపిలేకుండా మోదుతూనే ఉన్నారు …అయినా లేవలేదు కుంభకర్ణుడు.

ఈ ధ్వనులకు లంకాపట్టణమంతా మోతమోగి పోయి అదురుతున్నది. కానీ అతడు లేవలేదు. కొందరు రాక్షసులు అతని జుట్టుపీకారు. కొందరు చెవులు కొరికారు. కొందరు చెవులలోనీళ్ళుపోశారు. ఉహూ, లాభము లేకపోయినది.

Also read: లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణుడు

అప్పుడు ఒకవరుసలో వేయి ఏనుగులను ఆ మహారాక్షసుడి శరీరము పైనుండి పరుగెత్తించిరి. అప్పటికి కొంచెము స్పర్శతెలిసి ఆవులిస్తూ అతడు నిద్ర లేచెను.

ఆ ఆవులింత రెండకొండల మధ్యనుండి వచ్చు హోరుగాలివలే ఉండెను. విపరీతమైన ఆకలి ఉండుటచేత అక్కడ అప్పటికే సిద్ధము చేసి ఉంచిన మద్యమాంసములు, రక్తము, కొవ్వుకుండలు, అన్నింటినీ ఖాళీచేసి పెద్దగా త్రేన్చి,

‘‘ఎందుకు నన్ను లేపినారు?’’ అని భటులను ప్రశ్నించెను.

‘‘అన్నగారు క్షేమమే కదా! ఏదో పెద్ద ఆపద వచ్చి మీదపడిన కానీ నన్ను నిద్రనుండి లేపడు. కారణమేమో యదార్ధముగా తెలుపుడు’’ అని కుంభకర్ణుడు తనను లేపిన రాక్షస ప్రముఖులను అడిగెను. అప్పుడు రావణుని మంత్రి అయిన యూపాక్షుడు అంజలి ఘటించి నిలిచి, “రాజా మనకు ఇప్పటివరకూ దేవతలవలన కూడా భయము లేదు. కానీ నేడు ఒక మానవమాత్రుడు మనలను చికాకు పరచుచున్నాడు. ఈ దుఃఖము మనకు సీతాపహరణము వలన సంప్రాప్తించినది. పూర్వము ఒక వానరుడు లంకను కాల్చి వెళ్ళినాడు. నేడు ఒక మానవుడు మనరేడును యుద్ధములో పరాభవించినాడు. మన రాజును ఓడించి నేడుపోయి రేపురా అని ఘోరముగా అవమానించెను” అని జరిగిన వృత్తాంతమును కుంభకర్ణునకు తెలిపినాడు.

Also read: రావణ వీరవిహారం, వానరవీరులపై శరపరంపర

అన్నకు జరిగిన పరాభవము యూపాక్షుని ద్వారా తెలుసుకొని కోపముతో కళ్ళెర్రచేసి గిరగిర త్రిప్పుచూ, ‘‘ఓయీ నేనిపుడే యుద్ధరంగమునకేగి సకల వానర సైన్యమును మట్టుపెట్టి రామలక్ష్మణులను ఒక పట్టుబట్టి మట్టికరిపించి గానీ అన్న ఎదుట అడుగు పెట్టను’’

అప్పుడు మహోదరుడు అను ఒక రాక్షస ప్రముఖుడు, ‘‘రాజా తొందరపడక ఒక సారి మహారాజ సముఖమునకు వచ్చి ఆయన ఆలోచన తెలిసికొని ఆ ప్రకారము చేయ మనవి’’ అని వినయముగా ప్రార్ధించెను .అతని మాట మన్నించి అందరితో కలసి కుంభకర్ణుడు రావణ సభాభవనమునకు బయలు దేరెను.

లంకా నగరములో ఒక పెద్ద పర్వతమునకు కాళ్ళు వచ్చి నడచుచున్నట్లుగా యున్నది. ఊరుబయట ఉన్న వానరులకు కూడ ఈ మహాకాయుడు దర్శనమిచ్చెను. ఒక్కసారిగా ఈ భయంకర ఆకారమును చూసి అందరూ బెంబేలెత్తిపోయి తలకొకదిక్కుకు పారిపోయిరి. రాముడు కూడా ఈ భారీశరీరమును చూసి ‘‘ఎవరితను?’’ అని విభీషణుని ప్రశ్నించెను.

Also read: హనుమ, అంగద ప్రతాపం, రాక్షస యోధుల మరణం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles